Editorial

Monday, December 23, 2024
Peopleవీధిలోనే వాగ్భాణం - ఇంట్లో ఎంతో సౌమ్యం : కొణిజేటి శివలక్ష్మి గారి అంతరంగం

వీధిలోనే వాగ్భాణం – ఇంట్లో ఎంతో సౌమ్యం : కొణిజేటి శివలక్ష్మి గారి అంతరంగం

కొణిజేటి రోశయ్య నిలువెత్తు రాజకీయ సంతకం. మరి శివ లక్ష్మి గారు! ఆవిడ అంతే… వారికి సరితూగే సహచరి. జీవిత భాగస్వామి. రోశయ్య గారితో ఆవిడకు పదేళ్ల వయసులోనే పెళ్లి అయింది. దాంతో ఊహ తెలిసిన నాటి నుంచి ప్రారంభమైనఅనుబంధం అరమరికలు లేకుండా అల్లుకుపోయింది. వారి వ్యక్తిత్వాలకు నిండుదనాన్ని తెచ్చింది. కొణిజేటి శివలక్ష్మి గారితో సంభాషించినప్పుడు భర్త గురించిన మాటల నిండా గౌరవాభిమానాలు, ప్రేమానుబంధాలు ఉట్టి పడ్డాయి. రాజకీయాల్లో రోశయ్యగారి మాటలు ఎంతో పదును. ప్రత్యర్థుల విమర్శలకు ఆయన ఇచ్చే సమాధానాలు చురుక్కుమని పిస్తాయి. ఇంట్లో మాత్రం ఆయన ఎంతో ఎంతో సౌమ్యుడని, మితభాషి అని  తేటతెల్లమయింది.

సుమబాల

సాయంత్రం 7:00 గంటలు…

అప్పుడు రోశయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. దాంతో వారి ఇంట సెక్యూరిటీ చెకింగ్ లు, గన్మెన్ల హడావుడి ఎక్కువే. అనంతరం లోపలి గదిలోకి పిలుపు. వెళితే, ముందు రోశయ్య గారు ఆసీనులై కనిపించారు. తర్వాత ఆయన శ్రీమతి నెమ్మదిగా వచ్చి వారి పక్కన కూర్చున్నారు. ఫోటోల సెషన్ ముగిసి ఆమె మాటలు మొదలెట్టగానే రోశయ్య గారు కదలకుండా కూర్చుని శ్రీమతి మాటల్ని ఆసాంతం వింటూ ఆనందించారు.

శివ లక్ష్మి గారు పుట్టింది తెనాలి దగ్గరి జంపలి. తల్లిదండ్రులకు ఒక్కతే సంతానం. తమ కుటుంబం అనే కాదు.. ఆ కాలంలో అమ్మాయిలకు 9 10 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లిళ్లు చేసేవారట. అలా శివలక్ష్మికి కూడా అ పదేళ్లు వచ్చీరాగానే పెళ్లయింది. అప్పుడు రోశయ్య గారికి యుక్తవయస్సు. వారిది గుంటూరు జిల్లా వేమూరు. పెళ్లి జూన్ 4, 1950లో జరిగింది. వీరి పెళ్లి జరిగే నాటికి రోశయ్య గారి ఎస్ఎస్సెల్సీ ఫలితాలు వచ్చి ఒకే ఒక రోజు గడిచిందట.

తరువాత కాలేజీ లో ప్రవేశం, చదువులు, రాజకీయాల వైపు మళ్లడం… ఇలా ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. ‘ఆయన ఇంటి పట్టున ఉండటం తక్కువే. మొదటి నుండి అలాగే అలవాటైపోయింది. కాబట్టి ఎప్పుడూ పెద్దగా లోటు అనిపించేది కాదు’ అన్నారావిడ.

వీరికి నలుగురు సంతానం. ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఒక అబ్బాయిని దత్తతకు ఇచ్చారు. పిల్లల పెంపకం, ఇంటి వ్యవహారాలు, బంధువులకు, ఇంటికి వచ్చి పోయే వారికి మర్యాదలు అన్నీ అత్తగారు ఆదెమ్మ సహాయంతో చేసుకునే వారట. అంతా సవ్యంగా సాగిపోతున్న కుటుంబం అని కూడా అన్నారావిడ.

మితభాషి అంటే ఆశ్చర్యం

తన వాగ్ధాటితో ప్రతిపక్షాలను అదరగొట్టే రోశయ్యగారు ‘ఇంట్లో మాత్రం పెద్దగా మాట్లాడరు’ అని చెప్పి ఆశ్చర్యపరిచారావిడ. ఏదైనా అడిగితే.. ‘నీకు తెలుసు కదా..’ అన్నట్టు చిన్నగా నవ్వి ఊరుకుంటారట. ‘ఏ విషయమైనా బాగా ఆలోచిస్తున్నట్టు కూడా కనిపించరు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడే తీరు, ఆ విషయం మీద ఎంత లోతుగా ఆలోచించారో చెబుతుంది’ అంటారామె. అంతేకాదు ‘రాజకీయాలు ఏమున్నా.. ఎవరేమనుకున్నా.. మరేం చేసినా బయటే.. ఇంట్లో మాత్రం అందర్లాగే ఉంటారు. మేము మాకు ఇష్టం వచ్చినట్లే ఉంటాం’ అని చెప్పారావిడ.

ఇంటి పెద్ద అంటే ఉండే గౌరవం తప్ప వేరే భయాలేవీ ఉండవని కూడా అన్నారావిడ. ఏదైనా అతి ముఖ్యమైన విషయమైతే తప్పా ఆయనదాకా రానివ్వరట. ఇంటి వ్యవహారాలతో ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పోవడమేనని వివరించారు శివలక్ష్మి గారు.

డిటెక్టివ్ నవలలు ఇష్టం

ఊహ తెలిసినప్పటి నుండి చుట్టూ రాజకీయం వాతావరణమే ఉన్నా వాటితో ఆమె అంటీ ముట్టనట్లుగానే ఉన్నారనిపిస్తుంది. అందుకే ఆమెకు కుట్లు-అల్లికలు మీద ప్రత్యేక ఆసక్తి. మొదట్లో మ్యాట్ని కుట్లు, చీరల మీద రకరకాల డిజైన్లు వేసే వారట. హైదరాబాద్ కు వచ్చిన కొత్తల్లో తీరిక వేళల్లో ప్లాస్టిక్ బుట్టలు అల్లడంతో పాటు పుస్తకాలు చదవడంపై ఆసక్తి చూపేవారట. ముఖ్యంగా డిటెక్టివ్ నవలలు, చందమామలాంటి కథల పుస్తకాలు చదివేవారట. ‘డిటెక్టివ్ నవలల్లో ముందేమవుతుందో.. అనే ఆసక్తి ఉంటుంది కదా. అందుకే చదివేదాన్ని. ఇది చాలా సంవత్సరాల కిందటి మాట. ఇప్పుడు దగ్గరుండి గార్డెనింగ్ చేయించడం ఇష్టం. అలాగే ఇంటిని చక్కగా అందంగా ఉంచడం నచ్చుతుంది’ అని చెప్పారు.

అర్థం చేసుకుంటే అపార్ధాలు రావు…

57 సంవత్సరాల వైవాహిక జీవితంలో బాల్యం, యవ్వనం, ప్రౌఢ దశలన్నీ జంటగా కలిసి ప్రయాణిస్తున్న వారి మధ్య చెప్పుకోదగ్గ మనస్పర్థలు లేవనే చెప్పారు. “నేనెప్పుడూ ఆయన పనులకు అడ్డు వచ్చిందీ లేదు. అలాగే ఆయన ఎప్పుడు నన్ను పల్లెత్తు మాటన్నదీ లేదు” అన్నారు.

ఒకరి మనసులోని మాటను మరొకరు అర్థం చేసుకుని సాగిపోతున్నట్లు చెప్పారావిడ. “ముందు నుండి ఆయన వ్యవహారాలు తెలుసు కాబట్టి.. ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. భర్త బాధ్యతలేమిటో స్పష్టంగా తెలిసిన భార్య వారికి ఎప్పుడు, ఏ విషయంలోనూ ఇబ్బంది కలిగించకుండా సర్దుకుపోతుంది. ఇక అప్పుడు బాధపడే విషయాలేముంటాయి. అలాంటి ప్రసక్తే లేదు” అన్నారావిడ.

మనసు నొప్పించరు…

ఈ వయస్సులోనూ (ఈ ఇంటర్వ్యూ దాదాపు 14 ఏళ్ల క్రితంది. అప్పుడు వారికి 74- 75 యేళ్లు) రోశయ్య గారు చురుగ్గా రాజకీయాల్లో నిమగ్నం అవుతుంటారు. నిరంతరం రాజకీయ కార్యకలాపాల్లో మునిగి తేలుతుంటారు. మరి, మానసికంగానూ, శారీరకంగాను అలసిపోయి ఆరోగ్యం పాడు చేసుకుంటారని అనిపించలేదా? అని అడిగితే.. ‘ఊరికే ఇంట్లో కూర్చుంటే ఉబుసుపోక.. ఏవేవో ఆలోచనలు వస్తాయి. అలా కాక పనిలో పడితే ఏ జబ్బులూ మనదగ్గరికి రావు’ అని ఆవిడ అదంత పెద్ద విషయమా అన్నట్టు సునాయాసంగా చెప్పారు.

అంతేకాదు ‘ఆయనకు ఆసక్తి ఉన్నంత వరకు ఆయన రాజకీయాలకు నేను అడ్డు చెప్పను’ అన్నారు. అయితే, తన భర్తలాగా పిల్లలు రాజకీయాల్లోకి రావడం మాత్రం తనకు అంతగా ఇష్టం లేదని చెప్పారావిడ.

ఎప్పుడైనా బయటికి కానీ, ఫంక్షన్ లకు కానీ వెళ్దాం అనుకున్నప్పుడు.. అనుకోకుండా తనకు వేరే పని పడితే ‘ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా..ఇప్పుడెలాగూ వేరే దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. ఏం చేయమంటావు’ అని అడుగుతారని చెప్పారు. ‘అవతల పని ఇంత కంటే ముఖ్యమైనదని తెలిసినప్పుడు.. వెళ్లొద్దని ఎలా అంటాను’ అంటూ.. అలా తన పనేంటో.. దాని ప్రాముఖ్యత ఏంటో మన మనసులు నొప్పించకుండా, చాలా సౌమ్యంగా చెబుతారు’ అని ఆయన సౌమ్య ధోరణి గురించి అభిమానంగా వివరించారు.

ఆయన అభిమానం…

చివరగా తన అర్ధాంగి గురించి చెప్పమంటే ‘శివలక్ష్మి అన్ని విషయాలు అర్థం చేసుకుంటుంది. నాకు సంపూర్ణ సహకారం అందిస్తుంది’ అని ప్రేమగా చెప్పారు రోశయ్య గారు.

తనకు బాగా విసిగెత్తిపోయి కొన్ని సందర్భాల్లో చిరాకు పడితే, ‘బాధ్యతలు పెట్టుకున్నాక విసుగనుకుంటే ఎట్లాగూ’ అని సున్నితంగా మందలిస్తుంది అని కూడా చెప్పారాయన. అలాగని నేను చేసిన ప్రతి పనిని ఆమె మెచ్చుకుంటుందనుకుంటే పొరపాటే. ’నేను చేసిన పనేదైనా సబబుగా లేదనుకుంటే నిర్మొహమాటంగా వ్యతిరేకిస్తుంది’ అని చెప్పారు.

అలాంటప్పుడు మీరు ఎలా స్పందిస్తారు? అని అడిగితే.. ‘నవ్వి ఊరుకుంటాను’ అన్నారాయన. సౌమ్యమైన చిరునవ్వుతో. అంతటితో మరి ఆ దంపతుల నుంచి వీడ్కోలు తీసుకున్నాం.

కొణిజేటి దంపతులతో వ్యాసకర్త.
ఇంటర్వ్యూ -శనివారం మార్చి 17, 2007.వార్త దినపత్రిక సౌజన్యంతో పునర్ముద్రితం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article