మనం జీవిస్తున్న జీవనం గురించి అవగాహనకు మన ముందు తరాల జీవనమే గీటురాయి. వినండి. ‘కళాశ్రమం’ నిర్మాత, దివంగత రవీంద్ర శర్మ గారు గతంలో ఆదిలాబాద్ ఆకాశవాణి కి ఇచ్చిన ఇంటర్వ్యూలు.
ఇరవై నుంచి ముప్పయ్ నిమిషాల నిడివిగల ఈ ఇంటర్వ్యూలు మొత్తం పదిహేను ఉన్నవి. వీటిని మీ తీరుబాటును బట్టి ఒకట్రెండు రోజుల్లో వింటే మీ దృక్పథంలోనే సమూలమైన మార్పు ఏర్పడుతుంది. గత వర్తమానాల పట్ల అవగాహన కలుగుతుంది. భవిత పట్ల మన నడవడి కూడా మారుతుంది. ఒక్కమాటలో వీటిని వింటే భారతీయ గ్రామం గురించి సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ఆధినికులైన మనం కోల్పోయిన దేమిటో బోధపడుతుంది.
కందుకూరి రమేష్ బాబు
‘గురూజీ’ అని ఆప్యాయంగా పిలుపునందుకున్న రవీంద్ర శర్మ గారు 1979 లో ఆదిలాబాద్ లో కళాశ్రమం స్థాపించిన విషయం తెలిసిందే. ఇది గ్రామీణ విజ్ఞానానికి, సాంకేతికతకు నిలయం. వారిని కొన్నేళ్ళ క్రితం ఆదిలాబాద్ ఆకాశవాణి కోసం కోసం ‘శిలాంతరంగాలు’ శీర్షిక పేరిట రచయిత బి. మురళీధర్ గారు పదిహేను భాగాలుగా ఇంటర్వ్యూ చేశారు. వీటిని వింటే గ్రామీణ జీవనం, అందలి కౌశలం, ఆర్థిక దృక్పథం, వస్తు వినిమయం, సౌందర్య దృష్టి, చీర కట్టు మొదలు ఇండ్ల నిర్మాణం దాకా ఎన్నో తెలుస్తాయి. గ్రామం అన్నది వైద్యం, విజ్ఞానం, దార్శానికతల సంగమంగా ఎట్లా నిర్మాణమైనదో బోధపడుతుంది. అందులో ఇమిడిన సంస్కృతి, సభ్యత , పరంపరల ఉద్దేశ్యం లోతుగా అవగతమవుతుంది.
రవీంద్ర శర్మ గారు ఐదేళ్ళ క్రితం మట్టిలో కలిసిపోయారు. కానీ వారు అందించిన జ్ఞానం మట్టి పరిమళం వంటిది. అది మనిషిని తన మూలల వైపు చూసి పులకరించేలా చేస్తుంది.
18 వృత్తులు, 49 సంస్కారాలు, 222 మట్టి పాత్రల వినియోగం వంటివి వివరిస్తూ వాటి ద్వారా ఒకనాటి గ్రామ వైభవాన్ని ఎంతో చక్కగా వారు మన అవగాహనలోకి తెస్తారు. వీటిని వింటే మన ఆధునిక జీవనంలో సమిష్టి స్థానంలో వ్యక్తి ఎట్లా వచ్చి చేరాడో, అందులోని బోలుతనం ఎటువంటిదో పోల్చుకోగలం. మనం ఎట్లా ఒక సంధియుగంలో ఇరుక్కుపోయమో కూడా అవగతమవుతుంది.
రవీంద్ర శర్మ గారు ఐదేళ్ళ క్రితం మట్టిలో కలిసిపోయారు. కానీ వారు అందించిన జ్ఞానం మట్టి పరిమళం వంటిది. అది మనిషిని తన మూలల వైపు చూసి పులకరించేలా చేస్తుంది. ఈ ఇంటర్వ్యూలే అందుకు మంచి ఉదాహారణలు. వాటి వరుస క్రమం ఇది….ఆయా భాగాలపై క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. గమనించగలరు.
- వాడ్రేవు చినవీరభద్రుడు గారు రవీంద్ర శర్మ గారి గురించి 2018 లో రాసిన మూడు భాగాలను కూడా ఇక్కడ చదవచ్చు. 1. మరికొన్ని మంచి మాటలు. 2. గురూజీ మాటలు మరికొన్ని. ౩. జీవనశిల్పి .