ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వక్తలు ”అంబేద్కర్ అందరివాడు” అంటూ మాట్లాడినపుడు ఈ మాట చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? ఆయన బహుముఖప్రజ్ఞని, ఆర్థికవేత్తగా ఆయన సల్పిన కృషిని గుర్తించడానికి, ఆ విషయాలు మాట్లాడానికి వందేళ్ళ సమయం పట్టిందా? అని ఆశ్యర్యపోయాను.
కొండవీటి సత్యవతి
“భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రూపొందించాడు” అనే ఒక్క వాక్యం తప్ప చదువుకునే సమయంలో ఆయన గురించిన పాఠం ఏ సిలబస్‌లోనూ చదివినట్టు గుర్తులేదు. అంబేద్కర్ గురించి పాఠ్యాంశం ఎందుకులేదో చాలా ఏళ్ళ తరువాత కానీ అర్థం కాలేదు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ నిజానికి భారతీయులందరికీ చెందాల్సిన వాడు.
దళితుల హక్కుల కోసం ఆత్మగౌరవ పోరాటాలు చేసిన అంబేద్కర్‌ను దళితులకే పరిమితం చేయడం, ఆయన విగ్రహాలతో దళితులకు తప్ప ఇంకెవ్వరికీ ఏలాంటి సంబంధమూ లేకుండా చెయ్యడం ఒక చారిత్రక కుట్ర. ఆయన పోరాటాలు, ఉద్యమాల గురించి విస్తృత ప్రచారం లేకపోవడం ఒక తప్పిదం. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు జరిగిన వివిధ కార్యక్రమాల్లో వక్తలు ”అంబేద్కర్ అందరివాడు” అంటూ మాట్లాడినపుడు ఈ మాట చెప్పడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందా? ఆయన బహుముఖప్రజ్ఞని, ఆర్థికవేత్తగా ఆయన సల్పిన కృషిని గుర్తించడానికి, ఆ విషయాలు మాట్లాడానికి వందేళ్ళ సమయం పట్టిందా? అని ఆశ్యర్యపోయాను.
వేలాది సంవత్సరాలుగా దారుణ అణచివేతకి, వివక్షకి, దోపిడీకి గురౌతున్న దళితులకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పించడం అనే అంశాన్ని మాత్రమే హైలైట్ చేసి అంబేద్కర్ దళితుల మనిషి, దళితులకు మాత్రమే చెందిన వాడు అని ముద్రవేయడం అన్యాయం.
మా ఇళ్ళ దగ్గర అంబేద్కర్ విగ్రహం లేదు. చాలా చోట్ల దళితులుండే ప్రాంతాల్లోనే అంబేద్కర్ విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. ఓహో! ఈయన దళితుల నాయకుడు కాబోలు అనుకునేదాన్ని.
మా సీతారామపురం వెళ్ళాలంటే… నర్సాపూర్‌లో బస్సెక్కి, రోడ్డు మీద బస్సు దిగి మాలపల్లె (దళితవాడ) దాటి మా ఇంటికి వెళ్ళాలి. మాలపల్లెలోంచి నడుస్తున్నపుడు దారిలో చూపుడువేలుతో దారి చూపించే అంబేద్కర్ విగ్రహం కనబడేది. మా ఇళ్ళ దగ్గర అంబేద్కర్ విగ్రహం లేదు. చాలా చోట్ల దళితులుండే ప్రాంతాల్లోనే అంబేద్కర్ విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. ఓహో! ఈయన దళితుల నాయకుడు కాబోలు అనుకునేదాన్ని. మా ఊరు కులాల పరంగా విడగొట్టబడి ఉండేది. ఊరి మొదట్లో మాలపల్లె ఆ తరువాత బి.సీల ఇళ్ళు, ఆ తరువాత మా ఇళ్ళు, కొంచెం దూరంగా రాజుల ఇళ్ళు ఉండేవి. మాదిగ వాడలు ఊరి బయట విసిరేసినట్టు ఉండేవి. మా ఊళ్ళో బ్రాహ్మలు, రెడ్లు, కమ్మ కులస్థులు లేరు. కంసాలులుండేవాళ్ళు. కల్లుతీత కులాలు (వీరిని ఈడిగలు అనేవాళ్ళు) ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు నాకు తెలిసిన కులాలు ఇవే. మా ఊళ్ళో లేని కులాల గురించి నాకు అస్సలు తెలియదు అప్పట్లో.
దళిత వాడల్లో ధీర గంభీరంగా దిశానిర్దేశం చేస్తూ, సూటు, బూటులో నిలబడి ఉండే అంబేద్కర్ విగ్రహం దళితులదే అని నమ్మిన రోజులు. దళితుల్ని అవమానించాలంటే అంబేద్కర్ బొమ్మకు చెప్పుల దండలు వేసి అవమానపర్చిన ఉందతాలెన్నో విన్నాను, చదివాను. నేను పెరిగి పెద్దాయ్యాక, కొంత జ్ఞానం పొందాక అంబేద్కర్ అనే ఆయన ఎవరు? ఏం చేసాడు? ఎలాంటి పోరాటాలు చేసాడు అనే అవగాహన కలిగింది.
వేలాది సంవత్సరాలుగా ఆ అమానుషాన్ని, కులవ్యవస్థనీ, కులం పేరుతో దారుణమైన అణచివేతని భారతీయుల రక్తంలోకి ఎంత బలంగా ఇంకించిందీ కూడా ఆయన అవగాహన చేసుకున్నాడు కాబట్టే 1927లో మహద్ అనే గ్రామంలో ఊరి చెరువును తాకే పోరాటం చేసాడాయన.
అప్పుడప్పుడే స్వాతంత్య్రం పొందిన దేశానికి సమగ్రమైన రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ కృషి అక్కడే ఆగిపోలేదు. దేశ ప్రజలందరికి అవసరమైన ఆర్థిక అంశాలలో ఆయన ఆలోచనలు, రిజర్వు బ్యాంకు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లాంటి ముఖ్య విభాగాల ఏర్పాటు ఆయన దార్శినికతకు నిదర్శనాలు.
మహారాష్ట్రలో అత్యంత వెనుకబడిన, తీవ్ర అణిచివేతను ఎదుర్కొనే ‘మహర్’ కులంలో పుట్టిన అంబేద్కర్ జీవితం పొడుగునా ఏన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అంబేద్కర్ తండ్రి రాంజీ ఆర్మీలో ఆఫీసర్‌గా పనిచేసేవాడు. తల్లి భీమాబాయి తండ్రి కూడా ఆర్మీలో పనిచేసేవాడు. తల్లిదండ్రులు ఆర్మీకి చెందినవారైనప్పటికీ అంబేద్కర్ తాను పుట్టిన ‘మహర్’ కులం వల్ల అంటరానివాడుగానే అవమానాలు పొందాడు. భారతదేశంలో మనుస్మృతి ఆధారంగా నిర్మితమైన చాతుర్వర్ణ వ్యవస్థ క్రూరత్వాన్ని, ద్వేషాన్ని, దుర్మార్గాన్ని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాడు కాబట్టే అంబేద్కర్ పలుసార్లు ‘మనుస్మృతి’ని తగలబెట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ, అట్టడుగున ఉన్న కులాలను ఏ విధంగా అణగదొక్కిందీ, నిచ్చెన పైభాగాన ఉన్న బ్రాహ్మణులు తమ స్వలాభం కోసం, తమ ఆధిపత్యం నిలుపుకోవడం కోసం అంటరాని కులాలను ఎలా సృష్టించింది అంబేద్కర్ అద్భుతంగా అర్థం చేసుకున్నాడు. వేలాది సంవత్సరాలుగా ఆ అమానుషాన్ని, కులవ్యవస్థనీ, కులం పేరుతో దారుణమైన అణచివేతని భారతీయుల రక్తంలోకి ఎంత బలంగా ఇంకించిందీ కూడా ఆయన అవగాహన చేసుకున్నాడు కాబట్టే 1927లో మహద్ అనే గ్రామంలో ఊరి చెరువును తాకే పోరాటం చేసాడాయన. అస్పృశ్యులు, అంటరాని వారు అంటూ ముద్ర వేసి ఊరి చెరువును తాకకూడదని, దేవాలయాల్లోకి రాకూడదని నిషేధం విధించిన వర్ణ వ్యవస్థ నడ్డి విరిచేలా వేలాది మందితో చెరువును ముట్టుకునే ఉద్యమం నడిపాడు అంబేద్కర్.
నవ జీవితానికి ముఖ్యంగా కావల్సిన ప్రజ్ఞ, సమతలు బౌద్ధంలో ప్రధానమని, అందుకే తాను బౌద్ధం స్వీకరిస్తున్నానని ప్రకటించాడు. బుద్ధుని సిద్ధాంతాలకు రాజకీయ రూపం ఇస్తే మానవాళి మనుగడకు అదే చక్కని మార్గమని చెప్పిన అంబేద్కర్ 1954లో వందలాది మందితో సహా బౌద్ధాన్ని స్వీకరించాడు.
ఆ సందర్భంగా – ”మనం పోరాడితే తప్ప ఏదీ లభించదు. ఎవరూ వచ్చి మనల్ని బాగుచేయరు. మనల్ని మనమే బాగుచేసుకోవాలి. స్వయం సహాయంతో ముందుకు సాగాలి. మనం తక్కువ వాళ్ళం అనే భావన వదిలిపెట్టి ఇతర వర్ణాల వారితో సమాన హొదాతో జీవించడానికే ప్రయత్నించండి. మీ అలవాట్లను మార్చుకొని అందరివలే ఆత్మగౌరవంతో బ్రతకండి” అంటూ సందేశం ఇచ్చిన అంబేద్కర్ మాటలు ఈనాటికీ దళితలందరికీ శిరోధార్యం కావాలి. పరమ దుర్మార్గమైన చాతుర్వర్ణ వ్యవస్థ సమూలంగా నిర్మూలనమైతే తప్ప అంటరాని వారుగా అస్పృశ్యతను అంటగట్టబడిన దళితుల జీవితాల్లో సమూల మార్పు సాధ్యం కాదని అంబేద్కర్ బలంగా నమ్మాడు. ఆ చైతన్యంతోనే తన కార్యక్రమాలను కొనసాగించాడు.
కుల వ్యవస్థ, కులం పేరుతో అణిచివేతల మూలాలు హిందూ మతంలో ఉన్నాయనే విషయాన్ని అంబేద్కర్ అర్థం చేసుకున్నాడు. రామాయణంలో శంభూకవధ కథ ద్వారా బ్రహ్మణ వ్యవస్థ, బ్రహ్మాణీయ భావజాలం కులవ్యవస్థకి పునాదిగా ఉన్నాయనేది అర్థమౌతుంది. చాతుర్వర్ణ వ్యవస్థని రక్షించడానికే శంభూకవధ జరిగింది. తపస్సు చేయడం, విద్యనభ్యసించడం బ్రాహ్మణుల హక్కు అని శూద్రుడైన శంభూకుడు తపస్సు చేయడం వల్లే బ్రాహ్మణ బాలుడు ఆకాల మృత్యువు పాలయ్యాడని, శంభూకుడిని శిరస్సు ఖండించడం ద్వారా శూద్రులకు ఒక హెచ్చరికను పంపిన రామాయణంలోని శంభూకవధ కథని అంబేద్కర్ బాగా ఆకళింపు చేసుకున్నాడు. చాతుర్వర్ణాలను నేనే సృష్టించానని చెప్పిన భగవద్గీత… హిందూ మతంలో బ్రాహ్మణులు సృష్టించిన కుల వ్యవస్థ ఎంత బలంగా భారతీయ సమాజంలో వేళ్ళూనుకుపోయిందో అంబేద్కర్‌కి తెలుసు, అందుకే ఆయన బౌద్ధం స్వీకరించాడు. మానవ జీవితానికి ముఖ్యంగా కావల్సిన ప్రజ్ఞ, సమతలు బౌద్ధంలో ప్రధానమని, అందుకే తాను బౌద్ధం స్వీకరిస్తున్నానని ప్రకటించాడు. బుద్ధుని సిద్ధాంతాలకు రాజకీయ రూపం ఇస్తే మానవాళి మనుగడకు అదే చక్కని మార్గమని చెప్పిన అంబేద్కర్ 1954లో వందలాది మందితో సహా బౌద్ధాన్ని స్వీకరించాడు.
మహోద్గ్రంధం లాంటి అంబేద్కర్ జీవితం, ఆయన రచనలు, ప్రసంగాలు, ఆచరణలు ఒక వ్యాసంలో కుదించాలంటే సాధ్యంకాని పని. అంబేద్కర్ అందరివాడు, భారతీయులందరికీ చెందిన వాడని చెప్పాలన్నదే నా ఈ ప్రయత్నం.
భారత రాజ్యాంగంలో మహిళలకు అన్ని హక్కులు కల్పించబడినప్పటికీ హిందూ స్త్రీలు అనేక వివక్షతలకు, అణిచివేతలకు గురవుతున్నారని అంబేద్కర్ భావించడం వల్లనే 1951 ఫిబ్రవరిలో హిందూకోడ్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడు. నెహ్రూ బిల్లుకు అనుకూలంగా ఉన్నప్పటికీ పటేల్, రాజేంద్రప్రసాద్‌లాంటి వారందరూ బిల్లుకు తీవ్ర వ్యతిరేకులు. ఈ బిల్లు పాసయితే హిందూ సమాజం విచ్ఛిన్నమైపోతుందని సాంప్రదాయవాదులు గగ్గోలు పెట్టారు. అయినప్పటికీ అంబేద్కర్ ఎన్నో హేళనలని, అవమానాలని ఎదుర్కొని బిల్లును ప్రవేశపెట్టాడు కానీ కాంగ్రెస్ మంత్రివర్గం, పార్టీ చూపుతున్న వ్యతిరేకతకి విసుగు చెందిన అంబేద్కర్, బిల్లును ఆమోదింప చేయలేకపోయినందుకు తీవ్ర వేదనతో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. స్త్రీల పురోభివృద్ధిని కాక్షించి అంబేద్కర్ చేసిన ప్రయత్నం మూఢ సాంప్రదాయాలు నిండిన ఆనాటి సమాజం తీవ్రంగా వ్యతిరేకించి నీరుగార్చింది. దీని కోసం అంబేద్కర్ తన మంత్రి పదవిని త్యాగం చేశాడు.
మహోద్గ్రంధం లాంటి అంబేద్కర్ జీవితం, ఆయన రచనలు, ప్రసంగాలు, ఆచరణలు ఒక వ్యాసంలో కుదించాలంటే సాధ్యంకాని పని. అంబేద్కర్ అందరివాడు, భారతీయులందరికీ చెందిన వాడని చెప్పాలన్నదే నా ఈ ప్రయత్నం. అవును… అంబేద్కర్ అందరివాడు… మనందరివాడు.
రచయిత్రి, యాక్టివిస్ట్, ప్రకృతి ప్రేమికురాలు కొండవీటి సత్యవతి గారు భూమిక ఉమెన్స్ కలెక్టివ్ నిర్వాహకురాలు. నివాసం హైదదరాబాద్. ఇటీవల మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన సాక్షి సంపాదకీయం చదివాక ఈ కథనం మళ్ళీ షేర్ చేయాలనిపించింది అని పేర్కొని వారు తన ఫేసు బుక్ వాల్ పై తిరిగి పోస్టు చేశారు.