‘బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి’ అనే నినాదంతో మలిదశ తెలంగాణ ఉద్యమం గల్ఫ్ దేశాలలో తెలంగాణీయులను ఒక్కటి చేయడానికి ఎంత ఉపయోగపడిందో అందరికీ తెలుసు. కానీ వారి కోసం ప్రభుత్వం తీసుకున్న బలమైన చర్యలు ఏమిటీ అంటే చెప్పుకోదగ్గవి ఏమీ లేవనే చెప్పాలి.
నేటి అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ మన వాళ్ళు ‘అమరుల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికుల స్థితిగతుల మార్పు కోసం, వారి ఉపాధి, సంక్షేమం కోసం చేయవలసిన కృషి చేయడం లేదనే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పవలసి వస్తోంది. తండ్రీ తనయులను గట్టిగా ప్రశ్నించక తప్పడం లేదు.
మంద భీంరెడ్డి
మిత్రులారా. గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు “చనిపోయిన వారిని స్మరించండి – బ్రతికున్న వారి కోసం పోరాడండి” (‘Remember the dead, fight for the living) అనే నినాదంతో ఏప్రిల్ 28 న కార్మికుల స్మారక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా మనం చేయవలసింది ఏమిటో అర్థం చేసుకునేందుకు గాను గల్ఫ్ స్థితిగతులేమిటో మనం సన్నిహితంగా అర్థం చేసుకుందాం. ప్రభుత్వం వీరి సంక్షేమాన్ని ఎంత అలక్ష్యం చేస్తుందో కూడా చర్చిద్దాం.
మీకు తెలుసా. వలస పోయిన మన బడుగు జీవులు ఎడారి దేశాల్లో ప్రతి ఏటా వేలాది మంది అసువులు బాస్తున్న విషయం?! అందుకు స్పష్టమైన లెక్కలే ఉన్నాయి. ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో దాదాపు 15 లక్షల మంది తెలంగాణ కార్మికులు వలస జీవులుగా బతుకు తున్నారు. కన్న ఊరును, ఆత్మీయులను వదిలి సుదూర తీరాలకు వెళ్లిన వీరిలో చాలామంది దిక్కులేని చావు చస్తున్నారంటే వట్టి మాటలు కాదు. మృతదేహాలు అక్కడి ఆసుపత్రి శవాగారాలలో నెలల తరబడి మగ్గడం ఎంత మామూలు విషయం అయిందీ అంటే అదొక వర్తనే కాకుండా పోయింది. శవపేటికల కోసం నెల నుండి ఆరు నెలలు, కొన్ని సార్లు ఒక సంవత్సరం వరకు ఎదిరి చూపు కూడా మామూలు విషయం అయింది. చివరి చూపుకు కూడా నోచుకోకుండా కొందరి పార్థీవ దేహాలు అక్కడే ఖననం అయిపోతున్న విషాద స్థితి ఈ సంగతి తెలిసిన ఎవారి మనసునైనా కలచి వేస్తుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ కు దుబాయ్ పరిస్థితులు బాగా తెలుసు కూడా. కానీ అయన కూడా గట్టిగా పట్టించుకున్న పాపాన పోవడంలేదు.
ఐతే, మరణాలకు కారణాలు ఎన్ని ఉన్నా స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ఇప్పటికీ వలసలు ఉన్నాయని మనం గ్రహించక తప్పదు.
ముందు అన్నట్టు స్పష్టమైన లెక్కలే ఉన్నాయి. బతుకుదెరువు కోసం ఎడారిబాట పట్టిన తెలంగాణ వలసజీవులు వారానికి నలుగురి చొప్పున, సంవత్సరానికి 200 మంది కానరాని దేశాలలో కన్నుమూస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారమే చూసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఈ నెల మొదటివారం వరకూ దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు 1600 మంది తెలంగాణ వలస జీవుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇదీ మన స్వరాష్ట్రంలో తెలంగాణ వలస జీవుల పరిస్థితి. ఐతే మరణాలకు కారణాలను కూడా ప్రస్తావించుకుందాం.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం విదేశాల్లో హృదయ సంబంధ సమస్యల వలన ఎక్కువ మంది భారతీయులు మరణిస్తున్నారు. దాదాపు తెలంగాణా వాళ్ళ మరణాలు కూడా అందులో భాగమే.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి నేటి వరకూ సుమారు 1600 మంది తెలంగాణ వలస జీవుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయంటే పరిస్థితిని మీరే అంచనా వేసుకోండి.
పగలు ఎండలో.. రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు ఆకస్మిక మరణాలకు కారణాలని తెలుస్తోంది. ఐతే, ఇలాంటి మరణాలు కాకుండా గల్ఫ్ దేశాల్లో భారతీయ కూలీల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరిఅయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, ప్రియమైన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిస అవడం – ఇలాంటి అనేక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వం చెబుతున్నట్టు గల్ఫ్ నుంచి ‘తిరుగు వలస’ అన్నది పెద్ద సంఖ్యలో లేదని కూడా చెప్పవచ్చు. ఈ దిశలో ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేయకపోవడం విషాదం.
ఐతే, మరణాలకు కారణాలు ఎన్ని ఉన్నా స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్లే ఇప్పటికీ వలసలు ఉన్నాయని మనం గ్రహించక తప్పదు. రాష్టం ఏర్పాటయ్యాక కూడా ఈ ఎనిమిదేళ్ళ కాలంలో తగిన ఉపాధికి ఆశాజనక పరిస్థితులు ఏర్పడలేదనే చెప్పాలి. ప్రభుత్వం చెబుతున్నట్టు గల్ఫ్ నుంచి ‘తిరుగు వలస’ అన్నది పెద్ద సంఖ్యలో లేదని కూడా చెప్పవచ్చు. ఈ దిశలో ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలు వేగవంతం చేయకపోవడం విషాదం.
ఆమ్నెస్టీ చొరవ కారణంగా 2007లో గల్ఫ్ దేశమైన యూఏఈ నుండి ఉత్తర తెలంగాణకు తిరిగివచ్చిన 29 మంది గల్ఫ్ కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తూ 9 మే 2008 నాడు జీఓ నెం. 266 ను జారీ చేసింది. ఆ తర్వాత గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన సుమారు వంద మంది పేద కార్మికులకు కూడా ఒక లక్ష రూపాయల చొప్పున ఇలాగే ధన సహాయం చేశారు. ఐతే, ఇదంతా స్వరాష్ట్రం ఏర్పడక ముందరి సంగతి.
అట్లా గట్టిగా డిమాండ్లు పెట్టిన కెసిఆర్ రెండు దఫాలు ముఖ్యమంత్రి అయ్యాక కూడా తాను చేసిన డిమాండ్లను తానే అమలు చెయకపోవడం ఎంత విచారకరం!
తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేలకోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు అప్పటి ప్రభుత్వం రూ. 500 కోట్ల నిధులు ఇవ్వాలని 2008 లో నాడు ఉద్యమంలో ఉన్న కేసీఆర్ పరేడ్ గ్రౌండ్స్ సభలో డిమాండ్ చేయడం కూడా మీకు గుర్తుండే ఉంటుంది. వారు గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేయడం విశేషం. అట్లా గట్టిగా డిమాండ్లు పెట్టిన కెసిఆర్ రెండు దఫాలు ముఖ్యమంత్రి అయ్యాక కూడా తాను చేసిన డిమాండ్లను తానే అమలు చెయకపోవడం ఎంత విచారకరం!
‘బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి’ అనే నినాదంతో మలిదశ తెలంగాణ ఉద్యమం దేశ విదేశాల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో తెలంగాణీయులను ఒక్కటి చేయడానికి ఎంత ఉపయోగపడిందో అందరికీ తెలుసు. కానీ వారి కోసం కేసిఆర్ తీసుకున్న బలమైన చర్యలు ఏమిటీ అంటే చెప్పుకోదగ్గవి ఏమీ లేవనే చెప్పాలి.
కేసిఆర్ మాత్రమే కాదు, కేరళ, పంజాబ్ తరహా విధానాలను అవలంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు కూడా ఎండమావులైనాయి.
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో కేసిఆర్ అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చినంక ఆమాటే మర్చిపోయరు. కేసిఆర్ మాత్రమే కాదు, కేరళ, పంజాబ్ తరహా విధానాలను అవలంభిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు కూడా ఎండమావులైనాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేక ప్రవాసి మంత్రిత్వ శాఖ ఏర్పడలేదంటే కెసిఆర్ చిత్తశుద్దిని శంకిచాల్సి వస్తుంది. గద్దెనెక్కాక మర్చిపోవడాన్ని విమర్శిస్తూ సమిష్టిగా వారి వైఖరిని ఎండగట్ట వలసి వస్తుంది.
ఇప్పటికైనా వారి వైఖరిని మార్చుకోవాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) కూడా ఏర్పాటు చేయాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గల్ఫ్ కార్మికులు అమరుల స్మారక దినోత్సవం సందర్భంగా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
మంద భీంరెడ్డి వలస వ్యవహారాల విశ్లేషకులు. వారి మొబైల్ 98494 22622. ఇ-మెయిల్: mbreddy.hyd@gmail.com