Editorial

Monday, December 23, 2024
ARTSSketch Book : శీలా వీర్రాజు గారి లేపాక్షి 'శిల్పరేఖ'లు

Sketch Book : శీలా వీర్రాజు గారి లేపాక్షి ‘శిల్పరేఖ’లు

మీరు చూసేవి మొన్న కన్నుమూసిన ప్రముఖ చిత్రకారులు, రచయిత శ్రీ శీలా వీర్రాజు 1990లో వెలువరించిన తన లేపాక్షి స్కెచ్ బుక్ – ‘శిల్ప రేఖ’లోని రేఖా చిత్రాలు. మీరు చదివేది ఆ పుస్తకానికి వారు రాసిన విలువైన ముందుమాట.

శీలా వీర్రాజు

పందొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఒకానొక మే మాసపు వడగాల్పుల్లో మా జీపు అనంతపురం నించి హిందూపురానికి బయలు దేరింది. జీపులో నేనూ, గోపాలశాస్త్రి కాక మరో ముగ్గురు వున్నారు. వారిలో ఒకరు ఫొటో గ్రాఫర్. మరొకరు ఆర్టిస్టు.

లేపాక్షి, తాడిపత్రి తదితర ప్రాంతాల్ని చూసి ఆంధ్రప్రదేశ్ పత్రికలో ఇంగ్లీషులో గోపాలశాస్త్రి, తెలుగులో నేనూ వ్యాసాలు రాయడం కోసం ఫొటో గ్రాఫర్నీ, ఆర్టిస్టుని వెంటబెట్టుకుని, మాతోపాటు వస్తానన్న మరో ఆఫీసర్ని కలుపుకుని హైదరాబాదునించి బయలుదేరాం. అందరమూ సమాచారశాఖ ఉద్యోగులమే. ఉద్యోగరీత్యా నేను అసిస్టెంట్ ట్రాన్స్ లేటర్నే అయినా, చిత్రకళమీద నాకున్న అభిరుచి కారణంగా ప్రత్యేకంగా ఒక స్కెచ్ బుక్ పట్టుకుని బయలుదేరాను నేను.

బహుశా అక్కడే గాబోలు కల్లూరి సుబ్బారావుగార్ని కలుసుకున్నాం. లేపాక్షిని వెలుగులోకి తెచ్చినవారు ఆయనే.

హైదరాబాదునించి బయలుదేరి దారిలో ఓ రాత్రి ట్రావెలర్స్ బంగళాలో బసచేసి, పొద్దున్న మళ్ళీ బయలుదేరి మధ్యాహ్నానికి అనంతపురం చేరుకున్నాం. భోజనానంతరం మా ఆఫీసుకు సంబంధించిన జిల్లా కార్యాలయంలో గడిపి కాస్త ఎండ తగ్గగానే హిందూపురం చేరుకుని, బహుశా అక్కడే గాబోలు కల్లూరి సుబ్బారావుగార్ని కలుసుకున్నాం. లేపాక్షిని వెలుగులోకి తెచ్చినవారు ఆయనే. లేపాక్షి శిల్పాలు, చిత్రాలు ఎంత గొప్పవో ఆయన చెప్పడమేకాదు, వాటిని భద్రపరచడానికీ, పదిమంది దృష్టికి తీసుకురావడానికి ఆయన పడిన శ్రమ వివరించారు.

ఆలయ ప్రాంగణంలో నివాసం వుంటూ కట్టెలతో వంటలవీ చేసుకోవడంవల్ల స్తంబాలూ, గోడలూ పొగచూరిపోయాయి. కుడ్యచిత్రాలపై సున్నం వేసేయడంవల్లా, పొగచూరి మసిబారిపోవడంవల్లా చాలా కుడ్య చిత్రాలు పాడైపోయాయి.

లేపాక్షిలోనిది వీరభద్రేశ్వరాలయం. చాలా కాలంగా ఆ దేవాలయం ఆలక్షింపబడి శిథిలావస్థకు చేరుకుంది. భీక్షకులు ఆలయ ప్రాంగణంలో నివాసం వుంటూ కట్టెలతో వంటలవీ చేసుకోవడంవల్ల స్తంబాలూ, గోడలూ పొగచూరిపోయాయి. కుడ్యచిత్రాలపై సున్నం వేసేయడంవల్లా, పొగచూరి మసిబారిపోవడంవల్లా చాలా కుడ్య చిత్రాలు పాడైపోయాయి. గోడలు పడిపోయీ, రాళ్ళు ఊడిపోయీ, శిల్పాలు దెబ్బతినీ సరైన ఆలనా పాలనా లేకుండా వున్న లేపాక్షి వీర భద్ర ఆలయాన్ని గురించి కల్లూరి సుబ్బారావుగారు పట్టించుకుని అధికార్ల దృష్టికి తెచ్చి, పత్రికలద్వారా ప్రచారంచేసి, పెద్దలను కలిసి మాట్లాడి ఆ ఆలయాన్ని సముద్దరించడానికి విశేషంగా కృషి చేశారు. ఆ విషయాలన్నీ ఆయన చెప్తూ ‘లేపాక్షి దేవాలయాన్ని గురించి నేను చెప్పడంకాదు, మీరే చూస్తారుగా, వెళ్ళిరండి’ అని సాదరంగా వీడ్కోలు పలికారు.

సూర్యుడు ఆలయం వెనక ఇళ్ళ కప్పుల కిందకు కుంగిపోతున్నాడు. ఆకాశంలో పరుచుకున్న ఎర్రరంగు కొద్దిగా వెలుతుర్ని ఆలయ ప్రాంగణంలోకి కుమ్మరిస్తోంది.

హిందూపురంనించి చాలా దగ్గరే. పదిమైళ్ళు. చూస్తుండగానే మా జీపు పొలాలవక్క ‘మట్టి రోడ్డులో ఎర్రని దుమ్మును లేపుకుంటూ లేపాక్షి గ్రామాన్ని చేరుకుంది. ఊరు చాలా చిన్నది. ప్రభుత్వం కొత్తగా ఒక టూరిస్ట్ గెస్ట్ హౌస్ కట్టించింది కాని ఇంకా ప్రారంభం కాలేదు. అప్పట్లో అది మా శాఖక్రిందే వుండేది గనుక అందులో సామాను పడేసి స్నానం చేసీ చేయనట్లు వొళ్ళు తడుపుకుని ఆలయానికి చేరుకున్నాం. అప్పటికే చీకటి పడుతూ పడుతూ వుంది. సూర్యుడు ఆలయం వెనక ఇళ్ళ కప్పుల కిందకు కుంగిపోతున్నాడు. ఆకాశంలో పరుచుకున్న ఎర్రరంగు కొద్దిగా వెలుతుర్ని ఆలయ ప్రాంగణంలోకి కుమ్మరిస్తోంది. స్థానికంగా వున్న మా శాఖ అధికారి ముందుగా చెప్పడం వల్ల పూజారి మా కోసమే ఎదురుచూస్తూ వున్నాడు.

నేను రంగమండపంలో చిరు వెలుగుల్లో నా చుటూ పరివేష్టించి వున్న దేవతామూర్తుల మధ్య ఒక్కడ్నే నిలబడిపోయాను.

అందరూ దైవ దర్శనంలో మునిగిపోయారు. నేను రంగమండపంలో చిరు వెలుగుల్లో నా చుటూ పరివేష్టించి వున్న దేవతామూర్తుల మధ్య ఒక్కడ్నే నిలబడిపోయాను. కొబ్బరిముక్క ప్రసాదం పట్టుకొచ్చి మా వాళ్ళు నా చేతిలో పడేశారు- దేవుడంటే భక్తి శ్రద్ధాలేదు, వట్టి నాస్తిక వెధవ్వి నువ్వు అన్నట్టు నా వైపు చూసి.

నిజమే, అక్కడ నేను దేవుడ్ని చూడలేకపోయాను. ఆ దేవుడ్ని చెక్కిన, చిత్రించిన శిల్పుల, చిత్రకారుల ప్రతిభల్ని మాత్రమే చూడగలిగాను – అక్కడున్న ఆ రెండు రోజులూ, వచ్చిన రోజుకాక మర్నాడు, ఆ మర్నాడు పొద్దున్నే దేవాలయానికి రావడం, మధ్యాహ్నం వరకూ స్కెచ్ లు గీసుకోవడం, భోజనానికి వెళ్ళి వచ్చి సాయంత్రం వరకూ మళ్ళీ స్కెచ్ లు వేసుకోవడం, మధ్య మధ్య పూజారిని అడిగి అక్కడి శిల్పాల వివరాలు తెలుసుకోవడం, రాత్రి గెస్ట్ హవుస్ కి వచ్చి భోజనం కాగానే గోపాలశాస్త్రి జోకాభిరామాయణంలో మునిగిపోవడం, రాత్రి కలలు కనాలనుకొంటూనే వొళ్ళు నొప్పుల్లో తెలివి లేకుండా మత్తుగా నిద్రపోవడం – అలా గడిచిపోయాయి మిగతా రెండ్రోజులూ.

ఈ స్కెచ్ బుక్ లో వున్నవి ఆ శిల్పాలకు అక్కడికక్కడ నిలుచునో, కూర్చునో అప్పటికప్పుడు నేరుగా గీసుకున్న చిత్రాలే. ఆ రెండ్రోజుల్లోనూ దాదాపు యాభై స్కెచ్ లు గీసుకున్నాను.

ఆ రెండ్రోజుల్లోనూ రంగమంటపం, కళ్యాణ మంటపాల్లోని యించుమించు అన్ని పెద్ద శిల్పాల స్కెచ్ లూ వేసుకున్నాను. ఈ స్కెచ్ బుక్ లో వున్నవి ఆ శిల్పాలకు అక్కడికక్కడ నిలుచునో, కూర్చునో అప్పటికప్పుడు నేరుగా గీసుకున్న చిత్రాలే. వీటిలో తుడుపులకు, దిద్దుబాట్లకూ అవకాశంలేదు. ఇవి స్పాట్ స్కెచ్ లు. స్పీడ్ ముఖ్యం. ఆ రెండ్రోజుల్లోనూ దాదాపు యాభై స్కెచ్ లు గీసుకున్నాను. దేవాలయ చరిత్రను గురించీ, శిల్పాలను గురించీ పూజారి చెప్పిన వివరాలను నోట్ చేసుకున్నాను. మాతో వచ్చిన ఆర్టిస్టు రమణ కూడా తన స్కెచ్ పుస్తకం నింపేశాడు. ఫొటోగ్రాఫర్ జగదీశ్వర్ ఒక్క రోజులోనే అన్ని ఫొటోలూ తీసేసుకుని గోపాలశాస్త్రితో మంటపం అరుగుమీద కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని, ఆడపాతడపా పూజారిని అడిగి కొబ్బరిచెక్కల ప్రసాదం తెచ్చియిస్తుండేవాడు. మాతో వచ్చిన మరో అధికారి పనుందని చెప్పి బెంగుళూరు వెళ్ళిపోయాడు శని, ఆదివారాల్లో అక్కడే జరిగే అశ్వమేధ యజ్ఞంలో పాల్గోవడానికి.

చుట్టుపట్ల గ్రామాలవాళ్ళు ఎప్పుడయినా వచ్చినా దేవుడికి ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ నమస్కారం పెట్టుకోడానికి వచ్చేవారే. ఇక్కడొక గొప్ప శిల్పం వున్నదనీ, అద్భుతమైన చిత్రలేఖనం వున్నదనీ చూసిపోదామనే కళాత్మక దృష్టితో చాలా తక్కువ మందే వచ్చేవారు.

లేపాక్షిని చూడడానికి వచ్చే సందర్శకులు ఎక్కువగా బెంగుళూరునించే వస్తుంటారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా లేపాక్షికి రోజూ టూరిస్టు బస్సులు వున్నాయి. తెలుగు టూరిస్టులు బహుతక్కువే. చుట్టుపట్ల గ్రామాలవాళ్ళు ఎప్పుడయినా వచ్చినా దేవుడికి ఓ కొబ్బరికాయ కొట్టి, ఓ నమస్కారం పెట్టుకోడానికి వచ్చేవారే. ఇక్కడొక గొప్ప శిల్పం వున్నదనీ, అద్భుతమైన చిత్రలేఖనం వున్నదనీ చూసిపోదామనే కళాత్మక దృష్టితో చాలా తక్కువ మందే వచ్చేవారు. కొంత మంది విదేశీ పర్యాటకులు కూడా వచ్చారు. వారంతా బస్సుల్లోనో, టేక్సీల్లోనో బెంగుళూరునించి వచ్చినవారే. బెంగుళూరు అక్కడికి దగ్గరే.

లేపాక్షి బసవయ్య నిజంగానే గొప్ప శిల్పం, తెలుగు పౌరుషానికి అది ప్రతీక.

లేపాక్షి బసవయ్య నిజంగానే గొప్ప శిల్పం, తెలుగు పౌరుషానికి అది ప్రతీక, ఎంతో హుందాగా, నిండుగా ఒంటినిండా ఆభరణాలతో అద్భుతమైన చెక్కడపు వనితనంతో వీరభద్ర ఆలయానికి అల్లంత దూరంలో ఊరి మధ్య ఠీవిగా కూర్చునివున్న ఆ ఏకశిలా నంది విగ్రహం దానికదే సాటి. బెంగుళూరులోని బసవనగుడి నందికన్న, ఆ దగ్గరలోని నందిహిల్స్ పైవున్న నందికన్న, లేపాక్షి నంది బహుశా పెద్దది కావచ్చు. అలాగే వీరభద్ర ఆలయంలోని నాగలింగం కూడా చాలా పెద్దది. ఈ రెండు విగ్రహాల ముందు నాలాటి వాళ్ళ సరేసరి, గోపాలశాస్త్రి లాటి వాళ్ళు కూడా చాలా చిన్నగానే అనిపిస్తారు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేపాక్షిని గురించి యిప్పుడిప్పుడే ప్రచారం చేయడం మొదలెట్టింది. అందువల్ల యిక్కడివారికి చాలామందికి దాని గొప్పతనం గురించి యింకా అంతగా తెలిసినట్టులేదు. లేపాక్షి బసవయ్య, పేరు మాత్రమే తెలుసు. అదీ – అడవి బాపిరాజు “లేపాక్షి బసవయ్య లేచి రావయ్య” అంటూ రాసిన గేయం రేడియోలో అప్పుడప్పుడు వినిపిస్తుండేది గనుక.

నేను అక్కడి శిల్పాలకు మాత్రమే స్కెచ్ లు గీసుకున్నాను. గోడలమీదా, సీలింగు పైనా రంగుల్లో చిత్రించిన పురాతన చిత్రాలు కూడా వున్నాయి. అచ్చమైన దేశీయ శైలి చిత్రాలవి. నేను వాటి జోలికి పోలేదు.

లేపాక్షి ఆలయ శిల్పాలకు వాడిన రాయి కొన్నిటికి నల్ల సేనావు రాయి….అదే – బ్లాక్ గ్రానైట్, మరికొన్నిటికి ఇసుకరాయి వాడారు. గ్రానైట్ రాయి ఉలికి ఒక పట్టాన లొంగని గట్టిరాయి. అయినా -శిల్పులు ప్రతి విగ్రహాన్ని ఆభరణాలతో, అలంకారాలతో చాలా వివరంగా చెక్కారు. కుడ్యాల మీదా , స్తంబాలమీదా హంసలు, లతలు వంటి మోటిఫ్ లు కూడా చాలా చక్కగా చెక్కారు. అదృష్టవశాత్తూ యిక్కడి శిల్పాలు భారతదేశంలోని పలు ప్రాంతాలలోని శిల్పాల మాదిరిగా విధ్వంసకారుల చేతిలో పడి పెద్దగా నాశనం కాలేదు. నాలుగైదు మాత్రమే అటువంటివి వున్నాయి. నేను అక్కడి శిల్పాలకు మాత్రమే స్కెచ్ లు గీసుకున్నాను. గోడలమీదా, సీలింగు పైనా రంగుల్లో చిత్రించిన పురాతన చిత్రాలు కూడా వున్నాయి. అచ్చమైన దేశీయ శైలి చిత్రాలవి. నేను వాటి జోలికి పోలేదు. సమయం చాలకపోవటం ఒక కారణమైతే, తీసుకెళ్ళిన స్కెచ్ బుక్ పూర్తయిపోయి ఆ పల్లెటూళ్ళో డ్రాయింగు పేపర్లు దొరక్కపోవడం మరో కారణం. నాలుగోరోజు ఉదయమే అక్కడినుండి తిరుగు ప్రయాణం కట్టాం. వస్తూ వస్తూ దారిలో తాడిపత్రి, పిల్లలమర్రి చూసుకుని హైదరాబాదు చేరుకున్నాం.

తిరిగి వచ్చిన తర్వాత, ఆధికారికంగా నేను వెళ్ళిన పని పూర్తి చేసేశాను. ఆంధ్రప్రదేశ్ పత్రికలో లేపాక్షిమీద ఓ వ్యాసం రాశాను.

తిరిగి వచ్చిన తర్వాత, ఆధికారికంగా నేను వెళ్ళిన పని పూర్తి చేసేశాను. ఆంధ్రప్రదేశ్ పత్రికలో లేపాక్షిమీద ఓ వ్యాసం రాశాను. మా ఫొటోగ్రాఫర్ తీసిన కొన్ని ఫొటోలూ, నేను వేసిన ఒకటో రెండో చిత్రాలూ అందులో వాడుకున్నాం. ఈ మధ్యనే ఆ వ్యాసం ఆంధ్రప్రదేశ్ పత్రికలో పునర్ముద్రించబడింది సచిత్రంగా..

1968 జూలైలో బెంగుళూరులోని చిత్రకళా పరిషత్ వారి పిలుపు మేరకు విధాన సౌధలో వారం రోజులపాటు జరిగిన చిత్రకళా ప్రదర్శనలో పాల్గొని లేపాక్షి స్కెచ్ లను ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరిగింది. 1969 ఏప్రిల్లో హైదబాదులోని కళాభవన్లో భారత కళా పరిషత్ సహకారంతో యీ లేపాక్షి స్కెచ్ ప్రదర్శన వారం రోజులపాటు ఏర్పాటు చేయబడింది.

1970 జనవరిలో పశ్చిమ జర్మనీలోని గోటింజెన్ నగరంలో అక్కడి విశ్వవిద్యాలయంలో భారతీయ తత్వశాస్త్రంపై డాక్టరేట్ చేస్తోన్న డి. శ్రీధరబాబు చొరవతో ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ వారు యీ లేపాక్షి చిత్రాల ఒన్ మాన్ షోను వారం రోజులపాటు నిర్వహించారు. ఆ విశ్వవిద్యాలయంలో చరిత్ర ప్రొఫెసర్ డా॥ హెచ్. రుడాల్ఫ్ రోజ్ మాన్ గారు ఈ ప్రదర్శనకు ప్రారంభోత్సవం చేశారు.

చివరకు యిన్నాళ్ళకు ఇది వెలుగు చూస్తోంది. చిత్రాలు గీసిన యిరవై రెండేళ్ళకు అచ్చవుతోన్న యీ పుస్తకాన్ని ఆ మిత్రుడికే అంకితం యివ్వడం నా స్నేహధర్మంగా భావిస్తున్నాను.

అప్పటి నుంచీ యీ స్కెచ్ లతో ఒక పుస్తకాన్ని అచ్చు వేయించాలనే ఆలోచన వుండేది. పదేళ్ళ క్రితం యీ ఆలోచనను గురించి నాకు అత్యంత ఆప్తుడైన కె.వి.యస్. సూర్యనారాయణరాజు అనే సాహితీ మిత్రునితో చెప్తే చాలా మంచి ఆలోచన, తప్పక అచ్చు వేయమని ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఎప్పుడు కలిసినా ఆ పుస్తకం గురించి అడిగి, వెంటనే మొదలెట్టమని, ఆలస్యం చేయవద్దని తొందర పెడుతూనే వుండేవాడు. ఏడెనిమిదేళ్ళ క్రితం సికింద్రాబాదులో ఒక రోడ్డు ఏక్సిడెంట్లో సతీ సమేతంగా ఆయన మరణించి వుండకపోతే యీ పుస్తకం, ఆయన ప్రోత్సాహంవల్ల, ఎప్పుడో అచ్చయివుండేదే..

చివరకు యిన్నాళ్ళకు ఇది వెలుగు చూస్తోంది. చిత్రాలు గీసిన యిరవై రెండేళ్ళకు అచ్చవుతోన్న యీ పుస్తకాన్ని ఆ మిత్రుడికే అంకితం యివ్వడం నా స్నేహధర్మంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం వెలుగుచూస్తే ఆనందించే మిత్రులు దివి శ్రీధరబాబు, మాజేటి రాజాజీగార్లు ఈనాడు లేరు. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోకుండా పుండలేను.

22-3-1991, హైదరాబాదు

 శీలా వీర్రాజు గారిపై వాడ్రేవు చినవీరభద్రుడి రాసిన ఆత్మీయ నివాళి :  వెంటాడే ఆరాధ భావన 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article