సింథటిక్ రంగుల వినియోగం స్థానంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహజ వర్ణ వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసి అటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి, వాణిజ్యంతో దేశానికి ఆదర్శం కావాలి.
భారతదేశం వస్త్ర నైపుణ్యతలో ఎల్లప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నది. శతాబ్దాల క్రితమే భారతదేశం మూలిక వర్ణ వస్త్ర సంపత్తితో శోభిల్లింది. 19వ శతాబ్దంలో సింథటిక్ రంగుల ప్రవేశంతో సహజ వర్ణ రంగుల వినియోగం క్రమంగా తగ్గుతూ వచ్చింది. మరీ ముఖ్యంగా గత 60 సంవత్సరాలలో సింథటిక్ రంగుల వినియోగం విపరీతంగా పెరిగింది. తక్కువ ధరకు సులువైన మార్గాలలో సింథటిక్ రంగులు ఉత్పత్తి కావడం ఇందుకు ప్రధాన కారణం.
వస్త్ర రంగంలో సింథటిక్ రంగుల వినియోగం కారణంగా పర్యావరణానికి ఎనలేని హాని కలుగుతున్నదని పారిస్ లో జరిగిన క్లైమెట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ ఆందోళన చెందింది. అంతేకాదు రానున్న 50 సంవత్సరాలలో నీటికి, సారవంతమైన భూమికి తీవ్రకొరత ఏర్పడుతుందని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదే విధంగా సింథటిక్ రంగుల వినియోగం జరిగితే భూమి, గాలి, నీరు కాలుష్య భారిన పడతాయని వస్త్ర రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించాలని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.
వస్త్ర పరిశ్రమ వలన ప్రపంచ వ్యాప్తంగా ప్రతి గంటకు 70 కోట్ల లీటర్ల నీరు, 13 లక్షల కిలోల మట్టి, 12 లక్షల కిలోల గాలి కాలుష్య భారిన పడుతున్నాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా గాలిలో కార్బన్ డైయాక్సైడ్ స్థాయి వేగంగా పెరుగుతున్నది. సింథటిక్ రంగులలో 42 రకాల క్యాన్సర్ కారకాలను గుర్తించడం జరిగినది. ఇలాంటి సింథటిక్ రంగులను జర్మని నిషేధించింది. సింథటిక్ రంగుల తయారీకి ఉపయోగించే 8 వేల రకాల రసాయనాల వలన అస్తమా, అలర్జీ, వొళ్లునొప్పులు వంటివే కాక చిన్న పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వస్త్ర పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాలను నదులు మరియు ఇతర జలాశయాలలోకి వదలడం వలన త్రాగు మరియు సాగు నీరు తీవ్ర కాలుష్యభారిన పడుతున్నాయి.
తక్కువ ఖర్చుతో సహజ రంగులను తయారుచేసే విధానాలను ప్రభుత్వం పరిచయం చేయాలి. కేవలం రంగుల విషయమే కాక పర్యావరణ సానుకూల ఉత్పత్తులను తయారుచేసే ప్రతి పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి.
శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందక ముందే భారత్ లో స్థానికంగా అందుబాటులో ఉన్న మొక్కలు, పూలు, పండ్లు వంటి వాటితో రంగులను తయారు చేసేవారు. మరీ ముఖ్యంగా అడవిలో దొరికే ఔషధమొక్కలతో రంగులను తయారు చేయడం ద్వారా మనిషి ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి ఎంతో మేలు జరిగేది. ఒకే రంగును వివిధ ప్రాంతాలలో లభ్యమయ్యే వివిధ మొక్కలనుండి తయారు చేసే సౌలభ్యం ఉండేది. సహజ రంగులను తయారు చేసిన తరువాత వెలువడే వ్యర్థాలు పంట పొలాల్లో ఎరువుగా ఉపయోగపడతాయి. అడవిలో లభ్యమయ్యే వ్యర్ధ వనరులు సైతం సహజరంగుల తయారీకి ఉపయోగించవచ్చు. భారత్ ల్ ప్రస్తుతం 3,500 కోట్ల వనమూలిక వ్యాపారం జరుగుతున్నది. ప్రతి ఏటా ఇది 20 శాతం పెరుగుతున్నది. ఇండిగో మొక్కల పెంపకం అమెరికా, చైనా, థైలాండ్, ఇండోనేషియతో పాటు భారత్ లో నేటికి జరుగుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఇండిగో రంగుకి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఈ రంగు అభివృద్ధి భారత్ వాణిజ్యానికి ఎంతో మేలు చేస్తది. ఔషధ గుణాలున్న రంగు వస్త్రాలను ధరించినప్పుడు ఔషధ కణాలు శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సహజ రంగుల ముడి పదార్థాలు భూమిపై కంటే సముద్ర గర్భంలో అనేక రెట్లు ఎక్కువగా లభ్యమౌతాయి. వీటికి ఇంకా పరిశోధనలు జరిపి తక్కువ ఖర్చుతో సహజ రంగులను తయారుచేసే విధానాలను ప్రభుత్వం పరిచయం చేయాలి. కేవలం రంగుల విషయమే కాక పర్యావరణ సానుకూల ఉత్పత్తులను తయారుచేసే ప్రతి పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు నడుంకట్టిన సందర్భంలో భవిష్యత్ తరాల కోసం పర్యావరణ సానుకూల ఉత్పతుల వైపు పయనించాల్సిన సమయం ఆసన్నమైనది.
నిరుద్యోగ యువతకు ఇచ్చే శిక్షణలో భాగంగా సహజ రంగుల అద్దకం, మూలికా రంగుల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇస్తే ఈ రంగానికి మరియు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
విశ్వగురువు పాత్రను సంకల్పించిన భారత్ ప్రతి రంగంలో పర్యావరణహిత విధానాన్ని అనుసరించాలి. భారతదేశాన్ని “ప్రపంచ నైపుణ్య రాజధాని’ గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వడానికి ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని తీసుకవచ్చింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. వస్త్ర పరిశ్రమకు సంబంధించి టెక్స్టైల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ క్షేత్ర పరిశీలన, స్కీమ్ అమలు బాధ్యత తీసుకుంటుంది. నిరుద్యోగ యువతకు ఇచ్చే శిక్షణలో భాగంగా సహజ రంగుల అద్దకం, మూలికా రంగుల తయారీ వంటి వాటిపై శిక్షణ ఇస్తే ఈ రంగానికి మరియు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
80 బిలియన్ల మార్కెట్ సామర్ధ్యం ఉన్న ఈ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలి. తెలంగాణలో వరంగల్, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంను టైక్స్టైల్ హబ్ గా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహజ రంగుల పరిశ్రమపై ప్రత్యేక దృష్టిని సారించాలి. ఈ పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి. అందుకు అనుగుణంగా విధానాలను రూపొందించాలి. రాబోయే రోజులలో ప్రపంచ వ్యాప్తంగా సహజ వర్ణ వస్త్రాలకు వచ్చే డిమాండ్ దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. మొదటి దశలో అడవులలో లభ్యమయ్యే వనరులు, రెండవ దశలో డింమాడ్ దృష్టా ప్రత్యేకంగా మొక్కల పెంపకం చేయడం ద్వారా రంగుల అభివృద్ధితో పాటు గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. నూతన ఆలోచనలు, విధానాలతో పలు రంగాలలో పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలు సహజ వర్ణ వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసి అటు ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఉపాధి, వాణిజ్యంతో దేశానికి ఆదర్శం కావాలి.
యర్రమాద వెంకన్న నేత జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, సెల్: 7382557788