‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో కమలా భసీన్ పుస్తకాలు మూడు పదహారో పరిచయం.
కొసరాజు సురేష్
Kamla Bhasin అందరికీ తెలిసిన ఫెమినిస్టు. ఆమె 2021 సెప్టెంబరు 25న చనిపోయారు. తెలుగు, ఇంగ్లీషు పత్రికలలో ఎంతో మంది ఆమె జ్ఞాపకాలను పంచుకున్నారు. ఫెమినిజాన్ని అకడెమిక్ విషయంగా కాకుండా పాటలతో, తేలికగా అర్థమయ్యే పుస్తకాలతో ప్రజల మధ్యకు ఆమె తీసుకుని వెళ్లారు. పిల్లలకు రాసిన పుస్తకాల ద్వారా నాకు వారు పరిచయం (ఎంత పరిచయం అంటే ఆమె పేరును భాసిన్ కాదు భసీన్ అనాలని మొన్నటి దాకా తెలియదు). ‘జెండర్’ విషయాన్ని తెలియచేయటానికి ఆమె రాసిన ‘What is a Girl? What is a Boy?’ అనే పుస్తకం పండు వలిచి పెట్టినట్టు ఉంటుంది. ఈ పుస్తకాన్ని తెలుగులో ‘బాలిక అంటే ఏమిటి? బాలుడు అంటే ఏమిటి?’ అన్న పేరుతో Books for Change అన్న సంస్థ రెండు దశాబ్దాల క్రితమే ప్రచురించింది. అలాగే అమ్మాయిలను, అబ్బాయిలను మూసపోతలో చూసే దృష్టిని బద్దలుకొడుతూ ఆమె రాసిన ‘Rainbow Girls Rainbow Boys’ అన్న పుస్తకాన్ని ప్రథమ్ సంస్థ ప్రచురించింది. దానిని తెలుగులోకి మాధవి అనువదించగా, నేను గెస్ట్ ఎడిటర్‌గా ఉన్నాను.
సెక్స్ గురించి, మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పిల్లలతో మాట్లాడవలసిన అవసరాన్ని ఈ పుస్తకం తెలియ చేస్తుంది.
కమలా భసీన్ రాసిన మూడు పుస్తకాలను అనువాదం చేసే అవకాశం నాకు లభించింది. మొదటిది ‘మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే!’ (పిల్లలపై లైంగిక హింస అని దీనికి ఉపశీర్షిక) అన్న పుస్తకం. గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్‌కి చెందిన డా. వి. రుక్మిణి రావు ఈ పుస్తకాన్ని అనువాదం చెయ్యమని అడిగారు. 2009 సెప్టెంబరులో దీనిని గ్రామ్య సంస్థ ప్రచురించింది. ఎన్నో విలువైన పుస్తకాలు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రచురితమై బయట అందుబాటులో లేకుండా పోతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రుక్మిణి గారిని అడిగితే మంచి పుస్తకం ద్వారా ప్రచురించటానికి అనుమతించారు. ఈ రెండవ ముద్రణ 2017 అక్టోబరులో వచ్చింది.
లైంగిక దూషణపై మౌనాన్ని ఛేదిద్దాం అని పిలుపునిచ్చే ఈ పుస్తకం చదివితే ఒక గొప్ప కనువిప్పు కలుగుతుంది.
ఈ పుస్తకంలో ఒక అమ్మాయి పాఠకులతో మాట్లాడుతున్నట్టు (ప్రథమ పురుషలో) ఉంటుంది. శరీరం గురించి, ఎదుగుతున్న పిల్లల్లో వచ్చే మార్పుల గురించి పిల్లలతో మనం మాట్లాడం. ఇక సెక్స్ గురించి, చిన్న పిల్లలపై జరిగే లైంగిక హింస గురించి అస్సలు మాట్లాడం. పిల్లలపై లైంగిక హింసకు పాల్పడేది ఎక్కువగా బంధువులు, కుటుంబ స్నేహితులు, ఉపాధ్యాయులు, స్నేహితుల అన్నలూ, తండ్రులూ వంటి వారేనని చెపితే ఆశ్చర్యం కలిగిస్తుందేమో కాని అది నిజం. పిల్లలకు ఇలాంటివి జరిగినప్పుడు వాళ్లు గందరగోళానికి గురవుతారు. ఏం జరిగిందో వాళ్లకు తెలియదు, పెద్దవాళ్లకి ఏమని చెప్పాలో తెలియదు. సమాజంలో మర్యాదస్తులుగా చలామణి అయ్యేవాళ్లు కూడా ఇటువంటి పనులకు పాల్పడితే, వాళ్లు చెప్పింది ఎవరూ నమ్మకపోతే మరింత వ్యధకు లోనవుతారు. అంతేకాదు, ఆత్మ న్యూనతకు గురవుతారు. తప్పు తమలోనే ఉందా అనే అపరాధ భావనతో బాధపడతారు. ఇలాంటి అనుభవాల వల్ల జీవితాంతమూ బాధ పడే వాళ్లు ఉంటారు.
పుస్తకానికి నలుపు-తెలుపులో బిందియా థాపర్ వేసిన బొమ్మలు బాగున్నాయి.
సెక్స్ గురించి, మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి పిల్లలతో మాట్లాడవలసిన అవసరాన్ని ఈ పుస్తకం తెలియ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం తమకు ఇటువంటి అనుభవం ఎదురైనప్పుడు పిల్లలు చెబితే దానిని తీసిపారెయ్యకుండా, ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ ఇచ్చి, వినాలి. ఆరోపణకు గురైన వ్యక్తి ఎంత పెద్దవాడైనా, ఎంతటి హోదాలో ఉన్నా, ఎంతో మంచివాడని మనకి ఎంతో నమ్మకం ఉన్నా పిల్లల మాటలనే ముందు నమ్మాలి. పిల్లలపై లైంగిక హింసకు పాల్పడేవారు మంచిగా అనిపిస్తారని, పిల్లలతో స్నేహం ఎలా చెయ్యాలో వీళ్లకి తెలుసని, పిల్లల నమ్మకాన్ని చూరగొని చేరువౌతారని, ఆ తరవాత వాళ్ల అసలు రూపం బయటపడుతుందని ఈ అమ్మాయి చెబుతుంది.
లైంగిక దాడి జరిగిందని చెప్పుకుంటే కుటుంబ మర్యాద పోతుందని, ఇలా రకరకాల కారణాల వల్ల పెద్దవాళ్లు, సమాజం మౌనం వహిస్తున్నాయి. లైంగిక దూషణపై మౌనాన్ని ఛేదిద్దాం అని పిలుపునిచ్చే ఈ పుస్తకం చదివితే ఒక గొప్ప కనువిప్పు కలుగుతుంది. పుస్తకానికి నలుపు-తెలుపులో బిందియా థాపర్ వేసిన బొమ్మలు బాగున్నాయి. 28 పేజీల ఈ పుస్తకం వెల 30 రూపాయలు. కావాలనుకున్నవాళ్లు దానిని ఈ లింకు ద్వారా కొనుక్కోవచ్చు.
ఇక కౌమార వయస్కుల కోసం United Nations Population Fund వాళ్లకి Conversations with Adolescents అన్న శీర్షికతో కమలా భసీన్ మొత్తం 4 పుస్తకాలు రాశారు. వీటిని తెలుగులోకి చేస్తే బాగుంటుందని యం. వి. ఫౌండేషన్‌కి చెందిన వెంకట రెడ్డి సూచించారు. అయితే రంగుల బొమ్మలతో నాలుగు పుస్తకాలూ ప్రచురించటం చాలా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మొదటి రెండు మాత్రమే చేయాలని అనుకున్నాం. మొదటిది జీవన నైపుణ్యాలు: జీవన కళ, రెండవది కౌమార వయస్కులని, లైంగికతని అర్థం చేసుకోవటం. అనువాదం చెయ్యని మిగిలిన రెండు పుస్తకాలూ HIV/AIDS, Substance misuseకి సంబంధించినవి. కాగా. పై రెండు పుస్తకాలు తెప్పించుకోవాలంటే ఆ పుస్తకాల పేర్లను క్లిక్ చేయగలరు.
ఈ పుస్తకాలను తమ కార్యకర్తల శిక్షణలో వాడుకుంటామని యం. వి. ఫౌండేషన్ వాళ్లు చెప్పారు, ఆ శిక్షణా కార్యక్రమానికి కమలా భసీన్ హాజరౌతారని తెలిసి అతి తక్కువ సమయంలో అనువాదం పూర్తి చేసి పుస్తకం ప్రచురించాం. మొదటి పుస్తకాన్ని అక్టోబరు 2018లో రచయిత్రి సమక్షంలో ఆవిష్కరించటం ఎంతో సంతోషాన్ని కలుగచేసింది.
రెండవ పుస్తకం అదే నెల చివరలో వెలువడింది. ఈ పుస్తకాలకు వందన బిష్ట్ – సురభి సింగ్ వేసిన రంగుల బొమ్మలు వన్నె తెచ్చాయి.
జీవన నైపుణ్యాలు అన్న మొదటి పుస్తకంలో మనుషులుగా మనమందరం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు చెప్పారు. సమాన హక్కుల గురించి, మనందరిలో ఉండే వైవిధ్యత గురించి, ఐకమత్యం గురించి కమలా బాగా వివరించారు. చిన్నప్పుడు తల్లిదండ్రులే పిల్లలకు హీరోలు, కానీ కౌమార వయస్సు వచ్చేసరికి ఈ పరిస్థితి మారుతుంది. పెద్దవాళ్లు చెప్పేది ఎల్లప్పుడూ సరైనదేనా అని ప్రశ్నించి పరస్పర అవగాహన, నిజాయితీతో కూడిన సంబంధాలు మంచి జీవితానికి పునాది అంటారు.
మనందరం ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెబుతాం, ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలో మగపిల్లలకి చెప్పం. ఆ పని కమలా భసీన్ చాలా చక్కగా చేశారు.
తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచటం ఎంత ముఖ్యమో ఎదుట వాళ్లు చెప్పేది అంత శ్రద్ధగా వినాలి. మండారిన్ భాషలో వినటం అనే పదానికి మూడు బొమ్మలు, లేదా సంకేతాలు ఉంటాయి. అవి చెవులు, కళ్లు, హృదయం. బాగా వినటానికి ఈ మూడూ అవసరం అవతాయని కమలా చెబుతారు. విన్నంతనే ఏదీ నమ్మవద్దనీ, మెదడు తలుపులు తెరిచి ఉంచి ప్రతిదీ పరిశీలంచాలంటారు కమలా.
రెండవ భాగంలో జెండర్, లైంగికత, సెక్స్ – ప్రేమ వంటి అనేక విషయాలు చర్చించారు. స్త్రీ, పురుషుల మధ్య శారీరిక పరమైన తేడాలు పిల్లలను కనటానికి సంబంధించినవేనని, మిగతావన్ని సమాజం ఏర్పరచిన కట్టుబాట్లు అని కమలా చెపుతారు. పిల్లలను కనటం, రొమ్ము పాలు ఇవ్వటం స్త్రీలు మాత్రమే చెయ్యగలుగుతారు. కానీ పిల్లల్ని పెంచటంలో స్త్రీ, పురుషులు సమాన పాత్ర పోషించగలుగుతారు. దీనిని అడ్డుకుంటోంది సామాజిక నియమాలు మాత్రమే. కౌమార వయస్సులో తోటి వాళ్ల నుంచి వచ్చే ఒత్తిడులు గురించి, ఉద్వేగాలతో ఎలా తలపడాలో చెబుతారు. మనందరం ఆడపిల్లలకి మాత్రమే జాగ్రత్తలు చెబుతాం, ఆడపిల్లలతో ఎలా వ్యవహరించాలో మగపిల్లలకి చెప్పం. ఆ పని కమలా భసీన్ చాలా చక్కగా చేశారు. లైంగికత, లైంగిక హక్కులు, లైంగిక హింస గురించి తేలిక పదాలలో చక్కగా వివరించారు.
ఈ పుస్తకాన్ని తన కూతురికి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చిన కొల్లూరి సోమశంకర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ సంతృప్తిని ఇచ్చింది. ఇలాంటి వాళ్లు కొంతమందికైనా ఈ పుస్తకాలు ఉపయోగపడ్డాయంటే అంతకంటే కావలసింది ఏముంటుంది?
ఈ అంశాలపై తెలుగులో పుస్తకాలు అంతగా అందుబాటులో లేవన్నది నిజం. కొత్తగా రాయటం కంటే అరటి పండు వలిచి వివరించే కమలా భసీన్ పుస్తకాలు తీసుకుని రావటం సమంజసం అనిపించింది. ఇంకోవైపున ఈ పుస్తకాలను తెలుగు పాఠకులు ఎలా తీసుకుంటారోనని ఇసుమంత ఆందోళన కూడా ఉండింది. ఈ పుస్తకాన్ని తన కూతురికి పుట్టిన రోజు బహుమతిగా ఇచ్చిన కొల్లూరి సోమశంకర్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ సంతృప్తిని ఇచ్చింది. ఇలాంటి వాళ్లు కొంతమందికైనా ఈ పుస్తకాలు ఉపయోగపడ్డాయంటే అంతకంటే కావలసింది ఏముంటుంది?
కాలమిస్టు పరిచయం
పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. తొమ్మిదవది ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’. పదవది ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’. పదకొండవది పరుసవేది. పన్నెండవది ‘శివమెత్తిన నది’. పదమూడవది ఒక రోజా కోసం. పద్నాలుగవది ‘సింగారవ్వ’. పదిహేనవది ‘హంసలను వేటాడొద్దు’. చిన్నవి పెద్దవి కలిపి వారు వంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు ఆయా పుస్తకాలను ఇలా వారానికి ఒకటి చొప్పున మీకు పరిచయం చేస్తారు.
Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/