Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఈ వారం పెరుగన్నం : మునిపల్లె రాజు చెప్పిన 'ఆ బోగం మనిషి' కథ...

ఈ వారం పెరుగన్నం : మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ – జింబో

Munipalle Rajuఅసలు కథలు రాయాలంటే అనుభవంతో బాటు ఎంతో జీవితానుభవం ఉండాలి. అలాంటి ఎన్నో కథలని మునిపల్లె రాజు రాశారు. నాకు నచ్చిన కథలు చాలా ఉన్నప్పటికీ ‘భోగం మనిషి’ అన్న కథ చదివి దుఃఖాన్ని ఆపుకోలేక పోయాను. నన్ను కదిలించి, కలిచి వేసిన ఆ కథ గురించి మాట్లాడుకుందాం.

జింబో

చిన్న కథకు నవలకి ఉన్న తేడా అంతా ప్రమాణంలోనే కాదు. ప్రయోగం లోనూ ఉంటుంది.

సాధారణంగా చిన్న కథకు కేంద్ర బిందువుగా ఒకే వ్యక్తి ఉంటాడు. కానీ అనుభవజ్ఞులైన రచయితలు రాసే కథల్లో మనకు కనిపించని మరో పాత్ర కూడా ఉంటుంది. ఆ కథ ముగింపుకి వచ్చేసరికి ఆ ఫలానా పాత్ర కథలో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది.

కథకి వస్తువు ముఖ్యం. కానీ వస్తువే కథగా మారదు. కథ గా మారాలంటే చుట్టూ సంఘర్షణలు, సంఘటనలు ఉండాలి. వాటిని సరిగ్గా చెప్పే శిల్పము ఉండాలి.
అనుభవాలే కాదు పరిణితి చెందిన జీవిత అనుభవం వున్నప్పుడు ఆ కథ మరింత బలంగా ఉంటుంది.
అలాంటి కథే మునిపల్లె రాజు రాసిన కథ ‘భోగం మనిషి’కథ.

మిత్రుడు నరేందర్ ఒక రోజు ఫొన్ చేసి “రాజు గారిని మనం ఎలా మిస్ అయ్యాము” అన్నాడు. ఆ తరువాత మా సంభాషణల్లోకి అయన కథలు వచ్చేసాయి.

ఈ కథ గురించి చెప్పడానికి ముందు అయనతో నాకున్న పరిచయం చెప్పాలి. నాకు సాహిత్యం మీద అభిరుచి ఏర్పడిన తర్వాత చాలా మంది కథలు చదివాను. పాత తరం రచయితల కథలు దాదాపుగా అన్నీ చదివాను. దురదృష్టవశాత్తు నా తొలి దశలో నేను మిస్సయిన రచయిత మునిపల్లె రాజు. చాలా రోజులకి వారి కథలు చదివిన మిత్రుడు నరేందర్ ఒక రోజు ఫొన్ చేసి “రాజు గారిని మనం ఎలా మిస్ అయ్యాము” అన్నాడు. ఆ తరువాత మా సంభాషణల్లోకి అయన కథలు వచ్చేసాయి.

1990 ప్రాంతంలో ప్రముఖ కథా రచయిత శ్రీపతి, నెనూ కలిసి నారాయణగూడ లోని తాజ్ మహల్ హోటల్ లో ‘కథకుల డిన్నర్’ ని ఏర్పాటు చేశాం. అప్పుడు మునిపల్లె రాజు గారు వ్యక్తిగతంగా నాకు పరిచయమయ్యారు. 1994లో నా కథ ‘పావు’ చదివి వారు మళ్ళీ పలకరించారు. ఆ తర్వాత ఆ కథని ఇంగ్లీషులోకి అనువాదం చేశారు కూడా. ఆ కథని ‘ప్రాతినిధ్య కథ’ అని ఆయన అనేవారు.

అసలు కథలు రాయాలంటే అనుభవంతో బాటు ఎంతో జీవితానుభవం కూడా ఉండాలి. అలాంటి ఎన్నో కథలని మునిపల్లె రాజు రాశారు. నాకు నచ్చిన కథలు చాలా ఉన్నప్పటికీ ‘భోగం మనిషి’ అన్న కథ చదివి దుఃఖాన్ని ఆపుకోలేక పోయాను. నన్ను కదిలించి, కలిచి వేసిన ఆ కథ అ గురించి ఇప్పుడు  మాట్లాడుకుందాం.

నాలుగు రోజుల నుంచి అతని కోసమే తండ్రి ప్రాణం నిలిచి ఉందని చెబుతాడు. వచ్చి తులసీ తీర్థం పోయాలని చెబుతాడు. అయినా బాలకృష్ణ నిరాకరిస్తాడు.

తన తండ్రి వేరే స్త్రీతో ఉంటున్నాడన్న కక్షతో, కోపంతో అతని అవసాన దశలో కూడా అతన్ని చూడటానికి బాలకృష్ణ నిరాకరిస్తాడు. బాలకృష్ణ మేనమామ ఆందోళన చెందుతూ ఉంటాడు. అతను రాకపోతే ఎట్లా? ఆస్తి ఏమవుతుందోనని అతని బాధ? అతను బాలకృష్ణకి రాసిన ఉత్తరానికి జవాబు ఉండదు. తంతికి స్పందన ఉండదు.

చివరికి వాళ్ళ సేవకుడు వెంకటాద్రి వచ్చి బాలకృష్ణ రమ్మంటాడు. బాలకృష్ణని చిన్నప్పుడు భుజాల మీద మోసిన వ్యక్తి వెంకటాద్రి. అతనికి రహస్యంగా తాటి ముంజలు, తేగలు, పచ్చి వేరుశనగ పప్పు, అతను కోరినవన్నీ తెచ్చి ఆప్యాయంగా తినిపించిన వాడు అతను. వాళ్ల ఇంటి ముందు సేవక ధర్మంతో పడిగాపులు పడిన వ్యక్తి వెంకటాద్రి.

వెంకటాద్రి వచ్చి బాలకృష్ణని రమ్మంటాడు. నాలుగు రోజుల నుంచి అతని కోసమే తండ్రి ప్రాణం నిలిచి ఉందని చెబుతాడు. వచ్చి తులసీ తీర్థం పోయాలని చెబుతాడు. అయినా బాలకృష్ణ నిరాకరిస్తాడు. బాలకృష్ణ కోసమే తండ్రి ప్రాణం నిలిచి వుందని చెబుతాడు.

బాలకృష్ణ వేంకటాద్రి తల గుడ్డ వైపు చూశాడు. చేతిలో కర్ర చూశాడు. అతని మొహం చూసాడు. ఏమిటీ విశ్వాసం? ఏమి వేదాంతం? ఏమి నమ్మిక? నవ్వులు, సంస్కారులు -అనుకునే ఈ విద్యావంతుల కందని ధర్మం, విశ్వాసం ఈ నిరక్షర కుక్షి, సేవకుడు, వృద్ధుడూ- ఇతనిలో అంతర్వాహినిగా, గత యుగాల నుండి తెగిపోని శాశ్వత బంధంగా ఎట్లా నిలిచింది? బాలకృష్ణకి ఏమీ అర్థం కాదు. కాకపోవడమే కాదు. తన బింకమూ ద్వేషమూ, సంఘర్షణా అర్దరహితమై తోచినవి. అతని మాటలు తనలోని లోపాన్ని కుతర్కపు ఆడంబరత్వాన్ని తత్వాన్ని ఎత్తి చూపినట్టుగా తోచినవి.

“చిన్న బాబూ- నేను సతువుకుణ్ణోన్ని కాదు. తమకు తెలియనిది ఏమీ లేదు. అమ్మగారు తమర్ని ఉన్నఫళాన తోలుకు రమ్మన్నారండి.”అంటాడు వెంకటాద్రి. ఆ మాటతో బాలకృష్ణ కదులుతాడు.

కారులో తమ ఊరికి చేరుకుంటారు . తను చేరుకోగానే బంధువులు మామ అందరూ చుట్టుముడతారు. ఆస్తి గురించి వీలునామా గురించి, బీరువా తాళం చెవి గురించి మాట్లాడతారు తప్ప ఎవరు కూడా తులసి తీర్థం గురించి మాట్లాడరు. ‘ఆ భోగం మనిషిని’ ఇంట్లో నుంచి ఏ విధంగా తరిమికొట్టాలి అన్న విషయం గురించి మాట్లాడతారు.

తండ్రి కన్నుమూస్తాడు. బీరువాకి సంబంధించిన తాళం చెవులు అతని తలగడ కింద దొరుకుతాయి. ఆ తాళం చెవి చిన్న పెట్టది. ఆ పెట్టె ఆ భోగం మనిషి దగ్గర ఉంటుంది.

బాలకృష్ణ తండ్రి దగ్గరికి వెళ్తాడు. బాలకృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్న తాళంచెవి అతని చేతిలో ఉంచుతాడు బాలకృష్ణ తండ్రి. ఆ తర్వాత తండ్రి కన్నుమూస్తాడు. బీరువాకి సంబంధించిన తాళం చెవులు అతని తలగడ కింద దొరుకుతాయి.

ఆ తాళం చెవి చిన్న పెట్టది. ఆ పెట్టె ఆ ‘భోగం మనిషి’ దగ్గర ఉంటుంది.

తండ్రి కర్మ పూర్తి చేసిన తర్వాత ఆ పెట్టని తెరుస్తాడు బాలకృష్ణ. అందులో ఆస్తికి సంబంధించిన కాగితాలు ఏమీ ఉండవు. ఆస్తి పత్రాలూ ఉండవు. అందులో ఓ ఉత్తరం ఉంటుంది. ఆ ఉత్తరంలో ఆస్తికి సంబంధించిన అంశాలు ఉండవు.ఆ ఉత్తరమే వీలునామా.

ఆ ఉత్తరం ఇలా ఉంటుంది…

“నాన్నా! బాలకృష్ణా! నాకు గత పది రోజుల నుండి ఇక బతుకననే అనుమానం వేధించుకు తింటున్నది. మన దురభిమానాలు వదిలేద్దాం. ఈ ఉత్తరం నీతో నా చివరి మాటలు చెప్పడానికి. విను- మీ అమ్మను నేను ఎప్పుడూ బాధించలేదు. రాచి రంపాన పెట్టలేదు. దానిది ఒక తత్వం. మొండితనం మంకుపట్టు. నాకు అవి పడని మాట నిజమే. యశోద ఇంటికి రాకపూర్వమే దాని తత్వం అట్లా ఉండేది. యశోద కులానికి మాత్రమే వేశ్య. ఒక సందర్భంలో ఆమె రక్షించవలసిన బాధ్యత నా పైన పడ్డది. మన పూర్వీకులు సంగతి నీకు కర్ణాకర్ణిగా అయినా తెలిసి ఉండవచ్చు. మన ఇంటికి తెచ్చాను. మగవాడి రక్షణలేని స్త్రీ గతి ఈ దేశంలో అధోగతే కదా! ఆమె వచ్చినప్పటి నుంచి మీ అమ్మ పోరు ఎక్కువైంది. సహజమేనని ఊరుకున్నాను. మీ మామయ్య వచ్చి ఆస్తి పంపకాలు, హక్కులు అని ప్రారంభించాడు. నాకు చిర్రెత్తి ఆస్తంతా యశోద పేరు రాశాను ఒకసారి. ఆ కాగితాన్ని ఆమె చించి వేసింది. ఏడుపు ఒక్కటే మీ అమ్మకు తెలుసు. కానీ యశోదకు ఈ భవిష్యత్తు తెలుసు . నేను తాత్సారించినా నీకు డబ్బులు, దుస్తులు, పుస్తకాలు పుష్కలంగా పంపించే ఏర్పాటు చేసేది. నీకు భార్య వస్తే వీణా నేర్పించాలని ఎంతో కుతూహల పడేది.

నేను పోతే ఎట్లా అని అడిగాను. నువ్వు ఉన్నావ్ అన్నది. నువ్వు ఎత్తుకొని ఆడించిన వాడివి కాదు అన్నాను. ఏమీ అక్కర్లేదు అన్నది. ఆ నమ్మకాన్ని నేనెందుకు చెడగొట్టాలి.

ఐనా ఈ కులస్త్రీ గాని మనిషిని ఎవరు గుర్తిస్తారు? కొంత ఆస్తి వ్రాస్తానన్నాను. వద్దన్నది. అలా చేస్తే చచ్చి పోతానన్నది. నీతో ఒక్కమాట కోసం- ఇన్నేళ్లు పడిచచ్చింది. నువ్వూ, అమ్మ ఆ అవకాశం దానికి ఇవ్వలేదు. ఆస్తి వద్దు అన్నావు – నేను పోతే ఎట్లా అని అడిగాను. నువ్వు ఉన్నావ్ అన్నది. నువ్వు ఎత్తుకొని ఆడించిన వాడివి కాదు అన్నాను. ఏమీ అక్కర్లేదు అన్నది. ఆ నమ్మకాన్ని నేనెందుకు చెడగొట్టాలి.

మీ మామయ్య కు చెప్పు!నేను ఆస్తిని పాడు చేయలేదని. మీ అమ్మకు చెప్పు మనది పూర్వ జన్మ సుకృతం అని.

నీకు తెలుసునో, తెలియదో యశోద రాత్రిళ్లు ఆవు పాలు మాత్రమే తాగుతుంది. సంగీతం కోసం వచ్చిన అలవాటది. యశోదను కూడా నువ్వు మనిషిగా చూస్తే నేనామెను ఇక్కడికి ఏ పరిస్థితుల్లో తెచ్చానో, ఆ కర్తవ్యం పూర్తవుతుంది. నా అస్తికలు కాశీలో కలిపినంత పుణ్యం అదే నాకు”

బాలకృష్ణ గబగబా ఆమె దగ్గరికి పరిగెత్తాడు. తన కోసమే నిరీక్షిస్తూన్నట్టుగా ఆమె కన్నులు చెబుతున్నవి.

“అమ్మ -కృష్ణుణ్ణి దేవకి కన్నది. కానీ యశోద పెంచింది. నా గోవుల పాలన్నీ నీకిస్తాను.
మా నాన్నగారు గొప్ప మనిషి. ఆయన కొడుకునని అని పించుకుంటాను” అన్నాడు.

ఈ కథలో కదిలించే ప్రధాన అంశాలు రెండు

బాలకృష్ణ కోసమే అతని తండ్రి ప్రాణం వేచి ఉందన్న విషయం. ఆ విశ్వాసం, నా నమ్మిక-అది నిజంగా జరగడం.

ఈ విషయం నా అనుభవంలో కూడా ఉంది. కూతురి రాక కోసం మరణశయ్య మీద ఎదురు చూసిన తండ్రిని చూసిన అనుభవం నాకుంది. అదే విధం గా కొడుకు కోసం ఎదురు చూసిన తల్లి అనుభవం కూడా నాకు ఉంది. ఆ అనుభవం వల్ల కథ చదివి కదిలిపోయాను.

ఆ తండ్రి వీలునామా లాంటి ఉత్తరం చదివి కన్నీళ్ల పర్యంతమయ్యాను.

మంచి కథ చదివి కన్నీళ్ళ పర్యంతం కావడం అంటే ఆ కథలో గొప్పతనం వున్నట్టే. అదేవిధంగా ఏదైనా గొప్ప ఫీలింగ్ కథ కలుగ చేయాలి.

ఆయన కథలు కన్నీళ్లు తెప్పించడమే కాదు.కర్తవ్యాన్ని కూడా బోధిస్తాయి. మరో విషయం. కథలో నామ మాత్రం గా కనిపించే పాత్ర చుట్టూ కథ తిరగడం ఈ కథ లోని ప్రత్యేకత.

ఈ కథలో మరో మరో విషయం ఉంది. బాలకృష్ణ ఇంటికి రాగానే అందరూ ఆస్తి గురించి వీలునామా గురించి నగల గురించి ,తాళం చెవుల గురించి అడగమంటారు. కానీ ఎవరు కూడా తులసి తీర్థం గురించి మాట్లాడరు. చెప్పరు.

అందరి ఆసక్తి ఆస్తి మీదేనా? ఏమీ లేవా? జీవి ఇహ లోకాన్ని వదిలి పోయే సమయంలో? చేసిన తప్పులు? క్షమార్పణలు? వీడ్కోలు అదిరింపులు? మర్చిపోవటాలు ఏమీ లేవా ? అనుకుంటాడు బాలకృష్ణ.

ఎంత జీవితానుభవం ఉంటే ఇలాంటి కథ, ఇంత లోతైన వాక్యాలు పుడతాయి!

జీవితానుభవానికి మారుపేరు మునిపల్లె రాజు కథలు. ఆయన కథలు కన్నీళ్లు తెప్పించడమే కాదు. కర్తవ్యాన్ని కూడా బోధిస్తాయి. మరో విషయం. కథలో నామ మాత్రం గా కనిపించే పాత్ర చుట్టూ కథ తిరగడం ఈ కథ లోని ప్రత్యేకత.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article