జయతి గారి పుస్తకాలు చదివిన వారు లేదా ఆమె అడవి కుటీరం గురించి ఎరిగిన వారు తాను ఎందుకు అడవి బాట పట్టారూ అన్న ప్రశ్న తప్పక వేసుకునే ఉంటారు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం వెతికే చిరు ప్రయత్నం.
కందుకూరి రమేష్ బాబు
‘మనం కలుసుకున్న సమయాలు’ పుస్తకం చదువుతుంటే విస్మయం కలిగించే విషయాలు అనేకం. ప్రకృతి, జీవరాశి, పరిసరాలు, భావుకతా..సాహచార్యం, ఏకాంతం, కొండలు కోనలు ఇంకా ఎన్నో. ఇవన్నీ కాకుండా అసలు లోయలో వినవచ్చే పాట…
అంతేనా? కాదు. ఇంకా ఉన్నది. అది ఏమిటీ అన్నది మనం పోల్చుకోవలసే ఉన్నది. అలా భావిస్తూ చదువుతుంటే ఒక అంశం తప్పక కనిపిస్తుంది. అదే తప్పక పంచుకోవాలనిపించింది. అది, మనిషి గురించి. వికృతమవుతున్న అతడి ప్రకృతి గురించి, తత్పలితంగా జరుగుతున్న విధ్వంసం గురించి. అప్రమేయంగా అతడి ఆవరణ దాటి తాను దూరం దూరంగా జరగడం గురించి. ఇందుకు అనేక ఉదాహరణలు కానవస్తాయి.
ఆమె పుస్తకాలను చెవోగ్గి వింటే మనిషి తాలూకు వికృత పకృతి నుంచి దూరం జరగడమే మొత్తం జయతి ఇతివృత్తం అని కూడా అనిపిస్తోంది.
ఆమె పుస్తకాలను చెవోగ్గి వింటే మనిషి తాలూకు వికృత పకృతి నుంచి దూరం జరగడమే మొత్తం జయతి ఇతివృత్తం అని కూడా అనిపిస్తోంది. అందుకే, మొదట అడవి నుంచి అడవికి, తర్వాత అడవి పుస్తకానికి, పిమ్మట తాజాగా నేటి మనం కలుసుకున్న సమయాలు దాకా జయతి లోహితాక్షణ్ సారస్వత సందేశం మనం నివసించే మైదానానికి ఒక అడవి చేస్తున్న హెచ్చరికలా అనిపిస్తున్నది.
అడవి నేలలో కప్పబడిపోయి ఊపిరి ఆగిపోవాలని, వృక్ష కాండాల్లో ఇంకి పోవాలన్నది ఒక్కటే తన కోరికగా జయతి గారు ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రప్రథమంగా పేర్కొన్నారు. అయితే ఆ కోరిక వెనకాల గల కారణమేమిటా అని అన్వేషిస్తూ వెళుతుంటే ఈ పుస్తకంలో సుస్పష్టంగా కనీసం మూడు మాటలు కన్పించాయి. ఇవే జయతి మైదానం నుంచి అడవికి, అడవి నుంచి అడవికి, అడవి పుస్తకంగా మారడానికి కారణం అని కూడా అనిపిస్తుంది.
ఆమె విశిష్టతల కారణంగా తాను పడుతున్న ఆవేదన, వ్యక్తీకరిస్తున్న నిరసన, చూపుతున్న ప్రతిఘటన, పెడుతున్న సూటైన విమర్శలను కానరాకుండా అయ్యేలా ఉన్నాయి.
జయతి గారి పుస్తకాలు చదివిన వారు లేదా ఆమె అడవి కుటీరం గురించి ఎరిగిన వారు తాను ఎందుకు అడవి బాట పట్టారూ అన్న ప్రశ్న తప్పక వేసుకునే ఉంటారు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం ఆమె విశిష్టత, ప్రత్యేకతలు, సాహస ప్రవృత్తి, త్యాగం తదితర గుణాల వెనకాల లేదా అపురూప సాహిత్య తాత్విక వ్యక్తిత్వం కింద చూడటం వల్ల మరుగున పడే అవకాశం ఉంది. కానీ పై గుణాలన్నీ ఆమె పడుతున్న ఆవేదన, వ్యక్తీకరిస్తున్న నిరసన, చూపుతున్న ప్రతిఘటన, పెడుతున్న సూటైన విమర్శలను కానరాకుండా చేసేలా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా ఆమె భావజాలం లెఫ్ట్ కాదు, రైటూ కాకపోవడం. ఆమె ఏ extremes లోనూ లేదు. అందుకే ఆమె బాగా రాస్తుందని లేదా భిన్నంగా జీవిస్తున్నదీ అని కుడి ఎడమల్లో ఉన్న వారందరూ అనడం మొదలైంది. ఆమెను కలుసుకోవాలీ అనుకోవడం ఎందరిలోనో మొదలైంది. అసలుకి ఆమె జీవిత ప్రధాని. అందుకే నిర్జీవ లోకం నుంచి అనివార్యంగా తప్పుకుంది.
తాను వికృతి అవుతున్న మనిషి ప్రకృతి ఆవరణ నుంచి నెమ్మదిగా ఎడంగా జరిగింది. దూరం దూరంగా జరిగి మైదానం నుంచి అడవి బాట పట్టింది. అడవి కుటీరం నుంచి ఈ మాటలు చెబుతోంది.
నిజానికి జయతి విసుగు చెందింది. అభివృద్ధి మాటున మనిషి చేస్తున్న పరిశోధనలకు తాను ఆవేదన చెందింది. మనిషి ఆర్థిక సంబంధాల పట్ల పెంచుకున్న వ్యామోహానికి తీవ్ర విచారానికి లోనైంది. లాభాపేక్ష తప్ప మరొకటి పట్టని అత్యాధునికుడూ నాగరీకుడూ ఐన నేటి మనిషి పట్ల కలత చెందింది. బెంగ పడింది. చేసేదేమీ లేక ఏమీ చేయకుండా ఉండేందుకు తానైనా దూరం జరగాలనుకుంది. మెల్లగా ప్రయాణం మొదలెట్టింది. తాను వికృతి అవుతున్న మనిషి ప్రకృతి ఆవరణ నుంచి నెమ్మదిగా ఎడంగా జరిగింది. దూరం దూరంగా జరిగి మైదానం నుంచి అడవి బాట పట్టింది. అడవి కుటీరం నుంచి ఈ మాటలు చెబుతోంది. చూడండి
‘మా బందువొకాయన ఆదిలాబాదు జిల్లలో ఒక డ్యాము ముంపులో నష్టపోయిన జీవ సంపద మీద పరిశోధన చేస్తున్నాడు. కోటి రూపాయల ప్రభుత్వ ప్రాజెక్టు. నేను ఆయనతో వెళ్లి అక్కడంతా తిరిగి చూడాలనుకుంటున్నాను’ అంటాడు ఒకతను జయతి గారితో.
ఆ మాటకు తానేమీ అనలేదు. బదులివ్వలేదు.
‘మీరూ ఎదో చెయ్యాలి. ప్రకృతిని కాపాడడానికి.’ ఆయన మళ్ళీ అన్నాడు.
అప్పుడు రాస్తుంది జయతి…’మనిషి మాట్లాడకుండా ఉండటం కష్టం. ఏం చెయ్యకుండా ఊరికే ఉండలేడు.’ అని.
ఏమీ చేయకుండా ఉన్నా బాగుండు అని ధ్వనిస్తూ తన మొత్తం సారస్వతంలోని అత్యంత మౌలికమైన మాట ఇదిగో ఇలా చెప్పింది.
‘ఏ ఆనకట్టలు, పరిశోధనలు లేని భూమిని, ఆ రాత్రి నేను కలకన్నాను’ అని. ( నిశ్శబ్దం – పుట 24 )
ఇది మొత్తంగా అత్యంత కీలకం. తర్వాత మరో చోట ఇలా అంది….
ఎక్కడ భూముల కొనుగోళ్ళు అమ్మకాల మాటలు జరుగుతాయో అక్కడ నాకు ఊపిరాడదు అనీ. (అధ్యాయం : వైటీ – నది. పుట : 4)
అ తర్వాత ఇలా అంది.
ఒకనాడొక యువకుడు ఆకుకూరల రైతు ఒక పూల మొక్కని వేర్లతో లాగేయ్యబోయాడు తోటలో.
అయ్యో! నేనది ఎక్కన్నుంచో తెచ్చి నాటానని అతడ్ని ఆపాను.
ధనం వస్తుందా అన్నాడు అతను.
సీతాకోక చిలకలొస్తాయన్నాను.
(నిశ్చలత. పుట : 86 )
‘మనం కలుసుకున్న సమయాల్లో’ ఇక్కడ మనం వినలేనిది. ఆమె అక్కడి నుంచి దూరంగా ఉంటూ వినిపించేది ఇదే. జయతి ముఖ్య ఇతివృత్తం అదే
ఇదీ జయతి విశేషం. ఆమె సీతాకోక చిలకల కోసం తపిస్తోంది. ఇవతల మనం డబ్బు వస్తుందా అని ఆలోచిస్తున్నాం.
ఇదీ మన పరిస్థితి. మన మైదానపు దుస్థితి. అది వికృతి. అక్కడి నుంచే జయతి గారు ప్రకృతిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇలా అన్నారు కూడా…
మీరు ఎవరు? ఇక్కడేం పని చేస్తారు? జీతం ఎంతొస్తుంది? ఇలాంటి ప్రశ్నల్ని నేను ఎదుర్కోవాల్సి వస్తుందని నన్ను నేను రక్షించుకోవడానికి మనుషుల్నుంచి దూరదూరంగా తిరుగుతాను.
(నిశ్చలత – పుట 96 )
అదే జరిగింది. మొత్తంగా జయతి గారి మూడు పుస్తకాల సారాంశం ఇదే. మరో రకంగా చెబితే జయతి ఇప్పటి వరకు వెలువరించిన అడవి పుస్తకాల సారాంశం మన మైదానం మనుషులకు అడవి చేస్తున్న హెచ్చరిక అని నాకు అనిపిస్తోంది.
‘మనం కలుసుకున్న సమయాల్లో’ ఇక్కడ మనం వినలేనిది. ఆమె అక్కడి నుంచి దూరంగా ఉంటూ వినిపించేది ఇదే. జయతి ముఖ్య ఇతివృత్తం అదే. వినాలి.
అంతకన్నా ముఖ్యం…ఎప్పటికైనా మనం ప్రకృతిలో భాగమై ఆమెను అడవి నుంచి మైదానంకు ఆహ్వానించాలి. అదే అవశ్యం..మనం కలుసుకోవలసిన సమయాలకు పరమార్థం.
జయతి – లోహిలకు హృదయపూర్వక ఆహ్వానం.
జయతి లోహితాక్షణ్ చాయా చిత్రకారిణి. జీవిత రచయిత. ‘అడవి నుంచి అడవికి’, ‘అడవి పుస్తకం’, తాజాగా ‘మనం కలుసుకున్న సమయాలు’ తాను వెలువరించిన అక్షర కృతులు. తెలుపు ప్రచురించిన వారి ఇతర వ్యాసాలు : ఎవరూ లేదనే అన్నారు!, ప్రకృతివైపు ,స్వేచ్ఛ వైపు, Of Solitude 2021. వారి పుస్తకాల కోసం 9848015364 నంబరుకి కాల్ చేయవచ్చు.