వరంగల్లులో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66) నేడు మనల్ని శాశ్వతంగా వీడి వెళ్ళిన సందర్భంగా వారి జీవిత కాల కృషిని ఒకసారి మననం చేసుకోవాలి.
కందుకూరి రమేష్ బాబు
ఫోటోగ్రఫీ అన్నది కొద్ది మంది వల్లే సిగ్నేచర్ స్టైల్ గా పేరొందింది. తెలుగునాట, సమకాలీన చరిత్రలో అలాంటి వారెవరో చెప్పుకోవాలంటే తెలంగాణ సాంస్కృతిక రాయబారిగా పేర్కొనదగ్గ వారు భరత్ భూషణ్. ఆయన ఒక రాష్ట్ర పండుగ అంతటి వ్యక్తి. వారు గురించి తలచుకోవడం అంటే అది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గ అంశం.
తెలంగాణలో భరత్ భూషణ్ మూడు దశాబ్దాల కృషిని ‘ఇల్లు వాకిలి’ అని గనుక చెప్పుకోవలసి వస్తే అది పెద్ద దర్వాజ నుంచి ఇంటి ముందు అడి పాడిన బతుకమ్మ వరకు, దాన్ని చెరువులో నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి చేరుకునే దాకా మాట్లాడుకోవచ్చు.
నిజానికి అయన చెరువును కూడా చిత్రించారు. తెలంగాణలోని మానవ వనరులే కాక జీవన వనరుల కూడా అదృశ్యం అవుతున్న ఒక విషాద భరిత సన్నివేశాన్ని ఎంతో బాధ్యతతో చిత్రిక పట్టారు. పెను విషాదంలోనూ కొడగట్టని ఆత్మను అయన ఆవిష్కరించారు.
కరువు కాటకాలు, వలసలు, సమస్త విధాలా జీవన విధ్వంసం, వీటి తాలూకు పర్యవసానాలను అయన చిత్రాలు చెప్పకనే చెబుతాయి. అదే సమయంలో బతుకు పట్ల అచంచల విశ్వాసాన్ని కలిగించే జీవన సంబురాన్ని, అందలి ఈస్తటిక్స్ తో సహా అవి ఆవిష్కరిస్తాయి.
వారు ఇప్పటివరకూ ఏడు వ్యక్తిగత ప్రదర్శనలు చేసినప్పటికీ వారు చేయవసిన ప్రదర్శనలు ఇంకా చాలా ఉన్నాయి. వారి చిత్రాల్లో గడియ పడ్డ దర్వాజాలు కాన వస్తాయి. కాగితం బతుకమ్మలూ అగుపిస్తాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే గతం వర్తమానంలోకి సరికొత్తగా నడిచి రావడం, నేడు తిరిగి ఇల్లూ వాకిలీ చేనూ చెలకా పచ్చగా మారుతున్న సమయంలో అయన కృషిని భేరీజు వేసుకుంటే, వారు ఒక ఫోటో జర్నలిస్టు గానే కాక ఫోటో హిస్టారియన్ వంటి పాత్ర పోషించడాన్ని మనం మరచిపోరాదు.
అయన ఇండ్లు తీశారు. కూలిన గోడలు, దర్వాజాలను తీశారు. గొల్లం పెట్టినవే కాదు, తాళం వేసిన ఇండ్లను తీశారు. దీపం లేని దిగూడులను తీశారు. వాకిట్లో ముగ్గులను తీశారు. వంటింట్లో వస్తు సామాగ్రినీ తీశారు. దైనందిన జీవితాన్నే కాదు, పండుగలను పబ్బాలనూ చిత్రీకరించారు. ముఖ్యంగా నిలువెత్తు తెలంగాణ జీవన వ్యాకరణాన్ని అయన గోడల మీది రాతలతో సహా సంక్షిప్తం చేశారు. చెరపలేని చరిత్రకు ఆనవాలు భరత్ భూషణ్ రచనలు.
అన్నిటికన్నా ప్రధానంగా వారు బొడ్డెమ్మను, బతుకమ్మను – ఆటా పాటాలతో తెలంగాణ నిర్దిష్ట చారిత్రక వాస్తవికతను సాంస్కృతిక వైభవాన్ని ఎంతో అపురూపంగా చిత్రించి పది కాలాలకు అందించడం ఎంతో విలువైన కృషి.
అన్నిటికన్నా ప్రధానంగా వారు బొడ్డెమ్మను, బతుకమ్మను – ఆటా పాటాలతో తెలంగాణ నిర్దిష్ట చారిత్రక వాస్తవికతను సాంస్కృతిక వైభవాన్ని ఎంతో అపురూపంగా చిత్రించి పది కాలాలకు అందించడం ఎంతో విలువైన కృషి.
ఒక్క మాటలో అయన ప్రపంచీకరణ తాకిడికి తల్లడిల్లిన తెలంగాణ బిడ్డనూ – తల్లిని, అందలి దశదిశలను ఎంత ఒడుపుగా చిత్రించారంటే అధ్యయనం చేస్తే – ముందర అన్నట్టు -ఛాయా చరిత్రకారులగా వారిది అద్వితీయ కృషి అని చెప్పొచ్చు.
వారి చిత్రాల్లో వెలుగు నీడలు రంగుల్లో వన్నె తేలుతాయి. సహజత్వం, ప్రత్యేకత రెండూ అందంగా కలగలసి ఉంటాయి. గతం వర్తమానం మేళవింపు అలవోకగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన జాజూ సున్నం తాలూకు వస్తుశిల్పాలు నిండుగా ద్యోతకం అవుతాయి. అంతేకాదు, అలంకరణ అన్నది భౌతికం కాదు, అది అంతరంగం అన్ని సోయి కలుగుతుంది. ఆ అలంకరణ తాలూకు సౌందర్యం చిన్న బొయి కనిపించినా లేదా రంగుల్లో వన్నె తేలినా అది తెలంగాణ అస్తిత్వాన్ని అప్పటి తీరు తేన్నులతో ఆవిష్కరించడం విశేషం. అదే ఈ ఛాయా చిత్రకారుడు చరిత్రకారుడిగా ఎదిగినట్టి జీవన సాఫల్యం.
భరత్ భూషణ్ ఇల్లూ వాకిలీ చేనూ చేలుకలతో పరిసర జీవితాన్నే కాదు, ఇంటి గలాయన వ్యక్తిత్వం చెప్పడం కూడా మరో ప్రత్యేకత. సాంస్కృతిక రంగంలోనే కాదు, సాంఘీకంగా రాజకీయంగా కూడా తెలుగు ప్రజల జీవితాల్లో విడదీయరాని ముద్ర వేసిన ఎంతోమంది మూర్తిమత్వాన్ని భరత్ భూషణ్ ఎంతో హుందాగా చిత్రించడమే అందుకు నిదర్శనం. కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారిని అయన ఎంతో బాధ్యతగా తీసి పెట్టారు. ముఖ్యంగా మనందరి మదిలో సజీవంగా ఉన్న కాళోజి ఛాయాచిత్రాలు తీసింది భరత్ భూషణ్ గారే. వారు తీసిన రూప చిత్రాల్లో సదరు వ్యక్తి ఆత్మ కూడా మనల్ని హత్తుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే భరత్ భూషణ్ గారు తీసిన బతుకమ్మ చిత్రాలు నేడు ఎట్లా పండుగ అయ్యాయో వారు తీసిన రూప చిత్రాలు రానున్న తరాలకు ఒక సంపద అనడంలో అతిశయోక్తి లేదు. వాటిని గనుక ఒక సంకలంగా తెస్తే, తెలుగు ప్రజలకు కుడి ఎడమలుగా నిలబడ్డ ఎందరో వైతాళికులను అవి చిరస్మరణీయం చేస్తాయి.
అదృష్టవశాత్తూ అస్మిత ఆధ్వర్యంలో వచ్చిన ‘మహిళావరణం’ భరత్ భూషణ్ ఛాయాచిత్ర విశిష్టతను చాటే మరో మేలిమి ప్రయత్నం. తెలుగు నాట, ఆకాశంలో సగభాగమైన మహిళల జీవిత విశేషాలను సంకలనం చేసిన ఆ గ్రంథానికి అసలైన కూర్పు భరత్ భూషణ్ రూపచిత్రాలే అనాలి. అందులో చాకలి ఐలమ్మ చిత్రం ఒక మణిపూస. మనకు తెలియని మన మహిళా మణులను కళ్ళ ముందు నిలిపిన ఆ ప్రయత్నంలో ఈ ఒక్క చిత్రం చాలు, భరత్ భూషణ్ ఛాయా చిత్రలేఖనం వలన మనకు లభించిన సంపద ఏ పాటిదో గుర్తు పెట్టుకోవడానికి.
అన్నట్టు, భరత్ భూషణ్ సినిమాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు. హరిజన్, కాంచన సీత, రంగులకళ వంటి వెండితెర చిత్రాలకు వారి నిచ్చలన చిత్రాలు చేసిన దోహదం మరో నిశబ్ద కృషి.
భరత్ భూషణ్ ఫోటో జర్నలిస్టుగా మరో విశిష్టత చెప్పుకోవాలంటే వారు రచించిన వ్యాసాల గురించి పేర్కొనాలి. తెలుగు జర్నలిజంలో జానపద కళలపై, కుల వృత్తులపై వారు సచిత్ర వ్యాసాలు అందించడంలో వారి రచనా సామర్థ్యం మరింత ప్రత్యేకమైనది. ఒక ఫోటోగ్రాఫర్ పరిశీలన ఎంత నిశితంగా ఉంటుందో తెలియడానికి మన కంటికి కానరాని ఎన్నో లోతైన అంశాలను ఆయ వ్యాసాల్లో వారు తడిమి రాయడం విశేషం. ఒక్క మాటలో ఫోటోగ్రాఫర్ గా వారి నిశితమైన కన్ను ఆయా వ్యాసాల విస్తృతిని పెంచడంలో కాన వస్తుంది.
భరత్ బూషణ్ చిత్ర రచనలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు మచ్చు తునకలు.
ఇట్లా – భరత్ బూషణ్ చిత్ర రచనలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు మచ్చు తునకలు. ఇక్కడి ఆరాట పోరాటాలకు ప్రతీకలు. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక పాట. బృందగానం. అనారోగ్య కారణాల వాళ్ళ వారు తన తొలి అభిలాష ఐన చిత్రలేఖనంలో ఇటీవల ఎక్కువ కృషి చేశారు గానీ తిరిగి ఉత్సాహంగా వారు మళ్ళీ కెమెరా చేతబట్టడానికి ఎంతో పెనుగులాడారు.
క్యాన్సర్ తిరిగబెట్టడంతో వారు బసవతారకం అస్పత్రిలూ చికిత్స పొందినప్పటికీ అయన శరీరం తట్టుకున్నట్టు లేదు. ఈ ఉదయం అయన కన్ను మూశారు. తన కళను మనకు వదిలి.
తను చేపట్టిన రంగంలో అద్వితీయంగా కృషిచేసిన వారి మరణం తీరని లోటు. ముందు చెప్పినట్టు మనం ఆయన అంటే జాజూ సున్నం గోడల తెలంగాణా ఇల్లు. ఒక పెద్ద దర్వాజ. అటువంటి ఇల్లు మళ్ళీ కట్టలేం. ఆ స్మృతిలో కాలం గడపడం తప్ప. వారికి కన్నీటి నివాళి.