Editorial

Friday, November 22, 2024
ఆనందంకొండంత కొడుకు : మారసాని విజయ్ బాబు తెలుపు

కొండంత కొడుకు : మారసాని విజయ్ బాబు తెలుపు

“వోరోజు మా మమ్మీ, వుప్మా యెలా చేయాలో నేర్పించింది నాకు. మరుసటి రోజు నేనే వుప్మా చేసుకుని స్కూలుకు తీసుకెళ్లాను.భలే వుందిరా వుప్మా. మీ అమ్మ చాలా బాగా చేసింది అన్నారు ఫ్రెండ్స్.మా అమ్మ కాదురా, నేనే చేశాను అన్నాను.అందరూ భలే మెచ్చుకున్నారు. నాకూ మునుపెన్నడూ లేనంత ఆనందంవేసింది. మనం మంచిగా భోజనం పెడితే అందరూ యెంతో సంతోషిస్తారని నా మనసులో ఆనాడే ముద్రవేసుకుంది.”

మారసాని విజయ్ బాబు

మనోఫలకం మీద మధురభావనలు కదలాడినపుడు కలిగే సంతృప్తి అంతా యింతా కాదు కదా! యెన్నాళ్లయినా… యెన్నేళ్లయినా… వాటి పరిమళం అణుమాత్రం కూడా తగ్గదు.

చాలా ఆనందంగా యింటికి వచ్చాడు మహేష్. వచ్చీరాగానే, డ్యాడీ నేను వైవా చాలా బాగా చేశాను అన్నాడు.

మహేష్ బాబు మా పెద్దబ్భాయి. యింటర్ వొకేషనల్ కోర్సులో హోటల్ మేనేజ్ మెంట్ పూర్తిచేశాడు. ఫైనల్ పరీక్షకు ముందు వైవా జరిగింది.

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటిలో ఇది ఎనిమిదో కథనం.

యేం చెప్పావు నాన్నా అని అడిగాను.

వైవాలో నన్నడిగిన ప్రశ్శ యేమిటంటే…

నువ్వు చాలా బాగున్నావు. ప్రొడక్షన్ (వంట చేయడం) అంటే యెందుకు యిష్టపడుతున్నావ్? ఫ్రెంట్ ఆఫీసు (రిషప్సన్) లేక సర్వీస్ పై యెందుకు ఆసక్తిలేదు? అని ప్రశ్నించారు.

సార్,

నేను నాలుగో తరగతి చదివేటప్పుడు జరిగిన సంఘటన నాపై చాలా ప్రభావం చూపింది.

మా డ్యాడీ జర్నలిస్ట్. మా తమ్ముడూ నేను సాయంత్రం స్కూల్ నుంచి యింటికి వెళ్లేసరికే ఆయన డ్యూటీకి వెళ్ళుంటాడు. నైట్ డ్యూటీ. పొద్దున్నే మేం స్కూలుకు బయలుదేరే సమయంలో నిద్రపోతుంటాడు.

మా అమ్మ హోటల్లో హౌస్ కీపింగ్ సూపర్వైజర్ గా పనిచేసేది. పొద్దున్నే నిద్రలేచీ లేవగానే హడావుడిగా మాకు టిఫిన్ చేసి, క్యారియర్ కట్టిపెట్టేసి డ్యూటీకి వెళ్లిపోతుంది. అది ఆమెకు చాలా యిబ్బందిగా వుండేది.

చాలాసార్లు టిఫిన్ చేయలేకపోయేది. పక్కనే వున్న యెల్లమ్మ దగ్గర యిడ్లీలు తినేసి, క్యారీయర్ తీసుకెళ్లమంటుంది.

వోరోజు మా మమ్మీ, వుప్మా యెలా చేయాలో నేర్పించింది నాకు.

మరుసటి రోజు నేనే వుప్మా చేసుకుని స్కూలుకు తీసుకెళ్లాను.

మధ్యాహ్నం భోజనాల సమయంలో నా మిత్రులతో కలిసి వుప్మా తిన్నాము.

భలే వుందిరా వుప్మా. మీ అమ్మ చాలా బాగా చేసింది అన్నారు ఫ్రెండ్స్.

అర్రే…. మా అమ్మ కాదురా, నేనే చేశాను అన్నాను.

యెవరూ నమ్మలేదు. యెంత చెప్పినా.

నిజంగానే నేనే చేశాను. నిన్న మా అమ్మ నేర్పించింది. అలాగే చేసి తీసుకొచ్చాను. నమ్మకపోతే మా యింటికి రండి చేసి చూపుతాను.

Illustration : BEERA SRINIVAS

నిజంగానే నేనే చేశాను. నిన్న మా అమ్మ నేర్పించింది. అలాగే చేసి తీసుకొచ్చాను. నమ్మకపోతే మా యింటికి రండి చేసి చూపుతాను.

అవునా రా. భలే చేశావు అంటూ మా ఫ్రెండ్స్ చాలా సంతోషించారు. నన్ను అందరూ భలే మెచ్చుకున్నారు.

నాకూ మునుపెన్నడూ లేనంత ఆనందంవేసింది. మనం మంచిగా భోజనం పెడితే అందరూ యెంతో సంతోషిస్తారని నా మనసులో ఆనాడే ముద్రవేసుకుంది.

దాని ప్రభావంతోనే చెఫ్ గా పనిచేయాలని నిర్ణయించుకున్నాను.

దానికి తోడు నాకు ప్రపంచం అంతా తిరగాలనే కోరికుంది. మిగిలిన వాటితో పోలిస్తే చెఫ్ వుద్యోగాలకు డిమాండ్ యెక్కువ. సులభంగా విదేశాల్లో పనిదొరుకుందన్న ఆశపడుతున్నాను. అందుకే ప్రొడక్షన్ అంటే యెంతో యిష్టంగా తీసుకున్నాను.

యిన్విజిలేటర్స్ చప్పట్లతో ఆ హాలు మారుమోగింది.

ప్రతి వొక్కరూ మహేష్ లాగా వుండాలని సూచించారు. దాంతో మా తరగతి మొత్తం నాపై అభినందనలు కురిపించారు.

ఆ తర్వాత యిన్వజిలేటర్స్ మా క్లాస్ రూంలోకి వచ్చి… నేను చెప్పిన విషయాలన్నింటిని అందరు విద్యార్థులకు చెప్పారు.

ప్రతి వొక్కరూ మహేష్ లాగా వుండాలని సూచించారు. దాంతో మా తరగతి మొత్తం నాపై అభినందనలు కురిపించారు.

అంతటి స్పందనను చూసి అబ్బురపడిపోయాను డ్యాడి.

మహేష్ చెప్పిన విషయాలకు నేనూ సంబరపడిపోయాను. నా హృదయం ఆనందంతో వుప్పొంగిపోయింది.

నాన్నా, నీ ఆలోచనలు చాలా వున్నతంగా వున్నాయి. నువ్వు యేదైతే కోరుకున్నావో అది తప్పక నీకు దక్కుతుంది. తండ్రిగా నా ఆశీస్సులు నీకు తోడుంటాయని దీవించాను.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ది పామ్ అట్లాంటిస్

బీయెస్సీ హోటల్ మెనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, కలినరీ ఆర్ట్స్ లో నాలుగేళ్ళ డిగ్రీ ని పూర్తిచేశాడు మహేష్. క్లాస్ లో నంబర్ వన్.

బీయెస్సీ హోటల్ మెనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, కలినరీ ఆర్ట్స్ లో నాలుగేళ్ళ డిగ్రీ ని పూర్తిచేశాడు మహేష్. క్లాస్ లో నంబర్ వన్.

బెంగుళూరుకు చెందిన నవోటల్ వారి కేంపస్ యింటర్వ్యూలో సెలెక్ట్ కానందుకు చాలా బాధపడ్డాడు.

డ్యాడీ థర్డ్ యియర్లో మీకు చెప్పాను. గుర్తుందా. మేం నవోటల్లో వృత్తిపరమైన శిక్షణకు వెళ్లినపుడు…

నా పనితీరు నచ్చి అప్పుడే నన్ను జాబ్ లో జాయిన్ అవమన్నారు.

అప్పుడే నేను చేరుతానంటే మీరు వద్దన్నారు. ముందు డిగ్రీ పూర్తిచేయమన్నారు. తర్వాతే జాబ్ లో చేరమన్నారు.

యిప్పుడు చూడండి యిలా అయింది అని వాపోయాడు.

బాధపడవద్దు నాన్నా. అంతకంటే గొప్ప ఛాన్స్ నీకు దక్కుతుంది.

నాకో అనుమానం వుంది డ్యాడీ. ఆ హోటల్లో పనిచేసే చెఫ్ వొకరికి అవసరం వుందంటే నేను అయిదు వందలు డబ్బు యిచ్చాను.

వచ్చేముందు అతను డబ్బు యివ్వలేదు. పెద్ద గొడవైంది. నా డబ్బు యిచ్చేవరకు నేను వదిలిపెట్టలేదు. బహుశా అతడు నా గురించి రాంగ్ ఫీడింగ్ యిచ్చి వుండవచ్చు.

యేమైనా కానీ మహేష్, జీవితంలో ఆహ్వానించాల్సిందే అన్నాను నేను.

అయినా బాధపడుతునే వున్నాడు. దీనికి తోడు గుజరాత్ లోని సెంట్లాంస్ హోటల్ యింటర్వ్యూలోనూ సెలెక్ట్ కాలేదు.

యిక ఆ బాధ వర్ణనాతీతంగా మారిపోయింది.

మా దంపతుల వోదార్పులు యెందుకూ పనికిరాలేదు.

డ్యాడీ యింటర్వ్యూను యెలా ఫేస్ చేయాలో నాదగ్గర నేర్చుకున్నోళ్లు కూడా సెలెక్ట్ అయ్యారు. నాకే యెందుకిలా జరుగుతోందంటూ వేదనతో విలవిలాడాడు.

డ్యాడీ, రేపు మీరొక ముఖ్యమైన పని చేయాలి అని అన్నాడు.

నువ్వు దుబాయ్ కి వెళుతున్నావ్ కదా ఇంకేమి పనులు మిగిలి ఉన్నాయి అని నేను అడిగాను.

డ్యాడీ రేపు మీరు డ్యూటీకి వెళ్లిన తర్వాత రాజీనామా చేయండి.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ది పామ్ అట్లాంటిస్ వారి కేంపస్ యింటర్వ్యూలో ఆ సంవత్సరం యిండియా నుంచి మహేష్ వొక్కడే సెలెక్ట్ అయ్యాడు.

యిక మహేష్ ఆనందాన్ని పట్టడానికి సాధ్యం కాలేదు.

నా మనసు మాత్రం యేదో తెలియని వెలితిగా ఫీలైంది.

యెక్కడి పాకాల

యెక్కడ దుబాయ్

మనిషి అంతదూరం యెందుకు యెగబాకాల. యిసుక నుంచి బంగారం పిండటానికా?

కుటుంబసభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు అందర్ని వదులుకోని వెళ్లాల్సిందేనా?

ఇలా ఆలోచనలు నా మనసు నిండా ముసురుకున్నాయి.

యింతలో మహేష్ ఇలా అన్నాడు…

డ్యాడీ, రేపు మీరొక ముఖ్యమైన పని చేయాలి అని అన్నాడు.

నువ్వు దుబాయ్ కి వెళుతున్నావ్ కదా ఇంకేమి పనులు మిగిలి ఉన్నాయి అని నేను అడిగాను.

డ్యాడీ రేపు మీరు డ్యూటీకి వెళ్లిన తర్వాత రాజీనామా చేయండి.

ఎల్లుండు నేను డ్యూటీలో చేరుతాను.

అప్పుడు మీ డ్యూటీ కొనసాగినటేగా… అని అన్నాడు.

మీరేం తింటారో తినండి. ఏమి తాగుతారో తాగండి. మాకోసం వెన్నుముక విరిగేలా కష్టపడ్డారు… ఇక రెస్ట్ తీసుకోండి అని అన్నాడు.

………

నేను ముభావంగా ఉండిపోయాను.

……….

యెందుకు డ్యాడీ బాధ పడుతున్నారు. కొండంత కొడుకును కన్నారు. మీరేం చేయాలనుకుంటున్నారో చేయండి… నేను మీకు రక్షణ కవచంలా నిలుస్తానన్నాడు.

కొద్ది సేపు ఎం చెప్పాలో తెలియలేదు.

…….

కొడుకు యెంతో బాధ్యతతో మాట్లాడుతుండే మురిసిపోయాను.

తీవ్రమైన బాధ కూడా ఆవహించింది.

కాసేపట్లో తేరుకున్నాను.

ఆ బాధ నుంచి నా మనసంతా మెల్లగా ఆనందంతో నిండిపోయినట్లుంది.

అనిర్వచనీయమైన ఆ ఆనందాన్ని, తృప్తిని రాయలేను కూడా.

ఆ రోజు కుటుంబ బాధ్యతలను తన భుజంపైకి తీసుకున్న మహేష్ ఎంతో సమర్థవంతంగా చేయడం వొక యెత్తు.

జీవితం వృధా కాకూడడు. మన జీవితపు పరిమళాలను భవిష్యత్ తరాలకు అందించాలని నిరంతరం తపిస్తుండటం మరో ఎత్తు.

ఆ రోజు కుటుంబ బాధ్యతలను తన భుజంపైకి తీసుకున్న మహేష్ ఎంతో సమర్థవంతంగా చేయడం వొక యెత్తు.

జీవితం వృధా కాకూడడు. మన జీవితపు పరిమళాలను భవిష్యత్ తరాలకు అందించాలని నిరంతరం తపిస్తుండటం మరో ఎత్తు.

వొకనాడు ఆత్మనూన్యత భావంతో సతమతమైన యిదే మహేష్ బాబు…

యీనాడు నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలవడం….

జీవితంలో ఆపాదమస్తకం కదిలిపోయే …తృప్తిల్లె ఇటువంటి అపురూప అనుభవాలు గర్వకారణం.

మారసాని విజయ్ బాబు  రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను, అందలి తాత్వికతను వారం వారం ‘ఆపాదమస్తకం’ శీర్షిక ద్వారా అందిస్తారు. పాత వాటి కోసం కింద క్లిక్ చేసి చదవండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article