Editorial

Thursday, November 21, 2024
అభిప్రాయం"A Room of once own" : ఈనాటికీ లేకపోవడమే అసలైన విషాదం -...

“A Room of once own” : ఈనాటికీ లేకపోవడమే అసలైన విషాదం – కొండవీటి సత్యవతి

ఈ పుస్తకం చదవడం పూర్తి చేయగానే నాకు ఇప్పటి స్థితిగతుల మీదికి దృష్టి మళ్ళింది. షుమారు వందేళ్ళ క్రితం పరిస్థితి గురించి వర్జీనియా ఉల్ఫ్ రాసింది. స్త్రీలు సృజనాత్మక సాహిత్యం రాయడానికి అనువైన పరిస్థితులు లేవని చెప్పింది కదా! ఇప్పుడు ఆ వసతులు సమకూరాయా?

కొండవీటి సత్యవతి

నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా చరిత్ర అధ్యాపకురాలు వసంత గారు నాకు ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. డిగ్రీలో స్పెషల్ ఇంగ్లీషు ఒక సబ్జక్టుగా ఉండడం వల్ల కూడా ఇంగ్లీషు నవలలు చదివే అవకాశం దొరికింది. ఇంగ్లీషు పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను కానీ మాట్లాడటం ఒంటబట్టలేదు. కారణం తెలుగు మీడియంలో చదవడం. అప్పట్లో నేను చదివిన అనేక పుస్తకాలతో పాటు ‘‘ద సెకండ్ సెక్స్’’, ‘‘ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’’ నన్ను చాలా ప్రభావితం చేశాయి. ‘స్త్రీలు, పురుషులు ఒకేలా పుట్టినా సమాజం స్త్రీలను తయారుచేస్తుంది’. ” One is not born , but rather becomes,a woman”. ఈ వాక్యాన్ని రాసిన సైమన్ ది బోవర్ ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. సమానత్వం కోసం స్త్రీలు ఉద్యమించేలా బేసింది ‘‘డి సెకండ్ సెక్స్’’ పుస్తకం అలాగే వర్జీనియా ఉల్ఫ్ 192లో రాసిన రెండు పత్రాలు, ‘‘ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’’ పేరుతో పుస్తకం గా ప్రచురితమైంది. ‘‘ప్రపంచ సాహిత్యంలో స్త్రీల స్థానమెక్కడ? సృజనాత్మక రచయిత్రులుగా ఎంతమంది ఉన్నారు. వారి స్థానమేమిటి’’ అంటూ సాగిన అన్వేషణ, ఈ పుస్తకం చదువుతున్నప్పుడు వర్జీనియా ఉల్ఫ్ గుండెల్లో మంటతో పాటు కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్ళూరి ఉంటాయి అనిపించింది నాకు.

‘‘కిండిల్ యాప్’’లో ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు, పుస్తకాల కోసం వెతుకుతున్నప్పుడు వర్జీనియా ఉల్ఫ్ పుస్తకాలు కనబడ్డాయి. ఎన్నో ఏళ్ళ క్రితం చదివిన ‘‘ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’’ కనబడగానే వెంటనే కొనేసి చదవడం మొదలుపెట్టాను. మొదటిసారి చదివినపుడు నా భావాలేమిటో నాకు గుర్తులేదు.

వర్జీనియాను ఒక ఆర్ట్ సొసైటీలో ప్రసంగించడానికి ఆహ్వానించినపుడు వాళ్ళిచ్చిన టాపిక్ ‘‘ఉమన్ అండ్ ఫిక్షన్’’. ఈ అంశం మీద ఆమె ఒక పత్రం సమర్పించాల్సి ఉంది. ఇది జరిగింది 1928 సంవత్సరంలో. ఆ పత్రం తయారుచేసుకోవడం కోసం లండన్‌లోని ఒక ప్రముఖ లైబ్రరీలో ఫిక్షన్ రాసిన రచయిత్రులు, రాసిన పుస్తకాల కోసం వెతుకుతున్నప్పుడు అలాంటి పుస్తకాలేవి కనబడనపుడు తనకు కలిగిన ఆలోచనల సమాహారమే ‘‘ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’’ అనే పుస్తకం.

ఇంటి పనులు, పిల్లలు, కుటుంబం, ఆమె ఏమి రాస్తున్నదా అనే నిరంతర నిఘా, అందరూ కూర్చునే హాలులోనే కూర్చుని రాయాల్సి రావడం, ఇలా రాయకూడదు, అలా రాయకూడదు అనే సెన్సార్‌షిప్ మధ్య ఎవరైనా ఎలా రాయగలరు? అందుకే ఆమె ‘‘ A woman must have money and a room of her own if she is to write fiction ” అని ఖరాఖండిగా చెప్పింది.

ఆనాటి మహిళలు సృజనాత్మక సాహిత్యం సృష్టించలేకపోవడానికి కారణాలేమిటని అన్వేషిస్తుంది వర్జీనియా. ఆర్ట్ సొసైటీ వారు ‘‘సృజనాత్మక సాహిత్యం మహిళలు’’ అనే టాపిక్ మీద మాట్లాడమంటే నేను ‘‘ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’ అని ఎందుకు పెట్టానో తెలుసా? ఏకాంతంగా కూర్చుని రాసుకోవడానికి ఒక గదిలేని మహిళలు, వారి సంపాదన వారికి లేని మహిళలు సృజనాత్మక సాహిత్యం ఎలా సృష్టించగలరు? ఇంటి పనులు, పిల్లలు, కుటుంబం, ఆమె ఏమి రాస్తున్నదా అనే నిరంతర నిఘా, అందరూ కూర్చునే హాలులోనే కూర్చుని రాయాల్సి రావడం, ఇలా రాయకూడదు, అలా రాయకూడదు అనే సెన్సార్‌షిప్ మధ్య ఎవరైనా ఎలా రాయగలరు? అందుకే ఆమె ‘‘ A woman must have money and a room of her own if she is to write fiction ” అని ఖరాఖండిగా చెప్పింది. మర్చిపోకండి ఇది రాసింది 1928 సంవత్సరంలో.

అంటే 94 సంవత్సరాల క్రితం అన్నమాట.

ఈ పుస్తకం చదవడం పూర్తి చేయగానే నాకు ఇప్పటి స్థితిగతుల మీదికి దృష్టి మళ్ళింది. షుమారు వందేళ్ళ క్రితం పరిస్థితి గురించి వర్జీనియా ఉల్ఫ్ రాసింది. స్త్రీలు సృజనాత్మక సాహిత్యం రాయడానికి అనువైన పరిస్థితులు లేవని చెప్పింది కదా! ఇప్పుడు ఆ వసతులు సమకూరాయా? పరిస్థితులు మారాయా అంటే నాకు కమలాదాస్ ‘‘మై స్టోరీ’’ గుర్తొచ్చింది. టాయ్‌లెట్‌లో కూర్చుని రాసిన తమిళ కవయిత్రి సల్మా గుర్తొచ్చింది. రాసుకోవడానికి తమకంటూ ఒక స్థలం, ఒక గదిలేని వేలాది మంది మహిళలు గుర్తొచ్చారు. ఇంటిపని, భర్తపని అంతా పూర్తయ్యాక, అందరూ నిద్రపోయాక అర్థరాత్రిళ్ళు డైనింగ్ టేబుల్ శుభ్రం చేసుకుని రాసుకోవడానికి కూర్చునే కమలాదాస్ కళ్ళముందు రూపుకట్టింది. రాయాలనే తపన, రాయమనే అగ్ని తనని దహించేస్తే తెల్లవార్లూ కూర్చుని రాయడం వల్ల తన ఆరోగ్యం ఎలా పాడైందీ కమల ‘‘తన కథ’’లో రాస్తుంది.

తమిళ కవయిత్రి సల్మా ఇంటిలో రాయడమే నిషేధం. కుటుంబం, కమ్యూనిటీ నిర్బంధం. రాయకపోతే బతకలేని స్థితిలో టాయ్‌లెట్‌లో కూర్చుని రాసింది సల్మా. ఒక జాతీయ స్థాయి సమావేశంలో ఈ అనుభవాన్ని సల్మా పంచుకున్నప్పుడు వింటున్న అందరం కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాం. అలాంటి నిర్బంధం మధ్య రాసిన సల్మా తరువాత గొప్ప రచయిత్రిగా ఎదిగింది. అద్భుతమైన కవిత్వం రాసింది.
ఇలా ఎంతోమంది స్త్రీలు తమలో ఉప్పొంగే భావాలకు అక్షర రూపమివ్వడానికి అనువైన పరిస్థితులు లేక, ప్రోత్సాహం కరువై తమ అక్షరాలకు ఎలా సమాధులు కట్టుకున్నారో లెక్కలు కట్టలేం. ఏదో విధంగా యాతనపడి రాసినా వంటింటి కథనాలని, ఎలాంటి మేధస్సు కానరాని రచనలని తీసిపారేయడం, లేదా మౌనం వహించడం పురుష రచయితలు చేసే పని. 1980 దశాబ్దంలో తెలుగు సాహిత్యంలోకి వెల్లువలా దూసుకొచ్చిన స్త్రీ వాద సాహిత్యాన్ని జ్వాలాముఖి లాంటి అభ్యుదయ రచయితలు సైతం వెక్కిరించి, ఛీత్కరించిన సంగతి అందరికీ తెలుసు. జయప్రభను డాలర్ ప్రభ అని నిందించిన చరిత్ర మనముందుంది. శరీర రాజకీయాలు, సెక్సువాలిటీ గురించే ఫెమినిస్టులు రాస్తారని విమర్శిస్తూ, స్త్రీ వాదులు లేవనెత్తిన పితృస్వామ్య, అణచివేత రాజకీయాలను పట్టించుకోని తెలుగు సాహిత్య పురుష విమర్శకులు మన ముందే ఉన్నారు.

రాయడానికి తూగుటూయలలు, కర్పూర కిళ్ళీలు లాంటి భోగాలు ఉండాలని అల్లసాని పెద్దన ఏనాడో రాశాడు కానీ మేము రాసుకోవడానికి డైనింగ్ టేబుళ్ళు కాదు, టాయ్‌లెట్‌లు కాదు మాకో గది కావాలి అని అడిగే పరిస్థితి ఈనాటికీ లేకపోవడమే అసలైన విషాదం.

వర్జీనియా ఉల్ఫ్ రాసినట్టు స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ లేక, రాసుకోవడానికి ఒక ఏకాంత ప్రదేశం, ఒక గది లేకపోయినా ఎంతోమంది ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించిన మహిళలు చరిత్ర పొడుగునా ఉన్నారు. పితృస్వామ్య కుటుంబంలో అనేకానేక అణచివేతల మధ్య గొప్ప రచయిత్రులుగా తమని తాము నిరూపించుకున్న రచయిత్రులు లెక్కలేనంతమంది ఉన్నారు.

నిజానికి పురుషులకు ఉన్నటువంటి సకల సౌకర్యాలు, సొమ్ములూ, స్వంత గదులూ, కుటుంబ బాధ్యతల నుంచి విముక్తి, పిల్లల పెంపకం లేకపోయుంటే ప్రపంచ సాహిత్యంలోనూ గొప్ప గొప్ప మహిళా సాహిత్యకారులు వెలుగు దీపాలై ప్రకాశించి ఉండేవారు.

రాయడానికి తూగుటూయలలు, కర్పూర కిళ్ళీలు లాంటి భోగాలు ఉండాలని అల్లసాని పెద్దన ఏనాడో రాశాడు కానీ మేము రాసుకోవడానికి డైనింగ్ టేబుళ్ళు కాదు, టాయ్‌లెట్‌లు కాదు మాకో గది కావాలి అని అడిగే పరిస్థితి ఈనాటికీ లేకపోవడమే అసలైన విషాదం.

సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించాలంటే ఏకాంతం అతి ముఖ్యమైన అంశం. వందేళ్ళ క్రితం అందరూ కలిసి కూర్చునే కామన్ హాల్‌లోనే కూర్చుని రచనలు చేసిన రచయిత్రుల రచనల్లో మేధస్సును వెతికే పురుష విమర్శకులకు ఆమె ఎలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో ఆ రచన చేసిందో అనే ఇంగితం, ఆలోచన ఉండదు. ఇది రచనే కాదు అని కొట్టి పారేయడమే తెలుసు. చరిత్ర పొడుగునా రచయిత్రులు ఈ చీదరింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు. భండారు అచ్చమాంబ లాంటి మహామేధావిని కూడా గుర్తించ నిరాకరించి చీకట్లోనే ఉంచేశారు. ప్రపంచ సాహిత్య చరిత్ర కూడా దీనికేమీ అతీతంగా లేదని వర్జీనియా పుస్తకం నిరూపించింది.

కాబట్టి ఇళ్ళు కట్టుకునేటప్పుడు వంటిల్లు, దేవుడిల్లు, ‘‘మాస్టర్’’ బెడ్‌రూమ్లే కాదు సృజనకారులు రాసుకోవడానికి ఓ గదిని కూడా కట్టుకోవాలి. ‘‘ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’. ఏకాంతంగా రాసుకోవడానికో బొమ్మలేసుకోడానికో ఓ గది కూడా కేటాయించుకోవాలి, ముఖ్యంగా మహిళలు.

రచయిత్రి, యాక్టివిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు కొండవీటి సత్యవతి గారు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ నిర్వాహకురాలు. నివాసం హైదదరాబాద్. ఇటీవల మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన సాక్షి సంపాదకీయం చదివాక ఈ కథనం మళ్ళీ షేర్ చేయాలనిపించింది అని పేర్కొని వారు తన ఫేసు బుక్ వాల్ పై తిరిగి పోస్టు చేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article