Editorial

Wednesday, January 22, 2025
Opinionఉత్సవ తెలంగాణ - వాస్తవ తెలంగాణ

ఉత్సవ తెలంగాణ – వాస్తవ తెలంగాణ

 drunkard

రాష్ట్రావిర్భావం తర్వాత ‘నీళ్ళు నిధులు నియామకాల’ యాజమాన్యం కన్నా సామాన్య జనం కష్టార్జితాన్ని కాజేసే ‘మద్యం సరఫరా’ పెరగడమే ఈ పదేళ్ళ తెలంగాణా విషాద వైఫల్యం అని తొలుత చెప్పక తప్పదు.

కందుకూరి రమేష్ బాబు

ఇంకో రెండు రోజుల్లో స్వరాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకునే సందర్భంలో రాష్ట్రం సాధించిన ప్రగతి విషయంలో మొదటగా చెప్పుకునే విషయం మద్యం (లిక్కర్) ఐతే బాగుంటుందేమో!

నిజానికి రాష్టం ఏర్పాటయ్యాక మంచి చెడులు రెండూ మాట్లాడాలి. ఐతే, చిత్తుగా తాగి ఉన్న ఈ మనిషి బొమ్మ నాణానికి బొత్తు వంటి విషయాన్ని చాలా బలంగా చెబుతుందని ముందస్తుగా ఈ చిన్న పోస్టు.

వాస్తవానికి రాష్ట్రం మద్యం విషయంలో సాధించిన అభివృద్ధి లేదా ప్రగతి మరే విషయంలో సాధించినట్లు లేదు కూడా. రాష్ట్ర ఖజానాకు మద్యం ద్వారా వస్తున్న డబ్బే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి వాణిజ్య శాఖ తర్వాత అబ్కారీ శాఖ ఆదాయమే ఎక్కువ ఉందని లెక్కలు చెబుతున్నాయి.

నిజానికి మద్యం అమ్మకాల్లో ‘దేశం’లోనే తెలంగాణా పేరు పొందుతోంది. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా హైదరాబాద్ రెండవ స్థానం. మూడవ స్థానంలో నల్లగొండ జిల్లా ఉన్నది మరి.
మద్యం అమ్మకాల్లో రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆదాయం ఏటా 1౦ వేల కోట్లు ఉండగా నేడు రూ. 40 వేల కోట్లు దాటినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఒక్కో కుటుంబం నుంచి సగటున ప్రభుత్వానికి 5౦ వేల రూపాయలు సమకూరుతోందని చెప్పవచ్చు.

ప్రభుత్వానికి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, మద్యం లైసెన్స్ అనే మూడు మార్గాల ద్వారా ఈ ఆదాయం లభిస్తోంది.

మీకు తెలిసిందే. పండుగలు, పబ్బాలు, చావులు, బాధల్లో తెలంగాణాలో మద్యం తాగడం ఉన్నదే. ఐతే, ప్రభుత్వం ప్రజల బలహీనతలను ఆసరా చేసుకుని వారికి మద్యం మరింతగా అందుబాటులోకి తెచ్చే విధానాలు చేపట్టడంతో ఖజానాకు పెద్ద ఎత్తున లాభం వస్తోంది. ఇది దీర్ఘ కాలికంగా సకల జనులపై ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడని పేద జనంపై చేసే జీవన విద్వంసం, ఆయాకుటుంబాల్లో పెంచే సంక్షోభం తదితర విషయాల గురించి పౌర సమాజం తరపున ఎవరూ పెద్దగా నోరు మెదపడం లేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు లేవు కూడా.

నిజానికి తెలంగాణాలో మద్యం అమ్మకాలు పెరగడానికి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో మద్యం విధానం అంత బాగా లేకపోవడం కూడా ఒక కారణం అంటున్నారు. అలాగే సమయం సందర్భం చూసి ప్రభుత్వం మద్యం ధరలను పెంచడం కూడా మరో కారణం అంటున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత కూడా మద్యం ధరలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. అంతేగాక ప్రభుత్వం ప్రజల కోసం వెచ్చిస్తున్న సంక్షేమ పథకాల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బు మద్యం అమ్మకాల ద్వారా తిరిగి ఖజానాకు చేరుతోందని కూడా అంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఒక నివేదిక రూపొందించేందుకు ఎవరైనా పూనుకుంటే ఈ విషయం నిగ్గు తెలవచ్చు కూడా.

celebrations logo

ఇది ఉత్సవాల తరుణంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న మద్యం విధానాన్ని మనం తీవ్ర విషాదంగా ఎంచి నిరసించ వలసి ఉంది.

నిజానికి రేపో ఎల్లుండో ఎక్సైజ్ శాఖ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం మరిన్ని ఘనమైన వివరాలను ఈ శాఖ తరపున సవివరంగా ప్రజల ముందు పెట్టవచ్చు కూడా. ఆప్పుడు గణాంకాలతో సహా ఈ విషయంలో రాష్ట్ర అభివృద్ధి మనం పోల్చుకోవచ్చు.

ఏమైనా రాష్టం ఏర్పాటు చేసుకున్నాక ‘నీళ్ళు నిధులు నియామకాల’ యాజమాన్యం విషయంలో కన్నా సామాన్య జనం ఇరుసుగా చెప్పుకోదగిన విషయం ఏమైనా జరిగిందీ అంటే వారి కష్టార్జితాన్ని కాజేసే మద్యం సరఫరా పెరగడమే అని చెప్పక తప్పదు. ఇది ఉత్సవాల తరుణంలో దీన్ని మనం తీవ్ర విషాదంగా ఎంచి నిరసించ వలసి ఉంది.

చివరగా ఒక మాట. మీరు చూస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లోనే. షేఖ్ పెట్ దగ్గర ఉన్న లిక్కర్ షాప్ ముందు తీసిందే.

రాష్ట్ర ప్రగతికి మచ్చు తునక వంటి ఈ చిత్రం తీయడంలో నా తరపున పెద్ద ఘనకార్యం ఏమీ లేదు. ఇలాంటి చిత్రాలు ఎక్కడంటే అక్కడ ప్రతి రెండు మూడు కిలోమీటర్ల పొడవునా ఎవరైనా తీయడానికి వీలుంది.

విషాదం ఏమిటంటే, ఇలాంటివి మనసు ఒప్పుకోక పోయినా ఈ పదేళ్ళలో పదికన్నా ఎక్కువే తీశాను. ఇవి ‘రాష్ట్ర ప్రగతి’కి చిహ్నాలు కారాదనే భావంతోనే దశాబ్ది ఉత్సవాలపై తొలి పోస్టు దీనితో పెడుతున్నాను.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article