విగత జీవిగా పడిఉన్న ఈ చెట్టు ఒక వార్త. దాన్ని కొట్టేసిన టీచర్ ఒక నేరస్తుడు. కరోనా కాలంలో మన బాధ్యతను గుర్తి చేసే ఈ అధికారి చర్య అభినందనీయం.
పచ్చగా ఎదగాల్సిన ఒక చెట్టును కొట్టేసిన ఉపాధ్యాయుడిపై సిద్ధిపేట పురపాలక కమిషనర్ చర్య తీసుకోవడం ఆసక్తికరమైన ఒక ఉదంతాన్ని గుర్తు చేస్తోంది.
పర్యావరణ ప్రేమికుడు, చవక ఇండ్ల నిర్మాణంలో పేరొందిన బ్రిటీష్ ఆర్కిటెక్టు లారీ బెకర్ ఒక ప్రభుత్వం కార్యాలయం వారి ఆహ్వానం మేరకు, ఒక ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చర్చించేందుకు కమిషనర్ తో మాట్లాడేందుకు సైకిల్ పై వెళతాడు. సరిగ్గా కార్యాలయం గేటు ముందు దాక వెళ్లేసరికి అక్కడ ఒక పచ్చటి చెట్టు కొట్టేసి ఉంది. దాన్ని చూసి అయన వెనక్కి వచ్చేస్తాడు. కాసేపట్లో కమిషనర్ నుంచి మనిషి వచ్చి, ‘మా సార్ వేచి చూస్తున్నారు, మీరింకా బయలు దేరలేదా?’ అంటాడు. అందుకు లారీ బెకర్ ‘రాను’ అంటాడు. ‘చెట్టునే పట్టించుకోని మీ కమిషనర్ పదుగురికి నీడ నిచ్చే ఇండ్ల సముదాయాని నిర్మిస్తాడా? కాని పని. అతడు తగినంత ధ్యాస పెడుతాడంటే నేను నమ్మలేను’ అని ఆ ప్రాజెక్టుని చేపట్టడానికి నిరసనగా నిరాకరిస్తాడు. అంతేకాదు, ఇక ఎన్నడూ ఆ అధికారి ఉన్నతవరకు ఆ కార్యాలయం మెట్లు ఎక్కానని బీష్మించుకుంటాడు.
పర్యావరణం పట్ల ఒక ఉన్నతాధికారి అలసత్వాన్ని చెప్పే ఈ ఉదంతం తాజాగా సిద్ధిపేట కమిషనర్ రమణాచారి బాధ్యతాయుత ప్రవర్తనతో చప్పున గుర్తొచ్చింది.
ప్రస్తుత మహమ్మారి కాలంలో ప్రాణవాయువు తీవ్రత అందరినీ అందోళణకు గురిచేస్తోంది. అటువంటి సమయంలో ఒక చెట్టును బాధ్యతగల ఒక ఉపాధ్యాయుడు కొట్టేయడం పెద్ద నేరమే అవుతోంది.
నాలుగేళ్ల క్రితం తన ఇంటి ముందు నాటిన గుల్మొహర్ చెట్టును నర్సింహరెడ్డి అన్న టీచర్ కొట్టివేయడంతో సిద్ధిపేట కమిషనర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. నిజానికి చెట్ల పెంపు అన్నది హరితహారంలో భాగమే. వాటిని కొట్టేసిన వారిపై చర్య కూడా సిద్దిపేటలో ఎప్పుడో రొటీన్ అయ్యింది. స్థానిక మంత్రి హరీష్ రావు ప్రోద్భలంతో సిద్ధిపేట ఒక సహజమైన లంగ్ స్పేస్ గా మార్చడం అన్నది అక్కడి ప్రాధాన్యత. కానీ ఈసారి కమిషనర్ ఆగ్రహానికి కారణం ప్రస్తుత స్థితి. మన అందరినీ వేధిస్తున్న ఆక్సిజన్ కొరత. అది సహజంగానే ఆ అధికారిని మరింత తీవ్రమైన చర్యకు ఉసిగోలపడం నిజానికి ఇక్కడ సానుకూలమైన అంశం
కరోనా మహమ్మారి మనల్ని ప్రకృతితో సమన్వయం చేసుకోమని చెప్పకనే చెబుతోంది. మన ప్రాణాలకు రక్షణ..నివాస పరిస్థితులు, చెట్టు చేమా, ఆరోగ్యానికి రక్షణగా ఉన్న సంప్రదాయ జీవనమే అన్న సంగతి కూడా తేల్చి చెబుతోంది. అటువంటి సమయంలో ప్రాణదాతగా ఉన్న ఒక చెట్టును నిర్దాక్షిణ్యంగా కొట్టేయడం కమిషనర్ ఆగ్రహానికి కారణమైంది. సదరు నర్సింహరెడ్డి అన్న టీచర్ ఉద్యోగం కూడా పోతుందని కేసు పెట్టలేదుగానీ నిజానికి పెద్ద శిక్షే వేయాలి’ అని కమిషనర్ ‘తెలుపు’తో అభిప్రాయ పడ్డారు.
‘సిద్ధిపేట లోని మహాశక్తి వీధి నంబరు రెండులో ఉండే నర్సింహ రెడ్డికి ఇరవై వేల రూపాయల జరిమానా వేశాం. అంతేకాదు, ఒక్క చెట్టు కొట్టేసినందుకు గాను మరో ఇరవై చెట్లు నాటాలన్న షరతు పెట్టాం. కానీ ఆయన అప్పటికే చేయవలసిన నష్టం చేశారు” కదా అని బాధపడ్డారు రమణాచారి.
“ఈ చర్య చెట్టు కొట్టేసినందుకే కాదు, బాధ్యతారాహిత్యానికి కూడా. భావి భారత పౌరులకు చెట్ల ప్రయోజనాన్ని చెప్పాల్సిన తరుణంలో ఆ ఉపాధ్యాయుడి ప్రవర్తన తీవ్రమైన నేరమే అనిపించింది నాకు, వ్యక్తిగతంగా. అందుకే అధికారిగా చేయవలసిన పని చేశాను. ఈ చర్య ఒక సానుకూల సందేశం తీసుకు వెళితే మరీ మంచిది” అని అయన చెప్పారు.
రమణాచారి గారికి ‘తెలుపు’ అభినందనలు చెబుతోంది. వారి ఆగ్రహంలోని సందేశాన్ని పదుగురికి చేరవేస్తోందని కూడా వారికి తెలియజేస్తోంది.
తెలుపు టీవీ ప్రజల సమస్యయకొరకు పనిచేయాలి.