Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం : 'దిబ్బ ఎరువు' వంటి మనిషి!

ఈ వారం మంచి పుస్తకం : ‘దిబ్బ ఎరువు’ వంటి మనిషి!

‘మంచి పుస్తకం’ఒక సంపద. తెలుపు అందిస్తున్న సగౌరవ శీర్షిక. ఈ పుస్తక పరిచయ పరంపరలో పదిహేడో పరిచయం వెంకట్ గురించి. వారి మూడు పుస్తకాల గురించి…

కొసరాజు సురేష్

ఈసారి నేను అనువాదం చేసిన మూడు పుస్తకాల కంటే ఎక్కువగా వాటి రచయిత గురించి రాద్దామని అనుకుంటున్నాను. ఆ వ్యక్తి వెంకట్.

అందరూ డాక్టర్ వెంకట్ అని పిలిచేవారు. అయితే, ఆయన డాక్టరు కాదు. అరవై ఏళ్ల వరకు ఒక నర్సింగ్ హోమ్‌లో పని చేశారు. ఆరోగ్యానికి సంబంధించి ఎంతోమంది ముందుగా ఆయనను సంప్రదించేవారు.

అరవై ఏళ్ల వయస్సులో జహీరాబాద్ దగ్గర పస్తాపూర్ లోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డి.డి.ఎస్.)తో సంబంధం ఏర్పరచుకున్నారు. ఆ ప్రాంతపు మహిళలతో డిడిఎస్ పాత పంటలు, పెరటి తోటలు, వర్షాధార వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం వంటి అనేక అంశాల మీద పని చేస్తూ ఉంది. డిడిఎస్ ద్వారా ‘పర్మాకల్చర్’ అనే వ్యవసాయ విధానం వెంకట్‌కి పరిచయం అయ్యింది. దీని రూపకర్తలలో ఒకరైన ఆస్ట్రేలియాకి చెందిన బిల్ మాసన్‌కి వెంకట్ అంటే ఎంతో గౌరవం, అభిమానం.

మనం నిజంగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే వయస్సు అడ్డం కాదని నిరూపించిన వాళ్లల్లో వెంకట్ ఒకరు. మొక్కలు, వ్యవసాయం, సామాజిక అంశాల పట్ల ఆయన జ్ఞానం, అవగాహన చూసి విస్తుపోతూ ఉండేవాడిని.

నేను ఈనాడు దినపత్రికలో ‘రైతే రాజు’ శీర్షికకి పని చేస్తుండగా వెంకట్ పరిచయం అయ్యారు. తరవాత పర్మాకల్చర్‌లో నేను కూడా శిక్షణ తీసుకున్నాను. పస్తాపూర్‌లో వెంకట్ పని చేస్తున్న పర్మాకల్చర్ డిమాన్‌స్ట్రేషన్ ఫారంకి వారాంతాలలో వీలైనప్పుడల్లా వెళ్లి వెంకట్‌తో గడుపుతుండేవాడిని. 2001లో వాసన్ సంస్థలో చేరిన తరవాత ఈస్ట్ మారేడ్‌పల్లి లోని వెంకట్ ఇంటికి తరచు వెళ్లి కలుస్తుండేవాడిని.
‘మొక్కై వంగనది మానై వంగునా’ అని అందరూ అంటుంటారు. మనం నిజంగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే వయస్సు అడ్డం కాదని నిరూపించిన వాళ్లల్లో వెంకట్ ఒకరు. మొక్కలు, వ్యవసాయం, సామాజిక అంశాల పట్ల ఆయన జ్ఞానం, అవగాహన చూసి విస్తుపోతూ ఉండేవాడిని. వ్యవసాయంలో డిగ్రీ, పీజీ చేసిన నేను ఆయన దగ్గర నిత్య విద్యార్థిగా ఉంటూ, కలిసిన ప్రతిసారీ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడిని.

ఇంగ్లీషులో వెంకట్ మూడు పుస్తకాలు రాశారు. ఆ మూడింటినీ నేను తెలుగులోకి అనువదించాను- వాటర్‌షెడ్ అభివృద్ధి – ఒక సమాలోచన, దిబ్బ ఎరువు తయారీ, నూతన వ్యవసాయం – పర్మాకల్చర్ దృష్టికోణం.

వ్వవసాయానికి సంబంధించి నేను అనువాదం చేసిన మూడు పుస్తకాలకు (గడ్డి పరకతో విప్లవం, ప్రకృతి నేర్పిన పాఠాలు, జీవితానికి మూలాధారమైన వ్యవసాయం) వెంకట్ ముందు మాటలు రాశారు.
వెంకట్, ఆయన భార్య షామా చాలా నిరాడంబర జీవనం గడిపేవారు. సేంద్రియ వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న వారు ఆయన దగ్గరకు వస్తుండే వారు. ఉత్తరాలు రాస్తుండేవారు. సంబంధిత శిక్షణలు, సమావేశాలకు వెంకట్ హాజరవుతూ ఉండేవారు. జ్ఞానాన్ని అమ్ముకోకూడదు అన్న సిద్ధాంతంతో శిక్షణా కార్యక్రమాలకు ప్రయాణ ఖర్చు, వసతి తప్పించి వారు ఎటువంటి రుసుము తీసుకునేవారు కాదు.

ఈస్ట్ మారేడ్‌పల్లి లోని ఆయన ఇంటి చుట్టూ తోటలో పని చేయటం వెంకట్‌కి ఎంతో ఇష్టమైన పని. చిన్న తోటలో ఎన్నో వైవిధ్యభరితమైన మొక్కలు ఉండేవి. రకరకాల పిట్టలు సందడి చేస్తూ ఉండేవి. ఇంటికి వచ్చిన వాళ్లకి కావాలంటే ఇవ్వటానికి ఆయన దగ్గర ఎప్పుడూ మొక్కలు, విత్తనాలు ఉండేవి. ఇంగ్లీషులో వెంకట్ మూడు పుస్తకాలు రాశారు- Some Reflections on Watershed Development (32 pages), On Composting (32 pages), New Agriculture: A Permaculture Point of View (56 pages). ఈ మూడింటినీ నేను తెలుగులోకి అనువదించాను- వాటర్‌షెడ్ అభివృద్ధి – ఒక సమాలోచన, దిబ్బ ఎరువు తయారీ, నూతన వ్యవసాయం – పర్మాకల్చర్ దృష్టికోణం.

వ్యవసాయం, సమాజానికి సంబంధించి ఇంగ్లీషు, తెలుగు భాషలలో పుస్తకాలు ప్రచురించాలన్న ఉద్దేశంతో మంచి పుస్తకం ప్రచురణ సంస్థలో ‘పర్మనెంట్ గ్రీన్’ పేరుతో ఇంప్రింట్ సీరీస్ మొదలుపెట్టాం. దీని వెనక వెంకట్, విజయేంద్రలు ఉన్నారు. అయితే ఈ దిశలో అనుకున్నంత కృషి చేయలేక పోయాం.
వెంకట్ రాసిన మూడు పుస్తకాలలో మొదటిది వాటర్‌షెడ్ రంగంలో పని చేస్తున్న వాసన్ సంస్థలోని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడినది. దీనిని రికార్డ్ చేసి, ట్రాన్‌స్క్రైబ్ చేస్తే, వెంకట్ ఎడిటింగ్‌తో అది పుస్తకంగా రూపుదిద్దుకుంది.

‘New Agriculture…’ అన్నది వెంకట్ చనిపోయిన తరవాత పుస్తకంగా కూర్చాం. ఈ చివరి పుస్తకానికి శ్రీకాంత్ వేసిన బొమ్మలు బాగుంటాయి.

ఆ రకంగా చూస్తే, రెండవ పుస్తకమైన ‘On Composting’ ఒక్కటే ఆయన రాశారు. మూడవ పుస్తకం ‘New Agriculture…’ అన్నది వెంకట్ చనిపోయిన తరవాత ఆయన వ్యాసాలు, పత్రాల ఆధారంగా విజయేంద్ర, నేను పుస్తకంగా కూర్చాం. ఈ చివరి పుస్తకానికి శ్రీకాంత్ వేసిన బొమ్మలు బాగుంటాయి.

కారణం తెలియదు కానీ సిద్ధాంతం, ఆచరణలలో అపార జ్ఞానం ఉన్న వెంకట్ రాయటానికి ఇప్టపడేవారు కాదు. “చెప్పవలసిందంతా ఎప్పుడో చెప్పేశారు. కొత్తగా నేను ఏం రాయాలి?” అనేవారు.

‘On Composting’ తోపాటు చెట్లు, నీళ్లు, నేలను కప్పి ఉంచే పంటలు వంటి అంశాల మీద చిన్న, చిన్న పుస్తకాలను వెంకట్ రాస్తారని అనుకున్నాం. కారణం తెలియదు కానీ సిద్ధాంతం, ఆచరణలలో అపార జ్ఞానం ఉన్న వెంకట్ రాయటానికి ఇప్టపడేవారు కాదు. “చెప్పవలసిందంతా ఎప్పుడో చెప్పేశారు. కొత్తగా నేను ఏం రాయాలి?” అనేవారు. లేకపోతే, “ఇది ఎవరికి ఉపయోగపడుతుంది?” అనేవారు. పుస్తకం రాస్తే అది ఉపయోగపడుతుందో, లేదో కాలమే చెబుతుందని నేను అనేవాడిని. ఆదరణ లేని పుస్తకం రెండవ ముద్రణకి వెళ్లదు కదా అనేవాడిని. వెంకట్ రాయడు అని ఇతరులు అన్నప్పటికీ పట్టువదలకుండా నేను ఎన్నో రకాలుగా, ఎంతగానో ప్రయత్నించాను. కానీ, ఫలితం లేకపోయింది. మిడిమిడి జ్ఞానంతో పుంఖానుపుంఖాలు రాసే వాళ్లున్నారు. ఉపయోగపడే జ్ఞానముండి కూడా వెంకట్ ఇంకా రాయకపోవటం ఇప్పటికీ నాకు మింగుడు పడని విషయమే. వెంకట్ చనిపోయి పదేళ్లు గడిచిపోయాయి. దిబ్బ ఎరువు తయారీ, నూతన వ్యవసాయం అన్న రెండు పుస్తకాలూ ఇంగ్లీషు, తెలుగు భాషలలో నేటికీ ఎందరికో ఉపయోగపడుతునే ఉన్నాయి.

చనిపోయేనాటికి వెంకట్‌కి 88 సంవత్సరాలు. రాయటం కంటే ఆయన ఇంటి తోటలో పని చేయటం ఎక్కువ ఇష్టపడేవారు. చనిపోవటానికి నెల రోజుల ముందువరకు తన చిన్న తోటలో పనిచేస్తూనే ఉన్నారు. ఒకసారి వెంకట్‌కి వెర్టిగో సమస్య వచ్చి పని చెయ్యవద్దని సలహా ఇచ్చారు. ఇక సమయమంతా రాయటానికి వెచ్చిస్తాననటంతో నేను ఎంతో ఆశపడ్డాను. కానీ, మూడు వారాలలో ఆ సమస్య కాస్త తగ్గేసరికి తిరిగి తన తోటకి అంకితమైపోయారు.

మన ఆచరణకి సరైన సైద్ధాంతిక పునాది అవసరం అని వెంకట్ వల్ల అర్థమవుతూ ఉండేది.

‘దిబ్బ ఎరువు తయారీ’ పుస్తకం చూస్తే వెంకట్ ఆలోచన స్పష్టంగా అర్థమవుతుంది. 32 పేజీల ఈ చిన్న పుస్తకం రెండు భాగాలలో ఉంటుంది. మొదటి భాగం సిద్ధాంతానికి సంబంధించినది, రెండవ భాగం ఆచరణకి సంబంధించినది. మన ఆచరణకి సరైన సైద్ధాంతిక పునాది అవసరం అని వెంకట్ వల్ల అర్థమవుతూ ఉండేది.

జీవ చక్రంలో ప్రాథమిక ఉత్పత్తిదారులైన మొక్కల గురించి, వివిధ స్థాయిలలో వినియోగదారుల గురించి అందరికీ తెలుసు. ఈ రెండు కోవలలోని జీవులు బతికి ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు ఉత్పన్నమయ్యే వ్వర్థాలను కుళ్లింప చేసి, నేలకు తిరిగి పోషకాలను అందించటం ఎంతో ముఖ్యం. ఈ పనిని ప్రధానంగా కంటికి కనపడని సూక్ష్మజీవులు చేస్తూ ఉంటాయి.

సేంద్రియ పదార్థాలతో ఎరువు తయారు చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. సర్ ఆల్బర్ట్ హవార్డ్ రూపొందించిన పద్ధతిని వెంకట్ ఎంచుకున్నారు. దీనిని ఆయన వివరించిన తీరు అరటిపండు వలిచి పెట్టినట్టు ఉంటుంది.

జీవ చక్రం కొనసాగాలంటే సేంద్రియ వ్యర్థాలన్నీ పోషకాలుగా తిరిగి నేలకు చేరాలి. సేంద్రియ పదార్థాలతో ఎరువు తయారు చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అయితే, 1930లలో ఇందోర్ నగరంలో సర్ ఆల్బర్ట్ హవార్డ్ రూపొందించిన పద్ధతిని వెంకట్ ఎంచుకున్నారు. దీనిని ఆయన వివరించిన తీరు అరటిపండు వలిచి పెట్టినట్టు ఉంటుంది. ఈ పుస్తకం చదివి ఎవరైనా దిబ్బ ఎరువు తయారీని విజయవంతంగా చేపట్టగలుగుతారు. ఎరువు బాగా తయారయ్యిందో, లేదో ఎలా తెలుసుకోవాలో, తయారైన ఎరువును ఎలా నిల్వ ఉంచుకోవాలో కూడా వెంకట్ చెబుతారు.

‘ఎందుకు’ అన్నది సిద్ధాంత, తాత్విక పునాదులను తెలియచేస్తుంది. ‘ఎలా’ అన్నది ఆచరణను తెలియచేస్తుంది. దిబ్బ ఎరువు తయారు చెయ్యటంలోని ఈ రెండింటినీ వెంకట్ ఇంత చిన్న పుస్తకంలో ఎంతో చక్కగా వివరించారు.

తమ కాలం కంటే ముందు నడిచిన ఎంతోమందిలో వెంకట్ తప్పకుండా ఉంటాడు. ఆయనని అందుకోటానికి మాబోటి వాళ్లకు మరో జీవిత కాలం కూడా సరిపోదు.

చివరగా, నేల, మట్టి గురించి ఇంగ్లీషులో వెంకట్ 28 నిమిషాల వీడియో కావాలనుకున్న వాళ్లు ఈ లింకులో చూడవచ్చు.

కాలమిస్టు పరిచయం

కొసరాజు సురేష్ పాత్రికేయులు, అనువాదకులు. ప్రభుత్వం ప్రభుత్వేతర  స్వచ్ఛంద సేవా సంస్థలో దశాబ్దాలు కృషి చేశారు. ప్రచురణా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వారి అనువాదాల్లో ‘గడ్డిపరకతో విప్లవం’ మొదటిదైతే ఇప్పటిదాకా వారు చిన్న పెద్ద పుస్తకాలను వంద దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అందించారు. అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే.

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. తెలుపు కోసం వారు ఇప్పటిదాకా పరిచయం చేసిన పదహారు పుస్తకాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. అక్కడి నుంచి ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకంలోకి వెళ్లి చదవొచ్చు. అందుబాటులో ఉన్న వాటిన్హి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు మెయిల్ చేయొచ్చు లేదా కింది వెబ్సైట్ చూడండి.

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article