Editorial

Monday, December 23, 2024
ఆనందంగోరటి వెంకన్నకు అభినందనలు

గోరటి వెంకన్నకు అభినందనలు

గోరటి వెంకన్నకు నేడు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించారు. ఈ సందర్భంగా అన్న తాత్వికత తెలుపు అభినందన వ్యాసం ఇది. అది ‘సోయగం’, ‘సౌరు’, ‘స్మృతి’ పదిలం. అంతేగాదు, ‘పరిమితి’, సహజత్వం, ఆనందంతో విలసిల్లు. అది పల్లె కన్నీరు పెట్టు. అట్లే, రేలా దూలా తాలెల్లాడే నేలా. చదవండి. ఒక జానపద పోరాణిక కవి గాయకుడి తత్వం.

కందుకూరి రమేష్ బాబు 

తనది విశ్వ భాష. అది స్థానికత నుంచి వెల్లువైన గానం. నేల నుంచి నింగికెగిసిన నృత్యం. అందులో ప్రాంతం కులంతో సహా సమస్త విశ్వం ఉన్నది. చిత్రమేమిటంటే అది ‘పరిమితి’, సహజత్వం, ఆనందంతో కూడినది. ఈ మూడు తనను కట్టి పడేసినయి’ అని చెప్పే వెంకన్న తెలంగాణ మూర్తిమత్వం కూడా ఇదేనని చెప్పకనే చెప్పిండు.

ఈ మూడూ – అది ప్రపంచీకరణ అనండి, తెలంగాణకు పీడగా మారిన వలసాధిపత్యం అనండి, వీటివల్ల తెలంగాణలో ‘పరిమిత’ జీవనం దెబ్బతిన్నది. సహజత్వం పోయింది. సగటు మనిషి ఆనందంగా జీవించే పరిస్థితి అసలే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే రెండు సంపద్వంతమైన, వృత్తులతో అలరారిన గ్రామాల మధ్య జీవించిన వెంకన్న, దళితుడే అయినప్పటికీ తన తండ్రికి ఊర్లో మంచి గౌరవం ఉండగా చూసి వెంకన్న, ఎంతమాత్రం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేని వెంకన్న, ఎంఎ చదువుకుని, ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్న వెంకన్న, ఒక భైరాగి తాత్వికతను వల్లె వేస్తూ ఒక దిగంబర కవి వలే సమస్తమూ వికృతంగా మారిన పల్లెను, తల్లి తెలంగాణ దుఃఖాన్ని వలవలా కార్చే కవిగాయకుడైండు. ఇప్పుడు ఎం ఎల్ సి కావొచ్చు, కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత కావొచ్చు. కానీ అయన స్పిరిట్ ‘పరిమితి’, సహజత్వం, ఆనందం.

దైన్యంతో పాటో ‘సోయగం’, ‘సౌరు’, ‘స్మృతి’…

ఒకనాడు అలుపెరగని సుదీర్ఘ రోదనకు మల్లే దీర్ఘ కవిత్వాన్ని రచించి ఆలపించే మహా గాయకుడైండు వెంకన్న. ఇదంతా ఒక బాధ, రంది. ఈ విషయాల గురించి చాలా కాలం కింద తనతో సంభాషిస్తుంటే, అదంతా తన ప్రాకృతిక నైజం అన్నడు. ‘‘సారవంతమైన భూములుండీ, ప్రవహిస్తున్న నదులుండీ, మనుషులు ఎందరో వలసలు పోతున్న దైన్యం నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన’’ అని చెప్పిండు.
‘విముక్తి, రాజ్యాధికారం, సాంస్కృతిక వైభవం, ఉద్యోగాలు- వీటికోసం నేను రాలేదు. నా ప్రాంతం కోసం, నా మనుషులంతా యాడికి పోయిండ్రో అన్న బాధ నుంచి వచ్చిన. నా పాట నిండా అదే దైన్యం ఉంటుంది’’ అన్నడు. అయితే, చిత్రమైందేమిటంటే, ‘ఇంత దైన్యం ఉన్నా కూడా ‘సోయగం’, ‘సౌరు’, ‘స్మృతి’ అయన ప్రత్యేకత,. ఆ వైభవోపేతమైన ఘనత తన ప్రాంతానిదే’ అని బలంగా చెప్పిండు. అది దెబ్బతిన్నందువల్లే ‘దైన్యం’ అని వివరించిండు.

అయితే, ‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరుణంలో చిన్నచిన్నగా పనిచేసుకుందాం. ‘పరిమితం’గా గ్రామీణ స్థాయి నుంచి పనిచేసుకుందాం’ అంటున్నడు వెంకన్న. సహజత్వాన్ని రంగరించే మనవైన పంటలు వేసుకుని పత్తికి ధర పలికినట్లు మనని అభివృద్ధి చేసుకుందాం అన్నడు.

‘రాములోరి సీతమ్మో… సీతమ్మోరి రామయ్య’

‘‘అపారమైన మన వనరులను వినియోగించుకుని పదేళ్లలో జపాన్ దేశం మాదిరి పునరుజ్జీవన ఫలితాలను అందుకుందాం’’ అన్నడు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొంతకాలానికి వెలుబుచ్చిన అభిప్రాయం. రాసిన పాటలో వెంకన్న పలికిండు. బతుకమ్మ మ్యాగజైన కోసం కొత్తగా చేర్చిన చరణాలతో సహా ఆ పాటను ప్రచురణకు ఇచ్చిండు. ‘రాములోరి సీతమ్మో… సీతమ్మోరి రామయ్య’ అన్నదే ఆ పాటే. ఇది ఒక రకంగా ఈ తెలంగాణ కవి తెలంగాణ పునరుజ్జీవనంలో అంబరాన్ని అంటే ఆనందాన్ని తొట్ట తొలిసారిగా, పరిపరి విధాలా తన కలల తెలంగాణను ఆవిష్కరించిన పాటగా చెప్పుకోవాలి. ఇదే కవి, ‘ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా? ఇండియా పాకిస్తానోలె ఇనుప కంచె పడుతుందా?’ అంటూ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో నిఖార్సయిన రాజకీయ కవిత అల్లిండు. ఈ కవి ఆ పాట తర్వాత ఈ రచనతో వేరు పడిన తెలంగాణ ఎట్లుండాలో యావత్ సమాజం ముందు పెట్టిండు. అట్లా రాజకీయ కవిత్వాన్ని మరొక అడుగు ముందుంచిన పాటగా కూడా . ‘రాములోరి సీతమ్మో… సీతమ్మోరి రామయ్య’ అన్న పాటను చూడాలి.

అసహనం ఆగ్రహంగా మారిన వైనం

చిత్రమైంది ఏమిటంటే, ‘కాలానికీ ఒక స్మృతి ఉంటుంది’ అన్నట్లు, నిజంగానే ఒకనాడు తీవ్రంగా ‘ఇద్దరం విడిపోతే ఏమవుతుంది’ అని గట్టిగా ప్రశ్నించిన సందర్భం ఉండింది. అది నిదానంగా మరుగున పడింది. కానీ, మలిదశ ఉద్యమం మళ్లీ ఆ ప్రశ్నను ముందుకు తెచ్చింది. ఎంతో కన్విన్సింగ్‌గా చెప్పింది కూడా.‘ఇద్దరం విడిపోతే భూమి బద్ధలవుతుందా? ఇండియా పాకిస్తానోలె ఇనుప కంచె పడుతుందా? రావచ్చు… పోవచ్చు… రొయ్యలమ్ము కోవచ్చు..’ అంటూ సాగే వెంకన్న పాటలో సూటిదనం ఉంటుంది. నిర్మొహమాట వైఖరి ఉంటుంది. ‘పొమ్మంటె పోవేంరా ఓ వలసవాది’ అన్న అసహనం ఆగ్రహంగా మారుతున్న వైనమూ ఉంటుంది. అదే సమయంలో అక్కడి కవులను గౌరవిస్తూనే శ్రీశ్రీలకు వినవూమంగా మొక్కచ్చు’ అంటూ, ‘మా దాశరథీ, కాళోజీని దాసిపెడితె కుట్రగాదా?’ అని ప్రశ్నిస్తడు. అయితే, అది కాదు విశేషం. ఈ పాట రాసిన వెంకన్న నిజంగా కాళోజీని అప్పటికే పూర్తిగా చదువుకోలేదు. సరిగ్గా కాళన్న కూడా ఇదే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిండు.

‘తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా?’ అని ఆయన 30 లైన్ల కవితను ఇదివరకే ప్రకటించిండు. సరిగ్గా ఆ కవితలోని ఎత్తుగడే ఈ కవి తిరిగి ఎత్తుకోవడం ఒక కాల స్పృహగా, ఒక యాధృచ్చిక వాస్తవిక పునరుత్ధానంగా చూడాలి. ‘నేను ప్రామిస్ చేసి చెబుతున్న. నేను కాళోజీని మొత్తం చదవలేదన్నా అని వెంకన్న వినమ్రంగా చెబుతూ, ‘తర్వాత తెలిసింది. కాళన్న ఇటువంటి చరణాలే రాసిండని, వరంగల్లులో చదివిన’ అని చెప్పిండు. ‘తెలిసి ఉంటే రాసేటోన్ని కాదు’ అని కూడా అన్నడు ఏమైనా, వెంకన్న. తెలియకుండా ఉండటమే మేలైంది. ఎందుకంటే, మలి తెలంగాణ ఉద్యమం ద్వితీయాంకంలో వెంకన్న పాట కూడా కాళన్నకు ఏమీ తక్కువ చేయలేదు. ఊర్రూత లూగించింది. ఆంధ్రోళ్లను గజగజా వణికించింది. ‘నిజంగానే, కాళోజీ ఇతడ్ని ఆవహించి రాసిండా’ అనిపించే అపూర్వ గీతం ఇది.

ఏకునాదం పలికిన తీరు

అయితే, వెంకన్న కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోవాలంటే తన మలి తెలంగాణ ఉద్యమం ముందు రాసిన పాటల్ని ముఖ్యంగా చెప్పుకోవాలి. తర్వాత రాసిన పాటల్నీ చెప్పుకోవాలి. అయితే తాను మెదటినుంచీ పల్లె కవి. ప్రకృతి కవి. తెలంగాణ ఆకాంక్షతో రాసిన వాడు కాదు. ముందే చెప్పినట్లు సహజత్వం దెబ్బతింటున్న క్రమంలో ఒక గాయపడ్డ పాలమూరు బిడ్డ మాదిరే తానూ శోకతప్త హృదయంతో పాటలు రాసిండు. పాడిండు. అయితే, ‘తనకు పొరుగున ఉన్న రాయలసీమ తాత్విక పునాదులు, తనని బైరాగులతో మమేకం చేయించాయనీ’ అంటాడు. తండ్రి నర్సింహులు ఏకునాదం పలికిన తీరును, దున్న ఇద్దాసుల తాత్వికతను రంగరించుకుంటూ ఒక జీవ కవి వలే పాటలు రాసిండు. ఎప్పుడైతే మలి తెలంగాణ ఉద్యమం సోయి తగిలిందో ప్రత్యేక ఆకాంక్షతో రాయడం మొదపూట్టిండు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదిగా కూడా రాసి ఆలపించిండు. ఇదంతా ఒక పరిణామ క్రమం.

అయితే ఇలా రాయడానికీ తనదైన రహస్యం ఉంది. తనకు నిర్మాణాలు ఇష్టం వుండవు. ఇన్‌స్టిట్యూషన్ అయిన ప్రతిదీ హింసకు, అణచివేతకు గురిచేస్తుందని తన అభివూపాయం. అందుకే ఇవ్వాళ కూడా ‘పరిమితి’ ఉండాలని, సహజత్వం కావాలని తాను భావించడం ఎందుకంటే ఏదీ వ్యవస్థీకరించబడ కూడదని!

నిర్దిష్టంగా ప్రకృతినీ, విశ్వాన్నీ కొనియాడిన కవి

ఇట్లా వెంకన్న నైసర్గికతను, ప్రాదేశిక న్యాయాన్నీ, ఆధునిక అభివృద్ధి పేరిట ఆక్రమించిన సీమాంధ్ర వలసాధిపత్యం, ప్రపంచీకరణ విష వలయం ఎండగడుతూ ఆయన నిర్దిష్టంగా ప్రకృతినీ, విశ్వాన్నీ చాలా అపూర్వంగా కొనియాడతాడు. ఒక రకంగా ఆయన ‘సోల్ ఆఫ్ ది యూనివర్స్’. విశ్వాత్మ పలికే కవిగాయకుడు. ఇంత స్థితిని అందుకునే అవకాశం పాలమూరు వల్ల అటు తర్వాత పొరుగున ఉన్న కర్నూలు నైసర్గికత వల్లా తనకు లభించింది. అలాగే తెలంగాణ ఉద్యమం వల్లా అది మరింత బలపడింది. ఇదంతా ఒక రకమైన అదృష్టం. బహుశా ఇదే సహజం, పరిమితం, ఆనందం. మనవైన లాక్షానికతల కోసమే ఇవన్నీ…

ఇక్కడ ఒక విషయం మనవి చేయాలి. తాను 90వ దశకం ప్రారంభంలోనే ‘అందుకోర గుత్పందుకో దొంగల తరిమేటందుకు’ అని మండల్ కమిషన్ ఉద్యమ నేపథ్యంలో రాస్తే ఒక్క వీరన్న తన పాటందుకున్నడు. కానీ, దళిత బహుజన సోయి అటు పిమ్మట తెలంగాణ అస్తిత్వానికి అందినప్పుడు మళ్లీ వెంకన్న అంతటి రాజకీయ కవితను అందించిండు. అదే ‘పొమ్మంటె పోవేంరా ఓ వలసవాది (ఇద్దరు విడిపోతే) ఇట్లా మన సమాజం రాజకీయ హక్కుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు శక్తివంతమైన పాటల్ని అందించిన కవి మన వెంకన్న.

‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’

తాను ప్రపంచీకరణ నేపథ్యంలో రాసినట్లు కనిపించే పాట ‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.’ ఈ పాట రాయడానికి నేపథ్యం పల్లె దెబ్బతినడమే అయినా అది సీమాంవూధుల గ్రామాలు దర్శిస్తున్నప్పుడు ‘వాళ్ల మడులు నీటితో తలతలా మెరియడమే’ అని చెప్పిండు. అక్కడ నీళ్లు ఉండటం, మనకు లేకపోవడం నుంచి మొదలైన తలపోతే, నాడు పల్లె కన్నీరు పెట్టిందని పాడినా, అందులో ‘తల్లి’ అనివార్యంగా తెలంగాణ అయింది. ఆ తల్లే వెంకన్నను తత్వాలు పాడే ‘విశ్వకవి’ నుంచి తెలంగాణ కవిగా నిర్దిష్టతలోకి- వెంకన్న అనే ‘పరిమితి’లోకి తీసుకెళ్లింది. మన గాయాల్ని ప్రపంచానికి వినిపించే సాధనం అయింది. మన ఆనందాన్ని కొత్త పాటలో రాసినట్లు ‘పరుగుల రాణి కృష్ణవేణి మన దారి మల్లాలి. కరువన్నదింక నిఘంటువులోనే దాగాలి’ అనిపించేలా చేసింది.

ఐతే, వెంకన్న పరిణామ క్రమాన్ని లోతుగా తడిమి చూడాలి. తొట్ట తొలుత దైన్యం (పాలమూరు బిడ్డగ-పల్లె కన్నీరు పెడుతుందో), తర్వాత వైభవం (తెలంగాణ సోయి వల్ల-తల్లి తెలంగాణమా), అటు తర్వాత ప్రత్యేక తెలంగాణ వాదిగా (ఇద్దరు విడిపోతే- పదల గువ్వ పరుగు అన్న రెండు పాటలు). రాజకీయ కవిత్వం వెంకన్న పాటల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా పన్నెండు పదిహేను పాటలైతే మొత్తంగా తెలంగాణ నడిచి వచ్చిన దశనీ, పరిణామ క్రమాన్నీ అప్పజెప్పుతయి. ఒక రకంగా ఒక మనిషిగా, కార్యకర్తగా, సాంస్కృతిక ఆర్థిక రాజకీయ అస్తిత్వాన్ని సాధించుకుంటున్న సాహసిగా అతడి పాటలు రాటుదేలిన వైనం అంతా తన కవిత్వంలో కనిపిస్తయి. ఇంతకు ముందు ప్రస్తావించిన ‘రాములోరి సీతమ్మ’తో ఈ కవి మరో అడుగు వేసి, పునరుజ్జీవనంలోకి అడుగుపెట్టిన స్థితినీ ఆవిష్కరిస్తది. ఇట్లా తెలంగాణ దశదిశలు ఒకే ఒక్క కవిలో చూడాలనుకున్నా కూడా అవన్నీ ఈ ‘కవిగానం’లో మనం దర్శించగలగడం ఒక విశేషంగానూ చెప్పుకోవచ్చు.

రేలా దూలా తాలెల్లాడే తెలంగాణ నేల

మొదట పాలమూరు. దాని చుట్టున్న ప్రాకృతిక సౌరభం, పక్క పొంటే ఉన్న కర్నూలు నైసర్గికత, అక్కడి ఆలంబన, జీవన వ్యవహారాలు-ఇవన్నీ అతడిని అపురూపమైన కవిగా మలిచాయి. ఒక మమకారం, ఆపేక్షతో అతడ్ని మైమరచేలా చేసి ప్రకృతిలో పారవశ్యం చేసేలా చేశాయి. అయితే తన తత్వం – విప్లవోద్యమం, దళిత్ పాంథర్స్ ఉద్యమాల నుంచి కాకుండా మన దేశంలో బ్రాహ్మణీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఇక్కడున్న అవధూత సంప్రదాయం, అచల సంప్రదాయం, సిద్ధ, బైరాగి, సాధు, సంతు సంప్రదాయాల నుంచి వచ్చిందనే చెప్పాలి. దానినుంచే తాను కైగట్టడం మొదలైందని కూడా నొక్కి చెప్పుకోవాలి. వాటిలో సోషలిజంకు సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉండటం సహజమే. అందుకనే, ఆ తత్వంతోనే, రేలా (గిరిజన), దూలా (ముస్లిం), తాలెల్లా (చిందు) అన్న మూడు పదాల్లో -దళిత మైనారిటీ గిరిజన పోరాటాలకు సంబంధించిన భూమికతో 95లోనే ‘రేలాదూలా తాలెల్లాడే తెలంగాణ నేల’ అన్న పాట రాయగలిగిండు.

ఒక జానపద పోరాణికం

తెలంగాణ రంగస్థలం మీద ఒక అరివీర భయంకరమైన ఒక పౌరాణిక పాత్ర వంటిది పోషించిన ఎంకన్న తాను స్వయంగా ఇందులో కీలక పాత్రే వహించినప్పటికీ తానే తిరిగి ఆశ్చర్యచకితుడై కొన్ని మాటలు చెబుతడు.‘ఒక ప్రాంత అస్తిత్వ ఉద్యమంలో ఎన్ని విలువలూ!’’ అని విస్మయానికి లోనవుతడు,
నిజానికి ‘ప్రకృతిని, అంతర్ముఖత్వాన్ని, సహజత్వాన్ని, అంతిమంగా లోకమంతా, ఆనందంగా ఉండే సమసమాజాన్ని స్వప్నం గాంచిన ఈ కవి తన స్వప్నమూ ఉద్యమమూ వేరుగా లేకపోవడం వల్లే ‘తెలంగాణ ఉద్యమంలో తన వాణిని, బాణిని విపించగలిగాను’ అని వివరించిండు. ‘ఏ వైరుధ్యం లేదు’ అంటూ, ‘నా స్వప్నానికీ ఉద్యమానికీ గింత కూడా వైరుధ్యం లేదు. అంగీకరించే అంశాలే ఎక్కువ’ అన్నడు. ‘ఇంకా చెప్పాలంటే, నాకు నిర్మాణాలంటే మహా కోపం. ఏ నిర్మాణాలు లేకుండా ప్రజలు అక్కడక్కడ సంఘటితమై కదలడం నాకు నచ్చింది. అందుకే నేను గూడ ఉద్యమంలో భాగమైన. ఆడినా అని చెప్పిండు.

అభినందన తెలుపు

ఇట్లా తన నిర్మాణం, వినిర్మాణం, సౌదర్యం, సోరు ఇవన్నీ ఇప్పుడు లోతుగా మరొకసారి విశ్లేషించుకోవాలి. కేంద్ర సాహిత్య పురస్కారం వచ్చిన సందర్భంగా ఈ అద్భుతమైన కవి గాయకుడూ, ప్రదర్శన విస్తారంగా జరగాలని ఆశిస్తూ అన్నకు అభినందనలు తెలుపు…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article