ఔషధ విలువల మొక్కలు ( 30 ) : మర్రి ఆకు
విత్తు చూడ నలుసు వృక్షమై తలయెత్తు
పండు, మాను నూడ పత్రమున్ను
ఔషదమ్ములయ్యె నాయుష్షు పెంచగా
వ్రతము పూజలకును వాసికెక్కె
నాగమంజరి గుమ్మా
మర్రి, త్రిమూర్తుల స్వరూపంగా, మహావిష్ణు రూపంగా భావించి పూజించే చెట్టు. అతి చిన్న విత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షంగా మారడం ఆశ్చర్యకరం.
మర్రి పాలు, ఊడలు, చిగుళ్లు, ఆకులు అన్ని ఆయుర్వేదంలో ఔషధాలే.
మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోక ముందు ఎర్రగా మొగ్గల్లా ఉంటాయి. వాటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని త్రాగితే తరచు విరేచనాలు, డిసెంట్రీతో బాధపడేవారికి మంచిదట. మర్రి ఊడలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులు రావట.
మరింత సమాచారం కోసం దీన్ని క్లిక్ చేయగలరు : మర్రి చెట్టు ప్రయోజనాలు
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.