Editorial

Wednesday, January 22, 2025
కవితPOEM : ఇది రాజకీయ కవిత కాదు : జూకంటి జగన్నాథం

POEM : ఇది రాజకీయ కవిత కాదు : జూకంటి జగన్నాథం

 

జూకంటి జగన్నాథం

నేను ఇయ్యాల
బతికి ఉన్న శవాల గురించి మాట్లాడుతున్నాను

వీడు హఠాత్తుగా చనిపోతే
కొంచెం సేపు జ్ఞాపకాలను చప్పరించి మంచిచెడ్డలు మాట్లాడుకుని
కాసేపు ఏడ్చి ఊకుండే వాళ్ళం
నీటిమీద రాతలు రాసి రాసి
ఎవరికి వారే
దినవారాలు పెట్టుకొని
సజీవ సమాధి పొందుతున్న
వారి ఉద్దేశించి ధిక్కారంతో సంభాషిస్తున్నాను

హుషారుగా తలుగు తప్ప తీసినా అని
కలం కళ్ళు మూసుకొని పిల్లిలా
పాలు తాగుతూ ఉంది

చేనులో పడ్డ దొంగ పశుపు
బంజరు దొడ్డిలోకి సేరి
పాయమాలు కట్టే రోజు ఒకటి రానే రాదని
సంకలు గుద్దుకుంటు మస్తు సంబరపడుతున్నాడు

పెంట కుప్పను పంది తన ముట్టెతో కెల్లగించి
వాతావరణాన్ని కాలుష్య దుర్గంధ భూయిష్టం చేస్తున్న అత్యంత పెను విషాదం

అసహజ అకాల మరణాలకు
అధికారిక లాంఛనాలతో
అంత్యక్రియలు జరుపుతున్న కాలం

ఇప్పుడు సంతాపదినాల రోజులు నడుస్తున్నవి
కేవలం ఒకే ఒక్క తబలా ఆదితాళం క్లార్నెట్
విలయ నిలయ విద్వాంసుల
వాయిద్య గోష్టి వినవస్తున్నది

గప్ చుప్ గా గాలాన్నిఎరను కాజేసే
దాసోహ దాస దగుల్బాజీ కాలం నడుస్తున్నది

చిన్నప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు
కత్తి గొప్పదా కలం గొప్పదా అని
వ్యాసరచన పోటీ పెడితే
ఖడ్గము కన్నా కలమే గొప్పది అని రాస్తే
మొదటి బహుమతి వచ్చింది

అన్యాయం అధర్మం రాతలు గురించే
నేను ఇవ్వాళ కరాఖండిగా మాట్లాడదలుచుకున్నాను

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article