Editorial

Saturday, January 11, 2025
Opinionరేవంతు 'రెడ్ల వ్యాఖ్యలు' - జిలుకర శ్రీనివాస్ విశ్లేషణ

రేవంతు ‘రెడ్ల వ్యాఖ్యలు’ – జిలుకర శ్రీనివాస్ విశ్లేషణ

రేవంత్ రెడ్డి మాటలు సరిగా అర్థం చేసుకోవాలి. రెడ్ల బలం వ్యవసాయ సంబంధాలలో వుంది. భూమిని కలిగి వుండటం ద్వారా వాళ్లు గ్రామ సీమలను నియంత్రించారు. భూమిలేని పేద కులాలను వాళ్ల చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇది ఫ్యూడలిజం.

డా.జిలుకర శ్రీనివాస్

రేవంతు రెడ్డి నిజం చెప్పాడు. రెడ్లకు ప్రాధాన్యత ఇవ్వనందుకు కాకతీయ సామ్రాజ్యం పతనమైనది‌. అయితే బుచ్చిరెడ్డి అనే సేనాధిపతి ఢిల్లీ సుల్తాను ఇచ్చిన పదివేల నగదు తీసుకొని కాకతీయులకు ద్రోహం చేశాడని చరిత్రకారులు రాశారు. కాకతీయులు రెడ్లు కాదు. వాళ్లు శూద్రులు. అంటే బిసిలు. చత్తీస్‌గఢ్ లో కాకతీయుల వారసులు వున్నారు. వాళ్లు అక్కడ ఎస్టీలు. రెడ్డి పదం బిరుదు అయితే పౌరుషం, పట్టుదల, పాలనా దక్షత గల వారంతా రెడ్లు అవుతారని అనుకుంటే ఏ కులం వారైనా ఆ గుణాలు గలవారు రెడ్డి అని పెట్టుకోవచ్చు అన్న మాట. రెడ్డి అనేది ఒక రెవెన్యూ అధికార హోదా. ప్రజల నుండి పన్నులు వసూలు చేసే అధికారం గలవాడు అని అర్థం. రెట్టడు అనే పదం రూపాంతరం చెంది రెడ్డి అయ్యింది. మరి అది ఒక కులంగా ఎందుకు మారిపోయింది? ఎవరు మార్చారు? అదంతా ఒక పరిణామం. చరిత్రలో చాలా కొత్త కులాలు అనేక కారణాల వల్ల ఏర్పడ్డాయి. రెడ్డి అనేది కూడా అంతే. ఆధునిక కాలంలో, అది కూడా బ్రిటిష్ వాళ్ల కాలంలోనే అది పూర్తి స్థాయి కులంగా మారిందనే అధ్యయనాలు కూడా వున్నాయి.

కేంద్రాన్ని ఎవరు పాలించినా సరే, రాష్ట్రం మాత్రం వాళ్ల కబంధ హస్తాలలోనే మగ్గిపోయింది. కేంద్రం తొలి రెండు పంచ వర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ నిధులన్నీ రెడ్డి, కమ్మ, వెలమ లాంటి నయా అగ్ర కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడడానికి తోడ్పడ్డాయి.

రేవంత్ రెడ్డి మాటలు సరిగా అర్థం చేసుకోవాలి. రెడ్ల బలం వ్యవసాయ సంబంధాలలో వుంది. భూమిని కలిగి వుండటం ద్వారా వాళ్లు గ్రామ సీమలను నియంత్రించారు. భూమిలేని పేద కులాలను వాళ్ల చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. ఇది ఫ్యూడలిజం. కులానికి ఫ్యూడల్ లక్షణాలు వుంటాయి.‌రెడ్లు, వెలమలు, కమ్మలు అలా భూమి మీద అధికారం కలిగి వుండటం వల్ల సామాజిక రాజకీయ పెత్తనం చలాయించారు. వాళ్లే పాలకులుగా వున్నారు. కేంద్రాన్ని ఎవరు పాలించినా సరే, రాష్ట్రం మాత్రం వాళ్ల కబంధ హస్తాలలోనే మగ్గిపోయింది. కేంద్రం తొలి రెండు పంచ వర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఆ నిధులన్నీ రెడ్డి, కమ్మ, వెలమ లాంటి నయా అగ్ర కులాలు ఆర్థికంగా, రాజకీయంగా బలపడడానికి తోడ్పడ్డాయి.

రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల వీడియో ఇది

అలాంటి సమయంలో భూసంబందాలను బద్దలు కొట్టే భూ సంస్కరణలు జరగాలని జరిగిన ఉద్యమాల వల్ల ఈ కులాలకు నష్టం జరిగింది. వ్యవసాయాన్ని పెట్టుబడిదారీ చట్రంలోకి తీసుకొచ్చే విధానాలను కాంగ్రెస్ అమలు చేసింది. ఈ కొత్త అవకాశాన్ని టిడిపి చాకచక్యంగా వాడుకున్నది. వ్యవసాయాన్ని నూతన ఆర్థిక విధానాలు దివాలా తీయించే సమయంలో చంద్రబాబు మరింత ఉత్సాహంగా రెడ్ల ఆధిపత్యాన్ని దెబ్బతీశాడు. సాంకేతికత, ఆధునిక అభివృద్ధి పేరుతో వ్యవసాయానికి సమాధి కట్టడం ద్వారా రెడ్ల ఆర్థిక బలాన్ని కూల్చే శాడు. అప్పటికే ఎన్టీఆర్ తెచ్చిన మండల వ్యవస్థ, ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రాజకీయ విప్లవాన్ని దగ్గర చేయడంతో రెడ్లు రాజకీయ గుత్తాధిపత్యాన్ని కోల్పోయారు.

రాజశేఖర్ రెడ్డి రైతు యాత్ర పేరుతో రెడ్ల పునరుజ్జీవన ఉద్యమం మొదలు పెట్టాడు. రెడ్ల కోసం జరుగుతున్న ఉద్యమమని ఆనాడు ప్రజలు గ్రహించలేక పోయారు.

అదిగో అప్పుడే రాజశేఖర్ రెడ్డి రైతు యాత్ర పేరుతో రెడ్ల పునరుజ్జీవన ఉద్యమం మొదలు పెట్టాడు. రెడ్ల కోసం జరుగుతున్న ఉద్యమమని ఆనాడు ప్రజలు గ్రహించలేక పోయారు. రెడ్డి రాజ్యం రాజశేఖర్‌రెడ్డి ద్వారా ఏర్పడ్డది. అయితే 1995లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముందుకు తెచ్చాడు. భూమిని ఒక అమ్మకపు సరుకుగా మార్చేశాడు. పట్టణ గరిష్ఠ భూపరిమితి చట్టాన్ని సవరించాడు. ఆ పిచ్చి పని వల్ల రెడ్ల భూములకు గతంలో ఎన్నడూ లేని విలువ వొచ్చింది. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా చుట్టూ వున్న భూములకు వందల కోట్ల విలువ ఏర్పడ్డది. పంట పండిస్తే వొచ్చే ఆదాయం కన్నా, రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వందల, వేల కోట్లు సంపాదించారు. అది రెడ్లకు పదేళ్ల పాటు అధికారాన్ని కట్టబెట్టింది.
రెడ్లకు, వెలమలకు చరిత్ర కాలం నుంచి శత్రుత్వం వున్నది. అందుకే తెలంగాణ ఉద్యమం పేరుతో రెడ్డి రాజ్యాన్ని కూల్చి వెలమలు అధికారంలోకి వచ్చారు. గ్రామ సీమల రెడ్లను సానుకూలంగా మార్చుకోవడానికి కెసిఆర్ రైతుబంధు పథకం తెచ్చాడు. వ్యవసాయాన్ని బలోపేతం చేసే భారీ నీటి ప్రాజెక్టులు చేపట్టాడు. ఆ నీళ్లతో, ఆ కాల్వలతో రెడ్ల భూముల విలువ మరింత పెరిగింది. తనకు తెలియకుండానే తన శత్రువులను తాను మరింత శక్తివంతమైన వర్గంగా మార్చేశాడు.‌ ఇప్పుడు రెడ్లను ఎదుర్కోవడం ఎలాగో తెలియక తల పట్టుకుంటున్నాడు కెసిఆర్.

ఈ రెండు మార్పులు చేస్తే రెడ్లకు భూసంబంధాల మీద వున్న పెత్తనాన్ని, తద్వారా రాజకీయ ఆధిపత్యాన్ని కెసిఆర్ దెబ్బతీయగలడు.

నిజంగా కెసిఆర్ రెడ్లను ఎప్పటికీ అధికారంలోకి రాకుండా చేయాలని కోరుకుంటే ఒక పని చేయాలి. పట్టణ, పల్లె భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని సవరించాలి. ఒక కుటుంబానికి మూడు ఎకరాల కన్నా ఎక్కువ వుండకుండా చట్టం చేయాలి. ఎక్కువ భూమి వున్న వాళ్ల నుండి మిగులు భూమిని స్వాధీనం చేసుకొని భూమిలేని పేదలకు పంపిణీ చేయాలి. అలాగే స్థిర, చరాస్తులను వారసత్వంగా పొందే వారసత్వ హక్కు చట్టానికి సవరణలు చేయాలి.

వారసత్వం ఆస్తిని పొందడానికి అధిక పన్నులు విధించాలి. అదేవిధంగా పదిశాతం ఆస్తిని మాత్రమే వారసత్వంగా పొందేలా చట్ట సవరణ చేయాలి. ఇంచుమించు ఇలాంటి చట్టాలు యూరపు దేశాలలో ఉండటం వల్లనే అవి చాలా ప్రజాస్వామికంగానూ ప్రగతిశీలంగానూ తయారయ్యాయి. ఈ రెండు మార్పులు చేస్తే రెడ్లకు భూసంబంధాల మీద వున్న పెత్తనాన్ని, తద్వారా రాజకీయ ఆధిపత్యాన్ని కెసిఆర్ దెబ్బతీయగలడు. ఈ క్రమంలో తన ఆస్తులను కూడా వొదులు కోవాలి. తన వందల ఎకరాలను పేదలకు పంచాలి. భూమిని కేవలం వినియోగ వస్తువుగానే చూసి, దానికిగల కమాడిటీ వాల్యూను పూర్తిగా తగ్గించాలి. భూమి ఎన్నటికీ కమాడిటీ కాకూడదు. అలా కమాడిటీ కావడం వల్ల భూమిగల కులాలు మాత్రమే అన్ని రంగాలను శాసిస్తాయి. వ్యవసాయాన్ని కమర్షియల్ రంగంగా మార్చే విధానం కూడా సరైనది కాదు. అది కేవలం ఉత్పాదక రంగంగా మాత్రమే వుండాలి. అప్పుడు మాత్రమే ఈ వర్గాల ఆధిపత్యం పోయి, నిజమైన ప్రజాస్వామ్య రాజకీయ సమాజం ఏర్పడుతుంది.

ఇంత సాహసం చేయాలంటే కెసిఆర్ పూర్తిగా ఆధునిక మానవుడిగా మారాలి. తనలోని ఫ్యూడల్ను చంపుకోగలగాలి. ఒక నవీన మానవుడిగా భవిష్యత్తు నాయకుడిగా మారితేనే ఈ సాహసోపేత చర్యలను చేపట్టగలడు. అలా‌ మారగలడా, నిజంగా?

 డా.జిలుకర శ్రీనివాస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ద్రవిడ బహుజన సమాఖ్య.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article