Editorial

Wednesday, January 22, 2025
సామాన్యశాస్త్రంయాభై ఒక్కరు - కందుకూరి రమేష్ బాబు

యాభై ఒక్కరు – కందుకూరి రమేష్ బాబు

 ఒక్కొక్కరిని కలవడం మొదలెట్టాను. నిజానికి ఆ యాభై ఒక్కరిని కలవడం ఒక గొప్ప యాత్ర. అది వివరంగా రాస్తే దానంతట అది ఒక అపురూప నవల అవుతుంది.

కందుకూరి రమేష్ బాబు

2009లో కొత్తగా తెస్తున్న ‘నామవాచకం’, ‘తొమ్మండుగురు’ పుస్తకాలతో పాటు నా తొలి సామాన్యుల పరిచయ వ్యాసాల పుస్తకం ‘కోళ్ళ మంగారం, మరికొందరు’ పుస్తకాన్ని రీ ప్రింట్ చేసి పాఠకులకు మూడు పుస్తకాలు ఒకేసారి అందించాలీ అనుకున్నాను. ఒక మిత్రుడి ఏమన్నారంటే, ‘ఆ పుస్తకంలో ఉన్న పద్దెనిమిది మంది గురించి తాజా సమాచారం ఆయా వ్యాసాల చివర్లో ఒకట్రెండు పేరాలు పోస్టు స్క్రిప్ట్ గా జత చేయి, పుస్తకం వచ్చిన ఈ ఐదేళ్ళలో వచ్చిన మార్పులు కూడా తెలుస్తాయి కదా’ అని సూచించారు. నిజామే అనిపించి ఆ ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళ సాగాను.

నిజానికి కోళ్ళ మంగారంలో పద్దెనిమిది మంది సామాన్యుల పరిచయ వ్యాసాలున్నాయి. అవన్నీ ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో అక్టోబర్ 2002 నుంచి జూలై 2004 వరకూ అచ్చయ్యాయి. అప్పటి నుంచి దాదాపు ఎనిమిదేళ్ళలో కొందరితో టచ్ లో ఉన్నప్పటికీ మరికొందరిని వెతికి పట్టుకోవలసి వచ్చింది.

ఐతే, ‘నామవాచకం’ పుస్తకంలోని 24 వ్యాసాలు కూడా సాక్షి ఆదివారం సంచిక ‘ఫండే’ లో దాదాపు ఎడాదికి పైగా ‘రాశాను. మే నుంచి నవంబర్ 2008 వరకు వాటిని రాసినప్పటికీ అందులో చిత్రించిన జీవితాలను నేను అంతకుముందు పదేళ్ళ నుంచి అర్థం చేసుకున్నవి. కాబట్టి అందులో పరిచయం చేసిన వారిని కూడా మరోసారి కలవాలనిపించింది. అలాగే అమెరికాలోని కిరణ్ ప్రభ గారు నడిపే ‘కౌముది’ కోసం రాసిన అ’సామాన్యులు అన్న వాసాలను ‘తొమ్మండుగురు’గా వేస్తున్నాను కనుక సందర్భం కనుక మరోసారి అందులోని వ్యక్తులనూ కలవడం మంచిదనిపించింది. ఇట్లా మొత్తం మూడు పుస్తకాలలోని 51 మందిని కలిసే ప్రణాళిక ఒకటి అనుకోకుండా రూపుదిద్దుకున్నది.

ఐతే, అంతమందిని ఎలాగూ కలుస్తున్నాను గనుక ఆ మూడు పుస్తకాల రిలీజ్ సందర్భంగా అందరినీ తప్పక ఆవిష్కరణ సభకు రప్పించే ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన కూడా మెదిలింది. వారితో పాటు సభకు బంధుమిత్రులు కూడా వస్తారు కనుక సుందరయ్య విజ్ఞాన కేంద్రం వంటి పెద్ద హాల్ బుక్ చేయాలన్న ఆలోచన మెదిలింది. దాంతో ఈ పుస్తకాల వేడుక పెద్దదిగా మారింది.

ఈ యాభై ఒక్క మందిలో ఒక్క దరిపల్లి రామయ్య గారు తప్ప అందరూ భాగ్యనగర వాసులే. ఐతే, అందులో కొందరు ఇల్లూ వాకిలి లేని వాళ్ళు, మరికొందరు ల్యాండ్ ఫోన్లు లేనివారు. ఇంకా కొందరు కాళ్ళు రెక్కలు లేనివారు. కొందరు సంఘ జీవులు  కూడా కాదు.

ఇలా అనేక విధాలా సన్నద్దమవుతూ ఇక ఒక్కొక్కరిని కలవడం మొదలెట్టాను. నిజానికి ఆ యాభై ఒక్కరిని కలవడం ఒక గొప్ప యాత్ర. అది వివరంగా రాస్తే దానంతట అది ఒక అపురూప నవల అవుతుంది. బాహుశా దానికి ఇది ముందుమాట కాబోలు!

ఈ యాభై ఒక్క మందిలో ఒక్క దరిపల్లి రామయ్య గారు తప్ప అందరూ భాగ్యనగర వాసులే. ఐతే, అందులో కొందరు ఇల్లూ వాకిలి లేని వాళ్ళు, మరికొందరు ల్యాండ్ ఫోన్లు లేనివారు. ఇంకా కొందరు కాళ్ళు రెక్కలు లేనివారు. ఇంకొందరు తమ పని స్థలం వదిలి ఒక్క పూటా కూడా రాలేని వాళ్ళు. కొందరు సంఘ జీవులు  కూడా కాదు. ఒక రకంగా రోడ్డు, ఫుట్ ఫాత్ అని రెండు రకాల సమాజం అనుకుంటే ఇక వారంధారినీ  కలుస్తున్నాను. ఆప్యాయంగా వారితో ముచ్చటించి వస్తూ ఉన్నాను.

అకస్మాత్తుగా ఒక రోజు ఒక విషయం తెలిసింది. ‘కోళ్ళ మంగారం’ పుస్తకంలోని ఒకరు మరణించారని.
అది పుస్తకంలోని మొదటి మరణం.

ఆ తర్వాత తెలిసింది ‘నామవాచకం’ పుస్తకంలోని ఇద్దరు మరణించారని. దాసాటి రాములు మరణించారని. తర్వాత డేనియల్ కూడా పోయారని.

అటు తర్వాత తెలిసింది. తొమ్మండుగురు పుస్తకంలోని లీలావతి గారు గతించారని. ఆ తర్వాత రామకృష్ణ గారు లేరని తెలిసింది.

మూడు పుస్తకాల అట్టల మధ్య అక్షరాల్లో చిత్రితమైన వారి జీవితాలు శాశ్వతంగా పదిలమయ్యాయి గానీ ఇలా తరచి చూసే క్రమంలో ఈ కలిసి మాట్లాడే గమనంలో దాదాపు నలుగురైదుగురు లేరన్న వాస్తవం బోధపడింది. దాంతో ఒక్కొక్కరిని కలిసే ముందు మునుపటి ఉత్సాహం స్థానంలో వారు జీవించి ఉన్నారా లేదా అన్న సంశయం ఆందోళనకు గురి చేసేది. నడుస్తున్న నడకను ఎంతో ఇబ్బంది పెట్టేది. ఐనప్పటికే  అలా ముందుకు సాగుతుండగా ఒకరోజు మరో విషయం తట్టింది. పుస్తకాల్లోని ఆరేడుగురు మరణించారన్న విషయం తెలిశాక గానీ ఆ సంగతి బోధపడలేదు. అదేమిటంటే ఒకానొక రోజు పుస్తకంలోని ప్రతి ఒక్కరూ లేకుండా పోతారు కదా అని.

పాత్రలుగా సదరు వ్యక్తులు, వాటిని రాసిన రచయితా, ముందు మాట రాసిన వ్యక్తితో సహా పుస్తకం ప్రూఫ్ రీడర్లతో సహా అచ్చువేసిన వారెవరూ కూడా ఒకానొక రోజు ఉండరని అవగతమైంది. ఆ అవగాహనకు నవ్వు కూడా వచ్చింది.

ఆ తర్వాతి క్షణమే మరొక సంగతీ తట్టింది. పుస్తకం రాసిన రచయిత కూడా లేకుండా పోతాడు కదా అని!

ఒక్కపరి ఎంతో బాధ కలిగింది. ఒకలాంటి వైరాగ్యం నను ముందుకు కదల నీయలేదు. పుస్తకంలోని మనుషులే కాదు, దాని రచయిత కూడా ఒకానొక రోజు ఉండరని అర్థమయ్యాక మానసికంగా నా ప్రయాణపు దిశ ఒక కుదుపుకు గురైంది. కానీ కాసేపే. ఆ తర్వాత విచారం స్థానలో ఎదో సత్యం బోధపడిన తత్వం తాలూకు ప్రశాంతత వచ్చి చేరింది. ఆ ప్రశాంతత వెలుగులో చేతుల్లోని కోళ్ళ మంగారం మరి కొందరు పుస్తకం తిప్పుతూ ఉంటే మరో విషయం తేట తెల్లమైంది. ఎంతో భక్తితో ఒక పుస్తకానికి మీరు ముందు మాట రాపించుకోగలరు. కానీ ఆ రచయిత కూడా ఎప్పటికీ ఉండరని. నిజం. కె ఎన్ వై పతంజలి గారు కూడా అప్పటికే లేరు. వారి మరణం ఆ క్షణంలో మరింత గాడంగా తెలిసి వచ్చింది.

పాత్రలుగా సదరు వ్యక్తులు, వాటిని రాసిన రచయితా, ముందు మాట రాసిన వ్యక్తితో సహా పుస్తకం ప్రూఫ్ రీడర్లతో సహా అచ్చువేసిన వారెవరూ కూడా ఒకానొక రోజు ఉండరని అవగతమైంది. ఆ అవగాహనకు నవ్వు కూడా వచ్చింది.

అప్పుడు ఎందుకో ‘మనందరి జీవితాలని రాసింది ఒకే ఒక చేయి’ అని పాలో కోయిలో భగవంతుడిని రచయితగా ఎంచుతూ రాసిన ఒక మాట గుర్తుకు వచ్చింది. ఆ వెలుగులో ప్రతి రచయితా తన పాత్రా ‘క్షరము’. ‘అక్షర’మే శాశ్వతం అనిపించింది.

ఈ జగత్తులో
బతికిన మనుషులందరి గురించి
ఓ లైబ్రరీ తెరవాలి
అందులో మీ పరిచయ వ్యాసం
తప్పక ఉండాలి

మొత్తానికి అందరినీ కలిసే ప్రయత్నం చేశాను. పుస్తకంలోని ఆ యాభై ఒక్కరిని బంధు మిత్రులతో సహా ఆహ్వానించాను. ఆ మూడు పుస్తకాలతో పాటు సరికొత్తగా రాసిన ‘డోంట్ ఫీల్’ అన్న పుస్తకాన్నీ అద్బుతంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రధాన హాల్ లో ఆవిష్కరింప జేశాను. సామాన్యుల పుస్తకాలను అసమాన్యులైన ప్రముఖుల సమక్షంలో విడుదల చేశాము. ఆ రోజు – పాత్రలు, ఆ పాత్రల బందు మిత్రులూ ముందుగా సుందరయ్య పార్కులో కలిసే ఏర్పాటు చేసి అక్కడి నుంచి హాల్ కు తీసుకొచ్చి వారి సమక్షంలో సామాన్యశాస్త్రం పుస్తకాలను ఒక వేడుకగా ఒక సంబురంగా జరిపాము.

పుస్తకంలో జీవించి ఉన్న వారందరినీ  అక్కడ కలిపినప్పుడు ఒకరికొకరు కొత్త. ఫలానా గుడికాడి చినమల్లయ్య ఏడి అని ఒకరు. ఫలానా లీలావతి గారు వస్తున్నారా అని మరొకరు. ‘ఆ వస్తున్నారు. అందరికీ చెప్పాను’ అన్నాను నేను. నిజానికి మరణించిన వారి ఫుట్ నోట్స్ పెట్టకూడదూ అని నిర్ణయం తీసుకోవడం ఎంత మంచిదైనదీ అంటే అందరూ ఉన్నారనే అనుకున్నారు. అదే ఈ కథనంలోని ఎరుక. ఇతివృత్తం.

ఈ రోజు కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి మరణం కలచివేసి ఆ వేదనలో ఇదంతా రాయడానికి ప్రేరేపించింది.

చావు శాశ్వతం ఐనప్పుడు అది వార్త ఎట్లవుతుంది. విశేషం ఎలా అవుతుంది.

నిజానికి కరోనా కాలానికి దాదాపు ఒక పుష్కరం ముందే ఈ ‘చావు నిజం’ నన్ను జీవితంపట్ల మరింత సన్నిహితుడిని చేసింది. క్షణ బంగురమైన జీవితమే అపురూపం అని గుర్తింప జేసింది. దాన్ని అక్షరాలా మాత్రమే కాదు, సచిత్రంగా సెలబ్రేట్ చేయడానికి ప్రోత్సహించింది.

ఈ రోజు కవి శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి మరణం కలచివేసి ఆ వేదనలో ఇదంతా రాయడానికి ప్రేరేపించింది. మరోసారి ఈ మాటలు మననం చేసుకునేలా చేసింది.

“ఈ జగత్తులో
బతికిన మనుషులందరి గురించి
ఓ లైబ్రరీ తెరవాలి
అందులో మీ పరిచయ వ్యాసం
తప్పక ఉండాలి

– సామాన్యశాస్త్రం

More articles

2 COMMENTS

  1. నేనేంటి అనే ప్రశ్న చాలా కాలంగా మదిని తొలుస్తోంది.మీ వ్యాసం చదవడం వల్ల నేనెప్పుడు అనే రెండో ప్రశ్న మొదలయ్యింది.

    అయితే సముద్రాల వారు చెప్పినట్లు
    బదులు కోసమై వెదుకుట మాని బ్రతుకుటయే న్యాయం అనిపిస్తుంది.
    అయితే ఈ ప్ర యాణాన్ని మరింత అర్థవంతంగా కొనసాగించడమే మన ఎదుగుదలకు దోహదం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article