కష్టజీవులను భౌద్దిక విషయంలో ద్వీతీయం చేయడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటాం. కానీ వారూ ప్రథమ పౌరులే. సగౌరవంగా వారిని మేధావులుగా చూపడంలో చెమట చుక్క ఒక్కటి చాలు. అది మేధావులుగా చెలామణి అయ్యే వారి కన్నీటికి ఎన్నటికీ సమం కాదు.
కందుకూరి రమేష్ బాబు
కండబలం. బుద్ధిబలం అంటారు. సామాన్యుడి విషయంలో అతడి శ్రమ దేహానికి సంబంధించింది, మేధావి విషయంలో అతడి కృషి బుద్దికి సంబంధించింది అని పేర్కొంటూ ఉంటారు. అలా కష్టజీవులను భౌద్దిక విషయంలో ద్వీతీయం చేయడం ఎప్పటి నుంచో చూస్తూనే ఉంటాం. అందులో భాగమే స్త్రీల గృహ జీవితం, వారి చాకిరీ పట్ల కూడా తక్కువ చూపు.
అంతేకాదు, రెక్కలు ముక్కలు చేసుకునే వారిని, కాయ కష్టం చేసేవారిని పేదవాళ్ళుగా చూడటం ఒక తప్పయితే వారిని మేధావులుగా అస్సలు గుర్తించకపోవడం మరింత పొరబాటు. మేధస్సు అన్నది బుద్దికి పని చెప్పడంలోనే లేదు, కాయా కష్టంలో కూడా అంతేగా ఉందన్న గ్రహింపు లేని దుస్థితే ఎక్కువ. సాహిత్య సృజనలో కళా వ్యక్తీకరణలో కూడా ఇదే విషాదం కొనసాగుతోంది.
నా చిత్రాల్లో అత్యధిక భాగం వారి దేహాలను చూపడంలో వారి మేధస్సును ప్రదర్శించడమే ప్రధాన ఇతివృత్తం అని చెప్పవచ్చు,
కానీ సామాన్యశాస్త్రం వ్యాసంగంలో అది అక్షరమైన, చిత్రమైనా ఇలాంటి దృక్పథానికి దూరంగా ఉండటం నాకెంతో బలాన్నించింది. మనిషిని ఆర్థిక కోణాన్ని బట్టి పేదవాడిగా లెక్కించడంలో ఇందుకు మూలం ఉన్నది. అది సరికాదని కూడా భావించడం వల్లే నా మనుషులు రక్త మాంసాలు ఆత్మతోనే కాదు, గొప్ప ఈస్తటిక్స్ తో కళకళ లాడుతూ ఉంటారు. అదే మేధస్సు అని నా భావన.
జన సామాన్యం జీవితాన్ని సన్నిహితంగా చూడటం నుంచి ఏర్పడిన ఈ అవగాహన నుంచి ఇవ్వాళ ఒక మాట తట్టింది. అందుకే ఈ ఉపోద్గాతం.
సామాన్యుడి చెమట చుక్క మేధస్సుకు ప్రతిబింబం, ప్రతిఫలం.
.