Editorial

Monday, December 23, 2024
కథనాలుHill of figures -బొమ్మలమ్మ గుట్ట : చిన్నారి పొన్నారి చిఱుతకూకటి నాటి ఙ్ఞాపకం

Hill of figures -బొమ్మలమ్మ గుట్ట : చిన్నారి పొన్నారి చిఱుతకూకటి నాటి ఙ్ఞాపకం

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్ట వేల సంవత్సరాల తెలుగు సాహిత్యానికి నిలువెత్తు సాక్ష్యం. ఇది ఇటు ఆధ్యాత్మికంగా, అటు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన ప్రాంతం. తెలుగుభాషకు ప్రాచీన హోదా రావడానికి దోహదం చేసిన ‘తొలి పద్య శాసనం’ ఈ గుట్టమీదే లభించింది. క్రీ.శ.945లోనే ‘జినవల్లభుడు’ఈ శాసనాన్ని వేయించినట్లు చరిత్ర చెబుతున్నది. కాగా ఈ గుట్ట గురించిన చారిత్రిక ప్రశస్తి కాకుండా కురిక్యాల బొమ్మలమ్మగుట్టతో చిన్నారి పొన్నారి చిఱుతకూకటి నాటి తొలి ఙ్ఞాపకం ఇది. స్థానికుల్లో దానిపట్ల ఉన్న భయభక్తులను చెప్పే గాథ ఇది.

వ్యాసకర్త ఈ గుట్టను తాను మొదటిసారి చూసింది ఓ అర్థరాత్దిపూట ! అదీ, సగంసగంగా… మరీ, భయంభయంగా…

ఇదొక స్థానిక కోణం…ఒకానొక భిన్న అనుభవం. చదవాలె…

డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి

అది 1985, వైశాఖమాసపు నట్టనడిఎండకాలం.
యేసంగికల్లాలు లేచినంక, మా చుట్టాల పెండ్లిసంబురం !
అక్క తరుపుచుట్టం.. మేనబావ పెండ్లిముచ్చట ఇది.

పెండ్లికొడుకు వాళ్ళది మా పక్కవూరే… కోట్ల ‘నందగిరి’.
ఇగ పెండ్లిపిల్లదేమొ కురిక్యాల. పెండ్లి పిల్లింటికాడనే గదా
వెనుకటి పెండ్లిళ్లేమో రాత్రి తెల్లవారుజామున ఉంటయాయే.
పెండ్లినాటి రాత్రి భోజనాలైనంక కన్నుమలిగేపొద్దుకు
ఓ పదిపదిహేను ఎడ్లకచ్చురాలల్ల పిల్లింటికి బైలెల్లినం.

అందరికంటె ముందట పెండ్లిపిలగాని పల్లాకి !
నెత్తిల గుడ్డివెలుతురు చిమ్మే బిజిలీ ఎత్తుకున్న
మంగలి కాశయ్య పల్లాకిముందట తొవ్వదీసే వీరుడు.
ఇగ తర్వాత గలగలబొలబొల చప్పుడుజేసుకుంట
బండ్లబాటమీద ఎడ్ల కచ్చురాలు.. బండెనుక బండి !
బండికైదారుగురు మనుషులు.. ఆడిబలుగమే ఎక్కువ.
ఆడొల్లముచ్చట్లకు అంతుపొంతేముంటదని రూబిడిస్తూ
రికాము లేకుంట ఏ బండి ముచ్చట ఆ బండికే స్వంతం.

బూరుగుపెల్లి, లక్ష్మిదేవి పల్లె, నాగిరెడ్డిపురం, గంగధర…
గంగధర దాటుతుండంగనే.. బండిబండికీ బండెడు నిశ్శబ్దం

చిన్నపిల్లలకు ఓ కంటికి సంబురం, ఓ కంటికి భయం.
అమాసముందటి రోజులేమో.. అంతా చిమ్మంజీకటి.
నెత్తి ఇరవోసుకున్న దయ్యాలలెక్క ఈతచెట్ల గుంపులు.
చీకటిపూటతొవ్వను ఇంకింతచీకటి చేసుటానికన్నట్టు
తొవ్వ పొడుగూత..మఱ్ఱి, చింత, యాప, నమిలినార చెట్లు.
అప్పుడప్పుడూ మాటలమధ్యలనుండి బయటికివస్తూ
ఏ పొలుమారు చేరినమో, ఏ ఊరు దాటినమో చూసుకునుడు.

బూరుగుపెల్లి, లక్ష్మిదేవి పల్లె, నాగిరెడ్డిపురం, గంగధర…
గంగధర దాటుతుండంగనే.. బండిబండికీ బండెడు నిశ్శబ్దం
పెండ్లేనాయె, పెయిమీద ఈసమోమాసమో ఉండుడేనాయె,
పెద్దవాళ్లందరిలో తెలువకుంటనే లోలోపల సన్నటి వణుకు.

ఇగ చెప్పేదేమున్నది,
బొమ్మలమ్మగుట్ట పేరుదీస్తెనే బండిబండికి ప్రాణం గజగజ..!

గంగధర దాటుడుతోనె దక్షిణపు పొలుమూరు గడ్డమీద
లగ్గం బండ్లన్నీ ఆగినయి… నలుగురు పెద్దమనుషులు
బండిబండికి తిరుక్కుంట… అందరికి భద్రమని చెప్పిపోయిరి.
సంగతేందంటే– గంగధర దాటి కురిక్యాల తొవ్వ వట్టంగనే
న్యాలకొండపల్లె శివారు చెరువుకట్టమూలమీది నుంచి
బొమ్మలమ్మగుట్ట దిక్కున్న బండ్లబాటకు తిరుగాలె…
అసలు ముచ్చట అక్కడనే ఉన్నది. ఇగ చెప్పేదేమున్నది,
బొమ్మలమ్మగుట్ట పేరుదీస్తెనే బండిబండికి ప్రాణం గజగజ..!

బొమ్మలమ్మగుట్ట వందలయేండ్లనుంచి దొంగలకు తావట!
తొవ్వలుకొట్టే దారిదోపిడిదొంగలు ధనం దాసుకునే గుట్టనట.

మొగొల్లు చెప్పినప్పుడు ఎంతముద్దుగ ఈ ఆడక్కలు తలలూపిరి.
భళే పో ! లోపల భయమున్నట్టేగని, గుసగుసలైతె ఆపేదిలేదు.
బొమ్మలమ్మగుట్ట వందలయేండ్లనుంచి దొంగలకు తావట!
తొవ్వలుకొట్టే దారిదోపిడిదొంగలు ధనం దాసుకునే గుట్టనట.

గుట్టనిండ పెద్దపెద్ద సొనికెలు.. సొనికెలల్ల లంకెబిందెలట.
బండసొనికెలల్ల వెనుకట రాజులు దాచిన పాతర్లున్నయట
వాటి చుట్టుపక్కల బండల్లనుంచి ఇప్పటికీ ఉనుక రాలుతదట
ఆ ధనం మొత్తాన్ని బొమ్మలమ్మ వెనుకటినుంచి కావలిగాస్తదట
దొంగలు ఆ తల్లికి ఐదేండ్లకోసారి చిన్నపిలగండ్లను హారమిస్తరట…

ఒకటిరెండు సార్లు గుట్టదిక్కుజూసి గట్టిగ కండ్లుమూసుకున్న.
బండ్లెపరిచిన గొంగట్ల బోర్లబొక్కల తలకాయ బోర్లించిన…

ఈ ఆఖరుమాట వినంగనే నా పైప్రాణం పైన్నే పోయినట్టైంది.
వెనుకముందున్న ఐదారుబండ్లల్ల నేనొక్కన్నే చిన్నపొలగాణ్ణి.
నాతోటి మా అమ్మ ఈ పెండ్లికి రాలేదాయె, అక్క వేరే బండ్లున్నది.
ఎవరి పెనుగులాట వాళ్లదే, మెడనిండ కొంగు సదురుకునుడేగని,
అయ్యో పసిపొలగాడు, గుండె అదురుద్దని దగ్గరికితీసెటోళ్లేరీ ?

ప్రాణభయం ఎంతుంటేంది, సాగే ప్రయాణమాగుతదిగనుకనా
చిన్నగమెల్లగ ఎడమపక్కనుంచి గుట్టకు దాపుగా రానేవస్తిమి…
కర్రెగ కలెచీకటి, గుట్టనిండ పెద్దపెద్దగ రాకాసి రాళ్లబండలు.
నా గుండెచప్పుడు నాకే, మొదటిసారి మంచిగ వినవడ్డది.

అప్పటికి గోరుకొయ్యలు గుంకి మూలచుక్క పొడిచిందట.
అది కర్రెపిట్ట రెక్కకదిలియ్యని కలికి గాంధారి యాల్లనట.
అంటేందోయేమో అవన్ని నాకేమి ఎఱుకని. నా భయం నాది.
ఒకటిరెండు సార్లు గుట్టదిక్కుజూసి గట్టిగ కండ్లుమూసుకున్న.
బండ్లెపరిచిన గొంగట్ల బోర్లబొక్కల తలకాయ బోర్లించిన…
పక్కకున్న మ్యాకొల్ల పెద్దమ్మ ధైర్యానికి వీపుమీద చెయ్యేసింది.

ఈ జన్మకు గండం గడిచిందన్నట్టు బొమ్మలగుట్టదిక్కు తిరిగి
అమ్మతల్లికి ముసలొళ్లు చేతులెత్తి దండాలు చెల్లించిరి.

ఓ పావుగంట ఎట్లగడిచిందో ఏమొ.. దేవునికే తెలువాలె !
మొత్తానికి కచ్చురాలన్ని కురిక్యాల చెరువుకట్ట ఎక్కినయి.
ఈ జన్మకు గండం గడిచిందన్నట్టు బొమ్మలగుట్టదిక్కు తిరిగి
అమ్మతల్లికి ముసలొళ్లు చేతులెత్తి దండాలు చెల్లించిరి.

ముందట మంగలికాశయ్య తీగెరాగాలుదీసుడు మొదలైంది
మెల్లెగ సరాయించి ఆడొల్లు మల్ల ముచ్చటకు తెరదీసిరి.
గుట్ట.. క్రమంగ కనుమరుగై కురిక్యాల రోడుమీదికి చేరితిమి.
నాలుగుపాసై ఐదుకుపోతున్న పాలబుగ్గల బాలక్యాల్లిగద
ఇండ్లు కండ్లవడంగనే… నా ప్రాణం మెల్లెగ లేచికూర్చున్నది !

ఇదీ… నేను మొదటిసారి పొడగన్న బొమ్మలమ్మగుట్ట కథ.

తాజా కలం : ఈ గుట్టమీద రాతి శిల్పాలతోపాటు అమ్మవారి (జైన చక్రేశ్వరీ దేవి) విగ్రహం చెక్కి ఉండటం వల్ల స్థానికులు ఈ కొండను ‘బొమ్మలమ్మ గుట్ట’ అని పిలుస్తున్నారు. ఈ గుట్ట వృషభం (ఎద్దు) ఆకారంలో ఉంటుంది. అంతేకాదు, గుట్టపైన వృషభేశ్వరుడి విగ్రహం చెక్కి ఉంది. కాబట్టి, గతంలో ఈ కొండ ‘వృషభాద్రి’, ‘వృషభగిరి’ పేర్లతో ప్రాచుర్యం పొందింది. ఈ గుట్టపై ఉన్న ప్రతీ శిల్పం వందల ఏండ్లనాటి తెలుగు వైభవానికి సాక్ష్యంగా నిలిచింది. గతంలో ఇక్కడ లభించిన 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి విగ్రహాన్ని కరీంనగర్‌లోని పురావస్తు శాఖ మ్యూజియానికి తరలించి భద్రపరిచారు. తెలంగాణ ప్రాచీన వైభవానికి అద్దం పట్టే ఈ గుట్టను దర్శనీయ స్థలంగా వృద్ధి చేయాలన్న డిమాండ్ ఇప్పటికీ ఉన్నది. ప్రబుత్వానికి ఇది మరో వినతి.

More articles

4 COMMENTS

  1. నిజంగా కథ….కథనం…..చదివించెట్లుగా ఉంది.ప్రత్యక్ష అనుభవం కలిగింది.

  2. బాగుంది బాల్యానుభవం.శాసన వివరాలతో వ్యాసాలు రాసినాం, కానీ ఈ అనుభవాలు అపురూపం,మాకు అందనివి…..సంగనభట్ల

  3. చాలా బాగా రాసిండ్రు. మీలెక్క తెలంగాణ భాష సొంపును రాసేవాళ్ళు తక్కువున్నా రు. మీ అనుభవాత్మక కథ చదువుతుంటే ఆ కచ్చురంల నేంగూసున్నట్టే అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article