Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఆదివారం ‘పెరుగన్నం’ : కథలు దృక్పథాలని మారుస్తాయా?

ఆదివారం ‘పెరుగన్నం’ : కథలు దృక్పథాలని మారుస్తాయా?

కథలు వ్యక్తి జీవితంలో మార్పులు తీసుకొని వస్తాయి. దృక్పథాన్ని మారుస్తాయి అని సాహిత్యంతో అంతగా సంబంధం లేని వ్యక్తి అన్న ఆ మాటలు నాకు చాలా విలువైనవిగా తోచాయి. ఈ వారం అతడిని ప్రభావితం చేసిన కథ కాలమ్ గా ‘పెరుగన్నం’.

జింబో

మనిషి జీవితంలో కథలు అద్భుతమైన మార్పును తీసుకొస్తాయి. ఈ మాటలని అన్నది అమెరికాకు చెందిన మానసిక శాస్త్రవేత్తలు రిచర్డ్ బాండ్లర్, జిమ్ గ్రైండర్ లు. వారిద్దరూ మానసిక శాస్త్రవేత్తలు. అదేవిధంగా మానేజ్ మెంట్ రంగంలో ప్రముఖులు.

“ఒక వ్యక్తి జీవితంలో అద్భుతమైన మలుపు తీసుకురాగలిగేది ఒక కథ మాత్రమే. అది నిజమైన కథ కావచ్చు, కల్పిత మైన కథ కావచ్చు. ఏదైనా కథ మాత్రం వ్యక్తిని కదిలిస్తుంది.” ఇదీ వాళ్ళు తరుచూ చెప్పే మాట.

కథలు నాగరికతను ధ్వంసం చేయగలవు. యుద్ధాలని జయించగలవు. కొన్ని మిలియన్ల ప్రజల హృదయాలని చూరగొనగలవు. శత్రువులని మిత్రులుగా చేయగలవు.

ఎన్నో యుద్ధాలు కలగలిపితే వచ్చే విజయం కన్నా కథ సాదించిన విజయం ఎక్కువ. ఈ మాటలను అన్నది ప్రముఖ కవి, కథా నవలా రచయిత ‘బెన్ ఒక్రి’. తాను నైజిరీయా కి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఇంగ్లాండ్ లో స్థిరపడ్డాడు.

నిజంగా కథకి ఇంత శక్తి ఉందా? అన్న అనుమానం వస్తుంది. ఇంత మార్పుని కథ తీసుకొని రాగలదా ఇలాంటి ప్రశ్నలు తలెత్తడం సహజమే.

ఉపన్యాసం చెప్పే వ్యక్తి మధ్యలో కానీ మొదట్లో కానీ ఓ కథ చెప్పి శ్రోతల్ని విపరీతంగా ఆకర్షిస్తాడు. గొప్ప మతాలన్నీ ఆకర్షించేది కథల ద్వారానే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ అభిప్రాయాల గురించి ఎలాంటి సందేహాలు కలిగినా ఒకటి మాత్రం నిజం – కథలు సంస్కారాన్ని కలిగిస్తాయి. ఆ మాట కొస్తే సాహిత్యం చేసే పని అదే. సాహిత్యం మన ధోరణుల్లో మార్పులని తీసుకొస్తాయి. నా ఈ అభిప్రాయం నిజమని ఓ మిత్రుడు రుజువు చేశాడు.

“కథ నా దృక్పథాన్ని మార్చింది”

అతని పేరు వెంకట్. సీఏ చేసి బిల్డర్ గా స్థిరపడ్డాడు. అప్పుడు అతని వయస్సు 35 సంవత్సరాలు ఉంటాయేమో. గతంలో నేను ఉంటున్న ఫ్లాట్ వ్యవహారాలు అతను చూసేవాడు. ఆ కంపెనీలో అతను భాగస్వామి కూడా. అతనితో సాహిత్య విషయాలు నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ సంఘటన జరిగిన కాలంలో నేను ‘నవ్య’వార పత్రికలో “మా వేములవాడ కథలు” రాస్తున్నాను

ఓసారి కింద సెల్లార్ లో కలిసినప్పుడు అతను నన్ను పలకరించాడు. “మీ వేములవాడ కథలు కొన్ని ఈ మధ్యే చదివాను సార్ “అన్నాడు.

“ఆ కథల్లో ఒక కథ మీ అన్న గురించి రాసిన కథ నా దృక్పథాన్ని మార్చింది. ఆ కథ చదివిన అందరి దృక్పథాలను ఆ కథ మారుస్తుంది సార్! అందుకని మనమే ప్రచురిద్దామని అంటున్నాను.

నాకు సంతోషం వేసింది. 40 సంవత్సరాలు దాటిన వాళ్లే సాహిత్యం చదువుతున్నారన్న అపవాదులో పూర్తి సత్యం లేదని కూడా అనిపించింది.

ఆ తర్వాత ఒకరోజు ఏదో పని మీద మా ఫ్లాట్ కి వచ్చాడు అతను వచ్చిన పని పూర్తి అయిన తర్వాత నా కథల ప్రస్తావన తీసుకుని వచ్చాడు.

“వేములవాడ కథల్లో అన్ని కథలు నేను చదవలేదు కానీ ఓ ఐదారు కథలు చదివాను సార్” అన్నాడు.

“సంతోషం. ఐదారైనా చదివారు” అన్నాను నేను.

“అవి పుస్తకంగా వచ్చినాయా “అడిగాడు.

“ఇంకా రాలేదు. ఎవరో పబ్లిషర్ వేస్తానని అంటే అతనికి ఇచ్చాను. అతను ఇంకా జవాబు చెప్పలేదు” అన్నాను

“పుస్తకం ప్రచురించడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్” అడిగాడు అతను

“25 నుంచి 30 వేలు కావచ్చేమో!”అన్నాను నేను.

“అయితే మనమే ప్రచురిద్దాం సార్.” అన్నాడు

నాకు కాస్త ఆశ్చర్యం చేసి “ఎందుకు” అని అడిగాను.

“ఆ కథల్లో ఒక కథ మీ అన్న గురించి రాసిన కథ నా దృక్పథాన్ని మార్చింది. ఆ కథ చదివిన అందరి దృక్పథాలను ఆ కథ మారుస్తుంది సార్! అందుకని మనమే ప్రచురిద్దామని అంటున్నాను. ప్రచురించడమే కాదు. ప్రతి స్కూల్ కి ఆ కథల పుస్తకాన్ని పంపించాలి”అన్నాడు అతను ఉత్సాహంగా. తనే ప్రచురిద్దామన్న ఆనందం అతనిలో కనిపించింది. (కాగా, ఆ కథల పుస్తకాన్ని ఎమెస్కో విజయకుమార్ ప్రచురించారు.)

నాకు ఆశ్చర్యం వేసింది. ఆనందం వేసింది. ఆయనకు నచ్చిన కథ “సమాధానం”

“సమాధానం”

ఆ కథలోని పాత్ర మా అన్నయ్య రఘుపతి రావుది. ఆయన ఆరోగ్యం బాగా లేక కరీంనగర్ నుంచి హైదరాబాద్ తీసుకుని వస్తారు. అతని సన్నిహిత మిత్రుడు సత్యం హాస్పిటల్ తీసుకువెళ్తారు. ఆయన్ని మేం సత్యం అన్నయ్య అని పిలుస్తాం.

“సత్యం అన్నయ్య సలహామేరకు రఘుపతన్నకి వైద్య పరీక్షలు అన్నీ జరిగాయి. స్కానింగులు ఇట్లా ఇంకా ఏవేవో టెస్టులు యుద్ధప్రాతిపదికన జరిగాయి .

రఘుపతన్న పరిస్థితి చూస్తే చాలా విషమంగా ఉన్నట్టు అనిపించింది. ఏమీ పాలుపోలేదు. రఘుపతన్నని వుంచిన రూములోకి రెండు సార్లు వెళ్లి చూసి వచ్చాను. ఆయన నా వైపు చూశాడు. ఏదో చెప్పాలని ఉన్నట్లుగా నాకు అనిపించింది. చెప్పలేడు. శరీరం సహకరించదు. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందా..! పూర్వం లాగా కనిపిస్తాడా ..? ఏమౌతుంది..? ఎన్నో ప్రశ్నలు. ఏం చేయగలను..? రఘుపతన్నని చూస్తున్నది ఎవరో కాదు ఆయన సన్నిహిత మిత్రుడు డాక్టర్ సత్యం.

ఒక గంట తర్వాత అతనికి తీవ్రమైన గుండెనొప్పి వచ్చింది. 10 నిమిషాల్లోనే సూపర్ స్పెషలిస్టులు ఇద్దరు వచ్చారు. రఘుపతన్న క్లాస్ మేట్స్ కూడా మరో ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళందరూ రఘుపతి అన్నతో పాటు లోపల. ఆందోళనతో మేము బయట. పక్షవాతం, గుండె నొప్పి ఒకేసారి రావడం వల్ల పరిస్థితి విషమించింది. ఒకరిద్దరు డాక్టర్లు బయటకు వచ్చారు. వాళ్ల ముఖాలు కూడా ఆందోళనగా కనిపించాయి. మళ్లీ లోపలికి వెళ్లారు.

నాతో పాటు మా అన్నయ్య స్నేహితుడు డా. రామారావు కూడా నిమ్స్ కి వచ్చాడు. ఆ రాత్రి భయంకరంగా గడిచింది.

అరగంట తర్వాత అందరూ బయటికి వచ్చారు గండం గట్టెక్కింది.

సత్యం అన్నయ్య నన్ను వదినని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళాడు.

“రఘు పరిస్థితి బాగాలేదు. సీరియస్ గా ఉంది. పక్షవాతంకి తోడు గుండెనొప్పి కూడా వచ్చింది. NiIms కి తరలిస్తే మంచిది. అక్కడ అందరూ ఉంటారు. పరిస్థితి విషమిస్తే వెంటిలేటర్లు కూడా పెట్టే అవకాశం ఉంది. వీటన్నింటితో పాటు స్నేహితులకు వైద్యం చేయడం అంత సులువైన పని కాదు” క్లుప్తంగా వివరించాడు.

ఏం మాట్లాడాలో మాకు తోచలేదు. ఇద్దరం మౌనంగా ఉండిపోయాం.

“అక్కడ నాకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు. వాళ్లకి చెబుతాను. నేను కూడా రోజూ వచ్చి చూస్తాను” అన్నాడు మా మౌనాన్ని గమనించి.

ఆ రాత్రికి రాత్రే రఘుపతన్న ని నిమ్స్ కి తరలించారం. ఆ సమయంలో అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు. నాతో పాటు మా అన్నయ్య స్నేహితుడు డా. రామారావు కూడా నిమ్స్ కి వచ్చాడు. ఆ రాత్రి భయంకరంగా గడిచింది.

జనరల్ వార్డులో రఘుపతన్నని ఉంచారు. ప్రతి నిమిషం ఆందోళనగానే గడిచింది.

న్యూరో వార్డులో అడ్మిట్ చేశారు. పక్షవాతానికి సంబంధించిన మందులు ఇచ్చారు., గుండెని నిర్లక్ష్యం చేశారు. ఆ విషయం చెప్పినా పట్టించుకోలేదు. వాళ్ల ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు. పరిస్థితి పూర్తిగా విషమించింది కాబట్టి గుండె డాక్టర్కి చూపించలేదో, నిర్లక్ష్యమో అర్థం కాలేదు.

రఘుపతి అన్న కూతురు అనుపమ అమెరికాలో ఉంది. సమాచారం ఇచ్చాం. తను రావడానికి 4 రోజులు పడుతుంది. అప్పటిదాకా పరిస్థితి ఎట్లా ఉంటుందో… ఇవే ఆలోచనలు.

రఘుపతన్న నోట్లో నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట.
అ.. న..

బహుశా అనుపమ గురించేనని అనిపించేది. కాగితం మీద కూడా రాసే పరిస్థితి లేదు. ఆయన ఏమనుకుంటున్నాడు ఏం అడగాలని అనుకుంటున్నాడో మేము మేము ఊహించి ఆయనకు సమాధానం చెప్పే వాళ్ళం. మేం చెబుతున్న విషయాలు అర్థమవుతునట్టుగా మాకు అనిపించేది.

ఐదు రోజులు కష్టంగా గడిచాయి అనుపమ స్టేట్స్ నుంచి సరాసరి నిమ్స్ కి వచ్చింది. అప్పటి నుంచి అనుపమ రఘుపతన్న పక్కనే కూర్చుంది. తన ముఖంలో కూడా ఏదో తెలియని కాంతి.

అనుపమ వచ్చిన తర్వాత 24 గంటలు రఘుపతన్న ప్రాణంతో ఉన్నాడు. అనుపమ కోసమే ఆ ఆరు రోజులు బతికాడేమో. ఆ తర్వాత మళ్లీ గుండెనొప్పి వచ్చింది. లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కోసం డాక్టర్లు మమ్మల్ని పరుగులు తీయించారు. అవి తెచ్చే లోపు ఆయన మరణించారు.

ఆ దుంఖంలో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ రెండు మూడు రోజుల తర్వాత ఆ విషయమే తరుచూ గుర్తుకొచ్చింది.

సైన్స్ నమ్మినా నమ్మక పోయినా, మనం విశ్వసించినా విశ్వసించకపోయినా ఒకటి మాత్రం నిజం -అనుపమ కోసమే ఈ ఐదు రోజులు రఘుపతన్న బతికాడు. కూతురుతో ఒక రోజంతా గడిపిన తర్వాత చనిపోయాడు. ఇంకా రెండు రోజులు ఎందుకు బతకలేదు. రెండు రోజుల ముందే ఎందుకు చనిపోలేదు. ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవడానికి సైన్స్ కి ఇంకా చాలా సమయం పడుతుంది.

రఘుపతన్న చనిపోయిన విషయం సత్యం అన్నయ్య కి ఫోన్ చేసి చెప్పాను. హైదరాబాదులో ఉన్న బంధువులకు చెప్పాను. అరగంటలో చాలామంది వచ్చారు. రఘుపతన్న స్నేహితులు కూడా చాలా మంది వచ్చారు. అందరికీ సమాచారం ఇచ్చింది సత్యం అన్నయ్యే .

హాస్పిటల్ ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత రఘుపతన్న శవాన్ని అంబులెన్స్ లోకి మార్చినాము. చివరి సారి చూడటానికి చాలామంది వచ్చారు – రానిది ఒక సత్యం అన్నయ్యే. రఘుపతి అన్న చనిపోయిన తర్వాత ఆయన ఎందుకు రాలేదో నాకు అర్థం కాలేదు.

“ఇంకా కాసేపు వెయిట్ చూద్దామా..? సత్యం అన్నయ్య వస్తాడేమో” అన్నాను రామారావుతో.

“వద్దు. మీరు బయలుదేరండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది” అన్నాడు రామారావు.

రాత్రికి రాత్రి కరీంనగర్ కి బయలుదేరాం. తెల్లవారి మధ్యాహ్నం మూడు గంటలకి దహన సంస్కారం ఉంటుందని అందరికీ తెలిపాము.

భద్రాచలంలో ఉన్న రఘుపతన్న స్నేహితుడు డాక్టర్ కాంతారావు దహనసంస్కారాలకి వచ్చాడు. మిర్యాలగూడ లో ఉన్న డాక్టర్ వెంకట్ రెడ్డి కూడా వచ్చాడు. సత్యం అన్నయ్య మాత్రం రాలేదు. ఆ దుంఖంలో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ రెండు మూడు రోజుల తర్వాత ఆ విషయమే తరుచూ గుర్తుకొచ్చింది.

ఓ 20 రోజుల తర్వాత సత్యం అన్నయ్య వచ్చాడు. రెండు గంటలు మాతో గడిపాడు. అందర్నీ పరామర్శించాడు. చనిపోయినాడు అని తెలిసిన తర్వాత నిమ్స్కి రాలేదు. దహనసంస్కారాలకి రాలేదు. హాస్పిటల్లో ఉన్నప్పుడు రాలేదు. చనిపోయిన 20 రోజుల తరువాత వచ్చాడు. అన్నయ్య ప్రవర్తన, ఆయన ఉద్దేశం నాకు అర్థం కాలేదు.

నాలుగు సంవత్సరాలు గడిచాయి. చాలాసార్లు సత్యం అన్నయ్యని కలిసిన ప్రతిసారి ఈ ప్రశ్న ఉదయించేది. కానీ ఎప్పుడూ అడగలేదు. ఆయన నాకు సమాధానం చెప్పలేదు.

ఓ నాలుగు రోజుల తర్వాత సత్యం అన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. గొంతు చాలా కామ్ గా ఉంది.

“రాజేందర్! నువ్వు నన్ను ఎప్పుడూ అడగలేదు కానీ రఘు నన్ను నాలుగేళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. చనిపోయిన నన్ను చూడడానికి ఎందుకు రాలేదని. ఆఖరి చూపు చూడడానికి కూడా ఎందుకు రాలేదని నన్ను తరచూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. వాడికి సమాధానం ఈ రోజు చెప్పాను. నీకు కూడా చెప్పాలని అనిపించింది” అన్నాడు.

కాస్సేపు నిశ్శబ్దం.

ఏం మాట్లాడాలో నాకు తోచలేదు.

“నేను వచ్చినప్పుడు చెప్పండి” అన్నాను కాస్త ఆలోచించి.

“అవసరం లేదు. నేను చెప్పేది విను.” అన్నాడు.

“అన్నయ్య..చెప్పండి” అన్నాను,

నా అభిప్రాయం సరైందేనా? అని ఎవరు ఎప్పుడు నన్ను ప్రశ్నించలేదు. కానీ ఈ నాలుగేళ్లుగా రఘు ఈ ప్రశ్న వేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను.

“కుటుంబసభ్యుల మరణాలను తప్ప ఎవరి మరణాలను నేను చూడలేదు. వాళ్ళు శవంగా మారిన దృశ్యాన్ని నేను ఊహించుకోలేను. నా సన్నిహితులు స్నేహితుల ముద్ర నా స్మృతి పథంలో శవంగా ఉండకూడదని నా ఆలోచన. ఈ కారణంగానే రఘు చనిపోయిన తర్వాత చూడడానికి రాలేదు.

దహనసంస్కారాలకి రాలేదు. 15 రోజుల తర్వాత వాళ్ళని కలిసి పరామర్శించడం ఇంతకాలం నేను చేస్తూ వస్తున్నాను. నా అభిప్రాయం సరైందేనా? అని ఎవరు ఎప్పుడు నన్ను ప్రశ్నించలేదు. కానీ ఈ నాలుగేళ్లుగా రఘు ఈ ప్రశ్న వేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను.

కొంచెం సేపు నిశ్శబ్దం.

“చెప్పండి అన్నయ్య” అన్నాను

“ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. నేను ఇంత కాలం చేసింది సరైంది కాదని నాకనిపిస్తుంది. ఆఖరి చూపు విలువని ఇంతకాలం తెలుసు కోలేకపోయాను.

మన ప్రేమని, గౌరవాన్ని వ్యక్తపరిచే చివరి సంఘటన శవాన్ని దర్శించడం.

అక్కడ ఓ దండం పెట్టడం. ఓ పుష్పగుచ్చాన్ని ఉంచడం. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి దుఃఖాన్ని పంచుకోవడం ఎంతో అవసరం.

“ఇదే రఘుకి జవాబుగా  చెప్పాను. రఘు నన్ను ప్రశ్నించటం మానేశాడు.”

ఈ సమాధానం నాకు చెప్పాడా రఘుపతన్నకి చెప్పాడా నాకు తెలియదు. కానీ చాలా కాలం నుంచి నాలో నలుగుతున్న సందేహానికి సమాధానం దొరికింది.

ఇది ఆ కథ.

విలువైన మాటలు

“నేను చదివిన వేములవాడ కథల్లోని ఈ కథ నా దృక్పథాన్ని మార్చింది. చాలామంది దృక్పధాన్ని ఈ కథ మార్చే అవకాశం ఉంది. ఇది త్వరగా వస్తే పుస్తకంగా వస్తే బాగుంటుంది సార్ ! ప్రతి స్కూల్ కి ఆ పుస్తకం
పంపిద్దాం” అన్నాడు వెంకట్.

కథలు వ్యక్తి జీవితంలో మార్పులు తీసుకొని వస్తాయి. దృక్పథాన్ని మారుస్తాయి అని వెంకట్ చెప్పడం ఎంతో గొప్పగా అనిపించింది. నిజానికి సాహిత్యంతో అంతగా సంబంధం లేని వ్యక్తి అన్న ఆ మాటలు నాకు చాలా విలువైనవిగా తోచాయి.

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. రెండవ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. మూడోవారం కథనం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!. నాలుగో వారం కథనం గుల్జార్ చెప్పిన కథ. ఇదోవారం కథనం పిల్లలే నయం.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన రాజేందర్ గారు అందరికీ న్యాయం అందాలని  కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి. 

ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”.  ఇవి కాకుండా వారు చాలా పుస్తకాలని వెలువరించారు.  

జింబో e-mail: rajenderzimbo@gmail.com

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article