ఔషధ విలువల మొక్కలు ( 53 ) : కలబంద
కలబంద గుజ్జు తాగగ
చలువయు నారోగ్యము సెగ శమియించునుగా
కలబంద గుజ్జు పూయగ
తొలగును తనువున మరకలు తొణుకును వన్నెల్
నాగమంజరి గుమ్మా
ఇంటికి దిష్టి తగలకుండా కలబంద కడతారు. నీరు, మట్టి లేకుండా దాదాపు మూడు నెలలు బతుకుతుంది. ఎండించిన కలబంద గుజ్జును ముసాంబరం అంటారు. చంటి పిల్లలకు తల్లి పాల అలవాటు మాన్పించడానికి ముసాంబరం వాడతారు.
జుట్టు పట్టుకుచ్చులా మెరవడానికి, శరీరకాంతికి కలబంద అదేనండి ఆలోవీరా ఎలా పనిచేస్తుందో అందరికి తెలిసిందే… ఇక మిగతా ఉపయోగాలు చూద్దాం…
కలబంద గుజ్జును చెక్కెరతో కలిపి సేవించడము గాని, రసాన్ని తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు.
కలబంద గుజ్జును ఉడికించి వాపులు, గడ్డల పై కడితే తగ్గి పోతాయి.
కలబంద రసాన్ని పసుపుతో కలిపి సేవిస్తే లివర్ వ్యాధులు ఉపశమిస్తాయి.
కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక వ్రణాలు త్వరగా మానిపోతాయి.
రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను భుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.
కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు, సూర్య తాపము వలన, X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములతో సహా ఉపశమిస్తాయి.
పంటి నొప్పి, పండ్లు కదులుట యందు కలబంద రసముతో చిగుళ్లపై రుద్ధటము గాని, కలబంద ఆకు ముక్కను నములుట గాని చేయాలి.
కలబంద గుజ్జును నీళ్ళల్లో బాగా కడిగిన తరువాత మాత్రమే లోపలికి గాని బయటకు గాని తీసుకోవాలి
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.