ఔషధ విలువల మొక్కలు ( 54 ) : పసుపు
ముత్యమంత పసుపు ముఖమంత ఛాయగా
పాదములకు పూయ పసిడి యౌగ
మేని నలదుకున్న మెరుపు మిక్కటమేగ
పసుపు గుణము లెన్నొ పాడ వినగ
నాగమంజరి గుమ్మా
పసుపు చేసే మేలు పడతులకు తెలియంది కాదు. ఒంటికి, ముఖానికి, పాదాలకు మెరుపు నిస్తుంది. వంటకాలలో ఉపయోగిస్తే ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పసుపు వేసి ఆవిరి పడితే జలుబు తగ్గిపోతుంది. కురుపులు, వ్రణాలు, గాయాలు మొదలగువాటికి చక్కని ఆంటిబయటిక్. ఎన్నో వ్యాధులకు ఔషధము పసుపు. శుభకార్యములకు పసుపు తోనే నాంది పలుకుతాం. మరిన్ని ఉపయోగాలు చూడండి..
మొటిమలు తగ్గడానికి : జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి.
కఫము : వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి . కఫము తగ్గుతుంది.
రక్త శుద్ధి : ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది.
దగ్గు, జలుబు : మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి పట్టాలి.
నొప్పులు, బెనుకులు : పసుపు, ఉప్పు, సున్నము కలిపి పట్టువేయాలి.
డయాబెటిస్ : ఉసిరి పొడితో పసుపు కలిపి బీర్లో కరిగించి తాగాలి. మధుమేహవ్యాధి అదుపులో ఉంటుంది. చిన్న గ్లాసు నీళ్ళలో ఒక పసుపు కొమ్ము చేసి రాత్రంతా నానబెట్టి పొద్దున లేచేక పసుపు కొమ్ము తీసేసి ఒక చెంచాతో బాగా కలిపి పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
కాలేయ ఆరోగ్యం :పసుపులో ఉండే ఆంటీ ఆక్సైడ్ లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి.
పసుపులో ఉండే కురుకుమిన్ వలన కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గటమే కాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాదుల నుండి కాపాడుతుంది.
తలతిరుగుడు : పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి.
బరువు తగ్గుదల : పసుపులో ఉండే సర్క్యూమిం ఒబేసిటీ ఇంఫలమటిన్ ను తగ్గిస్తుంది.
డిప్రెషన్, ఆంక్సిటీ : డిప్రెషన్ డిసార్డర్స్, ఆంక్సిటీ ల నుండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది
అల్జిమార్ వ్యాధి : పసుపులో ఉండే “కర్కుమిన్ ” అనే పదార్ధము మతిమరుపును అరికడుతుంది.
డయాబెటిస్ ఉన్నవాళ్ళు పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో ఉన్న చక్కెరను తగ్గిస్తుంది దీని వలన షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.