Editorial

Wednesday, January 22, 2025
వ్యాసాలుకొండపొలం : ఉత్పత్తి కులాల మానవీయతకు నిలువుటద్ధం - కాత్యాయనీ విద్మహే

కొండపొలం : ఉత్పత్తి కులాల మానవీయతకు నిలువుటద్ధం – కాత్యాయనీ విద్మహే

“పశుపోషక వృత్తిజీవనంలోని ధార్మిక నైతిక శక్తిని కొండల కెత్తుతూ, గుండెకు హత్తుకొంటూ రాసిన నవల కొండపాలం”. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు రచించిన ఈ అద్భుత జీవగ్రంధం తానా నవలల పోటీ -2019లో అత్యున్నత రచనగా ఎంపికై రెండు లక్షల బహుమతిని అందుకున్న విషయం తెలిసిందే. ఐతే, ఈ నవలను అదే పేరుతో ప్రముఖ దర్శకులు క్రిష్ దృశ్యమానం చేయడం మరో విశేషం. వారు ఆ సినిమాను వచ్చేనెల ఎనిమిదిన  మన ముందుకు తెస్తున్నారు. ఈ సందర్భంగా విశిష్టమైన ఈ నవలకు కాత్యాయనీ విద్మహే గారు రాసిన ముందు మాట తెలుపు పాఠకులకు మరోసారి…

కాత్యాయనీ విద్మహే

సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి మొదటి నుండీ గడ్డివేళ్ల స్థాయి మనుషుల జీవన తాత్వికతను ఒడిసిపట్టి నవలలు రాస్తున్న రచయిత, రాయలసీమ పల్లె జీవితం, పని పాటలు, జీవభాష ఆయన నవలలకు దేశీయ ముద్రను ఇస్తాయి. వ్యవసాయరంగంలో సంప్రదాయ తృణధాన్యాల సాగును ఉపాంతీకరించిన పెట్టుబడి, హరిత విప్లవం తెచ్చిన విధ్వంసానికి, దానితోపాటు జరుగుతున్న పర్యావరణ విధ్వంసానికి కనలిపోతూ ఒంటరి నవల రాసిన రెండేళ్లకే ఆయన రాసిన మరొక మంచి నవల కొండపొలం. ఈ నవలలోని ఇతివృత్తానికి అవసరమైన బీజాలు ఆ నవలలోనే ఉండడం విశేషం.

కడపకు కాస్త దూరంలో ఉన్న కాశినాయన క్షేత్రం జ్యోతి కేంద్రం నుండి వరికుంట్ల మీదుగా వెళ్తే వచ్చే అడవి అంచు గ్రామం ఒంటికొట్టంలో ఒంటరి నవల కథ నడిస్తే ఆ చుట్టుపక్కల కొండలు, గుట్టలతో కూడిన అడవి కొండపాలం నవలాస్థలం అయింది.

Kathyayani vidhmahe

కాత్యాయనీ విద్మహే గారు తానా నవలల పోటీకి వచ్చిన మొత్తం 58 నవలలలో నాలుగు ఉత్తమ నవలలుగా ఎంపిక చేసిన ఇద్దరు ప్రముఖ రచయితల్లో ఒకరు. ఆ నాలుగు నవలల్లో కొండపొలంను అత్యుత్తమ రచనగా ప్రచురణల కమిటి ఎంపిక చేయగా పుస్తకానికి వారు అద్భుతమైన ముందు మాట రాశారు. అది చదవడం అంటే ఈ పుస్తకం విలువను మరింత గొప్పగా అర్థం చేసుకోవడమే.
మీకు తెలుసు, కేతవరపు కాత్యాయనీ విద్మహే గారు అధ్యాపకురాలు, సుప్రసిద్ధ విమర్శకురాలు. వారు మార్క్సిజాన్నీ మాత్రమే కాక స్త్రీవాదం పట్లా, ప్రత్యేక అస్తిత్వాల పట్లా లోతైన అధ్యయనం, పరిశోధన, వ్యక్తీకరణ గలవారు. వర్గం, కులం, లింగం, ప్రాంతం తాలూకు పరస్పర అధార భూరితమైన అంశాలతో కూడి సాహిత్య విమర్శను ప్రజాస్వామీకరిస్తున్న అతి కొద్దిమందిలో వారు ముఖ్యులు. తమ విశేష కృషికి ఒకానొక గుర్తింపు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అందుకోవడం కూడా. కొండపొలం నవలకు వారు రాసిన ముందుమాట చదివితే ఈ పుస్తకం ఎన్ని విధాలా చర్చకు తావిచ్చే ఇతివృత్తాన్ని ఆవిష్కరించిందో బోధపడుతుంది.

పోరుమామిళ్ల పక్క పల్లె నుండి వేసవికాలం మేకల గొర్రెల మేపు కోసం మందను వెంట వేసుకొని కొండల మీదికి వలస వెళ్లిన గొల్లల జీవితానుభవ దృశ్యకథనంగా సాగిన ఈ నవలలోనూ కాశినాయన జ్యోతి మండల గ్రామమూ, ఆశ్రమమూ, వరికుంట్ల తరచు ప్రస్తావనకు వస్తాయి. ఆ నవలలో రైతు నర్సయ్య మనస్తత్వం, జీవిత అవగాహన, ప్రకృతి వనరుల గురించిన తాత్వికతల సారం ఈ నవలలోని పుల్లయ్య పాత్రలోకి ప్రవహించింది. ఆ నవలలో నర్సయ్య చూపును, చింతనను పరిశీలిస్తూ వచ్చిన డాక్టర్ రాఘవ స్థానంలో ఈ నవలలో పుల్లయ్య మాటను, ఆలోచనను, క్రియను పరిశీలిస్తూ, ప్రభావితుడవుతూ వచ్చిన రవీంద్ర ఉన్నాడు. ఇంజనీరింగ్ చదివి, నాలుగేళ్లుగా హైదరాబాద్లో కోచింగ్ తీసుకొంటూ సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు, హంగులు సంపాందించుకొంటూ, ఉద్యోగం మాత్రం ఇంకా సంపాదించుకోలేక అనివార్యంగా తండ్రికి సైదోడుగా గొర్రెలమందతో కొండదారి పట్టిన అతని అనుభవకోణం ను౦డి గొర్లమేపుకు కొండపొలం చేయబోయిన గొల్లల జీవనయానం భిన్న భావోద్వేగాల సంరంభంగా పాఠకుల కళ్ల ముందు ప్రదర్శితం అవుతుంది. వాళ్ళతోపాటు ఆ ప్రయాణంలో కలిసి  నడిచిన అనుభూతి పాఠకులలోనూ కల్గించే కథనశిల్పం ఈ నవలను కళాఖండం చేసింది.

రచయిత సన్నపు రెడ్డి వెంకటరామిరెడ్డి

1987 నుంచి రచనా వ్యాసంగంలో ఉన్న సన్నపరెడ్ది వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. కడప జిల్లా బాలరాజుపల్లెలో నివాసం. 2019లో తానా నిర్వహించిన నవలల పోటీల్లో ఏకగ్రీవంగా ఈ నవల అత్యుత్తమ రచనగా ఎంపికవడంతో రెండు లక్షల బహుమతి అందుకున్నారు. అంతకు ముందు 2017లో వారి రచన ‘ఒంటరి’కి కూడా మూడో బహుమతి అందుకున్నారు. కవిత్వంతో మొదలైన వారి రచనా ప్రస్థానంలో  ఇప్పటికి రెండు కథా సంపుటులు, ఎనిమిది నవలలు వెలువడ్డాయి. వారి రచనలు చదవడం ఒక గొప్ప అనుభవం. వారి ఫేస్ బుక్ అకౌంట్. ఇ -మెయిల్ :SANNAPUREDDY12@GMAIL.COM

పదిహేనేళ్ళ క్రితం కొండపొలం చేయబోయిన నాటి రవీంద్ర అనుభవాల జ్ఞాపకాల కలపోతల కథనం ఈ నవల. తండ్రితో పాటు గొర్రెలమందను కొండపొలం తోలుకుపోవటానికి ముందు రవీంద్ర ఎలా ఉన్నాడు? యాభై రోజులు కొండపొలం చేసివచ్చిన తర్వాత ఎట్లా రూపొందాడు అన్నది ఇందులో కీలకాంశం. ఈ ఆద్యంతాల మధ్య అసలు కథ ఉంది.

ఉత్పత్తి విధానం ఆహార సేకరణ, వేట దశ నుండి, పశుపోషణ దశను దాటి వ్యవసాయం కనుక్కొనటంతో స్థిరపడి, యంత్రం కనుక్కొనటంతో పరిశ్రమల రంగంగా అభివృద్ధి చెందిన విషయం మనకు తెలిసిందే. ఆహార సేకరణ, వేట మానవజీవనంగా ఉన్నరోజులు అంతరించాయి. వ్యవసాయ ఉత్పత్తి సమాజానికీ అనుబంధంగా పశుపోషణ కొనసాగుతునే ఉంది. అయినా ఈనాటి సమాజం పారిశ్రామిక పురోగమన కాంక్షతో ఉంది. పెట్టుబడి దాని మౌలిక లక్షణం. లాభం దాని అంతిమ లక్ష్యం. ఆ పెట్టుబడి వ్యవసాయ ఉత్పత్తి విధానంలోకి కూడా ప్రవేశించి రైతు జీవితాన్ని, భూసారాన్ని కూడా పీల్చి పిప్పి చేస్తున్న వర్తమాన విషాద సందర్భం గురించిన స్పృహతో గాయపడ్డ రైతు ఆత్మను ఆత్మీయంగా స్పృశించే ఇతివృత్తాలను ఎన్నుకొంటూ నవలలు రాస్తున్న సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పశుపోషక వృత్తిజీవనంలోని ధార్మిక నైతిక శక్తిని కొండల కెత్తుతూ, గుండెకు హత్తుకొంటూ రాసిన నవల కొండపాలం.

వ్యవసాయానికి అనుబంధంగాకాక గొర్రెల పోషణ గొల్లలకు దానంతట అదే ఒక స్వతంత్ర వృత్తి. గొర్రెలమందే వాళ్ల జీవనాధారం. సాకి, సవరించి, పెంపు చేసుకొనే మందతో వాళ్ల అనుబంధం, వాటితోటి సంబంధంలోనే నిర్ణయించబడే జీవితాలూ, విలువలు ఈ నవలలో అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి.

ఇప్పటివరకు ఉపాంతీకరణకు గురి అయిన సామాజికవర్గాల జీవితంలో సాహిత్య వస్తువు కాగలిగిన సత్తా ఎంత వుందో నిరూపించినందువల్ల, ఒకరికొకరు. తోడుగా, అందరి క్షేమం ఆకాంక్లగా; సమిష్టి జీవితంలో తొణికిసలాడే సౌందర్యం, ఉత్సాహం వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంత ప్రధానపాత్ర వహిస్తాయో చూపినందువల్ల ఇది గొప్ప నవల అవుతున్నది.

వానలు లేక, పచ్చికబీళ్లు కరువై, మేత కొనుగోలుకి వేలకువేలు ఖర్చు పెడుతూ కూడా వాటి కడుపు నింపలేక, అర్ధాకలితో దొడ్లో పడున్న జీవాలను తలచుకుని తిండి సహించక కళ్లనీళ్లు దీసే గొల్లలు వాటి అవసరాలు చూడటంలో తమదైన ఒక జీవితమే ఉందని మరచిపోతారు. కన్నబిడ్డల మీద ఉండే మమతా భ్రమతా అన్నీ గొ ర్రెల మందల చుట్టూ అలుముకొని పరిమళిస్తూనే ఉంటాయి. ఊల్లో ఇక మంద కడుపునింపే మేత పుట్టదని, దాహం తీర్చే నీరు దొరకదని తెలిసి, వేసవికాలం ఊరి గొల్లలంతా ఇళ్ళూ వాకిళ్లను, భార్యాపిల్లలను వదిలి, మందను వెంటేసు కొని కొండల మీద కురిసే వానకు పచ్చబడ్డ ప్రాంతాలను వెతుక్కొంటూ, ఉన్న చోటున ఉండకుండా నల్లమల కొండలు ఎక్కుతూ, దిగుతూ గొరైల మేతకు అనుకూలమైన చోట ఆగుతూ, కలసికట్టుగా చేసిన కష్ట భూయిష్టమూ సాహసోసేతమూ అయిన యాభై రోజుల ప్రయాణమే ఇతివృత్తంగా గల ఈ నవలల లో కొన్నిసార్లు రచయిత జీవితాన్ని వాస్తవ కాఠిన్యాలకు అతీతంగా ఆదర్శీకరించినట్లు అనిపిస్తుంది, కానీ ఇప్పటివరకు ఉపాంతీకరణకు గురి అయిన సామాజికవర్గాల జీవితంలో సాహిత్య వస్తువు కాగలిగిన సత్తా ఎంత వుందో నిరూపించినందువల్ల, ఒకరికొకరు. తోడుగా, అందరి క్షేమం ఆకాంక్లగా; సమిష్టి జీవితంలో తొణికిసలాడే సౌందర్యం, ఉత్సాహం వ్యక్తిత్వ నిర్మాణంలో ఎంత ప్రధానపాత్ర వహిస్తాయో చూపినందువల్ల ఇది గొప్ప నవల అవుతున్నది.

గొర్రెల పెంపకంతో ముడిపడిన గొల్లల ఆహార, ఆహార్య అలోచనా వస్తు సంస్కృతి ఈ నవలకు జీవధాతువు, గొర్రెల కాలికి ముల్లు దిగితే చంటిపిల్ల కాలువలే నోటబట్టి పళ్ల కరిచి తీయటం దగ్గర నుండి వాటి యవ్వనాన్ని, వాటి యవ్వన సంపర్కాలను, చూడికట్టి ఈనటం వరకు అనేక అవస్థలను కనిపెట్టి చూస్తు కాపుగాచే గొల్లల పనులు, కలలూ అన్నీ మంద చుట్టునే తిరుగుతుంటాయి. మంద మేతకు కావలసిన గడ్డి పెరగటానికి అవసరమైన వాన గురించిన కలవరింతలు ఉంటాయి, కొండపొలం వచ్చి నెల దాటుతున్నా భార్యాపిల్లల గురించికాక గొర్రెల గురించే కలవరపడే గొల్లల మనసు పొరలల ఉన్నది భార్యాపిల్లలతో నిండైన జీవితం గడపటానికి ఉన్న జీవికాపరమైన అవరోధాల అధిగమన ఆకాంక్షే అని సత్యసుందరంగా సూచించింది ఈ నవల.

గొర్రెలు కాచే గొల్ల మగవాండ్ల శ్రమజీవన సౌందర్యం మాత్రమే కాదు, దానిని ఒరుసు కొంటూ స్రీ పురుష జీవిత సంబంధాల సౌందర్యాన్ని కూడా ఇతివృత్తంలో భాగం చేయటం వలన ఈ నవల మరింత ఆసక్తికరంగా సాగింది.

గొర్రెలు కాచే గొల్ల మగవాండ్ల శ్రమజీవన సౌందర్యం మాత్రమే కాదు, దానిని ఒరుసు కొంటూ స్రీ పురుష జీవిత సంబంధాల సౌందర్యాన్ని కూడా ఇతివృత్తంలో భాగం చేయటం వలన ఈ నవల మరింత ఆసక్తికరంగా సాగింది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యావియోగం అంకయ్యను ఎంత బాధించిందో సుభద్రకు చేసిన ఒక ఫోను సంభాషణ ద్వారా చిత్రించబడింది. కొత్తబట్టలు కొనుక్కోటానికైనా, మరదలి పెళ్లికైనా, బావమరిది నిశ్చితార్థానికైనా భర్త తనతో రాలేదన్నది ఆమె అలకకు కారణం, అవి కాదనలేనివే అని అతనికీ తెలుసు. కానీ అంతకుమించిన గొర్రెల అవసరాలు అతనిని అ సరదాలను, సంతోషాలను వదులుకునేలా చేశాయి. ఫోను సంభాషణలో అవతల ఆడమనిషి ఏమి మాట్లాడుతున్నదో తెలియదు కానీ అంకయ్య చెప్పుకొనే సంజాయిషీ, చేసే వాదన మాత్రమే అతనితో ఉన్న రవికి అయినా అట్లుపోసి అమ్మే అంగడి ఆడమనిషికైనా, మనకైనా వినబడుతుంటాయి. భార్యపట్ల, కొడుకుపట్ల అతని ప్రేమ, దానిని చూపలేని జీవన ఆరాట పోరాటాల విషాదమే ఒక శిక్షగా అతనిని బాధించిన తీరు అర్థమవుతుంటే అ బాధ రవిదీ అవుతుంది, అడ మనిషిదీ అవుతుంది, మనది కూడా అవుతుంది, జీవన వాస్తవాలు అర్థమవుతున్నకొద్దీ స్రీ పురుషులు దాంపత్య సంబంధాలలో సర్దుబాట్లకు ఎలా సిద్ధమవుతారో, వాటినీ అథిగమించగల ఏకైక సాధనంగా దాంపత్య సంబంధాన్ని ఎలా మలుచుకొంటారో అంకయ్య, సుభద్రల స్నిగ్గ స్వభావంలో నిరూపించాడు రచయిత.

గొల్లల వృత్తి జీవనం, సామాజిక ఆర్థిక జీవిత సంక్లిష్టతల సంబంధం నుండి పెండ్లి గురించిన చర్చలు, పెండ్లి సందర్భాలు కూడా ఈ నవలలో చోటు చేసుకున్నాయి. పిల్లపెండ్లికి ఇయ్యాల్సిన కట్నం బాకీ కింద గొర్రెలమందను అల్లుడు అమ్మకానికి పెడుతుంటే నిస్సహాయ దుఃఖంతో నిలబడిపోయిన పాములేటి కనబడతాడు. గొర్లు కాసుకొనే వాళ్లు ఆడపిల్లలను దండిగా కట్నాలు ఇచ్చి వ్యాపారస్తులకో, ఉద్యోగస్తులకో ఇచ్చి పెళ్లిళ్లు చేస్తే సామాజిక హోదాలో వచ్చే వ్యత్యాసాలవల్ల ఎంత హింస పడాల్సి వస్తుందో, కన్నపిల్లలకు, ప్రాణమిచ్చి పెంచుకున్న మందకు ఎలా పరాయీకరింపబడతారో సూచిస్తుంది పాములేటి అనుభవం. ఇలాంటి ప్రమాదాన్ని పసిగట్టటం వల్లనే కాబోలు మూడు లక్షల కట్నం పోసి కూతుర్ని మిలటరీలో పనిచేస్తున్న అక్క కొడుక్కు ఇచ్చి చెయ్యాలని రామయ్య ఆలోచిస్తుంటే, అతను గొర్రెలను తోలుకొని కొండపొలం పోయి ఉన్న తరుణంలో చిన్న నాటకం ఆడి అన్న కొడుకుతో పిల్ల పెళ్లి తక్షణమే జరిపించాల్సిన అవసరాన్ని సృష్టించింది అతని భార్య.

మనిషికి, నేలకు, అడవికి, కొండలకు, వానకు, ఎండకు, సమస్త ప్రకృతికి, పశుపక్షి జాతులకు ఉండవలసిన సమతౌల్య సంబంధాల చింతన, చిత్రణ ఈ నవలకు ప్రాణభూత విషయం.

మనిషికి, నేలకు, అడవికి, కొండలకు, వానకు, ఎండకు, సమస్త ప్రకృతికి, పశుపక్షి జాతులకు ఉండవలసిన సమతౌల్య సంబంధాల చింతన, చిత్రణ ఈ నవలకు ప్రాణభూత విషయం. అడవులను లోపలికి నెట్టేస్తూ భూమిని ఆక్రమిస్తున్న డబ్బున్న మారాజుల భూదాహానికి, అటవీ సంరక్షణ చట్టాలు వచ్చిన కొద్దీ పెరుగుతున్న అటవీ సంపద దోపిడీదారులకు ప్రతిద్వందిగా గొల్లకురుమ శ్రమజీవులను నిలబెట్టింది ఈ నవల. అడవి వాళ్ల జీవనావసరం. గొర్రెల మేతకు అవసరమైన మేరకే అడవిని ఉపయోగించుకొంటారు వాళ్లు. ఆ వలస కాలంలో అడవి జంతువులకు హాని కలిగించకుండా తమ పని తాము చేసుకుపోవటం స్వయం నిర్దేశిత నైతిక నియమం. అడవితల్లి సంతానంగా జంతువుల గురించి చెప్పే పుల్లయ్య తాత గొల్లవాడి చేతి గొడ్డలి ఆత్మరక్షణకే కానీ అడవి హననానికి, అడవి జంతువుల వేటకీ కాదు అని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. పులి ఒక గొర్రెను పంజా విసిరి పట్టుకుపోయినా దానిని శత్రువుగా చూడకూడదంటాడు. అది దాని తిండి… దాని హక్కు. దాని తావుకు మనమే వచ్చాం కనుక సుంకం చెల్లించినట్లు అనుకోవాలంటాడు. ఈ సహజ ధార్మిక నైతికత అసలైన పర్యావరణ
ప్రేమికులు అతిసాధారణ శ్రామికజనమేనని స్పష్టం చేస్తుంది. గొర్రెల పెంపకపు పనితోను తద్వారా అడవితోనూ ముడిపడ్డ జీవితతత్వాన్ని అర్థం చేయించటానికి పుల్లయ్య మాట్లాడిన మాటలు అలవోకగా వాడిన అతి సాధారణ ఉపమానాలు శ్రమజీవుల తరగని గని అచ్చమైన ‘మానవీయత’ అని స్పష్టం చేస్తాయి.

సంగటి కెలికే తెడ్డు, పప్పు గుత్తి, మజ్జిగ కవ్వం ఇలాంటి గృహ అవసరాలకు అవసరమైన చిన్న కర్రలు, ఇంటి వైద్యానికి అవసరమైన ఆకులు, వేర్లు, బెరళ్లు తప్ప అడవి నుండి వాళ్లు తీసుకెళ్లేది ఏమీ ఉండదు. అది కూడా గొంగడి భుజం మీద ఆనించి పట్టుకున్న కర్రకు కట్టిన తిండిమూటలో పట్టుకపోగలిగినంత మాత్రమే. ట్రాక్టర్లకు, లారీలకు ఎత్తి రవాణా చేయగలిగినంత వ్యాపారపు సరుకు కాదు. అలా చేసే ఎర్రచందనపు దొంగ వ్యాపారుల గురించిన ప్రస్తావన ఈ నవలలో ఉంది. అడవిని కొట్టి కలపను, చందనాన్ని తరలించే ముఠాలు తమ పని తాము చేస్తుండగా నేరస్థులుగా పట్టుబడి శిక్షలు అనుభవించే యానాదులు కూడా ఈ నవలలో కనిపిస్తారు.

స్మగ్లర్ల ఒత్తిడికి లొంగి అడవిసంపదల ఆచూకీ చెప్పి, తరలించటానికి సహకరించనైనా సహకరించాలి లేదా పోలీసులకు చిక్కి నేరాలు మోపబడి జైళ్లలో మగ్గనైనా మగ్గాలి. అవి తప్పించుకోవాలంటే వాళ్లకు చిక్కకుండా అడవులలోకి వెళ్లినా పోవాలి. ఇది రవీంద్ర, భాస్కర్ వంటి యువకులను కలత పెట్టిన విషయం. ప్రతీకార చర్యలకు దిగేట్లు చేసిన అనుభవం.

యానాదులు అతి ప్రాచీనమైన మానవ సమూహాలలో ఒకరు. భారతదేశంలో ఇలాంటి ఆదిమ జాతులు 573 గుర్తించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని 22 ఆదివాసీ తెగలలో నల్లమల అడవుల నుండి నెల్లూరు సముద్రతీరందాకా విస్తరించి ఉన్న సంచార గిరిజన తెగ అయిన యానాదులది ఆంధ్రరాష్ట్రపు ఆదివాసీ జనాభాలో సంఖ్యాపరంగా రెండవ స్థానం. గ్రామాల బయట తాత్కాలిక ఆవాసాలలో నివసిస్తూ, వేట మీద, ఆహార సేకరణ మీద ఆధారపడి జీవిస్తూ ప్రకృతి వనరులను సహజ హక్కుగా వాడుకొనే ఆదివాసులను- స్వంత ఆస్తి వ్యవస్థ, భూస్వామ్య ఆర్ధిక నిర్మాణం, దానిని రక్షించటానికి నిలబడ్డ రాజ్యం నేరస్థ జాతులుగా చూశాయి. బ్రిటిష్ పాలనలో అది చట్టబద్ధం అయింది. 1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1924 నాటికి సమగ్ర చట్టంగా రూపొందింది. యానాదులను పుట్టు నేరస్థ జాతిగా పరిగణించటం మొదలైంది. అక్కడినుండే. ఇది ఎర్రచందనం అక్రమ రవాణాదారుల ప్రయోజనాలకు ఎంతగా ఉపయోగపడిందో, యానాదుల జీవితాన్ని ఎంత భీభత్సానికి గురి చేసిందో ఈ నవలలో, “యీ ఇలాకాలో యాడ సందనపు
తుంటలు దొరికినా పోలీసోల్లకు దొంగలు మా కాలనీలోనే దొరుకుతారు,” అన్న యానాది నరసింహులు మాటలలో సూచించబడింది. పోలీసులు, స్మగ్లర్లు కూడబలుక్కుని ఆడుతున్న దోపిడీ నాటకంలో బలిపశువులు వాళ్లు. స్మగ్లర్ల ఒత్తిడికి లొంగి అడవిసంపదల ఆచూకీ చెప్పి, తరలించటానికి సహకరించనైనా సహకరించాలి లేదా పోలీసులకు చిక్కి నేరాలు మోపబడి జైళ్లలో మగ్గనైనా మగ్గాలి. అవి తప్పించుకోవాలంటే వాళ్లకు చిక్కకుండా అడవులలోకి వెళ్లినా పోవాలి. ఇది రవీంద్ర, భాస్కర్ వంటి యువకులను కలత పెట్టిన విషయం. ప్రతీకార చర్యలకు దిగేట్లు చేసిన అనుభవం.

మనిషి బలహీనత భయం. భయం ఒక మానసిక ఉద్వేగం. అభద్రత నుండి పుడుతుంది. ఆత్మన్యూనత కారణంగా పెరుగుతుంది. భయం మనిషిని ఎంత నైచ్యానికైనా దిగజారుస్తుంది అని నిరూపిస్తూ, భయం నుండి విముక్తమైనప్పుడే మనిషిగా మనుగడ, సార్ధక జీవితం అని సూచిస్తూ 1950లలో రాచకొండ విశ్వనాధశాస్త్రి రాసిన అల్పజీవి నవల గుర్తుకు వస్తుంది, ఈ నవల చదువుతుంటే. యాదవుల ఇంట తొలి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి, నాలుగేళ్లుగా కోచింగ్ తీసుకొంటూ ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరాక లోలోపల ఆందోళన పడుతున్న రవీంద్రకు ఇంటర్వ్యూ అంటే భయం. తన పల్లెటూరి నేపధ్యం, కులం వల్ల వచ్చిన సామాజిక న్యూనత, నాలుగేళ్లయినా రాని ఉద్యోగం గురించిన తండ్రి తాతల ఆరా, ఆందోళన, ఊరివాళ్ల ప్రశ్నలు కలిగించే ఒత్తిడి- ఏవైనా అతనిలో ఆత్మన్యూనతకు కారణం కావచ్చు. ఈ స్థితి నుండి అతను ఒక్కసారిగా కొండపొలంలో మరింత పెద్ద భయంలోకి కొండచిలువలు, పులుల భయంలోకి విసిరి వేయబడ్డాడు.

మూర్తిమత్వం అనేది కోచింగ్ సెంటర్లలో నిపుణుల ప్రసంగాలు విని అభివృద్ధి చేసుకునేది అని ప్రచారంలోకి తెచ్చిన కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్కృతిని నిరాకరించి, శ్రమ సంబంధంలో, ప్రకృతి సంబంధంలో, మనుషుల సంబంధంలో, సమిష్టి జీవన సంస్కృతిలో అభివృద్ధి అయ్యే విలువ మూర్తిమత్వం అని స్థాపించటంలో రచయిత సాధించిన విజయం ఈ నవల.

‘నక్క నొతి జీవాలు గొర్రెలు. అవి భయపడాల. వాతి బయ్యం మనం తీర్చాల. నీ
బయమే సెట్టుకాడ, గుట్టకాడ బెదరగొడతాంటే వాటి మంచేమి సూస్చావూ.’ అని తండ్రి, ‘బయాన్ని కొండల్లోకి తెచ్చుకోరాదు, అది బో సెడ్డది. దానితో కలిసి బతికే బదులు ఆడపులితో సంసారం చేసేది మేలు. అది పక్కనుంటే అందర్నీ సెరుస్చాది…’ అని పుల్లయ్య తాత ఎప్పటికప్పుడు చేసే హెచ్చరికలు ఒకవైపు అతనిని ఆలోచింపజేస్తుంటాయి. మరొకవైపు భయం అనే అపసవ్య ప్రవర్తనకు సరైయిన చికిత్స భయపడే పరిస్థితి పదేపదే ఎదురయ్యేట్లు చేయటమేనని మనో వైజ్ఞానిక శాస్త్రం చెప్పిన పద్ధతిలోనే రవీంద్రకు తనను తాను, తనమీద ఆధారపడిన జీవాలను పులి నుండి కాపాడుకొనవలసిన అనివార్య సందర్భాలు మోతాదు పెంచుతూ మళ్లీ మళ్లీ ఎదురయ్యేట్లు ఘటనలు కల్పిస్తూ కథ నడపటం ద్వారా రచయిత అతనిని ‘భయం’ నుండి క్రమంగా విముక్తం చేయటం చూస్తాం. రవీంద్ర పాత్ర పరిణామం దీనితో పూర్తయింది. కొండపొలం అనుభవాలు అతని మూర్తిమత్వాన్నే పూర్తిగా మార్చివేశాయి. మూర్తిమత్వం అనేది కోచింగ్ సెంటర్లలో నిపుణుల ప్రసంగాలు విని అభివృద్ధి చేసుకునేది అని ప్రచారంలోకి తెచ్చిన కార్పొరేట్ విద్యా వ్యాపార సంస్కృతిని నిరాకరించి, శ్రమ సంబంధంలో, ప్రకృతి సంబంధంలో, మనుషుల సంబంధంలో, సమిష్టి జీవన సంస్కృతిలో అభివృద్ధి అయ్యే విలువ మూర్తిమత్వం అని స్థాపించటంలో రచయిత సాధించిన విజయం ఈ నవల.

అంతవరకూ బాగానే ఉంది కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావాలనుకున్నవాడు అడవితో ఏర్పడిన కొత్త అనుబంధంతో అడవిని కాపాడే అధికారిని కావాలన్న కొత్త ఆదర్శంతో డిఎఫ్ ఓ ఉద్యోగాన్ని సాధించాడు. అడవి నరికే వాళ్ల ఆగడాలను అరికట్టగలిగాడు అంటూ నవలను ముగించిన తీరు రచయిత ఆకాంక్ష నుండి పుట్టిన అందమైన వూహ మాత్రమే అని ఎవరైనా గ్రహించగలరు. రాజకీయార్థిక వాస్తవాలు వేరు. అడవిలో పైకి కనిపించే వృక్ష సంపద మీదే కాదు, అడవి గర్భంలో కనపడకుండా ఉన్న బాక్సయిట్, యురేనియం వంటి ఖనిజ సంపదను తోడుకు పోవటానికి వీలుగా బహుళజాతి కంపెనీలకు అడవులను అప్పగించటానికి అనుకూలమైన అటవీ చట్టాలతో రాజ్యం సిద్ధమవుతున్నవర్తమాన సందర్భంలో పర్యావరణ పరిరక్షణకు, నేర నిరోధానికి ప్రభుత్వాధికార పోలీసు వ్యవస్థలు స్వతంత్రంగా, రాజ్యంగ నైతికత స్ఫూర్తిగా పనిచేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్నది మనముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఈ దిశగా ఆలోచన మొదలైందంటే సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఈ నవల ఆగిన చోటు నుండి మరొక కొత్త నవల రాయకుండా ఉండలేడని నా నమ్మకం.

కొండపొలం నవలకు శ్రీ చౌదరి జంపాల గారు రాసిన తొలి పలుకులు గతవారం తెలుపు ప్రచురించింది. దాన్ని ఈ లింక్ క్లిక్క్ చేసి చేసి చదవవచ్చు.

KONDAPOLAM from novel to celluloid – An Epic Tale Of Becoming by Krish Jagarlamudi | Panja Vaisshnav TGej | Rakul Preet Singh | watch trailer by clicking the link 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article