Editorial

Wednesday, January 22, 2025
Opinionవెంకన్న మూలాలపై 'పున్నా' వెన్నెల - కల్లూరి భాస్కరం తెలుపు

వెంకన్న మూలాలపై ‘పున్నా’ వెన్నెల – కల్లూరి భాస్కరం తెలుపు

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ తిరుమల కొండ మీదా, ఆ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి మధ్యా ఉన్నట్టు ఎంతో ఆహ్లాదం గొలిపే అనుభూతి. ఆపైన కుతూహలాన్ని రేపుతూ అనేక ప్రశ్నలు!

‘విడిపోయేందుకు కావలసినన్ని మతాలు; అభిమతాలు కలిపేందుకే ఏదీ లేదు అనే మానసికస్థితిలో అంతటా – అన్నిటా భాసించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు’ అంటూ ఈ పదచిత్రాలను రచయిత పున్నా కృష్ణమూర్తి ఆయనకే అంకితం చేస్తారు.

కల్లూరి భాస్కరం

చరిత్ర శోధనకు ఆకాశమే హద్దని ఈ మధ్య నాకు మరింత గట్టిగా అనిపిస్తోంది. బిభూతి భూషణ్ బందోపాధ్యాయను చదివిన తర్వాత, డి.డి. కోశాంబీ తండ్రి ధర్మానంద్ దామోదర్ కోశాంబి ‘నివేదన’ పేరుతో రాసిన ఆత్మకథ చదివిన తర్వాత, విష్ణుభట్ గాడ్సే అనే ఒక మరాఠీ బ్రాహ్మణుడు ధనార్జనకోసం పినతండ్రితో కలసి యాత్రలకు బయలుదేరి 1857 నాటి ప్రథమ స్వాతంత్ర్యసమరంలో చిక్కుకుని ఆ తర్వాత తన అనుభవాలను పొందుపరుస్తూ రాసిన ‘మఝా ప్రవాస్’(నా ప్రవాసం)చదివిన తర్వాత -బ్రిటిష్ భారత చరిత్రపైనా, అంతకు ఒకింత ముందుకాలానికి చెందిన చరిత్రపైనా ఆసక్తి అమాంతం పెరిగిపోయింది. ‘నివేదన’, ‘మఝా ప్రవాస్’ ఆంగ్ల అనువాదం నాకు పంపించి చదివించిన మిత్రులు పరవస్తు లోకేశ్వర్ గారికి ఎంతైనా కృతజ్ఞుడిని.

అలాగే, ఇప్పుడు మరో మిత్రులు, పాత్రికేయసహచరులు పున్నా కృష్ణమూర్తిగారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆయన ఈ మధ్యనే నాకు పంపించిన తన ‘తిరుమల కొండ పదచిత్రాలు’ రచన కూడా తిరుమల చరిత్రపై అంతే ఆసక్తిని కలిగించింది. స్వయంగా రచయిత తీసిన చక్కని ఛాయాచిత్రాలు, దాదాపు ప్రతి పుటలోనూ విస్మయపరిచే ఎన్నోచారిత్రకవిశేషాల సమాహారం ఈ పుస్తకం.

ఇరవయ్యేళ్ళ క్రితం వెలువరించిన ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ తిరుమల కొండ మీదా, ఆ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి మధ్యా ఉన్నట్టు ఎంతో ఆహ్లాదం గొలిపే అనుభూతి. ఆపైన కుతూహలాన్ని రేపుతూ అనేక ప్రశ్నలు!

‘మన సాంస్కృతిక సంపద మహోన్నతమైనది. మన చారిత్రక దృష్టి దోషభూయిష్ఠమైనది. చరిత్రను విస్మరించి పుక్కిటిపురాణాలతో కాలక్షేపం చేసే జాతి వికసించలేదు” అన్న చక్రవర్తుల రాజగోపాలాచారి వ్యాఖ్యను తొలి కవరు పేజీ మడతలో చేర్చడం ఈ పుస్తకరచనలో రచయిత దృష్టికోణాన్ని చూపిస్తుంది.

పురాణ, ఇతిహాసాలు నేటి అర్థంలో చరిత్ర కాకపోయినా, చారిత్రకాంశాలను ప్రతిఫలిస్తాయి కనుక ‘పుక్కిటి పురాణా’లనే మాటను నేను అంగీకరించను కానీ; మన చారిత్రకదృష్టి దోషభూయిష్ఠమైనదన్న అభిప్రాయంతో ఏకీభవించక తప్పదు. ఏదైనా చారిత్రకప్రదేశానికి వెళ్లినప్పుడు, లేదా పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు ఎంతసేపూ అక్కడ ప్రాచుర్యంలో ఉన్న కొన్నింటికే మన దృష్టి పరిమితమవుతుంది. పదే పదే దాని గురించే మాట్లాడతాం. పుణ్యక్షేత్రానికి వెడితే చరిత్రలాంటి ఇతరేతర ఆసక్తులన్నింటినీ భక్తి, పూజలు, ఇతరమైన తంతులు మింగేస్తాయి.

ఆమధ్య హంపీ వెళ్లినప్పుడు రెండు విషయాలు నా దృష్టిని ప్రముఖంగా ఆకర్షించాయి: మొదటిది, విరూపాక్షస్వామి ఆలయం గోపురం మీద ఉన్న మైథునశిల్పాలు; రెండవది, హంపీలో కృష్ణదేవరాయలు నిర్మించిన కృష్ణాలయం వద్ద వేయించిన శిలాఫలకం.

విరూపాక్షస్వామి ఆలయం గోపురం మీద ఉన్న మైథునశిల్పాలను ఎంతమంది సందర్శకులు గమనించారో, ఎంతమంది చరిత్రకారులు దాని గురించి రాశారో నాకు తెలియదు (ఎవరైనా రాసినట్టు మీ దృష్టికి వస్తే దయచేసి తెలపగలరు). మొత్తం మీద ఆ వివరం అంతగా ప్రాచుర్యంలో లేదు. A Forgotten Empire (Robert Sewell)లో మాత్రం నాకు ఆ ప్రస్తావన కనిపించింది(The pagodas are high and have great buildings with many figures of men and women, all in lascivious attitudes). పశ్చిమగోదావరి జిల్లాలో, మా స్వగ్రామమైన ప్రక్కిలంకకు అయిదారుకిలోమీటర్ల దూరంలో పట్టిసం అనే గ్రామం దగ్గర గోదావరి మధ్యలో ఉన్న వీరభద్రస్వామి గుడిలో కూడా మైథునశిల్పాలు ఉన్నాయి.

కెమేరాతో హంపిలో శ్రీ పున్నా కృష్ణమూర్తి

పున్నా కృష్ణమూర్తిగారి పుస్తకానికి వస్తే, నన్ను మొదట్లోనే కట్టిపడేసినది, ‘విశ్వాసవిజ్ఞానవేదిక’ శీర్షికతో రాసిన ప్రారంభఘట్టం.

హంపిలో నన్ను ఆకర్షించిన రెండో అంశానికి వస్తే, కృష్ణదేవరాయలు గజపతుల ఆధీనంలో ఉన్న ఉదయగిరి (ఇప్పటి నెల్లూరు జిల్లాలో ఉంది)ని జయించిన తర్వాత అక్కడి బాలకృష్ణుడి విగ్రహాన్ని తెచ్చి తను నిర్మించిన కృష్ణాలయంలో ప్రతిష్ఠించినట్టు అది చెబుతోంది. ‘…and after the successful termination of the war he brought with him from a temple on the hill a statue of the god Krishna, which he set up at Vijayanagar and endowed with a grant of lands’, అని Forgotten Empire అంటోంది. జయించిన రాజ్యంలోని దేవతవిగ్రహాన్ని తెచ్చి సొంత రాజ్యంలో స్థాపించే ప్రక్రియ మూలాలు అతిప్రాచీనకాలానికి చెందిన మెసపొటేమియాలోనూ, నేటి టర్కీ చుట్టుపక్కల ప్రాంతాలను ఏలిన హిట్టైట్ రాజ్యంలోనూ ఉన్నాయని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

మెసపొటేమియా, ఈజిప్టు, హిట్టైట్ సహా ప్రాచీన నాగరికతలలో నగరరాజ్యాలు ఉండేవి. ఒక నగరరాజ్యం ఇంకో నగరరాజ్యాన్ని జయించాలనుకున్నప్పుడు ఆ నగరదేవతను అపహరించి తెచ్చి తనరాజ్యంలో ప్రతిష్ఠించేది. ఆ దేవతవెంట ఆ నగరవాసులు కూడా జయించిన నగరానికి తరలి వచ్చేవారు. THE ANCIENT NEAREAST, Historical Sources in Translation(Edited by Mark W, Chavalas, 2006) అనే పుస్తకం, ఇలా వేరే రాజ్యంలోని దేవతలను ఎత్తుకెళ్ళి తమ రాజ్యంలో ప్రతిష్ఠించుకున్న ఉదంతాలను ఎన్నింటినో ఉదహరించింది.

15వ శతాబ్దిలో భారతదేశంలోని దక్షిణాపథంలో గణనీయమైన భాగాన్ని ఏలిన ఒక రాజు, భారతదేశానికి బయట (కూడా)ఉన్న ఈ ప్రాచీనకాలపు ఆనవాయితీని పాటించడం -సరిహద్దులకు అతీతమైన అజ్ఞాతచారిత్రకబంధాలను, సంబంధాలను, ప్రభావాలను సూచిస్తుంది కాబోలు.

మళ్ళీ పున్నా కృష్ణమూర్తిగారి పుస్తకానికి వస్తే, నన్ను మొదట్లోనే కట్టిపడేసినది, ‘విశ్వాసవిజ్ఞానవేదిక’ శీర్షికతో రాసిన ప్రారంభఘట్టం.

తిరుమలలోని శిలాతోరణం ఏర్పడ్డ సమయంలో ఆరుఖండాలూ, ఏడు సముద్రాలూ కలసిపోయి ఉండేవట; సృష్టి అప్పటికి ఫ్లూయిడ్ గానూ, నైరూప్యంగానూ కూడా ఉందట! నేటికీ చెక్కుచెదరని శిలాతోరణం సముద్రపు అలల సవ్వడులను తనలో దాచుకుందని రచయిత అంటారు.

అందులో విజ్ఞానానికి, విశ్వాసానికి ఉన్న ఒక సామ్యాన్ని మన దృష్టికి తెస్తారు. ఎలాగంటే, విజ్ఞానశాస్త్రం ప్రకారం, ఆదిలో భూగోళాన్ని సముద్రం కప్పేసి ఉన్నప్పుడు, సముద్రపు అలలపై కర్బనపు పొరలు ఉండేవి; వాటిపై సూర్యకిరణాలు ప్రసరించగా, ఆ సంయోగక్రియలో జీవం మొదలైంది…అలా అమీబా, చెట్టూ, పుట్టా, మనమూ వచ్చాం. విశ్వాసుల ప్రకారం కూడా, ఆదిలో చీకటి అగాధజలాలు పైన కమ్మేసి ఉన్నాయనీ, దేవుని ఆత్మ ఆ జలాలపై అల్లాడుతోందని బైబిల్, ఖురాన్ చెబుతాయి. మన దగ్గర పాలసముద్రంపై పవళించిన దేవుడి గురించి జానపదులు, వటపత్రశాయి గురించి తల్లులు, ప్రళయపయోధిజలం గురించి శిష్టులు చెబుతారు,..! ఇదీ రచయిత చూపిన సామ్యం. ఇది యాదృచ్చికమైన పోలిక కావచ్చు, కాకపోవచ్చు కూడా; ఇదమిత్థంగా మనకు తెలియదు. కానీ కథల పుట్టుకకు, వ్యాప్తికి సంబంధించిన చారిత్రకమూలాలను శోధించాలన్న కుతూహలాన్ని ఇది రేపుతుంది.

మన ప్రాచీనుల ఆలోచనలు, ఊహల మధ్య సహేతుకతనూ, విజ్ఞాన, విశ్వాసాల సమన్వయాన్నీ స్థాపించే లింకులు ఏవో ఉండేవేమో; మనకు చరిత్రను భద్రపరిచే దృష్టి లేకపోవడం వల్ల కాలగతిలో ఆ లింకులు తెగిపోయి, అస్పష్టమైన ఆలోచనలుగా, ఊహలుగా అవి మిగిలిపోయాయేమో ననిపిస్తుంది.

తిరుమల కొండకు, జీవం ఆవిర్భవించడానికి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తూ, అదే శీర్షిక కింద ఆ తర్వాత రాసినది మనల్ని ‘సృష్ట్యాది’కి తీసుకుపోయి మరింత కుతూహలాన్ని, ఆలోచనను రేపుతుంది. తిరుమల కొండపై ఉన్న నారాయణగిరిశిఖరం సముద్రమట్టానికి 3622 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతమంతా 250 కోట్ల సంవత్సరాలనాడు సముద్రగర్భంలో ఉండేదట; తిరుమలలోని శిలాతోరణం ఏర్పడ్డ సమయంలో ఆరుఖండాలూ, ఏడు సముద్రాలూ కలసిపోయి ఉండేవట; సృష్టి అప్పటికి ఫ్లూయిడ్ గానూ, నైరూప్యంగానూ కూడా ఉందట! నేటికీ చెక్కుచెదరని శిలాతోరణం సముద్రపు అలల సవ్వడులను తనలో దాచుకుందని రచయిత అంటారు. ఆపైన, సముద్రగర్భంలో మాత్రమే ఉండే మొక్కలు తిరుమలలో ఇప్పటికీ ఉన్నాయనీ, ప్రపంచంలో ఇనుమును తొలిసారి ఉత్పత్తి చేసిన రుజువులున్నాయనీ అన్నప్పుడు- అనాదిగతంలో ఈ కొండకూ, సముద్రానికీ ఉన్న సంబంధం అర్థమై ఆశ్చర్యంతో కళ్ళు విప్పారతాయి. తిరుమల కొండలు సహా నల్లమల కొండలు ఏర్పడిన క్రమం గురించి భూగోళశాస్త్రం ఏం చెబుతోందో తెలుసుకోవాలన్న తహతహ కలుగుతుంది.

తిరుమల అడవులలో నేటికీ శ్వేతవరాహాలు పుష్కలంగా ఉన్నాయనీ, వేదం అనే పదాన్ని ఆహారంగా భావిస్తే నేల లోపలి దుంపలను వెలికి తెచ్చిన జ్ఞానిగా వరాహస్వామిని గుర్తించవచ్చునని రచయిత అంటారు

ప్రళయకాలంలో వేదాలు నీటిలో ఉన్నప్పుడు వాటిని వటపత్రశాయి శ్వేతవరాహస్వామి రూపంలో భూమిమీదికి తెచ్చిన చోటు తిరుమల అని వరాహపురాణం చెబుతోందట. తిరుమల అడవులలో నేటికీ శ్వేతవరాహాలు పుష్కలంగా ఉన్నాయనీ, వేదం అనే పదాన్ని ఆహారంగా భావిస్తే నేల లోపలి దుంపలను వెలికి తెచ్చిన జ్ఞానిగా వరాహస్వామిని గుర్తించవచ్చునని రచయిత అంటారు. వరాహస్వామిని తమిళులు జ్ఞానపిరాన్ అంటారట. రాంభట్ల కృష్ణమూర్తిగారు ‘ఆదిసూకర వేదవేద్యుడు’ శీర్షిక కింద ‘జనకథ’లో అన్నది కూడా ఇదే!

ఆయన ప్రకారం- ఆవలు, అంటే చిత్తడి నేలల్లో రకరకాల తుంగలు మొలుస్తాయి. వాటికి దుంపలుంటాయి. వాటిని తుంగముస్తలంటారు. వాటిని తినడానికి వరాహాలు అక్కడికి చేరి, అదేపనిగా నేలను కెక్కిరిస్తాయి. దాంతో ఇప్పుడు చూసిన ఆవ రూపం ఇంకో గంటకు మారిపోతుంది. దాన్నే పూర్వులు “కోలాహలం” అనుంటారు. ‘కోలం’ అంటే అడవిపంది, ‘ఆహలం’ అంటే దుక్కి. ఒకప్పుడు రూపానికి సంబంధించిన కోలాహలం అనే మాటను ఆ తర్వాత పండితులు శబ్దానికి అన్వయించి ఉంటారు. పంది దుక్కివల్ల నీరు ఒడిసి పొడినేల బయటపడుతుంది, ఆ నేల మీద ఆహారపు మొక్కలు ఏపుగా పెరుగుతాయి. వ్యవసాయక్షేత్రాన్ని దున్నడం ఈ పంది దుక్కి నుంచే మనిషి నేర్చుకుని ఉంటాడు. కనుక వ్యవసాయానికి వరాహమే ఆదిగురువు. అందుకే మనదేశాన్ని పాలించిన ఎన్నో రాజవంశాలవారు వరాహాన్ని తమ జెండాల మీద నిలుపుకుని వరహలాంఛనులయ్యారు.

రాంభట్ల కూడా వేదమంటే అన్నమే నంటారు. మన పురాణాలు వరాహాన్ని ‘ఆదిసూకరవేదవేద్యుడు’ అనడంలో ఉద్దేశం, వరాహం అన్నోత్పాదన పద్ధతిని నేర్పడమే. తొలి వ్యవసాయసమాజాలైన ఈజిప్టు, మెసపొటేమియా (సుమేరు)ల అనుభవం కూడా ఇదే. సుమేరు సంస్కృతికి మూలమైన యూఫ్రటిస్, టైగ్రిస్ నదులకు; ఈజిప్టు సంస్కృతికి మూలమైన నైలునదికి ఏటా వచ్చే వరదలు ఒండ్రుమట్టిని మోసుకొచ్చినప్పుడు ఆ మట్టి నదీముఖద్వారంలో క్రమంగా పేరుకుని భూమిని నీటినుంచి పైకి తెచ్చినట్టు ఉంటుంది. పంది దుక్కి వల్ల నీరు ఒడిసి పొడినేల బయటపడడంతో దీనికి సామ్యం కనిపిస్తుంది. ఈ ప్రత్యక్షానుభవం ఆ తర్వాత మతభావనల్లో ప్రతిఫలించి నీటినుంచి భూమి పుట్టుకకు సంబంధించిన పురాణకథలను అన్ని సంస్కృతులలోనూ సృష్టించింది. అదే మనదగ్గర విష్ణువు వరాహావతారమెత్తి నీటినుంచి వేదాలను ఉద్ధరించిన గాథగా పురాణాలకు ఎక్కింది!

అన్నట్టు రాంభట్ల కూడా ‘తిరుమలకొండ పదచిత్రాలు’ పుస్తకంపై అభిప్రాయం రాసినవారిలో ఉన్నారు. ఇదేదో పూర్తిగా భక్తిసంబంధ రచన అనుకుని, దీనిమీద నేనేం రాయగలనని చెప్పి మొదట తిరస్కరించారట. తీరా చదివాక, తప్పక స్పందించాల్సిన పుస్తకంగా తోచిందట! పున్నావారి పుస్తకానికి అలాంటి సూదంటురాయి లక్షణం ఉందిమరి!

ఆయన ప్రకారం, బౌద్ధంలోని సాంఘికసమానతను, హిందూధర్మంలోని గృహస్థాశ్రమధర్మాన్ని మేళవించీ; హిందూమతంలోని కులవివక్షను ఒక వాస్తవంగా అంగీకరించి హిందూ ఛాందసుల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కులాల ప్రజలనూ కలిపీ; బౌద్ధులు, శైవులు, శాక్తేయులు, వైష్ణవులు అనే తేడాలేకుండా అందరినీ ఒక గొడుగుకిందికి తెచ్చే ప్రయత్నం ఫలితమే శ్రీవైష్ణవమూ, వెంకటేశ్వరుడూ!

మెసపొటేమియా ప్రస్తావన ఎలాగూ వచ్చింది కనుక, దక్షిణభారతానికి మెసపొటేమియా సుమేరు నాగరికతా, సంస్కృతులతో ఉన్న అనాది, అజ్ఞాత చుట్టరికం గురించి; తిరుమల వెంకన్నపేరుతో సుమేరు పౌరాణికదేవతైన అంకి-ఎంకి-ఎంకిడు (ఎపిక్ ఆఫ్ గిల్గమేశ్ లో మన పురాణాలలోని ఋష్యశృంగుని తలపించేపాత్ర) పేర్లకు ఉన్న సామ్యం గురించిన అనేక ఊహలు, ప్రశ్నలు పున్నావారి పుస్తకం చదువుతుంటే ముప్పిరిగొంటాయి.

నగరరాజ్యాల ఉదాహరణను ముందే ప్రస్తావించుకున్నాం. అలాగే, ఎలాంటి చారిత్రక పరిస్థితుల్లో శ్రీవైష్ణవం అనే కొత్తమతాన్ని, ఆ మతానికి ఆలంబనగా వేంకటేశ్వరస్వామిని ముందుకు తెచ్చారో పున్నావారు వివరిస్తూ, తిరుమల వెంకన్నను సర్వమత మతసమాహారంగా, మానవతావాదం ప్రాతిపదికగా వెలసిన మూర్తిగా అభివర్ణిస్తారు. ఆయన ప్రకారం, బౌద్ధంలోని సాంఘికసమానతను, హిందూధర్మంలోని గృహస్థాశ్రమధర్మాన్ని మేళవించీ; హిందూమతంలోని కులవివక్షను ఒక వాస్తవంగా అంగీకరించి హిందూ ఛాందసుల మనోభావాలు దెబ్బతినకుండా అన్ని కులాల ప్రజలనూ కలిపీ; బౌద్ధులు, శైవులు, శాక్తేయులు, వైష్ణవులు అనే తేడాలేకుండా అందరినీ ఒక గొడుగుకిందికి తెచ్చే ప్రయత్నం ఫలితమే శ్రీవైష్ణవమూ, వెంకటేశ్వరుడూ!

‘విడిపోయేందుకు కావలసినన్ని మతాలు; అభిమతాలు కలిపేందుకే ఏదీ లేదు అనే మానసికస్థితిలో అంతటా – అన్నిటా భాసించిన స్వామి శ్రీవేంకటేశ్వరుడు’ అంటూ ఈ పదచిత్రాలను రచయిత ఆయనకే అంకితం చేస్తారు. బాగానే ఉంది. ఆయన మనోభావాలను తప్పక గౌరవించవలసిందే. అయితే, చారిత్రక జిజ్ఞాసా చాపల్యం ఊరుకోనివ్వదు. దక్షిణభారత జానపదులకు, గిరిజనులకు వారి వారి దేవుళ్ళు వారికి ఉండగా ఉత్తరభారతపు వైదిక దేవుళ్ళు ఇక్కడికి ఎలాంటి పరిస్థితుల్లో తరలివచ్చారో; ఉభయుల దేవుళ్ళ మధ్య సమ్మేళనం ఎలా జరుగుతూవచ్చిందో; ఇందులో భాగంగా ఎవరు ఎలా రాజీపడ్డారో, ఎవరి పై చేయి చాటారో-ఆ చరిత్రంతా తడమాలనే కుతూహలాన్ని ఈ పుస్తకం రేకెత్తిస్తూనే ఉంటుంది.

ఇలా చెప్పుకుంటూ వెడితే అంతు ఉండదు. ఇప్పటికే సుదీర్ఘమైనట్టు ఉంది.

దళసరి ఆర్ట్ పేపర్ తో, పుటపుటకూ చక్కని వర్ణచిత్రాలతో 128 పేజీలున్న ఈ పుస్తకం పేపర్ బ్యాక్ ఖరీదు 700/-హార్డ్ బౌండ్ 1150/-. ఈమధ్యనే మరికొన్ని విశేషాలు చేర్చి హిందీలో కూడా వెలువరించారు. తెలుగులో కూడా అదనపు విశేషాలను చేర్చి సామాన్యపాఠకులకు అందుబాటులో ఉండేలా పునర్ముద్రిస్తే బాగుంటుంది, రచయితకు అభినందనలతో…


కల్లూరి భాస్కరం సీనియర్ పాత్రికేయులు, సునిశిత విమర్శకులు.
ఇటీవల తెలుపులో ప్రచురితమైన వారి వ్యాసం Statue of Equality : నేటి విగ్రహ వివాదాన్ని ఎలా చూడాలి? అలాగే చదవండి, గోవిందరాజు చక్రధర్ గారు రామోజీపై రాసిన పుస్తకం ‘ఉన్నది ఉన్నట్టు’పై వారు రాసిన సమీక్ష రామోజీరావు నలుపు తెలుపు.

More articles

1 COMMENT

  1. చాలా బాగా సమీక్షించారు. పున్నాశైలి,ఆయన దృష్టి ఒకదానితో మరొకటి పోటీపడతాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article