Editorial

Monday, December 23, 2024
సాహిత్యంకొండపొలం : జీవనారణ్యంలో సాహసయాత్ర - చౌదరి జంపాల

కొండపొలం : జీవనారణ్యంలో సాహసయాత్ర – చౌదరి జంపాల

“ఇప్పటివరకూ మనకు ఈ నిత్యజీవితపోరాటపు సాహసగాథ గురించి మనకు చెప్పినవారు ఎవరూలేరు. ఈ కొండపొలాన్ని స్వయంగా అనుభవించిన రాయలసీమ బిడ్డ, చేయి తిరిగిన ప్రముఖ రచయిత, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు స్వయంగా మనల్ని ఈ యాత్రకు తీసుకువెళుతున్నారు.” అంటున్నారు చౌదరి జంపాలగారు.

మీరు ఆ అద్భుత యాత్రకు సిద్ధమయ్యే ముందు మరి రెండు విశేషాలు.

ఒకటి, ఈ నవల ఆధారంగా సినిమా వస్తోంది. అవును, ప్రముఖ దర్శకులు క్రిష్ ఈ యాత్రను దృశ్యమానం చేసి వచ్చే నెల ఎనిమిదిన ప్రేక్షకుల వద్దకు తెస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నవలకు తొలి పలుకులు రాసిన జంపాల చౌదరి గారు ఈ రచనకు ఇచ్చిన ఉపోద్గాతం ఈ యాత్రకు తగిన మూల్యాంకనంగా తెలుపు ప్రచురిస్తూ, ముందు ‘వనవాసం’ అని అనుకున్నప్పటికీ ఈ రచనకు ‘కొండపోల’మే సబబని చెప్పింది వారే అని గుర్తు చేస్తోంది. దాంతో రచయిత ఆ మాండలిక పేరే పెట్టడం, దర్శకులు కూడా సినిమాకు అదే పేరు నిర్ణయించడంతో  ‘కొండపొలం’ అంటే అతి త్వరలో ఒక నిత్య జీవితపు సాహస యాత్రకు మనల్ని సిద్దం చేసే సర్వనామం కాబోవడం మరో విశేషం. మరి చదవండి, ఈ జీవనారణ్యం…

చౌదరి జంపాల

దట్టమైన అడవిలో కొండల మీద చెట్లకింద పడుకున్న అనుభవం నాకు లేదు.

అప్పుడప్పుడూ అడవులగుండా ప్రయాణం చేసినా, కారు అద్దాల భద్రత వెనుక నుండే నేను అడవిని చూసింది. నాకు తెలిసినవారిలోనూ అడవిలో బతికిన అనుభవం ఉన్నవాళ్లు చాలా తక్కువ. కానీ ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇప్పటికీ, తెలుగుదేశంలో కొంతమంది మధ్యతరగతి మనుషులు తమ మీద ఆధారపడిన జీవాలను బతికించుకోవడానికి తమ గ్రామాలు, ఆవాసాలు విడచి, స్వచ్ఛందంగా కొన్ని నెలలపాటు అడవుల్లో సంచారం చేస్తూ, వందలయేళ్లకు ముందు తమ పూర్వీకులు బతికినట్టు బతకవలసి వస్తుందని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది.

నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడప్పుడూ వర్షాభావం చేత తమ గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెల కాపరులు అడవిబాట పడతారు. ఊరిలో కొన్ని కుటుంబాల మనుష్యులు కలసి తమ గొర్రెల మందలని కలుపుకొని అడవిలో మేత, నీరు దొరికే స్థలాలను వెతుక్కొంటూ మళ్లీ తమ ఊరిలో వానలు పడి తమ గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు వారు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. ఈ కొండపొలానికి వెళ్లేవాళ్లలో చాలా ఏళ్ల అనుభవంతో తల నెరిసిన వారి దగ్గర నుంచి, మొదటిసారి వెడుతున్న వయసు పిల్లగాళ్ల వరకు ఉంటారు. కొన్ని తరాలుగా ఈ గొర్రెల కాపరుల కుటుంబాలకు ఇలా తరచు కొండపొలం పోవలసి రావటం తప్పకపోవటంతో, ఒక ప్రత్యేకమైన జీవనవిధానం, పద్ధతులు, ఆచారాలు ఏర్పడ్డాయి.

నవల ఆధారంగా తెరకెక్కుతున్న ‘కొండపొలం’కు సంభందించి ఇది తొలి ముందు మాట. మిగితావి ఈ వారంలో ప్రచురిస్తాం. కాగా. వ్యాసకర్త చౌదరి జంపాల గారు తానా పూర్వ అధ్యక్షులు. తానా నిర్వహించిన నవలల పోటీకి వచ్చిన రచనల్లో అత్యుత్తమ రచనగా ఎంపిక చేసిన ప్రచురణ కమిటీలో సభ్యులు. వారు వృత్తిరీత్యా సైకియాట్రిస్ట్. నివాసం మండలైన్, ఇల్లినాయ్, యు.ఎస్.ఏ.

వాళ్లు అడవులలోకి వెళ్లి అన్నాళ్లు ఉండేది సాహసం కోసమో, థ్రిల్ కోసమో కాదు. అయినా ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. అడవి గురించి తెలిసి ఉండాలి. తమ మీద ఆధారపడి వచ్చిన వందలాది మూగజీవాలను కనురెప్పల్లా కనిపెట్టుకుంటూ, రెప్పపాటులో దెబ్బ తీయడానికి అడవిలో పొంచి ఉన్న ఎన్నో విపత్తుల నుంచి మెలకువతో కాసుకోవాలి. అడవిలో ఎక్కడ గడ్డి ఉందో, ఎక్కడ నీరు దొరుకుతుందో తెలిసి ఉండాలి. కొండల, కోనల దారులు ఎరిగి ఉండాలి. చెట్టు మొదలుకీ, చుట్టుకుని పడుకొన్న కొండచిలవకీ తేడా తెలియాలి. ఎడగండునీ, చిరుబులినీ గుర్తుపట్టగలగాలి. పెద్దపులి అనుపానులు తెలుసుకోగలగాలి. ఈ కోరగల్ల జంతువుల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుంచే కాదు, అడవి మనుషుల దగ్గర నుంచి, గంధపు చెక్కల దొంగల నుంచి కూడా తమను, తమ మందలనూ రక్షించుకోవాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. ఈ వనవాసం నిజంగానే అబ్బురపరచే ఒక సాహస పోరాటమే.

అయితే ఇప్పటివరకూ మనకు ఈ నిత్యజీవితపోరాటపు సాహసగాథ గురించి మనకు చెప్పినవారు ఎవరూలేరు. ఇదుగో, ఈ సాహసయాత్రలో మనల్ని భాగస్వాములను చెప్పినవారు ఎవరూ లేరు. ఇదుగో, ఈ సాయసయాత్రలో మనల్ని భాగస్వాములను చేస్తుంది ఈ కొండపొలం నవల. మరి అడవి అంటే తెలీని మనకు ఒక అనుభవజ్ఞుడైన మార్గదర్శి ( గైడ్ ) కావాలి కదా. ఈ కొండపొలాన్ని స్వయంగా అనుభవించిన రాయలసీమ బిడ్డ, చేయి తిరిగిన ప్రముఖ రచయిత, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారు స్వయంగా మనల్ని ఈ యాత్రకు తీసుకువెళుతున్నారు. బయటివారు చూడలేని, తెలుసుకోలేని అనేక విషయాలను మనకు అసమాన ప్రతిభతో, నైపుణ్యంతో చూపించబోతున్నారు.

1987 నుంచి రచనా వ్యాసంగంలో ఉన్న సన్నపరెడ్ది వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. కడప జిల్లా బాలరాజుపల్లెలో నివాసం. 2019లో తానా నిర్వహించిన నవలల పోటీల్లో ఏకగ్రీవంగా ఈ నవల అత్యుత్తమ రచనగా ఎంపికవడంతో రెండు లక్షల బహుమతి అందుకున్నారు. అంతకు ముందు 2017లో వారి రచన ‘ఒంటరి’కి కూడా మూడో బహుమతి అందుకున్నారు. కవిత్వంతో మొదలైన వారి రచనా ప్రస్థానంలో  ఇప్పటికి రెండు కథా సంపుటులు, ఎనిమిది నవలలు వెలువడ్డాయి. వారి రచనలు చదవడం ఒక గొప్ప అనుభవం.
వారి ఫేస్ బుక్ అకౌంట్. ఇ -మెయిల్ :SANNAPUreddy12@gmail.com

ఈ సాహసయాత్రలో మనం వందలాది గొర్రెలను కాచుకొంటూ ఓబిలం (అహోబిలం) చుట్టుపక్కల పల్లెలపాయ, బింగోని బావి, గద్దగూడుకొండ, చింతల సడ్డు, ఇనుప సరూట్లు, రేగిమానుకొండ, గాలికుప్ప, తుమ్మమాని ఏనె, మబ్బు సెల, రాసాల చేను, పెద్దపులి సెల, దొంగ చెలిమ, కులుకుడు గుండాలు, జివ్విమాను బండ, ఒన్నూరమ్మ కోట, బాలప్పబావి, వంటి ప్రాంతాలు తిరుగుతాము. అక్కడి బోడులు, మిట్టలు, పేటలు, కొండలు, ఏనెలు, సెలలు, వాగులు, వంకలు అన్నీ మనకు పరిచయమౌతాయి. దారిలో స్థానిక స్థల పురాణాలు, మందిలో ప్రచారంలో ఉన్న అనేక కథలు కూడా చెబుతాడు మన మార్గదర్శి. ఆ ప్రాంతపు భాష, యాస, పలుకుబడి, మాటతీరును మనం అర్థం చేసుకొని ఆనందించేట్లు చేస్తాడు. భిల్లు, చందనం, ఏపె, సీకరేణి, సిరిమాను, పొలికె, తాండ్ర, మద్ది, సండ్ర వంటి రకరకాల చెట్లను చూస్తాము. పరిక్కాయ, ఈతకాయ, టూకీపండు, మోవిపండుల రుచులు తెలుస్తాయి. కొండల పైన, సెలలలోన మొలిచే అనేక రకాల గడ్డి మనకు కనిపిస్తుంది. నేండ్రగడ్డి కనిపిస్తే గొర్రెలు దబ్బగోగడిని, పీచుగోగడిని, బొచ్చుగడ్డినీ మూచూడవని గమనిస్తాము. ఎడుగండు ఎదురుపడితే గట్టిగా హడలుకొడితే చాలని, కానీ పెద్దపులి అలా జడవదని, మనమే దూరంగా తప్పుకోవాలని మన అనుభవానికి వస్తుంది. ముచ్చుగొర్రెకూ, బొల్లిగొర్రెకూ తేడా తెలుస్తుంది. మందలో కారు పొట్టేలు, దొడ్డిపొట్టేలు తల పొట్టేళ్ల తరతమ స్థానాలు అర్థమవుతాయి. ఎదగొర్రెల యవనదశల వెంపర్లాటే కాదు; కొండచిలవల ప్రణయ కాండ గురించి కూడా తెలుస్తుంది.

మరి మీరు ఈ అద్భుతయాత్రకు సిద్ధంగా ఉన్నారా?

తెలుగు సాహిత్యంలో వ్యవసాయ సంబంధిత విషయాలకు పెద్దపీట వేసినా, పశుపోషణ వృత్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనపడదు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యంలో పశుపోషణ ముఖ్యాంశంగా ఉన్న కథలు, నవలలు బహు తక్కువ.

మానవ జీవితపు తొలిదశ అడవులలో ఆహార సేకరణతో మొదలైనా, పరిణామ క్రమంలో తరువాత దశనుంచీ వ్యవసాయము, పశుపోషణ జీవితంలో ముఖ్య భాగాలయ్యాయి. ఇప్పటికీ ఈ రెండు వృత్తులూ సమాజానికి ముఖ్యావసరాలే. అయితే తెలుగు సాహిత్యంలో వ్యవసాయ సంబంధిత విషయాలకు పెద్దపీట వేసినా, పశుపోషణ వృత్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనపడదు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యంలో పశుపోషణ ముఖ్యాంశంగా ఉన్న కథలు, నవలలు బహు తక్కువ. ఉన్న కొద్ది కథల్లోనూ వ్యవసాయానికి అవసరమైన పశువుల (ఎద్దుల) ప్రసక్తే ఎక్కువ. మన ప్రాంతాల్లోనూ, ప్రపంచపు నలుమూలల సంస్కృతులలోనూ కనిపించే గొర్రెల గురించి, గొర్రెల కాపరుల జీవితాల గురించి తెలుగులో వ్రాసినది తక్కువ.

అలాగే తెలుగులో అడవి ముఖ్యపాత్రగా ఉండే పుస్తకాలూ తక్కువే; ఉన్న కొద్దీ కూడా గిరిజనుల జీవితాల గురించి లేక నక్సలైటు ఉద్యమం గురించి రాసినవే. ఇటీవలే వచ్చిన అడవి నుంచి అడవికి (జయతి లోహితాక్షన్ స్వీయ అనుభవాలు) కొంత మినహాయింపు అనుకుంటాను.

ఈ రెండు వస్తువులనీ (గొర్రెల కాపరుల జీవన విధానాన్ని, అడవిని) కలుపుకొంటూ మనలో చాలామందికి పరిచయం లేని ఒక ప్రత్యేక జీవనపోరాటాన్ని, ఈ కొండపొలం నవలలో, మన కళ్ల ముందు వాస్తవికంగా ఆవిష్కరిస్తున్నారు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి.

అయిదు బత్తేల పాటు (40 రోజులు) అడవిలో తిరిగేసరికి రవికి అడవి గురించీ, గొర్రెల గురించి, తనవాళ్ల గురించి, తన గురించీ కొన్ని సత్యాలు ఎరికకు రావటం ఈ నవల ముఖ్య ఇతివృత్తాలలో ఒకటి.

అయితే ఈ నవల ఒక్క అడవి సంచారానికే పరిమితం కాలేదు. కొన్ని విషయాలను సూక్ష్మంగానూ, మరెన్నో విషయాలను స్థూలంగానూ చర్చిస్తుంది.

కథానాయకుడు రవికి కొండపొలం పోవటం ఇదే మొదటిసారి. తప్పనిసరి పరిస్థితులలో, తండ్రికి సాయంగా, అతను కొండపొలం వెళ్లవలసి వచ్చింది. ఇది అతనికి పరిచయం ఉన్న ప్రపంచానికి బహుదూరమైన ప్రపంచం. ఆ ఊళ్లో ఎవరూ చదవని చదువు (బీటెక్) చదివిన రవి, ఊర్లో గొర్రెల కాపరుల జీవితానికి దూరంగా, ఇంటి పనులు చేయనంత సుకుమారంగా పెరిగాడు. బెరుకువల్ల ఇంటర్వ్యూలు సరిగా చేయక ఉద్యోగాన్ని సంపాదించలేక ఆత్మన్యూననతో బతుకుతున్న రవి, అడవికి వచ్చినా, గొర్రెలను కాయటం బదులు తన భయాన్నే కాసుకుంటూ ఉన్నాడు మొదట్లో. ఆ భయం అతన్ని తన చుట్టూ ఉన్న అడవిని కూడా సరిగ్గా చూడనివ్వలేదు. మిగతా అన్ని అనుభవాలకూ ఈ భయం అడ్డై నిలచింది. అయిదు బత్తేల పాటు (40 రోజులు) అడవిలో తిరిగేసరికి రవికి అడవి గురించీ, గొర్రెల గురించి, తనవాళ్ల గురించి, తన గురించీ కొన్ని సత్యాలు ఎరికకు రావటం ఈ నవల ముఖ్య ఇతివృత్తాలలో ఒకటి. ఈ జ్ఞానం రవి జీవితాన్ని మెరుగు పరచింది. ఊర్లో మిగతా యువతతో ఈ జ్ఞానాన్ని పంచుకొని వారికీ దారిచూపేలా చేసింది.

ఈ నవల రవి ఒక్కడి గురించే కాదు; అతనితో పాటు కొండ పొలానికి వెళ్లిన మిగతావాళ్ల గురించి కూడా. అంతేకాదు, ఊరిలో మిగిలి ఉన్నవారి గురించి కూడా. మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులలో ఒక్కొకరిదీ ఒక్కో కథ, ఒక్కోరకమైన వ్యధ. అయినా మనుషుల మధ్య ఉండే ప్రేమలు, బాంధవ్యాలూ, ఆశలూ, వైషమ్యాలూ, వైరుధ్యాలూ జీవితాన్ని సప్తవర్ణాల మిశ్రమంగా ఎలా చేస్తాయో రవికి తెలిసివస్తుంది. అలిగి పుట్టింటికి వెళ్లి తిరిగిరాని భార్య కోసం వేదనపడే అంకయ్య, కూతురుకు తనకు ఇష్టంలేని సంబంధం చేస్తున్న భార్యపట్ల కోపించిన రామయ్య, అల్లుడికిస్తానన్న కట్నం కోసం మందను అమ్ముకోవలసి వచ్చిన పాములేటి, చస్తే సేద్యగాడి సంబంధం కూతురుకి చేయనని పట్టుపట్టిన తిరిపేలు, పోలీసుల భయంతో అటు గ్రామంలో ఉండలేక, చందనపు దొంగల భయంతో అడవిలోనూ స్వేచ్చగా తిరగలేక సంచార జీవితం చేస్తున్న యానాదులు, రవి గుండెలోనే కాదు, మన గుండెల్లోనూ ముద్రలు వేస్తారు.

కొండపాలం వెళ్లిన బృందానికి పెద్ద దిక్కు ముసలి పుల్లయ్య ఇంకో ముఖ్యపాత్ర, అనుభవంతో తలపండిన పుల్లయ్యకు కొండపొలం వచ్చినవారందరూ మానుసులూ, గొర్రెలూ- సురక్షితంగా ఇంటికి తిరిగి వెళ్లటం అన్నిటికన్నా ముఖ్యమని తెలుసు. ఉడుకు రక్తపు యువకులు తొందరపడి అడవిజంతువులతోనూ, అడవిలో ఉన్న చెడ్డ మనుష్యులతోనూ గొడవలు పడి అపాయానికి లోనుకాకుండా ఉండటానికి. అందర్నీ ఒక కంట కనిపెడుతూ, తన అనుభవాన్ని అందరితో పంచుకుంటూ, అవసరమైనప్పుడు అదిలిస్తూ ఉండే పుల్లయ్యకు తమకు అడవికీ ఉన్న సంబంధం గురించి స్పష్టత ఉంది. ఈ అడవికి తాము చుట్టపుచూపుగా వచ్చినవాళ్లు. తమ పని తాము చూసుకుని మర్యాదగా తిరిగిపోవాలి; అడవికి నష్టం కలిగించకూడదు; చెట్లు నరకటమూ, అడవిజంతువులను చంపడమూ తాము చెయ్యాల్సిన పని కాదు, ఏ పెద్దపులైనా దాడి చేసినా, దానితో కలబడి దెబ్బలు తినే బదులు, దానికి ఒకటో రెండో గొర్రెల్ని పుల్లరిగా ఇవ్వటమే మిగతా మందకూ, కాపరులకూ క్షేమం అని తెలిసిన వ్యక్తి. ఇది పెద్దపులి రాజ్యమనీ, ఆకలి తీర్చుకునే హక్కు దానికి ఉందని, దాని మానాన దాన్ని పోనిస్తూ, తమమానాన తాము పోవటమే ఉత్తమమార్గమని గుర్తెరిగినవాడు. తన అనుభవంతోనూ, మాటకారితనంతోనూ, అవసరమైనప్పుడు వెటకారంతోనూ మిగతావారి సమస్యలను సానుభూతితో పరిష్కరించే పుల్లయ్య పాత్రను రచయిత మలిచిన తీరు మెచ్చుకోతగ్గది. అడవిలో తిరుగుతున్నందుకు తమకు పుల్లరి కట్టమని వచ్చిన చెంచులతో పుల్లయ్య వ్యవహరించిన తీరు నన్ను చాలా అలరించింది.

రచయితకు అడవి, అక్కడి జంతువులే కాదు, ఊర్లో మనుషుల గురించి కూడా బాగా తెలుసు. ప్రస్తుత ఆర్థిక సామాజిక పరిస్థితులు రైతుల, గొర్రెల కాపరుల కుటుంబ సంబంధాలను, బాంధవ్యాలను ఎలా విచ్ఛిన్నం చేస్తున్నాయో తెలిసిన ఈ రచయిత ఈ నవలలో అనేక ఉపకథలలో ఈ విషాదపు అనేక పార్శ్వాలను మనకు చాలా ప్రతిభావంతంగా చూపిస్తాడు. అంకయ్య అనే గొర్రెల కాపరి ఫోనులో మాట్లాడుతూ తన భార్య ముందు తన ప్రేమనూ, తన నిస్సహాయతనూ వెల్లబరచిన సన్నివేశాన్ని రచయిత నిర్వహించిన తీరుకి గుండె చిక్కబడుతుంది. అప్పుల బాధకు తాళలేక ఆత్మహత్యకు తయారైన రైతు, తన చావు తర్వాత విధులకు అయినవాళ్లు ఇబ్బంది పడకుండా అన్నీ సమకూర్చుకొని మరీ చనిపోవటం వెనుక ఉన్న మర్మాన్ని వెదికినప్పుడు కంటికి చెమ్మ వస్తుంది. గొర్రెల కాపరులకు గొర్రెలకు మధ్య ఉండే సంబంధాన్ని రచయిత ఈ నవలలో ఆవిష్కరించిన తీరు చాలా అర్ధంగా ఉంటుంది. తమ సంరక్షణలో ఉన్న మూగ జీవాల పట్ల గొర్రెల కాపరులకు చాలా ప్రేమ; పసిబిడ్డలను చూసుకున్నట్లు వాటి బాగోగులను చూసుకొంటారు. వాటి సంక్షేమాన్ని తమ బాధ్యతగా భావించి ఆరాటపడుతుంటారు. తన గొర్రెలకు తిండీ, నీరు సరిగా దొరకని రోజున తాను కూడా తిండి తినలేని గురప్ప లాంటి మనుష్యులను రచయిత మనకు పరిచయం చేస్తాడు.

రచయిత స్వీయానుభవాల, పరిశీలనలలో జన్మించిన ఈ కొండపొలం వాస్తవికతను నింపుకొని ప్రామాణికతను సంతరించుకుంది.

రచయిత స్వీయానుభవాల, పరిశీలనలలో జన్మించిన ఈ కొండపొలం వాస్తవికతను నింపుకొని ప్రామాణికతను సంతరించుకుంది. మనుషుల పట్ల, జంతువులపట్ల, పర్యావరణం పట్ల రచయితకు ఉన్న సానుభూతి, సంతులన దృష్టి ఈ నవలను అరుదైన మానవీయతతో నింపాయి.

సన్నపురెడ్డిగారు ఈ కథ చెప్పిన తీరు కూడా బహు గొప్పది. తెరలు తెరలుగా ఉత్కంఠ పెంచుతూ ఈ నవల ఎక్కడా ఆగకుండా చదివిస్తుంది. రచయిత తనకు తెలిసినదంతా ఊకదంపుడుగా మనకు చెప్పటం కాకుండా అవసరమైనప్పుడు అవసరమైనంతవరకే చెప్పడంతో మనకు విసుగు కలగదు. రచయిత భాషను ఉపయోగించుకున్న తీరు కూడా మెచ్చుకోతగ్గది. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు మళ్లీ మళ్లీ చదివించాయి. కడప మాండలికంలో పాత్రోచితమైన సంభాషణలు, సామెతలు ఒక పక్క, కొండల, అడవుల, అడవిజీవాల గురించి అద్భుతమైన కవితాత్మక వర్ణనలు ఇంకో పక్క కథలతోనూ, నవలలతోనూ పేరుగన్న సన్నపురెడ్డిలో ఒక మంచికవి ఉన్నాడని ఈ నవలతో అందరికీ తెలుస్తుంది.

అరుదైన వస్తువు, పాత్రలు, స్థలకాలాలు ఎన్నుకొని, చిక్కటి కథాక్రమం, కథన విధానం, మంచి ముగింపు, చక్కటి భాష, అంతర్లీనమైన తాత్వికతలను చక్కగా సమ తూకంలో సంతరించుకున్న ఈ కొండపొలం చదివిన ప్రతిసారీ నాకు మరింత గొప్పగా అనిపించింది.

అరుదైన వస్తువు, పాత్రలు, స్థలకాలాలు ఎన్నుకొని, చిక్కటి కథాక్రమం, కథన విధానం, మంచి ముగింపు, చక్కటి భాష, అంతర్లీనమైన తాత్వికతలను చక్కగా సమ తూకంలో సంతరించుకున్న ఈ కొండపొలం చదివిన ప్రతిసారీ నాకు మరింత గొప్పగా అనిపించింది. 2019 తానా నవలల పోటీలో రెండు లక్షల రూపాయల బహుమతిని అందుకొంటున్నఈ కొండపొలం పాఠకుల, విమర్శకుల మెప్పును పొంది, సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్రముఖ స్థానాన్ని అందుకొంటుందని నా నమ్మకం.

ఇంకా ఆలస్యమెందుకు? ముందుకు సాగండి. ఈ సాహసయాత్రను మీరూ అనుభవించండి.

KONDAPOLAM from novel to celluloid – An Epic Tale Of Becoming by Krish Jagarlamudi | Panja Vaisshnav TGej | Rakul Preet Singh | watch trailer by clicking the link 

 

 

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article