ఔషధ విలువల మొక్కలు ( 55 ) : పున్నాగ
పున్నాగ పూల తావికి
మిన్నాగులు నాట్యమాడు మృత్యుంజయుడున్
ఎన్నిక సేయును పూజకు
మన్నును కలియును విరిసిన మారు దినమునన్
నాగమంజరి గుమ్మా
పున్నాగపూలు కమ్మని వాసనలు వెదజల్లుతాయి. పూసిన మరుసటి రోజున నేలకు రాలిపోతాయి. నిజానికి మిగతా పువ్వులు కూడా అంతే కదా అనుకోవచ్చు, కానీ ఇవి నేల రాలిన 2 రోజుల వరకు కూడా అదే తాజాదనంతో అప్పుడే మొక్కకు విరిసినట్లు ఉంటాయి. వీటి సువాసనకు పాములు చేరుతాయి అంటారు. శివునికి ఈ పువ్వులతో పూజిస్తే ఇష్టమట.
ఔషధంగా పున్నాగ బెరడు రసము మంచి విరేచనకారి. ఇంకా ఈ రసాన్ని గాయాలు, వ్రణములను ఉపశమింపచేయుటకు వాడుతారు.
దీని విత్తనముల నుండి నూనె తీస్తారు. ఇది వాత నొప్పులను తగ్గిస్తుంది. ఈ నూనెను దీపారాధనకు వాడతారు. పడవలను తయారుచేసే చెక్క పాడయిపోకుండా ఈ నూనెను పూస్తారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.