ఔషధ విలువల మొక్కలు ( 56 ) : కామంచి
నడక దారిలోన నడవి మొక్కను బోలి
చిట్టి మొక్కయొకటి చేర బిలిచె
గాయ పడిన వేళ కామంచి నేనుంటి
ఆకు తుంచి నలిపి అద్దుమనియె
నాగమంజరి గుమ్మా
ఇది ఎవరూ ప్రత్యేకించి పెంచే మొక్క కాదు, కామంచి. మనం నిత్యం నడిచే దారిలో కనబడే అడవి మొక్క. గాయాలు తగిలినపుడు ఆకులు తుంచి, ఆ రసంతో సహా అద్ది పెడితే ఆంటీసెప్టిక్ గా పనిచేస్తుంది.
ఇది శోధ, దగ్గు, జ్వరం, ఆస్తమా నివారణకు దివ్యౌషధం అంటారు. విరేచనకారిగాను, జీర్ణకారిగాను పనిచేస్తుంది.
కీళ్లనొప్పులు, బ్రాంకైటిస్, అల్సర్లు, అజీర్తి, నిస్సత్తువ వంటి లక్షణాలను అరికడుతుంది. మూత్రం సాఫీగా జారీ అయ్యేలా ఉపయోగపడుతుంది.
ఈ మొక్క భాగాలను నీళ్లలో కాచి వడపోసి డికాక్షన్ తాగితే గుండె జబ్బులకు బాగా పనిచేస్తుంది. రక్తపోటును క్రమబద్దీకరిస్తుంది.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.