ఆర్థిక రంగం అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించికపోయనా ఆర్థికt వృద్ధి కొన్ని దశాబ్దాల వెనక్కు పోయింది. విధాన నిర్ణేతల్లో ఈ చింత మాత్రం కనిపించడం లేదు.
ఆర్థిక సామాజిక రంగాల్లో పరిస్థితులు విషమంగా ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు అలా విలాసంగా దూసుకుపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కేవలం యాధృచ్ఛిక పరిణామాలుగా చూడాలా లేక వీటి వెనక ఒక డిజైన్ ఉందని అనుమానించాలా?
నిజ ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా, లెక్కలేనితనంతో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలను చూస్తుంటే, అసంఖ్యాకులైన పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలపై మార్కెట్ ఎకానమీకి ఉన్న చులకన భావం అర్థమవుతుంది. కల్లోల కాలంలో భగభగమంటున్న షేర్ల ధరలు, ధగధగలాడుతున్న కార్పొరేట్ అధిపతుల సంపద విలువను చూస్తుంటే పాలకుల విధానాలు, సామాన్యులను ఎలా అవహేళన చేస్తున్నాయో బోధపడుతుంది.
ప్రభుత్వ విధానాల కారణంగా కొంత, కోవిడ్ 19 దెబ్బకు మరికొంత దేశ నిజ ఆర్థిక రంగం గత రెండేళ్లకాలంలో దాదాపుగా చతికిలబడింది. ఉద్యోగాల్లేక, వ్యాపారాలు నడవక, ఉన్న ఉపాధి కూడా కోల్పోయినావారు దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఉంటారు. మెజార్టీ ప్రజలకు ఉపాధి కల్పించే అవ్యవస్థీకృత రంగం పెద్దనోట్ల రద్దు, ఆపై జీఎస్టీ పోటుతోనే చావుదెబ్బ తిన్నది. బక్కజీవులు ఆ దెబ్బల నుంచి కోలుకోకముందే కరోనా కల్లోలం వచ్చిపడింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ లోనే లాక్ డౌన్ కారణంగా బతుకుతెరువు కోల్పోయిన వలస కార్మికులు, వందల మైళ్ల దూరంలోని సొంత ఊళ్లకు నడిచి వెళ్ళడం చూశాం. సెకండ్ వేవ్ తీవ్రత, ప్రభుత్వ ఉదాసీనత వెరసి ఈ సారి విధ్వంసం మరింత దారుణంగా ఉంది. అవసరాల కోసం జీవితకాలం కష్టపడి దాచుకున్న కొద్దిపాటి సొమ్మును కరోనా దెబ్బకు మందులకు, హస్పిటళ్లకు సమర్పించుకుంటున్నవారు కొన్ని లక్షల మంది ఉంటారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆస్తులమ్ముకుంటున్నవారి గురించీ, ఆప్తులను, ఇంటి పెద్దలను కోల్పోయి రోడ్డునపడిన వారి గురించీ ఈ కరోనా కల్లోల కాలంలో పత్రికల్లో చదువుతున్నాం.
నిజ ఆర్థిక రంగానికి సంబంధించి ప్రభుత్వ గణాంకాలు కూడా ఏ మాత్రం ఆకర్షణీయంగా లేవు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో మసిపూడి మారేడుకాయజేసి జీడీపీ అంకెలను ఘనంగా చూపించారు. లెక్కలేసే పద్ధతిని మార్చి ‘అచ్ఛేదిన్ వచ్చేన్’ అంటూ ఊరించారు. ఆ తర్వాత పెద్దనోట్ల రద్దు, జీఎస్టీలతో తామే సోకాల్ట్ పైపై మెరుపులు కూడా లేకుండా చేశారు. తాజాగా ప్రభుత్వం చెబుతున్న జీడీపీ లెక్కలు ఆర్థిక రంగ పురోగతి కొన్ని దశాబ్దాల వెనక్కుపోయిన విషయం స్పష్టం చేస్తోంది. అప్పుల మొత్తం జీడీపీలో 90 శాతానికి చేరాయి. ద్రవ్యోల్బణం పతాకస్థాయిలో ఉంది. ఇక ప్రభుత్వ వివక్షపూరిత విధానాల కారణంగా ప్రజాసమూహాల్లో నెలకొన్న అలజడి గురించి విడిగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆర్థిక సామాజిక రంగాల్లో పరిస్థితులు విషమంగా ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు అలా విలాసంగా దూసుకుపోవడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ? కేవలం యాధృచ్ఛిక పరిణామాలుగా చూడాలా లేక వీటి వెనక ఒక డిజైన్ ఉందని అనుమానించాలా ?
మతం కారణంగా ప్రజల నుంచి గెల్చుకున్న విశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని మార్చేందుకు సంపూర్ణంగా ఉపయోగించుకున్నది. నెహ్రూ హయాం నాటి వ్యవస్థల ఆనావాళ్లు కూడా లేకుండా చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. అందులో దాదాపు మోదీ ప్రభుత్వం సఫలమైంది.
గత ఏడాది మార్చి నెలతో పోల్చి చూస్తే కీలకమైన సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 100 శాతం పెరిగాయి. స్టాక్ మార్కెట్లకు మెజార్టీ ప్రజల సుఖ సంతోషాలకు ఏ మాత్రం సంబంధం లేదు. గుప్పెడు మంది శ్రీమంతులు, కార్పొరేట్ సంస్థల అధిపతులు, కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, ఫైనాన్షియర్లు, రాజకీయనాయకులు సంతోషంగా ఉన్నారా లేదా… ప్రభుత్వ పాలసీలన్నీ వారి సంపదను మరింత పెంచేందుకు దోహదం చేస్తున్నాయా లేదా అన్నదే స్టాక్ మార్కెట్లకు ముఖ్యం. స్టాక్ మార్కెట్లను, కాపిటలిస్టులను నిత్య సంతోషంలో ఉంచే నియో లిబరల్ పాలసీల అమలుకు 30 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచే నెహ్రూ కాలం నాటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కీళ్లను ఎక్కడికక్కడ ఊడదీసి ఫక్తు మార్కెట్ అనుకూల వ్యవస్థలను నిర్మించే పనులు మొదలయ్యాయి. అయితే, మన్మోహన్ సింగ్ హయాం ముగిసేవరకు కూడా ఈ విషయంలో సిగ్గు, బిడియంతో కూడిన నాన్పుడు వల్ల దూకుడు కనిపించలేదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవేవీ లేకుండా పోయాయి. నెహ్రూ విధానాల కారణంగానే, ఆయన నిర్మించిన వ్యవస్థల కారణంగానే ఈ దేశంలో విస్తారమైన మధ్యతరగతి ఏర్పడింది. కొత్త తరం పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. భిన్న, సామాజిక, మత, కుల సమూహాలు ఎంతో కొంత ముందుకు పోవడానికి వెసులుబాటు లభించింది. దేశ సంపద సమానంగా కాకున్నా ఏదో ఒక స్థాయిలో ప్రజలందరి మధ్య పంపిణీకి వీలుగా ప్రభుత్వ ప్రమేయంతో కూడిన నిర్మాణాలు ఏర్పడ్డాయి. మతం కారణంగా ప్రజల నుంచి గెల్చుకున్న విశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని మార్చేందుకు సంపూర్ణంగా ఉపయోగించుకున్నది. ప్లానింగ్ కమిషన్ రద్దు మొదలు కల్చరల్ సెంటర్లను ఎత్తేసే వరకు నెహ్రూ హయాం నాటి వ్యవస్థల ఆనావాళ్లు కూడా లేకుండా చేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సదరు వ్యవస్థలను మాత్రమే కాదు, వాటి లబ్దిదారుల ప్రయోజనాలను దెబ్బతీయడం కూడా సదరు ప్రయత్నాల పరమార్థం. అందులో దాదాపు మోదీ ప్రభుత్వం సఫలమైంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, డిజిటల్ లావాదేవీల పేరుతో అసంఘటిత రంగాన్ని చావు దెబ్బతీసిన తర్వాత, తాము ఎంపిక చేసిన లేదా తమను ఎంపిక చేసుకున్న పెట్టుబడిదారుల ప్రయోజనాలకు అనుగుణంగా వేగంగా పాలసీల తయారీ మొదలుపెట్టారు. లేబర్ చట్టాల్లో మార్పులు, భూ చట్టాలు, కంపెనీ చట్టాలు, బ్యాంకుల ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, దేశ సమష్టి సంపదగా చెప్పుకునే సహజ వనరులను కొంతమంది చేతుల్లో పెట్టడం, కొంతమంది బడా వ్యాపారవేత్తలు ఎడాపెడా ఆస్తులు పోగేసుకోవడానికి వెసులుబాటు కల్పించడం… గత కొన్నేళ్లలో మనం చూస్తున్న విషయాలే.
శ్రీమంతులే ప్రభుత్వ పాలసీలను కూడా పరోక్షంగా శాసిస్తున్నారు. ‘బహుజన హితాయ ….బహుజన సుఖాయ’ విధానాల నుంచి, పలుకుబడి, అధికారం, రాజకీయ ప్రాపకం కలిగిన కొద్దిమంది హితం, సుఖంలోనే దేశ హితం, సుఖం దాగి ఉన్నాయన్న విధానాల దిశగా మనం సాగుతున్నాం.
దేశం మీద ప్రేమ, ప్రజల పట్ల కనీస అభిమానం లేని, కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రైవేట్ జెట్స్ లో విదేశాలకు పారి వెళ్లిపోయిన సంపన్నుల శ్రేయస్సును ప్రభుత్వం కాంక్షిస్తున్నది. వారి విజయాలనే స్టాక్ మార్కెట్ సూచీలు గానం చేస్తున్నాయి.
ఆర్థిక రంగంలో ప్రజలకు భాగస్వామ్యం లేకుండా చేశారు. ప్రాజెక్టుల భూసేకరణలో అభ్యంతరాలకు వివాదాలకు ఆస్కారం లేకుండా చట్టాలు తెచ్చారు. మైనింగ్ విషయంలోనూ కొత్త చట్టాలు వచ్చయి. పేదలు, గిరిజనులు, గ్రామీణులు తరతరాలుగా అనుభవిస్తున్న భూములకూ గ్యారంటీ లేకుండా చేశారు. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ప్రజలకు దేశ సంపదమీద ఉన్న హక్కులను తొలగించి, వారిని పరాధీనులుగా మారుస్తున్నారు. సంపద అంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడానికి వీలుగా మార్గం వేస్తున్నారు. కరోనా ఇందుకు అనువైన సందర్భాన్ని సమకూర్చింది. దేశంలో పెట్టుబడిదారి అనుకూల విధానాలను ప్రభుత్వం స్థిరపర్చేందుకు ఉపయోగపడింది. సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడానికి దోహదం చేసింది. ఆర్థిక రంగం అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించికపోయనా ఆర్థిక వృద్ధి కొన్ని దశాబ్దాల వెనక్కు పోయింది. విధాన నిర్ణేతల్లో ఈ చింత మాత్రం కనిపించడం లేదు.
పదేళ్ల క్రితం అనేకమంది వ్యాపారస్తుల్లో ఒకడైన అదానీ ఇప్పుడు దేశంలో ఎన్నదగిన శ్రమంతుల్లో ఒకడు. పశ్చిమ తీరంలో పలు ఓడరేవులను సొంతం చేసుకున్న అదానీ సర్కారు పలుకుబడిని ప్రయోగించి మరీ తూర్పు తీరంలోని తెలుగు పారిశ్రామికవేత్తలకు చెందిన కృష్ణపట్నం, గంగవరం రేవులను రాత్రికి రాత్రి సొంతం చేసుకున్నాడు. అంబానీ పలుకుబడి గానీ వ్యాపార సామ్రాజ్యం గురించి గానీ చెప్పాల్సిన పనేం లేదు. ఇలాంటి శ్రీమంతులే ప్రభుత్వ పాలసీలను కూడా పరోక్షంగా శాసిస్తున్నారు. ‘బహుజన హితాయ ….బహుజన సుఖాయ’ విధానాల నుంచి, పలుకుబడి, అధికారం, రాజకీయ ప్రాపకం కలిగిన కొద్దిమంది హితం, సుఖంలోనే దేశ హితం, సుఖం దాగి ఉన్నాయన్న విధానాల దిశగా మనం సాగుతున్నాం.
దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలకు మెరుగైన జీవితం ఇవ్వడం లక్ష్యం కాదు. ఇందులో మూడో వంతు మందికి అంటే సుమారు 40 కోట్ల మందికి మాత్రం అన్ని రకాల అవకాశాలు అందుబాటులో ఉంచి, కొనుగోలు శక్తి కల్పిస్తే చాలు ఇండియా అతిపెద్ద వినిమయ మార్కెట్ గా రాణిస్తుంది. ఈ 40 కోట్ల మందిలోనే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, సంపన్న శ్రేణి ఉంటాయి. మిగతా జనాభా అంతా వీరిని ఆశ్రయించుకొని జీవించాల్సిందే. కొనుగోలు శక్తి గలిగిన 40 కోట్ల జనాభా అంటే అమెరికా కంటే, యూరప్ కంటే కూడా పెద్ద మార్కెట్ కింద లెక్క. ఈ లెక్కల కారణంగానే ఆదాయాల్లోనే కాదు, సంపదలో అంతరాలు అసాధారణ స్థాయికి చేరుతున్నాయి. సంపన్నులు అత్యంత సంపన్నులుగా మారుతున్నారు. పేదలు, మరింత పేదరికంలోకి జారుతుంటే మధ్యతరగతివారు పేదరికంలోకి జారకుండా నానాపాట్లు పడుతున్నారు. మాద్యం సాకుతో ప్రభుత్వం ప్రకటిస్తున్న రకరకాల ప్యాకేజీలు కూడా సంపన్నుల సంపదను పెంచుతున్నాయే తప్ప పేదలకు భరోసా ఇవ్వడం లేదు.
దేశం మీద ప్రేమ, ప్రజల పట్ల కనీస అభిమానం లేని, కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రైవేట్ జెట్స్ లో విదేశాలకు పారి వెళ్లిపోయిన సంపన్నుల శ్రేయస్సును ప్రభుత్వం కాంక్షిస్తున్నది. వారి విజయాలనే స్టాక్ మార్కెట్ సూచీలు గానం చేస్తున్నాయి.
వి.శ్రీనివాస్ సీనియర్ పాత్రికేయులు, బిజినెస్ ఎడిటర్. మన దేశీయ ఆర్థిక వ్యవహరాల తీరుతెన్నులను జన సామాన్యం జీవన ప్రమాణాల మెరుగుదలకు వీలుగా ఉన్నాయో లేదో చెప్పడం, అందలి క్లిష్టమైన అంశాలను సాధారణ పాఠకులకు సులభంగా విశదీకరించడంలో దిట్ట. ప్రతి పక్షం వారి విశ్లేషణ తెలుపుకి ప్రత్యేకం.
సర్, ప్రస్తుత పరిస్థితిని బట్టబయలు చేశారు… చాలా బావుంది….ఆర్థికరంగాన్ని మార్క్సిస్టు దృక్పథం తో విశ్లేషించగలిగిన వారు చాలా మంది ఉండచ్చు కానీ, ఇంత సరళంగా వ్యక్తీకరించేవారు చాలా అరుదు అని నా భావన.