Editorial

Monday, December 23, 2024
Peopleవేశ్యల కళ్ళలో నీళ్లు సుడి తిరగడం నేను చూసాను - కొంపెల్ల రవిప్రసాద్

వేశ్యల కళ్ళలో నీళ్లు సుడి తిరగడం నేను చూసాను – కొంపెల్ల రవిప్రసాద్

నిన్న ప్రసిద్ద రచయిత శ్రీ రావిశాస్త్రి గారి జన్మదినం. నిజానికి ఇది వారి శతజయంతి సంవత్సర ప్రారంభం, ఈ సందర్భంగా ఆ మహా రచయిత అపురూప వ్యక్తిత్వం తెలుపే వ్యాసం ఇది.

“ఆయన తర్వాత, అయనలా మానవత్వం మూర్తిభవించిన వ్యక్తి నాకు తారస పడలేదు” అంటూ ఉద్విగ్న జ్ఞాపకాలు పంచుకున్నారు వ్యాసకర్త .

కొంపెల్ల రవిప్రసాద్

శ్రీ రావిశాస్త్రి గారి ఆంతరంగిక మిత్రులలో శ్రీ రవిగారు ఒకరు. ఒకానొక సందర్భంలో రవిగారి ద్వారా, నాకు శ్రీ రావిశాస్త్రి గారితో దాదాపు అయన జీవించిన ఆఖరి ఆరు నెలల్లో పరిచయం ఏర్పడడం నా అదృష్టం. నన్ను “ఒరేయ్ కొంపెల్లా!” అని పిలిచేవారు. సుమారు రెండు నెలల పాటు, సాయంత్రం 7 గంటల సమయములో నేను జిల్లాపరిషత్ వద్ద ఆయన ఇంటికి వెళ్ళేవాడిని. నా చేతక్ స్కూటర్ పై ఎక్కి, ఆయన చెప్పిన చోటుకి, అది సాగరతీరమయినా, ఋషికొండ, యారాడ, ఎక్కడికయినా తీసుకివెళ్లి, తిరిగి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆయన్ని ఇంటి వద్ద విడిచిపెట్టడం రివాజు. ఆయన రచనలలో “రత్తాలు రాంబాబు” పుస్తకం, వారు సంతకం చేసి నాకు ఇచ్చారు. ఆయన జీవితంలో మానవత్వం, జాలి, ఉండడమేకాక వాటిని అమలు పరిచేవారు.

“ఈ ఒక్క రాత్రి అయినా, మీ ఒళ్ళు హూనం అవ్వకుండా, శరీరం అలసి పోకుండా, ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుక్కోండి” అన్నారు. వచ్చిన వారి కళ్ళలో నీళ్లు సుడి తిరగడం నేను చూసాను. ఆ వేశ్యలు శ్రీ రావిశాస్త్రి గారి కాళ్లకు దణ్ణం పెట్టి వెళ్లిపోయారు.

ఒకరోజు నన్ను ఫలానా షాపుకి వెళ్లి ఒక బాటిల్ తెమ్మన్నారు. ప్రతి ఖర్చుకి ఆయనే డబ్బులు ఇచ్చేవారు. ఆ షాపతను శాస్త్రి గారికా అని అడగడం ఆశ్చర్యం వేసింది. షాపతను సోడా, రెండు గ్లాసులు కూడా ఇచ్చాడు. గోకుల్ పార్క్ వద్ద సాగరతీరంలో అవి సేవిస్తూ, ఆయన అనుభవాలను నాతో చెబుతూండగా, జిల్లా కలెక్టరగారి బిళ్ళ బంట్రోతు 8-00 pm కి మా వద్దకు వచ్చాడు. GREENARY IN CITY OF DDESTINY గురించి, శ్రీ రావిశాస్త్రి గారు dolphin హోటల్ లో ప్రసంగించవలసి ఉందని, జిల్లా కలెక్టర్ గారి తో సహా, ఎందరో ప్రముఖులు ఎదురు చూస్తున్నారు అని, కారు తీసుకువచ్చానని, జిల్లా కలెక్టర్ గారు రమ్మన్నారని చెప్పాడు. పూర్తి స్పృహలోఉన్న శ్రీ రావిశాస్త్రి గారు, “నేను రాను అన్నాను అని చెప్పు”అని బదులు ఇచ్చారు. ఆ వచ్చిన వ్యక్తి బ్రతిమలాడినా లాభం లేకపోయింది.

విశాఖపట్నం బీచ్ రోడ్ లో రావిశాస్త్రి విగ్రహం.

నిన్న ప్రసిద్ద రచయిత శ్రీ రావిశాస్త్రి గారి జన్మదినం. నిజానికి ఇది వారి శతజయంతి సంవత్సర ప్రారంభం, ఈ సందర్భంగా ఆ మహా రచయిత అపురూప వ్యక్తిత్వం తెలుపే వ్యాసం ఇది.

అర్థరాత్రి 12-30 లకు, నన్ను రాజేశ్వరి థియేటర్ వద్దకు తీసుకు వెళ్ళమ్మన్నారు శ్రీ రావిశాస్త్రి గారు. అప్పటికి సెకండ్ షో వదిలేసారు. వేశ్యలతో, విటులతో, ఆ థియేటర్ ప్రక్క సందు రద్దిగా వుంది. మా స్కూటర్ ఆగగానే బిలబిలమంటూ 10 మందికిపైగా వేశ్యలు “బాబుగారు!” అంటూ పరుగు పరుగు న వచ్చారు. ఆయన ఫాంట్ కుడి జేబులోనుంచి 100/- కట్ట (10,000), చొక్కా జేబులోంచి కొంత డబ్బు వారికి ఇచ్చి, “ఈ ఒక్క రాత్రి అయినా, మీ ఒళ్ళు హూనం అవ్వకుండా, శరీరం అలసి పోకుండా, ఇంటికి వెళ్లి ప్రశాంతంగా పడుక్కోండి” అన్నారు. వచ్చిన వారి కళ్ళలో నీళ్లు సుడి తిరగడం నేను చూసాను. ఆ వేశ్యలు శ్రీ రావిశాస్త్రి గారి కాళ్లకు దణ్ణం పెట్టి వెళ్లిపోయారు. “పదరా కొంపెల్లా! ఇదిరా GREENARY అంటే, గొప్పవాళ్ళు జరుపుకునే వేడుకలలో dolphin లో ఉండదు రా అది” అన్నారు.

ఒక రోజు సాయంత్రం నాలుగింటికే రమ్మన్నారు నన్ను. శ్రీ వేంకటేశ్వరస్వామి గుడి వద్ద పడవలో యారాడకొండ అవతలికి చేరుకున్నాం.” ఆకలిగా ఉందిరా, వేడి ఇడ్లి 2 ప్లేట్లు కట్టించు” అన్నారు. యారాడ ఇసుక తిన్నెలలో సేద తీరి, ఇడ్లి పొట్లం విప్పుతుండగా, నేను మంచినీళ్ళ బాటిల్ అందించాను. ఇంతలో ఎక్కడి నుంచో రెండు కుక్కలు వచ్చాయి. వాటిని ప్రేమతో నిమిరి, ఇడ్లి పొట్లాలు వాటికి ఆహరం గా ఇచ్చేసారు ఆయన. నేను తప్పట్లు కొట్టాను. ఆయన నా భుజం తట్టారు.

ఇక మమ్మల్ని అందరిని శోక సముద్రంలో ముంచిన రావిశాస్త్రి గారి చివరి రోజు రానే వచ్చింది. హాస్పిటల్ లో డాక్టర్లు 2 గంటలకన్నా అయన బ్రతకరని, ఆయనకు ఏమి పెట్టకండి, ప్రమాదం అని, సాక్షాత్తు అయన తోనే చెప్పారు. మంచం మీదవున్న రావిశాస్త్రి గారు హోటల్ dolphin కి వెళ్లి మటన్ సూప్ తెమ్మన్నారు. అందరం ఏడుస్తున్నాం, ఎవరూ ఆయన మాట వినలేదు.

“చాలా రుచిగా ఉందిరా! నా కోసమే చేసారా!” అని ఆయన అంటుంటే మాకు ఏడుపు ఆగలేదు.

“ఒరేయ్ కొంపెల్లా! వెళ్ళారా! వెళ్లి పట్రా!” అన్నారు. ఆలస్యం చెయ్యకుండా అరగంటలో అయన చెప్పింది తీసుకువచ్చాను. “చాలా రుచిగా ఉందిరా! నా కోసమే చేసారా!” అని ఆయన అంటుంటే మాకు ఏడుపు ఆగలేదు. “అందరూ వెళ్లిపోండి. నన్ను మార్చురీ లో పడేస్తారు. రేపు కార్యక్రమాలు చేసుకోండి” అన్నారు. ఆయన రూము వద్ద అక్కడ, ఇక్కడ, అందరం విషాదంతో నించుని ఉండగా, ఆయన మరణవార్తని డాక్టర్లు ప్రకటించారు.

రావిశాస్త్రి గారి శవ యాత్రలో పాల్గొని, కడచారి చూపు చూసుకో గలిగాను. ఆయనకు ముందు, ఆయన తర్వాత, అయనలా మానవత్వం మూర్తిభవించిన వ్యక్తి నాకు తారస పడలేదు. ప్రజా జీవితంలో అయన రచించిన కధలు, కవితలు, నవలలు రూపంలో అయన బ్రతికే వున్నారు.

(విలువైన ఈ జ్ఞాపకాల వ్యాసం వ్యాట్సప్ లో చూసి తెలుపు పునర్ముద్రిస్తోందని గమనించగలరు. రచయితకు కృతజ్ఞతలు- ఎడిటర్ )

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article