Editorial

Wednesday, January 22, 2025
కథనాలుజై భీమ్, సాత్ రంగి సలాం : సజయ కృతజ్ఞతలు

జై భీమ్, సాత్ రంగి సలాం : సజయ కృతజ్ఞతలు

సామాజిక కార్యకర్త భాషాసింగ్ ఆంగ్లంలో రచించిన ‘అన్ సీన్’ అన్న పరిశోధనాత్మక గ్రంథాన్ని ‘అశుద్ధ భారత్’ పేరుతో తెలుగులోకి అనువదించిన సజయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఆ అవార్డును  స్వీకరిస్తూ వారు ఇచ్చిన కృతజ్ఞతా సందేశం ఇది

ఈ పురస్కారం తన ఒక్కరికి వచ్చిందని అనుకోకుండా పుస్తకంలో వున్న జీవితాలకి సగౌరంగా ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానని కూడా వారు వినమ్రంగా పేర్కొన్నారు. చదవండి.

కె. సజయ   

గౌరవనీయులు కేంద్ర సాహిత్య అకాడెమీ చైర్మన్, వైస్ ఛైర్మన్, కమిటీ సభ్యులు, నా పుస్తకాన్ని ఈ అవార్డుకి సిఫార్సు చేసిన సాహిత్యకారులు, నిర్ణేతలు ఇంకా ఇతర భాషల నుంచీ 2021 సంవత్సరపు అనువాద పురస్కారానికి ఎన్నికయిన నాతోటి గ్రహీతలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అందరికీ నమస్కారం, జై భీమ్, సాత్ రంగి సలాం.

సమాజ పురోగమనంలో పుట్టుక కారణంగా ఏ మనిషీ ఎదుర్కోకూడని వివక్షని రూపుమాపి రావలసిన సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలతో ముడిపడిన మానవీయ కోణం గురించి నా పుస్తకం ‘అశుద్ధ భారత్’ చర్చిస్తుంది.

ప్రతి చిన్న విషయాన్ని నమోదు చేయటం ద్వారా చదువరులను ఆ పరిస్థితుల్లోకి రచయిత నడిపించింది. అయితే తెలుగులో పదాల ఎంపిక అంత సులభంగా జరగలేదు. కారణం ఆయా పదాలు సాహిత్య వ్యక్తీకరణల్లో ఇప్పటివరకూ చోటు చేసుకోకపోవడమే.

ఏ అనువాదమైనా కేవలం భాషకు మాత్రమే సంబంధించిన విషయం గా వుండదు. భావం, ఇతివృత్తం ప్రధానంగా వుంటాయి. మూల రచనలోని అంశంతో ఏకీభావం లేకుండా, ఆ రచనతో సహానుభూతి చెందకుండా అనువాదం సాధ్యం కాదు. ప్రతి అనువాదం ప్రత్యేకమైన అంశాలతో కూడి ఉంటుంది. సైద్ధాంతిక అంశాలు అనువదించేటప్పుడు అనేక పదాలకు సమానార్ధకాలు ఉండవు. వాటిని ఇతర భాషల్లోకి అర్దమయ్యే విధంగా రాయటానికి చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ సమస్య కొంచం హెచ్చు తగ్గులతో వుంటుంది. ఆయా సాహిత్య ప్రక్రియల్లో ఉన్న అంశాలను బట్టి, రచయితలు రాసే శైలిని బట్టి కూడా అనువాద ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. అయితే నేను అనువాదం చేసిన ‘అదృశ్య భారత్’ (ఇంగ్లీష్ లో UNSEEN- the truth about India’s Manual Scavengers) రచయిత మిస్ భాషా సింగ్ శైలి అత్యంత ఆసక్తి కరంగా వుంది. ప్రతి చిన్న విషయాన్ని నమోదు చేయటం ద్వారా చదువరులను ఆ పరిస్థితుల్లోకి రచయిత నడిపించింది. అయితే తెలుగులో పదాల ఎంపిక అంత సులభంగా జరగలేదు. కారణం ఆయా పదాలు సాహిత్య వ్యక్తీకరణల్లో ఇప్పటివరకూ చోటు చేసుకోకపోవడమే. అయినప్పటికీ ఒక రాజకీయ వ్యక్తీకరణగా ఆ వృత్తిలో ఇమిడిఉన్న అమానవీయతని సమాజం ముందుకి తీసుకురావడం కోసం కొన్ని క్లిష్టమైన పదాలను వాడుతూనే భాషా సింగ్ చదివించే శైలిని యధాతధంగా తెలుగులోకి తేవటానికి ప్రయత్నించాను.

ఒకచోట “ఇప్పటికీ ఆ పీతికంపు నా జుట్టులో నుంచీ వస్తూనే వున్నట్లు అనిపిస్తుంది” అని హర్యానాలో కమలేశ్ చెప్పిన అనుభవం, “ఆ రోజుల్ని తలచుకుంటేనే నాకు కడుపులో తిప్పుతుంది” అని సంవత్సరాల తరబడి ఆ ఎత్తుడు పాకీదొడ్లు (dry letrins)శుభ్రం చేసిన అనుభవాన్ని అనంతపురం నారాయణమ్మ చెప్పింది చదువుతుంటే మన మనశ్సరీరాలు రెండూ ఆ పీతి పెంటల్లో మునిగిపోయి ఆ కంపు మనల్ని కమ్ముకుని వెంటాడుతూనే వుంటుంది. ఆ భావన మనల్ని వదలదు. అందుకే తెలుగు లో “కనిపించని భారతం”/ “మరుగునపడ్డ బతుకులు”, “మురుగు” వంటివి వాడినా గానీ విషయం పూర్తిగా అర్థంకాదనిపించి ‘అశుద్ధ భారత్’ అనే పేరుని వాడాను.

మూల రచన దెబ్బతినకుండా తెలుగులోకి సరళంగా తీసుకు రావడం అంత సులభంగా ఏమీ జరగలేదు. ముఖ్యంగా ప్రధాన ఇతివృత్తం పాకీ పనికి సంబంధించింది కావడంతో ఎలాంటి పదాలు వాడాలి అనే ప్రశ్న ముందుకి వచ్చింది. సాధారణంగా తెలుగులో అసహ్యం, చీదర వంటి భావాన్ని వ్యక్తం చేయటానికి ‘చండాలం’ అని ఉపయోగిస్తుంటారు. కానీ అది ఒక కుల సమూహం పేరు. ఆ సమూహానికి చెందిన ప్రజలను కించపరిచే విధంగా ‘ఛండాలం’ అనే పదాన్ని వాడకూడదని ముందే స్పష్టంగా నిర్ణయించుకున్నాను. సామాన్య ప్రజల వాడుకలో ఉండే “పియ్యి”, “పెంట” అని వాడాలా? లేక సంస్కృతీకరణకి గురైన “మలమూత్రాదులు” అని వాడాలా? మరుగుదొడ్లా లేక ఎత్తుడు దొడ్లు అని వాడాలా అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ పదాలు ఉపయోగిస్తే పాఠకులు పుస్తకాన్ని స్వీకరిస్తారా అనే సందేహం కూడా నా లోపల వుంది. నిజానికి పాకీ అనే పదాన్ని వాడాలా వద్దా అనే మీమాంస నడిచింది. దీని కోసం దళిత ఉద్యమంలో పనిచేస్తున్న కొంత మంది మిత్రులు, రచయితలతో చర్చించినప్పుడు స్పందన మిశ్రమంగా వచ్చింది. ఇంగ్లీష్ లో అతి సాధారణం గా ‘షిట్’ ‘ఫక్’ అని సులభంగా అనేయటం చూస్తున్నాం. అదే పదాల అర్థాలు తెలుగులో అనటానికి ఒక ఇబ్బంది వుంటుంది. ఈ అంశం మీద క్షేత్రస్థాయిలో ఈ సమూహంతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తల నుంచీ అభిప్రాయం తీసుకుని ఆ సమూహ ప్రజల అలవాటు వాడుక పదాలనే ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నాను . ఇదంతా ఒకరోజులో జరిగిన విషయమేమీ కాదు. దాదాపు ఆరు నెలలపాటు ఈ పుస్తకం గురించి ఎవరో ఒకరితో నిరంతర చర్చ నడుస్తూనే వుండేది. పదాల ఎంపికలో చేసిన మార్పుల వల్ల ప్రారంభంలో చేసిన కొన్ని చాప్టర్లు మళ్లీ తిరగరాయాల్సి వచ్చింది కూడా. అనువాదం మొత్తం అయిన తర్వాత కొంత సమయం తీసుకుని కాపీ ఎడిట్ చేయటం వలన అనువాదంలో వాక్యనిర్మాణం, భాషాపరమైన అంశాలు, అచ్చుతప్పుల వంటి పొరపాట్లను సరిదిద్దగలిగాను.

అతిశయోక్తిగా ఈ మాట అనటం లేదు. ఈ పుస్తకం లోని జీవితానుభవాలను చదువుతూ ఉంటే అయోమయంగా, నిజంగా మనం మనుషులమేనా అని తలబాదుకోవాలనిపిస్తుంది.

ఈ పుస్తకం ఏ భాషలో చదువుతున్నా గానీ ఎవరికైనా సిగ్గు, అవమానం, దుఃఖం, ఉద్వేగం, కోపం…అన్నీ కలగలిసిపోయిన ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. నేను అతిశయోక్తిగా ఈ మాట అనటం లేదు. ఈ పుస్తకం లోని జీవితానుభవాలను చదువుతూ ఉంటే అయోమయంగా, నిజంగా మనం మనుషులమేనా అని తలబాదుకోవాలనిపిస్తుంది. మనచుట్టూ ఇంత అమానవీయత అత్యంత సహజమైన విషయంగా చలామణి అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా దీన్ని ఒక ముఖ్యమైన అంశంగా ఎందుకు తీసుకోలేదు అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎవరూ దీనిని తమ కార్యాచరణలో ప్రత్యేక ప్రాధాన్యత వున్న విషయంగా ఎందుకు చూడలేదు. పితృస్వామిక కుల, మత సమాజపు పట్టు అన్ని సమూహాలలోను ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకంలోని అనుభవాలను చదువుతుంటే వ్యక్తిగతంగా మనందరికీ ఒక విధమైన నిస్సహాయత కమ్మేస్తుంది. ఇంతటి గడ్డు స్థితిలో కూడా పరిస్థితులను ఎదుర్కొనే దైర్యం, అనుభవంతో ఎదుటి వ్యక్తులని అంచనా వేసే ఈ స్త్రీల హాస్యపు మాటలు, వారి సునిశిత దృష్టి మనల్ని ఆకట్టుకుంటాయి. ఈ అమానవీయమైన పని నుంచి బయటపడటానికి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవటానికి సంసిద్ధమవుతూ.. తమ తర్వాతి తరాన్ని మాత్రం ఈ వృత్తిలోకి రానివ్వకుండా గట్టి పట్టుదలతో ఉన్నారనేది ఈ పుస్తకం చదువుతుంటే అర్థమవుతుంది. మనం మనసు పెట్టి వారి అనుభవాలని వినటం, వారి జీవితాలను అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైన అంశం. పైన వివరించిన భావోద్వేగాలను యధాతధంగా అనువాదంలోకి తీసుకు రావటానికి చేసిన ప్రయత్నమే ఈరోజు నన్ను మీ అందరి ముందూ నిలబడి మాట్లాడే అవకాశాన్ని కల్పించాయి.

ఈ వృత్తి మీద శతాబ్దాల తరబడి ఒక నిశ్శబ్దం పేరుకుపోయి వుంది. అదే నిశ్శబ్దం, సంఘర్షణ ఈ పుస్తకానికి కూడా వర్తిస్తుంది.

మొట్టమొదలు ఇలాంటి పుస్తకాలు సంచలనాత్మకమో, ఆకర్షణీయమైన ఇతివృత్తం వున్నవో కావు. ఈ వృత్తి మీద శతాబ్దాల తరబడి ఒక నిశ్శబ్దం పేరుకుపోయి వుంది. అదే నిశ్శబ్దం, సంఘర్షణ ఈ పుస్తకానికి కూడా వర్తిస్తుంది. నిజానికి, పాకీ పని మన కళ్ళ ముందు జరుగుతూ వున్నా గానీ అది అమానవీయమనే స్పృహ మనకు వుండదు. ఆపనిలో వున్నవారి హక్కుల గురించి మాట్లాడే గొంతులు, యూనియన్లు వుండవు. ఈ పుస్తకం పాకీ వృత్తిమీద వున్న అనేక భావజాల సంఘర్షణలను కూడా అర్థం చేయిస్తుంది. మహత్మా గాంధీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ లు ఈ వృత్తి మీద వివిధ సందర్భాల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలను కూడా అర్థం చేసుకోవటం, విశ్లేషించటం ముఖ్యం. ఏ సైద్ధాంతిక పునాది మీద నిలబడి ఈ వృత్తిని వారు విశ్లేషించారు అనేది చాలా ముఖ్యమైన అంశం. అవన్నీ ఈ పుస్తకంలో కనిపిస్తాయి. సామాజిక అంశాల పట్ల స్పందించగలిగిన సామాన్యమైన వ్యక్తులకు, సాహిత్యకారులకు ఈ పుస్తకం చేరువవటం సంతోషించవలసిన విషయం.

ఇప్పటికైనా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఈ పుస్తకం లేవనెత్తిన అంశాలు, ప్రశ్నల మీద చిత్తశుద్ధి తో విధానపరమైన కార్యాచరణలోకి వెళ్ళటం ద్వారా ఈ అమానవీయమైన వృత్తి నిర్మూలనకు పరిష్కారాలు శోధించవచ్చు.

ఒక రకంగా చెప్పాలంటే ఈ పుస్తకం తన ప్రచారాన్ని తానే నిర్వహించుకుంటోంది. విశ్వవిద్యాలయాల బోధనాంశాల్లోకి, పరిశోధనల్లోకి ఈ సమూహపు ప్రజల జీవితాలు వెళ్ళగలిగినప్పుడు మరింత మానవీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. 75 సంవత్సరాల స్వాతంత్ర రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటికైనా ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ఈ పుస్తకం లేవనెత్తిన అంశాలు, ప్రశ్నల మీద చిత్తశుద్ధి తో విధానపరమైన కార్యాచరణలోకి వెళ్ళటం ద్వారా ఈ అమానవీయమైన వృత్తి నిర్మూలనకు పరిష్కారాలు శోధించవచ్చు.

ఈ పుస్తకం వెలికి తీసిన పాకీ స్త్రీల జీవితాలు సాహిత్యలోకంలో చర్చకి రావడం, ఆ వేపుగా అనేక మంది ఆలోచించే విధంగా ఉండటం, సాహిత్య అకాడెమీ ఈ పురస్కారాన్ని ప్రకటించడం విలువైన గౌరవంగా భావిస్తున్నాను. నిజానికి, తలుచుకోవడానికి కూడా ఇష్టపడని ఈ జీవితాలను, ఆ జీవన దృశ్యాలు కళ్ళముందు కనిపించినా కానీ ఉనికిలో లేని అంశంగా, తప్పనిసరై గుర్తించాల్సి వస్తే తమ హావభావాల్లోనే ప్రపంచంలోని అసహ్యాన్నంతా ప్రదర్శించే సభ్యసమాజం మనది. అలాంటి జీవితాలు సాహిత్య అకాడమీలు, విశ్వవిద్యాలయాల్లో చర్చకు రావటం ఆహ్వానించదగిన అంశం . పుట్టుకతో కులం కారణంగా తోటిమనుషుల పియ్యి పెంటల కంపుని అనేక సంవత్సరాలుగా సంస్కృతి అనే పేరిట తమతో నిర్బంధంగా మోయిస్తున్న సమాజాన్ని “స్వతంత్ర భారతదేశంలో ఇదేనా మా జీవితం” అని నిలదీస్తున్న సందర్భం ఇది. “ఎక్కువ డబ్బులు ఇస్తే మీరెవరైనా ఈ పనిచేస్తారా?”, “ఇన్నేళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా మా పిల్లలతో బడుల్లో పాకీదొడ్లు కడిగిస్తున్నారు” అంటూ తమ కఠోర వాస్తవ జీవితాలతో శతాబ్దాల నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతున్న ఆ గొంతులను తెలుగు పాఠకులకు, సాహిత్యానికి పరిచయం చేసే అవకాశం నాకు వచ్చినందుకు, వారి ఉద్యమంలో భాగమవటం నా సామాజిక బాధ్యతగా భావిస్తున్నాను. ఈ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమి లాంటి సంస్థ నుండి ఈ విధంగా గుర్తింపు రావడం ఒక అమానవీయమైన వృత్తి నిర్మూలనలో ముందుకు పడాల్సిన వేలకోట్ల అడుగుల్లో ఒకటిగా చూస్తున్నాను.

ఇది కేవలం నా ఒక్క దానికే వచ్చిన అవార్డుగా కూడా నేను భావించడం లేదు. ఈ పుస్తకంలో వున్న జీవితాలకి సగౌరంగా ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను.

అభినందనలతో…

కె. సజయ
30 సెప్టెంబర్ 2022

పుస్తకం ముందు మాట ఇక్కడ చదవండి.

మరుగున వున్నవారిని వెలికితీసే ప్రయత్నం : సజయకు కేంద్ర సాహిత్య పురస్కారం

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article