Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌జింబో కథా కాలమ్ : రచయితలు మహాచరిత్ర కారులు - మచ్చుకు పొట్లపల్లి రామారావు కథ...

జింబో కథా కాలమ్ : రచయితలు మహాచరిత్ర కారులు – మచ్చుకు పొట్లపల్లి రామారావు కథ చదవాలే!

చరిత్రకారులు మాత్రమే చరిత్రకి అక్షర రూపాన్ని ఇవ్వరు. వారు రాసిన చరిత్రలో అప్పటి జీవన విధానం, దోపిడి, జీవన చరిత్ర పూర్తిగా ప్రతిబింబించదు. ఆ పని చేసేది రచయితలు.

మరో విధంగా చెబితే, చరిత్రకారులు సృష్టించే చరిత్రలో జీవిత కోణం తక్కువగా ఉంటుంది. ఆ ఖాళీని రచయితలూ పూర్తి చేస్తున్నారు. తమ రచనల ద్వారా అప్పటి జీవన విధానాన్ని వాళ్ళు మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు.

ఈ వారం పెరుగన్నం నేపథ్యం ఇదే. కథకులు చరిత్రకారులుకూడా అనేందుకు నిదర్శనంగా  పొట్లపల్లి రామారావు రాసిన ఒక చక్కటి కథను పరిచయం చేస్తాను.

జింబో

చరిత్రకి ఒక్కొక్కరు ఒక్కో రకమైన భాష్యం చెబుతారు.
అందరూ ఒప్పుకున్న అబద్ధం చరిత్ర అని వోల్టేర్ అన్నాడు. నాగరికతకు మేధావులు ఇచ్చిన నిర్వచనం చరిత్ర అని మరో చరిత్ర కారుడు అన్నాడు. ఇట్లా చరిత్ర కి ఎన్నో నిర్వచనాలు.

ఇక శ్రీ శ్రీ విషయానికి వస్తే-

“ఏ యుద్ధం ఎందుకు జరిగెనో
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో
తారీఖులు దస్తావేజులు
ఇవి కావోయి చరిత్రకి అర్దం
ఆ రాణి ప్రేమ పురాణం
ఈ ముట్టడికైన ఖర్చులు
ఇవి కావోయ్ చరిత్ర సారం”
ఇలా కొనసాగుతుంది “దేశచరిత్రలు”అన్న కవిత.

నైలునది నాగరికతలో సామాన్యుని జీవితం ఎలావుంది.? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీ లెవ్వరు? అంటూ ప్రశ్నిస్తూ చరిత్ర గురించి వివరిస్తాడు శ్రీ శ్రీ. ఏది చరిత్ర కాదో, ఏది చరిత్రో కూడా చెబుతాడు శ్రీశ్రీ.

చరిత్రకారులు చరిత్రని రాస్తారు. అందులో తారీఖులు దస్తావేజులు ప్రముఖమైన పాత్రను పోషిస్తాయి. ఆ కాలమాన పరిస్థితుల లోని నాగరికత గురించి, అప్పటి కట్టడాల గురించిన వివరణ చరిత్రలో మనకు ఎక్కువగా కనిపిస్తుంది. యుద్ధాల గురించి, సందుల గురించి సాహసాల గురించిన వివరాలు మనకు చరిత్రలో దర్శనమిస్తాయి.

చరిత్రని చాలామంది సృష్టిస్తారు. ఎంతో మంది రాస్తారు. ఎన్నో సంఘటనలు, సందర్భాలు చరిత్రలో మిగిలి ఉంటాయి. అయితే వీటికి అక్షర రూపాన్ని చరిత్రకారులు ఇస్తారు. చరిత్రకారులు మాత్రమే చరిత్రకి అక్షర రూపాన్ని ఇవ్వరు.

చరిత్రకారులు రాసిన చరిత్రలో అప్పటి జీవన విధానం, దోపిడి, జీవన చరిత్ర పూర్తిగా ప్రతిబింబించదు. ఆ పని చేసేది రచయితలు.

కవులు ప్రశ్నిస్తారు. చరిత్ర అంటే ఏమిటో చరిత్ర ఏది కాదో వివరిస్తారు. కానీ అప్పటి జీవన చిత్రణ కవిత్వంలో కనిపించదు. నేటి ఆధునిక కవిత్వం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆధునిక కవిత్వంలో కథనం తక్కువ. కథా నేపథ్యం ఉండదు. ఆ విధంగా పొందుపరుస్తూ కథనాతంక కథలు చాలా తక్కువగా వచ్చాయి

రచయితలు ఆ బాధ్యతలను నిర్వహిస్తారు. అది కథల రూపంలో కావచ్చు. నవల రూపంలో కావచ్చు. నాటకం రూపంలో కూడా ఉండవచ్చు. అందుకు ఉదాహరణలుగా ఎన్నో పేర్కొనవచ్చు. ఎన్నో నవలని మనం ఉదహరించవచ్చు. దాశరధి రంగాచార్య రాసిన చిల్లర దేవుళ్ళు కావచ్చు. నవీన్ రాసిన కాలరేఖలు కావచ్చు. అంపశయ్యా కావచ్చు. అవి కూడా చరిత్రలో భాగమే. వాటిల్లో అప్పటి జీవనం, దోపిడి, సంఘర్షణ ఇట్లా ఎన్నో ఉంటాయి.

తెలంగాణలో కథలే లేవని అన్న వాళ్ళకి ఉదాహరణలుగా ఎంతో మంది రచయితల పేర్లని మనం పేర్కొనవచ్చు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి పొట్లపల్లి రామారావు.

కన్యాశుల్కం నాటకంలో ఆ కాలం లో ఉన్న కన్యాశుల్కమే కాదు. అగ్రహార జీవితం కూడా అందులో కనిపిస్తుంది. చరిత్రకారులు సృష్టించే చరిత్రలో జీవిత కోణం తక్కువగా ఉంటుంది. ఆ ఖాళీని రచయితలూ పూర్తి చేస్తున్నారు. తమ రచనల ద్వారా అప్పటి జీవన విధానాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారు.

తెలంగాణలో కథలే లేవని అన్న వాళ్ళకి ఉదాహరణలుగా ఎంతో మంది రచయితల పేర్లని మనం పేర్కొనవచ్చు. ఇందులో ముఖ్యమైన వ్యక్తి పొట్లపల్లి రామారావు. తను ఉర్దూలో చదువుతున్నప్పటికీ మాతృభాష తెలుగు మీద మమకారాన్ని పోగొట్టుకోలేదు. తెలుగులో కవిత్వం రాశాడు. కథలు, గల్పికలు రాశాడు. ఆయన సాహిత్యం వెలుగు చూడటానికి బాగా కృషి చేసిన వ్యక్తి కవి రచయిత భూపాల్. అతనే కాదు, జయధీర్ తిరుమలరావు కూడా.

తెలంగాణ నుంచి కథలు తొలిదశలో రాలేదన్న విమర్శకి సమాధానం పొట్లపల్లి రామారావు రాసిన కథలని పేర్కొనవచ్చు. తెలంగాణ సామాజిక రాజకీయ జీవితాన్ని దోపిడీని కథల రూపంలో నిక్షిప్తం చేసిన వ్యక్తి రామారావు.

1945 కి పూర్వం జరిగిన దారుణాల గురించి, జమీందారుల, ప్రభుత్వ ఉద్యోగుల అరాచకాలను కళ్ళకు కట్టినట్టు రచించిన రచయిత పొట్లపల్లి రామారావు.

రామారావు కథా రచయిత మాత్రమే కాదు, చరిత్రకారుడు కూడా. అప్పటి దోపిడీని అన్యాయాలను అప్పటి జీవితాన్ని తన రచనల్లో వాస్తవికంగా చిత్రించిన చరిత్రకారుడు పొట్లపల్లి రామారావు.

చరిత్ర పుస్తకాల్లో అప్పటి సంభాషణ వారి స్థితిగతులు సంబంధబాంధవ్యాలు దోపిడీ దొరల పెత్తనం అంతగా కనిపించదు. కనిపించినా అది వివరంగా కళ్లకు కట్టినట్లు ఉండదు. కళ్లకు కట్టినట్టు కనిపించే విధంగా రాసిన వ్యక్తులు అలా చేసే వ్యక్తులు రచయితలు మాత్రమే. ఆ పనిని రామారావు తన కథల ద్వారా, రచనల ద్వారా చేశారు. అందుకని రామారావు కథా రచయిత మాత్రమే కాదు, చరిత్రకారుడు కూడా. అప్పటి దోపిడీని అన్యాయాలను అప్పటి జీవితాన్ని తన రచనల్లో వాస్తవికంగా చిత్రించిన చరిత్రకారుడు పొట్లపల్లి రామారావు.

పని పాట లేని వాళ్ళు జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరీ చేయడం ఆ కాలంలో ఉండేది. అధికారులు ఆ గ్రామానికి వస్తున్నారంటే ఆ వూరి వాళ్ళందరూ సేవ చేయాల్సి వచ్చేది. షావుకారు పుణ్యానికి సరుకులను ఇవ్వాల్సి వచ్చేది. ఊరి వాళ్లు కోడినో నువ్వు గొర్రెనో ఇవ్వాల్సి ఉంటుంది. చివరికి ఆ అధికారి వస్తాడో రాడో కూడా తెలియదు. అతను రాకపోతే ఆయన పేరుమీద తయారుచేసిన భోజనాన్ని స్థానిక అధికారులు, దొరలు తినేవాళ్ళు అధికారి తెల్లవారి మళ్లీ వస్తే అన్నీ తయారు చేయాల్సిందే. వంటకాలు అన్నీ తయారు చేయాల్సి వచ్చేది. ఇవే కాక దొరల ఇంట్లో అధికారులు ఇంట్లో పెండ్లి ఉంటే అతని అధికార పరిధిలోని ప్రజలు అన్ని వస్తువులు సమకూర్చాలి. ఈ చరిత్రకి అక్షరరూపం కల్పించిన వ్యక్తి పొట్లపల్లి రామారావు. ఆయన రాసిన “న్యాయం”అన్న కథ అందుకు ఒక నిదర్శనం.

ఆ కథ ఇలా మొదలవుతుంది

మాదిగ వాళ్ళు వెట్టి చేయడానికే పుట్టినట్టు, తెల్లవారకముందే వెట్టివాణ్ని కూతలు వేయడం ప్రారంభించాడు జవాను.

నీతి నియమాలు పాలించే ఉద్యోగులు తమ విధులను మర్చిపోయినా వెట్టి మాదిగ తన వంతు మర్చిపోలేదు. భుక్తి కోసరం ఏ చెట్టుకో గుట్టకో పోవల్సిన వాడు. ఎట్లాగు తప్పదు అనేక తరాలనుండి తనలో ఇంకిపోయిన ఓర్పుతో మెల్లిగా చావడి ముందుకు వచ్చాడు

“ఏమిరా పెళ్ళాము పక్కలో పడుకున్నావు…?”

“అంత సుఖమా ..? దొర …అది ఎప్పుడో పోయింది.”

“ఏమీ! నీవు కూడా ఒక పోక పోయినవ్. సర్కారీ పని ఆగుతుందా..?”

“పోయేనాడు ఎట్లాగూ తప్పదు కానీ ఉండేవరకు చేయక తప్పుతుందా దొర”

“అన్నీ సరేగాని ఇవాళ దొర పైనుండి దిగుతాడు. నీళ్ళు నిప్పులు ఏమీ లేవు. కరణం ఎక్కడ పడుకున్నాడు.?”

“పిలుచుకొస్త దొర” అంటూ మాదిగ వెళ్ళిపోయాడు.

జవాను చావిడిలో కూర్చొని సన్నగా బీడి పొగ వదులుతూ కరణం పైన రాబోయే అధికారిని గూర్చిన భయం ఎట్లా నెలగొల్పాలో, అతనికి ఎట్లా హడలు పుట్టేటట్టు చేయాలో, ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ తనలో లేని కోపాన్ని, అధికారాన్ని తవ్వి తెచ్చుకోవడంలో మునిగిపోయాడు.

“ప్రతి వాడు ఉత్తిగా తినడమే నాయే – దీనికి ఏమి ఇవ్వకపోతే తినిపోతె ఏమీ ఇవ్వకుండానే సామాన్లు దొరుకుతుందా..” అంటాడు కోమటి.

ఇంతలో కరణం వచ్చి నిద్ర కూడా పోనియనట్టు వుందే “అన్నాడు.

జవాన్ ఉలికిపడి లేచి కరణం మొఖం తీవ్రం గా చూసాడు.

“నిద్ర ఇంకావుంటే ఇక్కడే పడుకొండి”

ఏమిటీ గొడవ-ఏదో ఉరి మళ్ళీ”

“ఉరి ఎందుకు మీకు -అంతగా అయితే దొర వచ్చే, ఉరి లేకుండా చేస్తాడు”

కరణం భయపడతాడు. మీ దస్తరం తనక్కీ తహసిల్దార్ వస్తున్నాడని అన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతాడు. అతని వెంట గుర్రం కూడా వుందని చెబుతాడు.

వెట్టి చేసే వ్యక్తిని, కరణాన్ని ఎట్లా బెదిరించారు అన్న విషయం ప్రస్ఫుటమవుతుంది. కరణం తల ఎత్తక ముందే మాదిగ కోమటి కోసం ఉరుకుతాడు.

కోమటి రాగానే తను అందజేయాల్సిన సరుకుల వివరాలని అతనికి ఇస్తాడు కరణం.

కోమటి బాగా చూసుకొని..”ఏం చేయమంటారు నన్ను. “అన్నాడు

“నన్ను ఏమంటావు అయన్ని అడుగు”అన్నాడు కరణం

“ప్రతి వాడు ఉత్తిగా తినడమే నాయే – దీనికి ఏమి ఇవ్వకపోతే తినిపోతె ఏమీ ఇవ్వకుండానే సామాన్లు దొరుకుతుందా..” అంటాడు కోమటి.

“యిన్నాళ్ల నుండి ఎట్లా ఇస్తున్నావు “జవాన్ గదిమినాడు. కొమటి తన అసంతృప్తి ని చెబుతాడు.

జవాను ఊరుకోడు. దొంగ షేర్లు, తక్కువ బాట్లు అంటూ బెదిరిస్తాడు. ప్రపంచం లోని అబద్ధం, మోసం అంతా కోమటి వాని ఇంట్లోనే ఉంది అని కోమటి గునుగు తాడు.

కరణం కోమటిని సముదాయిస్తాడు. ఈ రోజు గుర్రం, మరి రేపు మోటర్లు వస్తే అని కోమటి సణుగుతాడు.

చివరికి కోమటి సరుకులు పంపిస్తాడు. సామాను రావడంతో ‘కోడీ, కోడీ’ అని అరుస్తాడు జవాను. వంతుల వారిగా కోళ్లని గ్రామస్తులు ఇవ్వాలి. గ్రామస్తులు ఎవరూ వుండరు. వాళ్ళు లేకపోతే కోళ్లు వుండవా? జవాను బెదిరింపుతో మాదిగ వాడు ఊరు మీద పడి ఒక కోడిని తెస్తాడు.

తహసిల్దార్ కి తమ కష్టాలు చెప్పుకుందామని వూరివాళ్ళు అక్కడికి వస్తారు. అయితే ఆరోజు ఆయన ఆ వూరికి రాడు.ఆయన కోసం వండింది జవాన్ తింటాడు.

తెల్లవారి దొర వస్తాడు. మళ్లీ అతనికోసం వంట తయారు చేస్తారు. ప్రజల సమస్యలు తీర్చడానికి కాదు. వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందని చెబుతాడు. కోళ్ళు గొర్రెలు తెచ్చి ఇవ్వాలని చెబుతాడు. రైతులు హతాశులు అవుతారు.

ఆ కాలంలో అధికార ధోరణి, దోపిడీ, ఏమీ చేయలేని ప్రజల అశక్తత మన కళ్లకి కట్టినట్టు రచయిత చెబుతాడు. చరిత్రలో ఈ సంభాషణ, ఈ వర్ణన కనిపించదు. ప్రజల జీవన విధానం కనిపించదు.

కథ చెప్పే క్రమంలో కరణానికి జవానుకీ మధ్య అధికారం ధోరణి, కోమటికీ జవాన్ కు మధ్య ఉన్న సంభాషణ పటితలని అప్పటి ప్రపంచంలోకి లాక్కొని పోతాయి.

1945 కు ముందు ఉన్న వాతావరణంలోకి మనం వెళ్తాము. ఆ కాలంలో అధికార ధోరణి, దోపిడీ, ఏమీ చేయలేని ప్రజల అశక్తత మన కళ్లకి కట్టినట్టు రచయిత చెబుతాడు. చరిత్రలో ఈ సంభాషణ, ఈ వర్ణన కనిపించదు. ప్రజల జీవన విధానం కనిపించదు.

కథల్లో చరిత్ర ఉంటుంది నవలల్లో చరిత్ర ఉంటుంది చరిత్రని చరిత్రలా కాకుండా, చరిత్రని మనం కథలాగా చదువుతాం. చరిత్రకారుడు చెప్పే చరిత్ర లో ఒక పార్శ్వం మాత్రమే చరిత్ర ఉంటుంది. రచయితల్లో చెప్పే కథల్లో అన్ని పార్శ్వాలు ఉంటాయి. అందుకే రచయితలు మహా చరిత్రకారులు.

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. రెండవ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. మూడోవారం కథనం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!. నాలుగో వారం కథనం గుల్జార్ చెప్పిన కథ. ఇదోవారం కథనం పిల్లలే నయం. ఆరో వారం కథనం కథలు దృక్పథాలని మారుస్తాయా?

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన రాజేందర్ గారు అందరికీ న్యాయం అందాలని  కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి. 

ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”.  ఇవి కాకుండా వారు చాలా పుస్తకాలని వెలువరించారు.  

జింబో e-mail: rajenderzimbo@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article