Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌పెరుగన్నం: సందేహాలు కలిగించే కథల అవసరం - జింబో 'కథా కాలమ్'

పెరుగన్నం: సందేహాలు కలిగించే కథల అవసరం – జింబో ‘కథా కాలమ్’

ప్రతి ప్రతి వ్యక్తికీ సత్యం పట్ల ప్రేమ, విశ్వాసం ఉండాలి. మరీ ముఖ్యంగా రచయితలకి సత్యాన్ని వ్యక్తీకరించే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకపోతే ఆ రచయితని రచయితగా గుర్తించలేము. సత్యం పట్ల ప్రేమ దాన్ని వ్యక్తీకరించే ధైర్యం రచయితకి ఉండాలి.

అన్నిటికీ మిన్న సందేశాలు కాదు – సందేహాలు కలిగించే కథలు రాయాలి.

జింబో

నేను దాదాపు ఏడు సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశాను. 27 సంవత్సరాలు న్యాయమూర్తిగా పని చేశాను. న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని దగ్గరగా చూసిన అనుభవం నాకుంది. న్యాయవాదిగా పనిచేస్తున్న కాలంలో న్యాయవాదులని మరీ దగ్గరగా చూశాను.

కుర్చీ నవ్వితే మా న్యాయవాద మిత్రులు నవ్వేవారు. కుర్చీ సీరియస్ గా మూతి బిగిస్తే మా వాళ్ళు మరీ సీరియస్ గా మూతి బిగించే వాళ్ళు. ఇది న్యాయవాదిగా పనిచేసినప్పటికీ సన్నివేశం. ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారి పోయినవి. కొత్త వేషం. కొత్త అనుభవం.

ఈ రెండు సందర్భాలలోనూ కవిత్వం రాశాను. కథలూ రాశాను. చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పాను.

“కన్ఫెషన్ “(నేర అంగీకారం ) అన్న కవితలో ఈ విధంగా అన్నాను.-

“నేను మోసగాడిని
అనునిత్యం అనుక్షణం
నన్ను నేను మోసగించుకుంటున్న పెద్ద మోసగాడిని
నా తప్పొప్పులను, నా అవలక్షణాలన సమర్ధించుకుంటూ
నన్ను నేను మెప్పించు కుంటూ, బతుకుతున్న పెద్ద మోసగాడిని
యువరానర్లను, మైలార్దులని భరిస్తూ
వాళ్ల అవ లక్షణాలని ప్రశంసిస్తూ పొగుడుకుంటూ
బతుకీడుస్తున్న మోసగాడిని ”

ఓ దిన పత్రికలో 1994 వ సంవత్సరములో “లావొక్కింతయు..” అన్న కాలం రాశాను. అందులో నుండి కథాంశం ఉన్న వాటిని ఎంపిక చేసి “రూల్ ఆఫ్ లా” అన్న కథల సంపుటిని వేశాను.

నేను రాసిన కవితలూ , కథలూ నేర న్యాయ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడ్డాయి

ఓ దిన పత్రికలో 1994 వ సంవత్సరములో “లావొక్కింతయు..” అన్న కాలం రాశాను. అందులో నుండి కథాంశం ఉన్న వాటిని ఎంపిక చేసి “రూల్ ఆఫ్ లా” అన్న కథల సంపుటిని వేశాను. నిజానికి అవి అన్నీ కథలు కాదు. కథ ఎలిమెంట్ ఉన్నవాటిని సంపుటిగా ప్రచురించాను. ఆ కథల్లో సంభాషణలు ఎక్కువగా ఉంటాయి. కానీ అవి విషయ పరిధిని దాటవు. మాట మాటకు మధ్య తర్కం ఉంటుంది. ఒక ప్రయోజనాత్మక దృష్టితో అవి రాశాను.

నేర న్యాయ వ్యవస్థపై నేను రాసిన కథలు వ్యవస్థకి వ్యతిరేకమైనది కావు. వ్యవస్థకు అనుకూలమైన కథలే. అంటే – నేర న్యాయ వ్యవస్థలోని లోపాలను గుర్తించి వాటిపైన నా దృక్పథాన్ని చెప్పటం చాలా కథల్లో నేను చేసిన పని.

ఆ శాసనానికి విరుద్ధంగా ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే వాళ్ల వీపులు సారా డ్రమ్ములూ పగలడం జరిగిది.

మద్యపాన నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక కథ రాశాను దాని పేరు ‘నిన్న మొన్న నేడు రేపు’

ఈ కథలోని పాత్రధారి పేరు యెల్లయ్య. అతని హోటల్ పేరు రెడ్డి హోటల్. అది హోటల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటుంది. యెల్లయ్య చాయ్ తయారుచేయడంలో మిరపకాయ బజ్జీలు చేయడంలో సిద్ధహస్తుడు. ఆ వూరిలో అతని హోటల్ ఆ రెండింటికీ ప్రసిద్ధి. పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉండటం వల్ల పోలీసులు తరచూ అతను హోటల్ నుంచి చాయ్ లు. మిర్చీలు తెప్పించుకునే వారు. డబ్బులు అడిగినప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. ఉద్దెర పెట్టేవాళ్ళు. అడిగితే కోపగించుకునేవాళ్లు.

ఆ కాలంలో నక్సలైట్లు సారా అమ్మకాలకి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. చుట్టుపక్కల ఊర్లో ఎక్కడ కూడా సారా అమ్మకాలు జరపొద్దని శాసించారు. ఆ శాసనానికి విరుద్ధంగా ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే వాళ్ల వీపులు సారా డ్రమ్ములూ పగలడం జరిగిది. దాంతో కాంట్రాక్టర్లు సారాన్ని అమ్మడం పూర్తిగా మానేశారు.

ధిక్కారాన్ని సహింతునా అని ప్రభుత్వం సారాని ఎలాగైనా అమ్మించాలని దృడ కంకణం కట్టుకుని పోలీస్ స్టేషన్ లన్నిటిని ప్రభుత్వ సారాయి దుకాణంగా మార్చేసింది. ఎన్కౌంటర్ లే కాదు సారా ఆమ్మడం కూడా మీ బాధ్యతే అని పోలీసులను ప్రభుత్వం శాసించింది. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఇన్స్ పెక్టర్ వరకు సారాని అమ్మడమే తమ జీవితం అనుకుని సారని అమ్మేవాళ్ళు.

తన బకాయిలను అప్పుడప్పుడూ భయంభయంగా వెలిగే పోలీసులకు గుర్తు చేసేవాడు యెల్లయ్య. ఇవ్వమని ప్రాధేయ పడేవాడు. అతని పోరు పడలేక పోలీసులు డబ్బులకి బదులుగా సారా ప్యాకెట్లు ఇచ్చి అమ్ముకోమ్మన్నారు. తాగమన్నారు. గత్యంతరం లేక డబ్బులకు బదులుగా సారా పొట్లాలు తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఎల్లయ్య. వీలైతే అమ్మేవాడు… కానప్పుడు తానే తాగడం అలవాటు చేసుకున్నాడు. కాలక్రమంలో అతని వ్యాపారం బాగా పెరిగింది. యెల్లయ్య కాస్త ఎల్లారెడ్డిగా మారాడు. అతని హోటల్ రూపు రెఖలు మారిపోయాయి. రెడ్డి హోటల్ కాస్త కాస్త మిలటరీ హోటల్ గా మారిపోయింది. అతను సారా పొట్లాల నుంచి నుంచి IMFL కి మారిపోయాడు. నౌకర్లు చాకర్లు వచ్చేశారు.

ఒక రోజు రాత్రి రెడ్డి తన లోపలి రూములో కూర్చొని మందు తీసుకుంటున్నప్పుడు చేసి అతన్ని అతని మందు సీసాని పోలీసు స్టేషంకి తీసుకొని పోయినారు.

కాలం మారిపోయింది. దూబగుంట లో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం దావానలం అయ్యింది. అయ్యిందో లేక దాన్ని ఆ విధంగా మార్చారో మీకే వదిలేస్తున్నాను. ఎన్నికలు వచ్చాయి. తాము అధికారంలోకి వస్తే ఉన్న మద్యపాన నిషేధం చేస్తామని ఎన్ టి రామారావు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రజలు రామారావుని చూసి ఓట్లు వేశారో రెండు రూపాయల కిలో బియ్యం చూసి ఓట్లు వేశారో మధ్యపాన నిషేధం చూసి ఓట్లు వేశారో తెలియదు కానీ బ్రహ్మాండమైన బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు.

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మద్యపాన నిషేధ ఆర్డినెన్స్ ని గవర్నర్ కి పంపించారు రామారావు. ఆ విధంగా మొదలయింది మద్యపాన నిషేధం.

తాగుడికి అలవాటైన ఎల్లారెడ్డికి నిషేదం వల్ల ఏమి ఫరక్ పడలేదు. డబ్బులు ఇచ్చి డాక్టర్ సర్టిఫికెట్ సంపాదించాడు. దాని ఆధారంగా బాటిల్ తెచ్చుకొని ఎంజాయ్ చేసేవాడు. చిన్నల్లుడు తిరుగుబాటు చేసి రాజ్యం చేపట్టి లైసెన్సులు కూడా రద్దు చేయడంతో యెల్లారెడ్డి కష్టకాలం మొదలైంది. పిల్ల కాకి కథ ను గుర్తుకు తెచ్చుకున్నాడు ఎల్లారెడ్డి. పిల్ల కాకి కన్నా తల్లికాకే మేలని అనుకున్నాడు.

నిషేధం ఉన్నప్పటికీ మద్యం ఆ ఊర్లో వరదలై పారేది. ఆ వూర్లోనే కాదు. ప్రతి వూర్లో అలాగే వుండేది. కానీ ఎల్లారెడ్డికి తెచ్చుకుని తాగాలంటే భయం వేసిది. చుట్టుపక్కల ఉన్న వాళ్లు అందరూ తాగడం చూసి అతను తెచ్చుకొని తాగేవాడు.

ఎల్లారెడ్డి హోటల్ కాస్త కాయ మిరపకాయ బజ్జీలకే కాదు బిర్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. పోలీసులు కూడా అతను హోటల్ లో బిర్యాని ని ఎగబడి తినేవాళ్ళు.

చాలామంది పోలీసులు డబ్బులు సరిగా ఇచ్చేవారు కాదు. దాంతో పోలీసులతో అతనికి తరచూ గొడవలు వచ్చేవి. పోలీసులకి అతను కోపం తెప్పించేవాడు.

యెల్లా రెడ్డి పని పట్టాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. సమయం కోసం చూస్తూ వున్నారు. ఒక రోజు రాత్రి రెడ్డి తన లోపలి రూములో కూర్చొని మందు తీసుకుంటున్నప్పుడు చేసి అతన్ని అతని మందు సీసాని పోలీసు స్టేషంకి తీసుకొని పోయినారు. ఇన్స్ పెక్టర్ ధర్మరాజు ముందు హాజరుపరిచారు. తెల్లగా బతుకుతున్న యెల్లా రెడ్డిని చూసి ఎప్పటి నుంచో కళ్లు మండుతున్న ధర్మరాజుకి అతను మందు సీసాతో పట్టుబడటం గొప్ప ఆనందాన్నిచ్చింది. ఎల్లారెడ్డికి లాకం రుచి కొంత చూపించారు. పూర్తి ట్రీట్మెంట్ మొదలు కాకముందే అతని భార్య ఓ రాజకీయ నాయకున్ని పట్టుకొని ౩౦,౦౦౦ రూపాయలు ధర్మరాజు ఒళ్లో పోసింది అతని భార్య. దాంతో చిన్న దెబ్బల తోనే సరిపోయింది. యదా ప్రకారమే కేసు రిజిస్టర్ అయింది. ఖజానా ఖాళీ అయిపోయింది

మద్యపాన నిషేధం ఎత్తి వేస్తే తప్ప ప్రభుత్వం గట్టెక్క లేని పరిస్థితులు వచ్చిపడ్డాయని నిషేదం అమలు లో విఫలం అయ్యామని చెబుతూ ప్రభుత్వం కఠోర నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని గోరంతలు కొండంతలు చేసింది ప్రభుత్వం. మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసింది.

“మందు కొనండి-ప్రభుత్వాన్ని రక్షించండి” అన్న ప్రకటనలు వచ్చేసాయి. ఈ మార్పులన్నింటిని చూసిన యెల్లా రెడ్డి మనస్సు బుడ్డీ వైపు లాగడం మొదలైంది. కానీ లాకప్ రుచి, నాలుగు రోజుల జైలు జీవితం గుర్తుకొచ్చింది.

ఈ కథలో సత్యం ఉంది. సత్యంతో పాటు సందేహాలు ఉన్నాయి. సత్యం చెప్పడం సాహసం అవునో కాదో కానీ చెప్పకపోవటం పిరికితనం అవుతుంది.

చివరలో ముగింపు ఇలా ఉంటుంది. అవి యెల్లా రెడ్డి మాటలు-
“మొన్న అలవాటు లేనప్పుడు బలవంతపెట్టి కనిపించారు. అలవాటు చేశారు.
నిన్న అలవాటు అయిన తర్వాత చాటుకు తాగినా కూడా కేసు పెట్టారు. డబ్బు గుంజారు.
ఈరోజు మానేద్దాం అనుకుంటే నేరం కాదు అంటున్నారు.

మొన్న నేరం కాదు. నిన్న నేరం.
ఈ రోజు నేరం కాదు .
ఇదేమి న్యాయమో ఎల్లారెడ్డి కి అర్థం కాలేదు.
రేపు తీసా దగ్గర లేకపోతే నేరం అంటారేమోనని భయం వేసింది”

ఎందుకైనా మంచిదని హోటల్ ని అక్కడినుంచి వేరే సుదూర ప్రాంతానికి తరలించాడు. ఇదీ కథ.

ఈ కథలో సత్యం ఉంది. సత్యంతో పాటు సందేహాలు ఉన్నాయి. సత్యం చెప్పడం సాహసం అవునో కాదో కానీ చెప్పకపోవటం పిరికితనం అవుతుంది.

నెగిటివ్ విషయాన్ని ఫోకస్ చేసి పాజిటివ్ విషయాన్ని తెలుసుకునే విధంగా నేను రాసిన ఇలాంటి కథలే “రూల్ ఆఫ్ లా కథలు”.

ఈ కథల ముగింపులో పరిష్కారం ఉండదు. ప్రశ్నలు ఉంటాయి. సందేహాలు ఉంటాయి. అవి ఆలోచనలకి దారితీస్తాయి.

సామాజిక బాధ్యత గల రచయిత చేయాల్సిన పనులు ఇవే. ఈ పని చేయనప్పుడు ఆ రచయిత విఫలమైనట్లు భావించాల్సి ఉంటుంది.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ. 13 వ వారం మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article