Editorial

Monday, December 23, 2024
అభిప్రాయంకాంతారా : చేతులెత్తి మొక్కాను - పవన్ సంతోష్ తెలుపు

కాంతారా : చేతులెత్తి మొక్కాను – పవన్ సంతోష్ తెలుపు

కొల్లూరు అడవులకు ఆనుకుని, కుందాపుర నుంచి విసిరేసినట్టు కరావళికి-మలెనాడుకు మధ్య ఉండే గ్రామం- కేరడి. ఇక్కడి వాడైన రిషభ్‌ శెట్టి ఈ ప్రాంతపు రక్తమాంసాలతో సినిమా తీశాడు.

ఒక్క మాటలో  చెప్పాలంటే ‘కాంతారా’ సామాన్యమైన సినిమా కాదు. ఇది కర్ణాటకలోని కరావళి ప్రాంతపు ప్రాచీన కళారూపాలకు, సంస్కృతికి, జీవన విధానానికి వెండితెరపై జరిగిన అభిషేకం.

పవన్ సంతోష్

కాంతారా అన్నది సినిమా పూర్తిపేరు కాదు. ‘దంతె కథ’ అన్న సబ్ టైటిల్ కలిపి చదువుకోవాలి. కాంతారా దంతె కథ అంటే అడవి పురాణం (The legend of the forest). మన ప్రజలు తమకు చరిత్రలో ముఖ్యమైన అంశాలను పురాణీకరించి గుర్తుపెట్టుకుంటారు. స్థల పురాణాలు, కుల పురాణాలు ఇలా లెక్కకు మిక్కిలి మనకు.

మనకూ ప్రాచీన కళారూపాలున్నాయి. ప్రతీ కులానికి కులగాయకులని ఉన్నారు, వీళ్ళను ఇప్పుడు ఉపకులాలు అంటున్నాం. వాళ్ళు కులపురాణాన్ని గానం చేసేవారు. ఉదాహరణకు మందెచ్చులవారు యాదవ కులానికి కులగాయకులు. వీరు యాదవులకు వినిపించే కథల్లో కాటమరాజు కథ, కాంభోజరాజు కథ ప్రముఖమైనవి.

కాకతీయ కాలంలో నెల్లూరు ప్రాంతంలో కనిగిరిని పాలించిన యాదవరాజైన కాటమరాజు, ఏలిక కోసం ప్రాణం పోగొట్టుకున్న ఖడ్గతిక్కన వంటివారి గాథలను జానపద కళాకారులు వినిపిస్తూ ఉంటే మన తాతముత్తాతలు, అవ్వముత్తవ్వల ఒళ్ళు పులకించేవి. ఈ యుద్ధ కథలను గానం చేసేవారి గొంతు రౌద్రంతో దద్దరిల్లుతూ, వీరావేశాన్ని పుట్టిస్తూ ఉండేది. ఈ కథ ఒక్క ఉదాహరణ మాత్రమే. సమాజంలో ఉన్న కులాలన్నిటికీ కుల పురాణాలూ ఉన్నాయి. వాటిని గానం చేసే కుల గాయకులూ ఉండేవారు. ఇప్పుడు కనుమరుగైపోతున్నాయి, పోతున్నాయి ఏమిటి పోయాయి. వీటిలో చరిత్ర, మార్మికత, సంకేతాత్మకత – ఇవన్నీ ఉంటాయి.

పల్నాటి యుద్ధాన్నీ మనవాళ్ళు గుర్తుపెట్టుకున్నది ఇలానే. పల్నాడులో కారెంపూడిలో ఆనాడు యుద్ధంలో చనిపోయిన వీరులకు వీర్ల గుడి ఉంది. ఈనాటికీ ఏటా అక్కడ వీరుల ఉత్సవాలు జరుగుతాయి. ఇందులో వీరవిద్యావంతులనే సంప్రదాయ దళిత కథాకారులు పల్నాటి వీరుల కథను చెప్తారు.

చెప్పవచ్చేదేమిటంటే – చరిత్రను పురాణాలుగా గుర్తుపెట్టుకోవడం, జాతరలుగా జరుపుకోవడం మనకూ ఉంది. తెలుగువారి జానపద కళారూపాలు పుస్తకం చదివితే ఇలాంటివి ఎన్నో కనిపిస్తాయి. కానీ, ఈ కళలన్నీ గత నూటయాభై ఏళ్ళలో నాటకాలూ, సినిమాలూ, టీవీల వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు కొన్ని దొరకమన్నా దొరకవు.

తిరిగి కాంతారా విషయానికి వద్దాం.

ఇందులో చూపించిన కళారూపం “భూత కోల”. ఇది కూడా మన ప్రాచీన కళారూపాల వంటిదే.

కర్ణాటకలోనూ, ఉత్తర కేరళలోనూ సముద్రతీరంలో విస్తరించిన కరావళి ప్రాంతం, దానికి పక్కనే అటవీ ప్రాంతాలైన మలెనాడు ప్రాంతాలకు చెందిన కళారూపం ఇది. కేరళకు చెందిన ప్రాచీన నృత్యరూపం తెయ్యుమ్‌కీ, భూతకోలకు దగ్గరి సంబంధాలున్నాయనీ, ఈనాటికీ కర్ణాటకలో ప్రాచుర్యం ఉన్న జానపద కళారూపం – యక్షగానంపై భూతకోల చూపిన ప్రభావం చాలానే ఉందనీ చెప్తారు. ఆంత్రోపాలజిస్టుల ప్రకారం ఈ కళారూపం కొన్ని వేల ఏళ్ళ నుంచి వస్తున్నది.

కాంతారా సినిమా కథ ఈ భూతకోల సంప్రదాయంతోనూ, అడవులను నమ్ముకుని జీవిస్తున్న ప్రజల జీవన విధానంలోనూ వేళ్ళుదన్ని ఎదిగింది.

మనకూ గ్రామదేవతలు ఉన్న తీరుగానే వారికీ దేవతలున్నారు. జుమాది, బ్రహ్మేరు, కొడమనితయా, లెక్కెసిరి, పంజుర్లి, కుప్పె పంజుర్లి, రక్త పంజుర్లి, ఉరండరయ్య, హోసదేవత – ఇలా ఎందరెందరో ఉన్నారు. ఈ దేవతలకు పురాణాలున్నాయి. ఉత్సవాలు జరిగేప్పుడు భూతకోల కట్టి ఆ కథలు చెప్తారు. వీరిని దైవాలనీ, భూతాలని కూడా పిలుస్తారు. గ్రామదేవతలన్న పోలిక వట్టి పోలికే. నిజానికి, కుటుంబ భూతాలు, గ్రామ భూతాలు (ఊరద భూత), ప్రాంత భూతాలు, రాజవంశపు భూతాలు – ఇలా రకరకాలుగా ఉన్నాయి. అన్ని దైవాలకు (లేక భూతాలకు) విపులంగా గాథలున్నాయి. సంప్రదాయాలున్నాయి. ఈ దేవతల ముందు భూతకోల కడతారు, ఆడతారు.

కాంతారా సినిమా కథ ఈ భూతకోల సంప్రదాయంతోనూ, అడవులను నమ్ముకుని జీవిస్తున్న ప్రజల జీవన విధానంలోనూ వేళ్ళుదన్ని ఎదిగింది. కొల్లూరు అడవులకు ఆనుకుని, కుందాపుర నుంచి విసిరేసినట్టు కరావళికి-మలెనాడుకు మధ్య ఉండే గ్రామం- కేరడి. ఇక్కడి వాడైన రిషభ్‌ శెట్టి ఈ ప్రాంతపు రక్తమాంసాలతో సినిమా తీశాడు.

జానపదులు తమ గాథలు చెప్పుకోవడంలో ఉపయోగించే ఈ మార్మిక సంకేతాలను ఈ సినిమాలో అద్భుతంగా వాడారు.

సినిమా అంతా అడవిపంది/వరాహం రిఫరెన్సు వస్తూనే ఉంటుంది. భూమిని కాపాడడానికి అడవి బిడ్డల పోరాటానికి, భూమిని రాక్షసుని బారి నుంచి కాపాడిన ఆదివరాహాన్ని సంకేతంగా తీసుకున్నాడని సినిమా చూసినప్పుడు తోస్తుంది. అది ఒక స్తరంలో వాస్తవమే. కానీ, కానీ, పంజుర్లి అన్న దైవం/భూత వరాహ ముఖంతో, మానవ శరీరంతో ఉండే దైవమనీ, ఆ దైవాన్ని ఆరాధించే భూతకోలలో వరాహ ముఖం ఉపయోగించడం సర్వసాధారాణమనీ తెలిశాకనే రిషభ్ శెట్టి సృష్టి అసామాన్యమని అర్థమవుతుంది.

సినిమాలో పంజుర్లి క్షేత్రపాలకుడైన గుళిగ పూనిన మనిషి మాయమైపోవడం, అడవి పంది అలంకారాలతో కనిపించడం, ఒక ప్రదేశం చుట్టూ గుండ్రంగా అగ్గిపుట్టడం వంటి అనేక అంశాలను ఉపయోగించారు. దీన్ని తేలికగా మ్యాజికల్ రియలిజం అనేసి చేతులు దులుపుకోవచ్చు. పాశ్చాత్య సాహిత్య విమర్శకులకు లాటిన్ అమెరికన్ సాహిత్యం అర్థం చేసుకోవడానికి పనికివచ్చిన ఈ పదం బాగా అరిగిపోయింది. అందుకని, నేను దీన్ని “జానపద మార్మికత” అనదలుచుకున్నాను. జానపదులు తమ గాథలు చెప్పుకోవడంలో ఉపయోగించే ఈ మార్మిక సంకేతాలను ఈ సినిమాలో అద్భుతంగా వాడారు.

పంజుర్లి దేవతకూ, ఆమె చుట్టూ కొలువైన సంస్కృతికీ, తమ ప్రాచీన కళలను వైభవోపేతంగా చూపించుకుంటున్న కర్ణాటక సోదరుల సంస్కారానికి చేతులెత్తి మొక్కాను.

సినిమా క్లైమాక్స్ చూసేప్పుడైతే – కళ్ళ నిండా నీళ్ళు, గుండె ఉద్వేగంతో కొట్టుకుపోయింది. తన ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తూ తమ జానపద కళను తెర నిండా పరిచి గర్వంగా చూపించడం చూసి ఒక ప్రేక్షకుడిగా మనసు ఉప్పొంగిపోయింది. పంజుర్లి దేవతకూ, ఆమె చుట్టూ కొలువైన సంస్కృతికీ, తమ ప్రాచీన కళలను వైభవోపేతంగా చూపించుకుంటున్న కర్ణాటక సోదరుల సంస్కారానికి చేతులెత్తి మొక్కాను.

అదే సమయంలో – ఎక్కడో మనసులో ఒక మూల – తెలుగు సినిమాల్లో మనవైన ప్రాచీన జానపద కళలకు, సంస్కృతికి ఇలాంటి నీరాజనం త్వరలో పడితే చూడాలని కోర్కె మిణుకుమనలేదని చెప్తే అబద్ధం ఆడినవాడినవుతాను.

తెలుగు సినిమాలు, చరిత్ర, సాహిత్యం అంటే ఆసక్తి మెండుగా గల పవన్ సంతోష్ Quoraలో లీగల్ సపోర్ట్ స్పెషలిస్టుగా పనిచేస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రను ‘నేడే చూడండి’ పేరిట త్వరలో పుస్తకంగా తెచ్చే పనిలో ఉన్నారు. వారి ఇ- మెయిల్ pavansanthosh.s@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article