Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌కలల ముంత : ఈ వారం 'మంచి పుస్తకం' - కొసరాజు సురేష్

కలల ముంత : ఈ వారం ‘మంచి పుస్తకం’ – కొసరాజు సురేష్

ఏదైనా అవసరానికి, ఉదాహరణకి చదువు కోసం, లేదా విహార యాత్రల కోసం డబ్బు పొదుపు చేస్తూ ఉంటే ఆ ముంత (Jar) మీద ఆ పేరు రాసుకుంటారు. రింకో కల టీచరు కావటం, అందు కోసం ఆమె పొదుపు చేసే ముంత ఆమె కలల ముంత. అదే ఈ నవలకి శీర్షక అయ్యింది.

కొసరాజు సురేష్

మంచి పుస్తకం కోసం చాలా పుస్తకాలు అనువాదం చేశానని ఇంతకు ముందు చెప్పాను. ఇందులో 16-32 పేజీల మధ్య చాలా చిన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. పెద్ద నవలల్లో  ‘మొయిన్, రాక్షసుడు’, ‘ధనక్’, ‘రహస్యం’ వంటివి ఉన్నాయి. ఇప్పుడు పరిచయం చేయబోతున్న ‘కలల ముంత’ అన్న పుస్తకం నాకు ఎంతో నచ్చిన పుస్తకం.

స్టోరీస్ ఫర్ ఎవ్రీవన్ అన్న పేరుతో ఆసక్తికరమైన కథలను, నవలలను ఈ-మేల్ ద్వారా పంచుకునే ఒక సంస్థ ఉంది. పిల్లలు, యువతతో పనిచేస్తున్న వాళ్లతో వీటిని పంచుకుంటారు (stories4ev@gmail.com, stories4ev@gmail.com). నవలలను ధారావాహికంగా పంపిస్తారు. కోవిద్ కాలంలో చాలా సంస్థలు చాలా పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉచితంగా అందచేశాయి. స్టోరీస్ ఫర్ ఎవ్రీవన్ కూడా ఆ సందర్భంలో ధారావాహికంగా కాకుండా ఒకేసారి పూర్తి నవలలను అందచేసింది. ఈ క్రమంలో వాళ్లు అందచేసిన వాటిల్లో నేను మూడు నవలలు చదివాను. అవి- 1) A Jar of Dreams by Yoshiko Uchida, 2) The Breadwinner by Deborah Ellis and 3) The Boy in the Striped Pyjamas by John Boyne.

మొదటి రెండు నవలలలో అమ్మాయిదే ప్రధాన పాత్ర. పైన పేర్కొన్న రెండవ నవల తాలిబాన్ల పాలనలో ఆఫ్ఘనిస్తాన్‌లో కుటుంబ పోషకురాలుగా మారాల్సి వచ్చిన ఒక బాలిక కథ. మూడవది నాజీ జర్మనీలో యూదుల శిబిరానికి సంబంధించినది.

కలల ముంతలో కథా కాలం 1935ల నాటి అమెరికా. ఈ కథని అమెరికాలో పుట్టి పెరిగిన 11 ఏళ్ల జపనీస్ బాలిక రింకో చెబుతోంది. ఆమె తండ్రి షింటారో 1918లో అమెరికా వలస వచ్చాడు. పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోటానికి రింకో తల్లి ఒంటరిగా అమెరికా వచ్చింది. రింకోకి అన్న కాల్, తమ్ముడు జోజి ఉంటారు.

జపనీస్ ప్రజల పట్ల కూడా అమెరికన్లు వివక్షత చూపేవారని నాకు మొట్టమొదటి సారి ఈ నవల ద్వారా తెలిసింది.

అందరికీ కలల దేశమైన అమెరికాకి వచ్చిన షింటారో పొలాల్లో కూలీగా, వంటవాడిగా పనులు చేశాడు. ప్రస్తుతం క్షురకుడిగా పని చేస్తున్నాడు. కానీ, సొంతంగా కార్ల మెకానిక్ షెడ్ పెట్టుకోవాలన్నది అతని కల. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తెలిసిన వాళ్ల కార్లను మరమ్మతు చేస్తుంటాడు. రింకో తల్లి ఇళ్లల్లో పని చేస్తూ ఉంటుంది. అన్న కాల్ (కాలిఫోర్నియా రాష్ట్రంలో పుట్టాడు కాబట్టి అతనికి అదే పేరు పెట్టారు, కానీ అందరూ క్లుప్తంగా కాల్ అంటారు) ఇంజినీరింగ్ చదువుతుంటాడు. కానీ, అప్పుడు ఉన్న వివక్షత కారణంగా అతనికి ఆ అర్హతతో ఉద్యోగం దొరుకుతుందని అనుకోడు. ఏ కూరగాయల దుకాణమో నడుపుతూ బతకాల్సిందే అనుకుంటాడు.

రింకోకి టీచరు కావాలని ఉంటుంది. ఆ చదువు కోసం ఆమె డబ్బు దాచుకుంటూ ఉంటుంది. అమెరికాలో ఏదైనా అవసరానికి, ఉదాహరణకి చదువు కోసం, లేదా విహార యాత్రల కోసం డబ్బు పొదుపు చేస్తూ ఉంటే ఆ ముంత (Jar) మీద ఆ పేరు రాసుకుంటారు. రింకో కల టీచరు కావటం, అందు కోసం ఆమె పొదుపు చేసే ముంత ఆమె కలల ముంత. అదే ఈ నవలకి శీర్షక అయ్యింది.

అమెరికాలో జాతి దురహంకారం గురించి అందరికీ తెలుసు. నల్ల జాతి వాళ్లతో బానిసలుగా పని చేయించుకోవటమే కాకుండా వాళ్లని మనుషులుగా కూడా చూడలేదు. వాళ్లకి ఇటీవల కాలం వరకు చాలా హక్కులు లేవు.

జపనీస్ ప్రజల పట్ల కూడా అమెరికన్లు వివక్షత చూపేవారని నాకు మొట్టమొదటి సారి ఈ నవల ద్వారా తెలిసింది. నగరంలో పెద్ద లాండ్రి కంపెనీ నడిపే విలబర్ జె. స్టార్ పాత్ర ద్వారా ఈ ద్వేషం మనకు తెలుస్తుంది. అతనంటే రింకో భయపడుతూ ఉంటుంది. నాన్న క్షౌరశాలకి స్టార్ లాండ్రి మీదుగా కాకుండా వేరే మార్గంలో ఆమె వెళుతుంది. తాము 1918లో మొదటిసారి అమెరికా వచ్చినప్పుడు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండేదో రింకో తండ్రి షింటారో చెపుతుంటాడు.

తన మూలాలను ఇష్టపడని, వాటిని వదులుకోవాలి అనుకునే పరిస్థితి ఆమెది.

బడిలో వివక్షత కారణంగా రింకో ఎంతో ఆత్మ న్యూన్యతకు గురి అవుతుంది. ఇతరులకు నోరు తిరగని తన పేరు (ఆమె ఇంటి పేరు త్సుజిమురా) నుంచి, తన జుట్టు, తన కళ్లు, ఇంగ్లీషు ఉచ్చారణ, తనదైన ఏదీ ఆమెకు నచ్చదు. తన మూలాలను ఇష్టపడని, వాటిని వదులుకోవాలి అనుకునే పరిస్థితి ఆమెది.

కథా కాలమైన 1935 నాటికే అమెరికాలోని జపనీయుల పరిస్థితి ఇలా ఉంటే రెండవ ప్రపంచ యుద్ధ (ప్రత్యేకించి పెర్ల్ హార్బర్‌పై జపనీయుల దాడి) నేపధ్యంలో ఇంకా ఎలా ఉండి ఉంటుందో అనుకున్నాను. దాని గురించి వెదికి చూడగా, ఆ సమయంలో పశ్చిమ తీరంలో ఉంటున్న జపనీయులు అందరినీ (పిల్లా-పీచు, ముసలి-ముతకాతో సహా షుమారు 1,20,000 మందిని) కాన్సంట్రేషన్ శిబిరాలకు తరలించారని తెలుసుకుని మరింత ఆశ్చర్యానికి, వ్యధకు లోనయ్యాను. దేశానికి హాని తలపెడుతున్నారు లేదా తలపెడతారు అన్న అనుమానం ఉన్న వాళ్లను అరెస్టు చెయ్యవచ్చు. కానీ అందరినీ శిబిరాలకు తరలించటం అదేమి ప్రజాస్వామ్యమో నాకు అర్థం కాలేదు. ఆనాటి సంఘటనలకి సంబంధించి యొషికొ ఉచిద రాసిన ఒక చిన్న కథ అరవింద గుప్తా అందచెయ్యగా తెలుగులోకి అనువదించాను. అది ఆర్కైవ్‌లో అందుబాటులో ఉంది. ఈ లింకు ద్వారా ఆ పుస్తకం కోసం ప్రయత్నించవచ్చు.

అయితే, ఆ వివక్షతాపూరిత చర్యల మీద ఒక విచారణ సంఘం వేసి అమెరికన్-జపనీయులకు ఆ దేశం కొన్ని దశాబ్దాల తరవాత క్షమాపణ చెప్పటం గుడ్డిలో మెల్లగా భావించి కొంత సంతోషించాలి.

నీ కొడుకుకి చెపుతున్నావు కానీ నీ కలను ఏం చేశావు అని షింటారోని నిలదీసినంత పని చేస్తుంది వాకా. ఆ స్ఫూర్తితో కార్ల తోపాటు, రకరకాల పరికరాలను మరమ్మతు చేసే పనిని షింటారో ఇంటి దగ్గర మొదలు పెడతాడు.

రింకో వాళ్లను చూడటానికి జపాను నుంచి అమెరికా వస్తున్నట్టు వాకా పిన్ని నుంచి వచ్చిన ఉత్తరంతో ఈ నవల మొదలవుతుంది. ఆ వార్త రింకోకి అంత సంతోషం కలిగించదు. వాకా పిన్ని మనిషి పొట్టి, ఒక కాలు అవీటి. అంతే కాకుండా ఆమె కొడుకు చిన్నప్పుడే చనిపోయాడు, ఆ తరవాత సంవత్సరం లోపే భర్త చనిపోయాడు. ఆమె విషాదాన్ని ఎలా భరించాలి అని రింకో బాధ పడుతుంది. అదీ కాక తన గది ఖాళీ చేసి ఆమె పిన్నికి ఇవ్వాల్సి ఉంటుంది.

వాకా పిన్ని జపానుకి తిరుగు ప్రయాణం కావటంతో నవల ముగుస్తుంది. ఆమె అమెరికాలో ఉన్నది కేవలం రెండు నెలలు. ఆ రెండు నెలలు ఎలా గడిచిపోయాయో రింకోకి తెలియదు. వాకా పిన్ని తిరిగి వెళుతున్నప్పుడు రింకో ఎంతో బాధపడుతుంది. అంత తక్కువ కాలంలో వాళ్ల జీవితాలను వాకా పిన్ని అంతగా ప్రభావితం చేసింది.

రింకో వాళ్ల నాన్నతో పాటు అమెరికా వచ్చిన కందాని పిల్లలు బాబాయ్ అంటారు. ప్రతి ఆదివారం రింకో వాళ్ల ఇంటికి భోజనానికి వస్తాడు కందా. జపాన్ నుంచి అతనికి వధువుగా వచ్చిన అమ్మాయి అమెరికా రాగానే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఘటన కందా బాబాయ్‌ని బాగా కుదిపివేస్తుంది. ఆ తరవాత అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోతాడు. కందా బాబాయ్, వాకా పిన్నిలు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని జపాన్ ప్రజలలో సంబంధాలు కుదుర్చే రింకో స్నేహితురాలి తల్లి ప్రతిపాదిస్తుంది. అలా జరిగితే బాగుంటుందని రింకోకి కూడా ఉంటుంది. కానీ జపాన్‌లో ఉన్న తల్లిదండ్రులు, భర్త, కొడుకు జ్ఞాపకాల దగ్గరకు వాకా పిన్ని తిరిగి వెళ్లిపోతుంది.

ఈ ఘటన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాకా పిన్ని కనబరిచిన ధైర్యం, ఆమె నిలబడి చెప్పిన మాటలు రింకోలో ఆశ్చర్యం కలిగిస్తాయి.

వాకా పిన్ని అమెరికా వచ్చేపాటికే ఇళ్లల్లో పని చేయటం మానేసి సొంతంగా ఇంటి దగ్గరే లాండ్రి పెట్టుకోవాలనుకుంటుంది రింకో తల్లి. ఉతకటానికి కొంతమంది బట్టలు ఇవ్వటానికి ఒప్పుకుంటారు కూడా. ఆ పనికి తగిన మార్పులను ఇంటిలో చేసుకుంటారు. వీళ్లతో పోలిస్తే స్టార్ వాళ్ల లాండ్రి ఎంతో పెద్ది. అయినప్పటికీ వీళ్ల ప్రయత్నంలో అనేక ఆటంకాలు కల్పిస్తారు. వీళ్లు ఉతకటానికని ఉంచిన బట్టలను స్టార్ లాండ్రీ వాళ్లు ముందుగానే తీసుకుని వెళ్లిపోతారు. దాంతో స్టార్ లాండ్రీ వాళ్ల వాహనాలు సాయంత్రం వెళ్లిపోయిన తరవాత రింకో వాళ్ల నాన్న ఉతికే బట్టలు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక రాత్రి వీళ్ల ఇంటిదగ్గర వాహనానికి నష్టం కలిగించటానికి వచ్చిన వాళ్లు రింకో తమ్ముడు పెంచుకుంటున్న మాక్స్ అనే కుక్కని తుపాకీతో కాలుస్తారు. ఆ రాత్రే కాకుండా, ఆ మరునాడు ఈ ఘటన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వాకా పిన్ని కనబరిచిన ధైర్యం, ఆమె నిలబడి చెప్పిన మాటలు రింకోలో ఆశ్చర్యం కలిగిస్తాయి. విల్‌బర్ స్టార్ దగ్గరకి నేరుగా వెళ్లి అతను ఏం చేసినా వెనక్కి తగ్గబోమని, తాము నిజాయితీగా, కష్టపడి పనిచేసేవాళ్లమని చెప్పి రమ్మంటుంది వాకా పిన్ని. షింటారో, కందా బాబాయ్ అలాగే చేస్తారు. ఆ సందర్భంలో నోట మాట రాకుండా ఉండిపోతాడు విల్‌బర్. ఈ ఘటన రింకోలో ఎంతో ఆత్మ విశ్వాసం నింపుతుంది.

తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు చూసి తాను ఇంజినీరింగ్ చదువు మానేసి, ఏదో ఒక పని చేస్తూ వాళ్లకి చేదోడు వాదోడుగా ఉంటానని కాల్ అంటాడు. తమ పాట్లు తాము పడతామని, తన కలను మాత్రం విడిచి పెట్టవద్దని కొడుకుకి నచ్చ చెప్పటానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. నీ కొడుకుకి చెపుతున్నావు కానీ నీ కలను ఏం చేశావు అని షింటారోని నిలదీసినంత పని చేస్తుంది వాకా. ఆ స్ఫూర్తితో కార్ల తోపాటు, రకరకాల పరికరాలను మరమ్మతు చేసే పనిని షింటారో ఇంటి దగ్గర మొదలు పెడతాడు. దీని కోసం కందా బాబాయ్ దాచుకున్న డబ్బుని తన వంతు పెట్టుబడిగా ఇచ్చాడు. అంతే కాకుండా చదువు కొనసాగించమని కాల్‌కి నచ్చ చెప్పటానికి అతను శెలవుల్లో పని చేస్తున్న ఊరికి వెళతాడు కందా. ఆ క్రమంలో అతను ప్రమాదానికి గురవుతాడు. ఆసుపత్రిలో తనను చూడటానికి వచ్చిన రింకోకి ఆమె కలను వదిలిపెట్ట వద్దన్న అన్న మాటలను కందా చెపుతాడు.

రింకో కోసం జపాన్ నుంచి వాకా పిన్ని ఒక కిమోనో తెచ్చింది. దానిని వాకా పిన్ని కోసమే ఒక రోజు రింకో వేసుకుంటుంది. దానిని వేసుకుని ఎవరైనా ఎలా నడుస్తారని రంకోకి ఆశ్చర్యం వేస్తుంది. దానిని రింకో మళ్లీ వేసుకోదని వాకా పిన్నికి అర్థమవుతుంది. కాలేజీ చదువు కోసం డబ్బును పొదుపు చేసుకొంటున్నట్లే ‘జపాను యాత్ర ముంత’ పెట్టి పొదుపు చెయ్యటం మొదలు పెట్టమని రింకోకి చెపుతుంది వాకా పిన్ని. అలా చేస్తే వచ్చే సంవత్సరమే జపానులో కలుసుకోవచ్చని వాకా అంటుంది. అది సాధ్యం కాని పని అని రింకోకి తెలుసు, వాకాకి కూడా తెలుసు.

ఈ ప్రధాన ఘటనల మధ్య ఎన్నో చిన్న చిన్న ఘటనలు ఉంటాయి. అన్నా – చెల్లెళ్ల మధ్య చెణుకులు, అక్కా – తమ్ముడు మధ్య తగువులు, కోళ్లంటే రింకోకి ఉన్న భయం, బాబాయ్‌ పిసినారితనం వంటివి ఎన్నో కథను ఎంతో సహజంగా నడిపిస్తాయి.

ఈ ప్రధాన ఘటనల మధ్య ఎన్నో చిన్న చిన్న ఘటనలు ఉంటాయి. అన్నా – చెల్లెళ్ల మధ్య చెణుకులు, అక్కా – తమ్ముడు మధ్య తగువులు, కోళ్లంటే రింకోకి ఉన్న భయం, రింకో అంటే ఎంతో ఇష్టంగా ఉండే పక్క ఇంటి మిసెస్ షుగర్, కందా బాబాయ్‌ పిసినారితనం వంటివి ఎన్నో కథను ఎంతో సహజంగా నడిపిస్తాయి.

అమెరికాలో పుట్టిన రింకో ఎంతైనా అమెరికా అమ్మాయే. తన మూలాల కారణంగా ఆత్మన్యూన్యతకు లోనయ్యే రింకో, వాకా పిన్నిని చూసిన తరవాత వాటికి గర్వ పడటం మొదలు పెడుతుంది.
కలల ముంత 2021 జనవరిలో ప్రచురితం అయ్యింది. 96 పేజీల ఈ పుస్తకం వెల 60 రూపాయలు. కావాలని ఉన్న వాళ్లు ఈ లింకు ద్వారా దీనిని కొనుక్కోవచ్చు.

కాలమిస్టు పరిచయం

కొసరాజు సురేష్ పాత్రికేయులు, అనువాదకులు. ప్రభుత్వం ప్రభుత్వేతర  స్వచ్ఛంద సేవా సంస్థలో దశాబ్దాలు కృషి చేశారు. ప్రచురణా రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వారి అనువాదాల్లో ‘గడ్డిపరకతో విప్లవం’ మొదటిదైతే ఇప్పటిదాకా వారు చిన్న పెద్ద పుస్తకాలను వంద దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అందించారు. అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే.

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. తెలుపు కోసం వారు ఇప్పటిదాకా పరిచయం చేసిన పందోమిది పుస్తకాల కోసం ఈ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. అక్కడి నుంచి ఏ పుస్తకం కావాలంటే ఆ పుస్తకంలోకి వెళ్లి చదవొచ్చు. అందుబాటులో ఉన్న వాటిన్హి తెప్పించుకోవచ్చు. మరిన్ని వివరాలకు మెయిల్ చేయొచ్చు లేదా కింది వెబ్సైట్ చూడండి.

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article