Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌మూడో కోణం : పుట్టబోయే కవల పిల్లల కథ : జింబో తెలుపు

మూడో కోణం : పుట్టబోయే కవల పిల్లల కథ : జింబో తెలుపు

పుట్టబోయే కవల పిల్లలు జీవితం గురించి మాట్లాడుకోవడం ఈ వారం పంచుకునే ఈ కథలోని ముఖ్యాంశం. ముఖ్యంగా ప్రసవం తర్వాత జీవితం ఉందా లేదా అన్నది కవలల సందేహం.

ఈ కథలో ఎన్ని కోణాలు వున్నాయో అన్న విషయం మీద అభిప్రాయ భేదాలు వుండవచ్చు. కానీ ఇది  ఆలోచింపచేస్తుందన్న విషయం మీద అభిప్రాయభేదం వుండే అవకాశం లేదు. చదవండి.  .

జింబో

Jimboకథలు ఏం చేస్తాయి? కవిత్వం ఏం చేస్తుంది? ఇంకా చెప్పాలంటే సాహిత్యం ఏం చేస్తుంది? కథలైనా, కవిత్వమైనా, సాహిత్యమైనా మనల్ని ఆలోచింపజేస్తాయి, ఆలోచింప చేయాలి కూడా. ఆలోచన మనిషి ప్రగతికి పునాది.

ప్రతి విషయంలోనూ పాజిటివ్ అంశాన్ని నెగటివ్ అంశాన్ని రెండూ చూడవచ్చు. మనం చూసే కోణం నుంచి అది ఆధారపడి ఉంటుంది.

చాలా రోజుల క్రితం ఇంటర్నెట్లో ఒక కథ చదివాను. నేను ఇప్పుడు చెప్పిన అంశాలకి అది సామీప్యంగా గా ఉంది. ఇంకా చెప్పాలంటే కథలోని పరిస్థితులు కూడా అదేవిధంగా ఉన్నాయని అనిపిస్తుంది.

ఆ కథలో పుట్టబోయే కవల పిల్లలు జీవితం గురించి మాట్లాడుకుంటాయి. ఆ సంభాషణ ఈ విధంగా కొనసాగుతోంది.

తల్లి గర్భంలో ఇద్దరు కవల పిల్లలు ఉంటారు. పుట్టబోయే పిల్లలకి ఏడెనిమిది నెలలు ఉంటాయి. ఆ కవల మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగుతుంది.

“మనం పుట్టిన తర్వాత జీవితం ఉంటుందా?” మొదటి కవల.

“ఎందుకు ఉండదు. ప్రసవం తర్వాత ఎంతో కొంత జీవితం ఉంటుంది. ప్రసవం తర్వాత మనం ఎలా ఉండాలో, దానికి సన్నద్ధం కావడం కోసమే మనం ఇక్కడ ఉన్నాం” చెప్తుంది పుట్టబోయే మరో బిడ్డ.

“చెత్త మాట్లాడకు ప్రసవం తర్వాత జీవితం లేదు. జీవితం అంటే ఏమిటి?”

“నాకు తెలియదు కానీ అప్పుడు చాలా వెలుతురు ఉంటుంది. మన కాళ్ళతో మనం నడుస్తాం మన నోటితోనే మనం తింటాం.”

“అవన్నీ నాకు తెలియదు. ప్రసవం తర్వాత మనం మన అమ్మను చూస్తాం. ఆమె మన బాగోగులని చూస్తుంది” చెబుతుంది మొదటి కవల.

“అది పూర్తిగా అర్ధరహితం. మనం నడవడం ఆసాధ్యం. నోటితో తినడం అంటే పరిహాసమే. కోపంగా అంటుంది రెండవ కవల. అక్కడితో వూరుకోదు. ఇంకా ఇలా అంటుంది. “పేగు ద్వారా మనకు ఆహారం అందుతుంది. పోషక ఆహార పదార్థాలు వస్తున్నాయి. ఆ తరువాత పేగుతో మనకు సంబంధం వుండదు. ప్రసవం తర్వాత జీవితాన్ని ఊహించలేం”

“ప్రస్తుతం తర్వాత ఏదో ఉంటుంది. ఇక్కడి కన్నా వేరుగా ఉంటుంది. వెలుగు కూడా వుంటుంది.”అని మొదటి కవల జవాబిస్తుంది.

“ప్రసవం తర్వాత జీవితం లేదు. జీవితానికి చివరి దశ ప్రసవం. ప్రసవం తర్వాత వెలుగు కాదు అంతా చీకటి ఉంటుంది. కటిక చీకటి. ఆరాటం భయం మనల్ని వెంటాడుతాయి .అవి మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళావు.”

“అవన్నీ నాకు తెలియదు. ప్రసవం తర్వాత మనం మన అమ్మను చూస్తాం. ఆమె మన బాగోగులని చూస్తుంది” చెబుతుంది మొదటి కవల.

“అమ్మా? అమ్మని నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు ఎక్కడ ఉంది ఆమె…”

“ఆమె మనచుట్టూ ఉంది. ఆమెలోనే మనం ఉన్నాం. ఆమె లేకుండా ఈ ప్రపంచం మనకు ఉండేది కాదు.”

“ఆమె నాకు కనిపించడం లేదు. ఆమె లేదు. వాదన కోసం నువ్వు చెబుతున్నావ్” రెండవ కవల అన్నది.

మొదటి కవల ఈ విధంగా జవాబు చెప్పింది. “నిశ్శబ్దంలో ఆమెను కొన్నిసార్లు నువ్వు వినవచ్చు. ఆమెను స్పర్శించవచ్చు. ప్రసవం తర్వాత వాస్తవం ఉంది. దానికి సంసిద్ధులను కావడమే – ఇప్పుడు మనం చేస్తున్న పని”

ఇదీ కథ. ఈ కథలో రెండు అంశాలు ఉన్నాయి. పుట్టిన తర్వాత జీవితం ఉందా? ఉంటే ఎలా ఉంటుంది?

ఈ గర్భంలో ఉన్న దాని కన్నా మంచి జీవితం ఉండదని అంటూనే… అదేమిటో చూడవచ్చు అంటుంది ఒక కవల. పుట్టిన తర్వాత వాస్తవికత ఉందని అనడంలో ఒక ఆశ కనిపిస్తుంది. ఆశా నిరాశలు ఈ కథల్లో కనిపిస్తాయి.

ఈ కథ చదివినప్పుడు ఎప్పుడో నేను రాసిన నా కవిత “బతుకు” గుర్తుకొచ్చింది. ఆ కవిత ఇలా వుంటుంది.

‘నే
చచ్చిపోతాననే కదూ
నీ బాధ
పిచ్చివాడా-

ఈ వ్యవస్థ లో
మనం బతికింది
తొమ్మిది మాసాలే!’

ఈ కథలో, కవితలో వాస్తవం ఉందని, మనిషి పుట్టిన తరువాత బతుకుతున్న బతుకు బతుక కాదన్న భావన వుంది. బతుకును ఈ కవిత వ్యతిరేకిస్తుందన్న వ్యక్తులూ వున్నారు.

ఎన్ని కోణాలు వున్నాయో అన్న విషయం మీద అభిప్రాయ భేదాలు వుండవచ్చు. కానీ ఈ కథ ఆలోచింపచేస్తుందన్న విషయం మీద అభిప్రాయభేదం వుండే అవకాశం లేదు.

కథ లోని రెండు అంశాలు రూడీ అయినవి. ప్రసవం తర్వాత జీవితం ఉంది. స్వతంత్రంగా జీవించవచ్చు. అన్నింటికన్నా కన్నా ముఖ్యమైంది అమ్మని చూడవచ్చు.

ఈ విధంగా కాకుండా కథని వ్యతిరేక భావనతో కూడా చూడవచ్చు. జీవితం బాగా లేదు కాబట్టి గర్భంలోనే ఉండాలని కోరుకోవడం లేదా అనుకోవడం ఉంది. అందుకని తిరోగమన కథను కూడా కొంతమంది చెప్పవచ్చు.

ఈ రెండు భావనలని తీసుకోవచ్చు. ఈ రెండు భావనలు కాకుండా మూడో కోణం కూడా ఈ కథలో ఉంది

ఆ దృష్టిని మనం అలవర్చుకోవాలి. ప్రసవం తర్వాత స్వతంత్రంగా జీవించవచ్చు. అమ్మని చూడవచ్చు. ప్రేమని పొందవచ్చు. ప్రేమను ఇవ్వవచ్చు.

నెగిటివ్ అంశాల్లో పాజిటివ్ అంశాలు కూడా ఉంటాయి. చూసే కోణం రావాలి కావాలి.

ఎన్ని కోణాలు వున్నాయో అన్న విషయం మీద అభిప్రాయ భేదాలు వుండవచ్చు. కానీ ఈ కథ ఆలోచింపచేస్తుందన్న విషయం మీద అభిప్రాయభేదం వుండే అవకాశం లేదు.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ. 13 వ వారం మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 14 వ వారం సందేహాలు కలిగించే కథ. 15 వ వారం గుల్జార్ కథ ‘మగాడు’. 15 వ వారం కథల్లో రచయిత గొంతు: వట్టికోట ఆళ్వారు స్వామి. 16 వ వారం ముసలితనం లేని కథ – రావి శాస్త్రి ‘మాయ’. 17 వ వారం పస గల వంశీ ‘పసలపూడి కథలు’.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article