Editorial

Sunday, December 22, 2024
Peopleరేపటి నుంచి 'ఆహా'లో ‘లగ్గం’ : ఈ దర్శకుడు ఒక 'కథల మండువ'

రేపటి నుంచి ‘ఆహా’లో ‘లగ్గం’ : ఈ దర్శకుడు ఒక ‘కథల మండువ’

పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన సినిమా ‘లగ్గం’. దర్శకుడు రమేష్ చెప్పాల అంటున్నట్టు పెళ్లి ఒక సంస్క్కృతి. కడదాకా సాగే రెండు కుటుంబాల జీవన వేడుక. కమనీయ సామాజిక బంధం. దాని భావోద్వేగాలకు పట్టం కట్టిన చిత్రం -లగ్గం.

కందుకూరి రమేష్ బాబు 

రేపటి నుంచి ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’లో రమేష్ చెప్పాల దర్శకత్వం వహించిన ‘లగ్గం’ సినిమాను ఇంటిల్లిపాది వీక్షించవచ్చు. పెళ్లి ప్రధానంగా సాగే ఈ చిత్రం అన్ని వయస్కుల వారిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి చేసేముందు తల్లిదండ్రులు, పెద్దలు తప్పక ఆలోచించవలసిన విషయంపై ఈ సినిమా దృష్టి పెట్టేలా చేస్తుంది.

మాట ముచ్చటతో మొదలై…

ఈ మధ్యే అంటే అక్టోబర్ 25వ తేదీన థీయేటర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘లగ్గం’ ఇక కుటుంబ సమేతంగా ఇంట్లోనే చూడవచ్చు. మానవ సంబంధాలు ప్రధానంగా సాగే ఈ హృద్యమైన ఈ చిత్రాన్ని వేణుగోపాల్ రెడ్డి నిర్మించగా రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించారు. ఇప్పటిదాకా చాలా సినిమాలు పెళ్ళితో ముగిసి శుభం కార్డు పడగా చూసాం. కానీ ఈ సినిమా మాట ముచ్చటతో మొదలై అప్పగింతల వరకూ అనేక భావోద్వేగాలతో సాగుతుంది. పెళ్ళైన ప్రతి వ్యక్తిని కదిలిస్తుంది. ‘శుభం’ అంటే ఏమిటో వివరిస్తుంది.

సాయిరోనక్, ప్రగ్యా నగ్రా హీరో  హీరోయిన్లుగా నటించగా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి, ఎల్ బి శ్రీరామ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. చరణ్ అర్జున్ సంగీతం, మణిశర్మ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా పెళ్లి ఒక సంస్కృతిగా ఆకర్షిస్తుంది. పాటలు విశేషంగా ఆకట్టుకుంటాయి. చిత్ర ఆలపించిన ఒక పాట గుండెలను పిండేస్తుంది.

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కూతురు ఇటీవల అకస్మాత్తుగా మరణించిన విషయం తెలిసిందే. అంతటి విషాదం ఎదురైనా వారు ఈ సినిమా ప్రమోషన్లలో కూడా పాల్గొని తన కూతురు జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం మీరు గమనించే ఉంటారు. దర్శకుడి కృషిని అభినందిస్తూ ఈ సినిమా ప్రాధాన్యం కూతురి  గొప్పదనం వంటిదే అని అనడం విశేషం.

‘మీ శ్రేయోభిలాషి’గా నిత్య నూతనం

దర్శకులు రమేష్ చెప్పాల ఇప్పటిదాకా చేసిన సినిమాలలో లగ్గం పెద్ద సినిమా. వారి చిత్రాలన్నీ ఆహ్లాద భరితంగా ఉంటాయి. ఆలోచనలకు గురి చేస్తాయి. ఎలాంటి ఇతివృత్తం తీసుకున్నా కూచున్న వారు లేవకుండా చూడగల శక్తి తనది. సున్నితమైన హాస్యంతో పాటు ప్రతి సినిమాను సంగీత భరితంగా మలచడం అతడి ప్రత్యేకత. అతడు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించిన ‘మీ శ్రేయోభిలాషి’ మీకు గుర్తుండే ఉంటుంది. తనకు బాగా పేరు తెచ్చిన ఈ సినిమా ఒరవడిలోనే మిగతా సినిమాలన్నీ మనిషి తనానికి, మంచి తనానికి ప్రాముఖ్యత ఇస్తూనే వినోదం పంచుతాయి. తాను దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘బేవార్స్’. ఇది మన మధ్యే తిరిగే యువతను సరైన దారిలో పెట్టే క్రమంలో సాగుతుంది. ఆ తర్వాత దర్శకత్వం వహించిన భీమదేవరపల్లి’ బ్రాంచి’ సినిమాలో రాజకీయ నాయకుల హామీలు ఎట్లా సామాన్యుల జీవితలను దుర్భరం చేస్తాయో వినోదాత్మకంగా చర్చించారు. ఇది కూడా తనకు దర్శకుడిగా బాగా పేరు తెచ్చింది. తాజాగా విడుదలైన ‘లగ్గం’ వాటన్నిటి కన్నా పెద్ద సినిమా, ప్రతి కుటుంబం చూడదగ్గ సినిమా. పెళ్లీడు పిల్లలున్న తల్లిదండ్రులు తప్పక చూసి మెచ్చే చిత్రం.

ఈ దర్శకుడు ఒక ‘కథల మండువ’

తెలంగాణకు చెందిన ఈ సినీ దర్శకులు చక్కటి రచయిత కూడా. దళిత బహుజన సాంస్కృతిక నేపథ్యం ప్రధానంగా వారు పల్లె జీవితాన్ని తలకెత్తుకుని అపురూపమైన కథలు రాసి పైపైకి ఎగబాకుతున్న మనిషిని నేలమీదికి తెస్తారు. బాల్యం, అనుబంధాలకు పెద్ద పీట వేస్తూ వెనుదిరిగి చూడటంలో ముందుకు వెళతామని తెలియజెబుతారు.

కరీంనగర్ జిల్లాలోని కనపర్తి గ్రామానికి చెందిన ఈ రచయితకు సమస్త వృత్తుల తన ఊరే విశాల ప్రపంచం. తమ ఊరి పేరుతోనే ‘మా కనపర్తి ముషాయిరా’ అన్న చక్కటి సంకలనం తెచ్చారు. త్వరలో దానికి సీక్వెన్స్ గా ‘కథల మండువ’ పేరుతో మరో పుస్తకం వస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రితమైన ‘లగ్గం’ కూడా అలాంటి కోవలోని పుస్తకమే. కాకపోతే తెరపై రచించారు. మరో మాటలో ఈ చిత్రం ‘ఒక పెళ్లి పుస్తక’మే. జీవితంలో అత్యంత ప్రధానమైన ఘట్టం ‘లగ్గం’. దాన్ని ఇంట్లోనే  చూసి ఆనందించండి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article