ఔషధ విలువల మొక్కలు ( 40 ) : ఆముదం
చేయి చాచి పెట్టి సేవకు ముందని
చాటు నాముదమ్ము సద్య రీతి
భరత దేశమందు ప్రాచీనౌషధమయ్యు
చమురు గాను మారె నమిత శక్తి
నాగమంజరి గుమ్మా
ఆముదం కారం, చేదు రుచులతో వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. సమస్త వాతరోగాలనూ పోగొట్టడంలో అగ్రస్థానం దీనిదే.
ఇది కడుపులోను, పొత్తికడుపులోను వచ్చే నొప్పులను, రక్తవికారాలను నివారింప చేస్తుంది. మొలలు హృద్రోగము, విషజ్వరము, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర బంధము మొదలైన సమస్యలను కూడా సులువుగా పోగొడుతుంది. శరీరంలో పేరుకుపోయిన దుష్ట విష పదార్థాలను కరిగించి బయటకు తోసివేస్తుంది. నరాలకు సత్తువ కలిగిస్తుంది. కడుపు నొప్పిని తగ్గించటంలో ఇంత ఉపయోగకరమైంది మరొకటి లేదని కూడా చెప్పవచ్చు.
భారతదేశంలో ఆముదము నూనె క్రీ.పూ. 2000 నుండి ఉపయోగంలో ఉంది. దీనిని దీపాలు వెలిగించడానికి, ఆయుర్వేదంలో విరేచనకారిగా ఉపయోగించారు. ఆముదపు ఆకుల రసం పచ్చకామెర్లు వ్యాధిని కొన్ని రోజులలో నయం చేస్తుందని నమ్మకం.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.