ఔషధ విలువల మొక్కలు ( 34 ) : పారిజాతం
హనుమ వాసముండు అందాల పూతర్వు
సత్య భామ కోరె స్వర్గ సుమము
కృష్ణ మూర్తి తెచ్చె వృక్ష రాజమ్మునే
శిరసు దాల్చరాదు నరుడు కోరి
నాగమంజరి గుమ్మా
పారిజాతం అనగానే హనుమంతుడు నివాసం ఉంటారని, సత్యభామ కొరకు శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి తెచ్చి ఇచ్చారని చప్పున గుర్తుకు వస్తుంది. ఈ పువ్వులు దేవతా పుష్పాలు కాబట్టి మనుషులు ధరించరాదు అని ఒక నమ్మకం.
ఇవి రాత్రి వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది.
ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం స్వంతం. దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు, చేతి ఐదు వేళ్ళను పోలి ఉంటాయి. పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి. వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు, తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లదకరమైన రంగులో ఉంటాయి. పుష్పాలు ఐదు రేకులు కలిగి ఉంటాయి. ఇవి రాత్రి వికసించి, ఉదయానికి రాలిపోయి చెట్టు క్రింద తెల్లని తివాచి పరచినట్లు కనిపిస్తాయి. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. వీటి నుంచి సుగంధ తైలాన్నికూడా తయారు చేస్తారు. తాజా ఆకుల రసాన్ని పిల్లలకు భేదిమందుగా వాడుతారు.
శరీరానికి వేడి చేసినపుడు పారిజాతం ఆకులు, పువ్వులు కలిపి నూరి నుదుటిపై పట్టు వేస్తే ఐదు నిమిషాలలో ఆ ముద్ద వేడి ఎక్కిపోతుంది. తీసివేసి, మళ్ళీ మరొక ముద్దను పట్టుగా వేయాలి. ఇలా ముద్ద వేడెక్కనంత వరకు వేయాలి. ఒంట్లో వేడి తగ్గిపోతే ముద్ద కూడా చల్లగానే ఉంటుందట.
పెరటిలో పారిజాతం పెంచుకోవచ్చు కానీ గొంగళిపురుగుల బాధ ఎక్కువ.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.