Editorial

Wednesday, January 22, 2025
Opinionమీరు సామాన్యులు కావడం ఎలా? - అడివి శ్రీనివాస్ సమీక్ష

మీరు సామాన్యులు కావడం ఎలా? – అడివి శ్రీనివాస్ సమీక్ష


మనకు జీవితంలో ఎంతోమంది తారసపడతారు. కొందరు ఇచ్చే వారుంటారు, కొందరు పుచ్చుకునే వారుంటారు. మరికొందరు ఇచ్చిపుచ్చుకునే వారూ ఉంటారు. ఈ మూడో రకం మనుషుల్లో ఆ ‘క్రియ’ అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతం ‘సామాన్యమైందే.

మనం ఇరుగు పొరుగున నివసించే వాళ్లతో ‘ఇచ్చిపుచ్చుకోమా?’ అటువంటిదే అది మరి, ఆ సామాన్యమైన అనుబంధాన్ని, అద్భుతాన్ని అలవోకగా నెరిపే వ్యక్తి కందుకూరి రమేష్ బాబు. అతడు అన్నీ ఇస్తాడు. అన్నీ పుచ్చుకుంటాడు.

అడవి శ్రీనివాస్

గౌరవం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అతడు అన్నీ ఇస్తాడు.
మనకూ ఇవ్వాలనిపిస్తుంది. తాను పుచ్చుకుంటాడు.
ఇచ్చిపుచ్చుకోవడంలోని సామాన్యత ఆయన దగ్గర నాకు విశేషంగా కనిపించింది.

ఈ విషయం చెప్పకుండా ఆయన రాసిన ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ ప్రారంభిస్తే అది సామాన్యంగా అనిపించదు. అందుకే ముందు రచయిత స్వభావం గురించి రెండు మాటలు చెప్పి మరి నాలుగు మాటలు పంచుకోవాలనుకుంటున్నాను.

తాను ఈ పుస్తకం ప్రారంభంలోనే ఒక చోట రాస్తాడు. నలుపును విస్మరిస్తే తెలుపు భగవంతుడి లీల మాదిరిగా కనిపిస్తుందని! ‘ఫ్రేమింగ్’ అంటే ఇదే. దాన్ని అక్షరాలా నిజం చేసి చూపే రచన ఈ పుస్తకం.

సత్యజిత్ రే సినిమాల్లో ఎక్కడా జూమ్ ఇన్ – జూమ్ అవుట్ కనిపించదు.
జీవితంలోని వాస్తవికతను ప్రతిబింబించాలనుకున్నప్పుడు దేన్నీ ఫోకస్ చేయడం వుండదు.
అందుకే సత్యజిత్ రే దేన్నీ జూమ్ చేయడు. జూమ్ ఔటూ చేయడు.
అయితే, టిల్ట్ అప్, టిల్ట్ డౌన్ ఉంటుంది. కెమెరా లెఫ్ట్ పాన్…రైట్ పాన్ అవుతూ ఉంటుంది.
కానీ, జూమ్ చేయడు. ఒక దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు యధాతధంగా జీవితాన్ని దర్శిస్తాడు.
వాస్తవికత, సహజత్వంలో లీనమై పోతాడు.
రచయితగా కందుకూరి రమేష్ బాబు ఈ పుస్తకంలో చేసింది అదే.
ఎక్కడా మనల్ని దగ్గరకు తీసుకెళ్లడు. దూరం చేయడు.
వాస్తవికతను రచించి అలా చూపిస్తాడు.

మరొక సంగతి.

టెక్నికల్ పరిభాషలో ‘ఫ్రేమింగ్’ అంటుంటాం.
ఒక ఫ్రేంలో ఏముండాలి? ఎంత వుండాలి? ఆ ఫ్రేం ఎలా పెట్టాలి? అని ఆలోచిస్తాం.
ఆ ఫ్రేంను ఎంత వరకు పెట్టాలో తెలియాలనీ అనుకుంటూ ఉంటాం.
ఈ రచయితకు దాని గురించి తెలుసు.

తనకి ఆ ఫ్రేం తెలుసు. తన ఫ్రేం తెలుసు.
దాన్ని ఎంత వరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవడమూ తెలుసు.
ఆ ఫ్రేం పరిధి దాటిపోకుండా ఉండటమూ అతడికి తెలుసు.
ఒక్క మాటలో ఫ్రేమింగ్ తెలిసిన ఆల్కెమిస్ట్ రమేష్ బాబు.

ఆ ఫ్రేమ్ లో ‘సామాన్యతే’ కనిపిస్తుండటం ఈ పుస్తకం విశేషం. సామాన్యత.

జీవితంలో అయినా, రచనలో అయినా, ఫొటోగ్రఫిలో అయినా – ఆ ఫ్రేమింగ్ తెలిసిన అరుదైన మనిషి రమేష్ బాబు. అటువంటి వ్యక్తిని నేనింతవరకూ చూడలేదు.

తాను ఈ పుస్తకం ప్రారంభంలోనే ఒక చోట రాస్తాడు. నలుపును విస్మరిస్తే తెలుపు భగవంతుడి లీల మాదిరిగా కనిపిస్తుందని! ‘ఫ్రేమింగ్’ అంటే ఇదే. దాన్ని అక్షరాలా నిజం చేసి చూపే రచన ఈ పుస్తకం.

రొమాంటిసైజ్ చేయడమనే లక్షణం ఈ పుస్తకంలో కనిపించలేదు.
నిజాయితీ, సహజత్వమేదో ఈ పుస్తకంలో ఉంది.

నేననుకుంటాను, ఉత్తమ రచనకు ఉండాల్సిన లక్షణం – ఏదైతే చదువుతున్నానో కాసేపు అదే నేనైపోవడం. ఆ నేనైపోవడం ఈ పుస్తకంలో సామాన్యంగా జరిగిపోయింది.

E. M. Forster ఎ ప్యాసెజ్ టు ఇండియాలో అనుకుంటాను, ఒక చోట రాస్తాడు…’మనిషి జీవితంలో చాలా భాగం నిరాసక్తమైనదే. కానీ, కవులు, కళాకారులు తమ ఉనికి నిలుపుకునే ప్రయత్నంలో జీవితాన్ని అందంగా, అద్భుతంగా నిర్వచించారు, రచించారు. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నవాడెపుడూ మౌనంగానే ఉంటాడు.’

ఈ మాట కొంచెం వివాదస్పదమే.
కానీ, ఇక్కడ ఏ వివాదమూ లేదు.

నాకనిపిస్తుంది! చాలాసార్లు సాహిత్యం చదువుతున్నప్పుడు ఒక్కోసారి భయమేస్తుంది.
రావిశాస్త్రి గారి ‘వర్షం’ కథలో – వర్షాన్ని సంపిడ్సిపెట్టే నూకరాజును చూస్తే భయమేస్తుంది.
వివినమూర్తి గారి ఏటిమార్గం కథలో రోడ్లు వేసే సంచార జాతికి చెందిన వ్యక్తి చెప్పే మాటలు…అవి గుర్తొస్తే బాధేస్తుంది.
ఆ కథలు గొప్ప కథలు.
ఆ కథలు చాలా సామాన్యుల కథలు.
ఆ కథల వంటి కథలు చాలా ఉన్నాయి.
ఆవి ఆయా రచయితల జీవితానుభవాల్లోంచో, వారికి పరిచయమైన వ్యక్తుల నుంచో వచ్చాయి.
వాటిని అద్భుతంగా మన ముందుంచారు.
అయితే ఈ రొమాంటిసైజ్ చేయడమనే లక్షణం ఈ పుస్తకంలో కనిపించలేదు.
నిజాయితీ, సహజత్వమేదో ఈ పుస్తకంలో ఉంది.
అందుకే ‘మీరు సామాన్యులు కావడం ఎలా’ అన్నఈ పుస్తకం జీవితంలా As it is లా ఉంది.
ఎలా కనిపిస్తే అలా…ఏది ఫీలైతే అలా…సహజంగా, సామాన్యంగా ఉంది.
అందుకే ఈ పుస్తకంలోని రైలు డ్రైవర్ ని చదివినప్పుడు…
అతడు తన విధులనుంచి తాను తప్పుకుంటున్నప్పుడు…
ఆ డ్రైవర్ ని నేనే అయిపోయాను.
ఇది చదువుతున్నంత సేపూ నేను సామాన్యుడినే అయ్యాను.

‘నేనొక సామాన్యుడిని’ అని మనల్ని మనం తెలుసుకునేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

వాళ్లు మీ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు. మనకు తెలియదు, వాళ్లు సామాన్యులని! అలాంటి ఎంతోమంది సామాన్యులను రమేష్ బాబు ఇందులో పరిచయం చేశాడు. సామాన్యతలోని సామాన్యతను ఈ పుస్తకంగా మలిచి చూపించాడు.

ఒక ఉదయం ఆర్.ఆర్. షిండే అన్న దర్శకుడితో నేను పంచుకున్న ఒక అనుభవం ఇక్కడ గుర్తు చేసుకోవాలనిపిస్తోంది.
ఆయన వేదాంతి వంటివాడు.
జీవితాన్ని రికామీగా ఫీలయ్యే వ్యక్తి.
ఆయన నాతో మాట్లాడుతూ, ‘జీవితంలో నేనేమీ పెద్దగా సంపాదించుకోలేదు శీనూ’ అన్నాడు.
‘ఒకే ఒకటి సంపాదించుకున్నాను. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి అన్నపూర్ణ స్టూడియో వరకూ నేను నడిచి వెళ్తుంటే ఓ పది కార్లు వచ్చి ఆగుతాయి. ‘ఏంటి షిండే..నడిచి వెళుతున్నావు…రా…కారెక్కు’ అని ఓ పదిమంది అడుగుతారు. నేను జీవితంలో సంపాదించింది ఇది శీనూ…’ అని అన్నారాయన.

నాకెందుకో అప్పుడు తనని ఒక ప్రశ్న అడగాలనిపించింది.
ఇలా అడిగాను. ‘ఎవరూ ఎక్కించుకోకుండా వెళితే ఏం చేస్తారు? అని కుతూహలంగా అడిగాను.
ఆయన అన్నారు, ‘ఏముందయ్యా…నడుచుకుంటూ వెళ్తాను’ అన్నారు.
సామాన్యులు అంతే.
వాళ్లు మీ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోతూ ఉంటారు.
మనకు తెలియదు, వాళ్లు సామాన్యులని!
అలాంటి ఎంతోమంది సామాన్యులను రమేష్ బాబు ఇందులో పరిచయం చేశాడు.
సామాన్యతలోని సామాన్యతను ఈ పుస్తకంగా మలిచి చూపించాడు.

ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడట…గురువు గారూ ‘enlightenment అయ్యాక ఇంకా ఏం జరుగుతుందీ?’ అని! ఆ గురువు గారు చెప్పారు, ‘ఏం జరగదు. నీ పని నువ్వు చేసుకుంటావు. అంతే’ అన్నారట. ఈ పుస్తకం పూర్తి చేశాక మనం మన పని మనం చేసుకుంటూ పోతాం.

ముందు చెప్పినట్లు ఈ పుస్తకం చదివి నేనొక రైలు డ్రైవర్ ని అయ్యాను.
ఇంకా చాలా అయ్యాను.
నేనూ అయ్యాను.

మొత్తం పుస్తకంలో నాకు బాగా నచ్చింది తానే పాట కావడం.
పాటై పోవడం!

మనం ఏదైతే అనుకుంటామో అది కావడం!

ఒక శిష్యుడు గురువుగారిని అడిగాడట…
గురువు గారూ ‘enlightenment అయ్యాక ఇంకా ఏం జరుగుతుందీ?’ అని!
ఆ గురువు గారు చెప్పారు, ‘ఏం జరగదు. నీ పని నువ్వు చేసుకుంటావు. అంతే’ అన్నారట.
ఈ పుస్తకం పూర్తి చేశాక మనం మన పని మనం చేసుకుంటూ పోతాం.
వేరే వాళ్ల జీవితాలు గడపడం కాదు, మన జీవితాలు మనం గడపడానికి పూనుకుంటాం.
అది నిజమైన అభినందన.
అదే ఈ పుస్తకానికి, రచయితకు నిజమైన అభినందన.

ఇంత గొప్ప ఫిలాసఫినీ ఇంత సింపుల్ గా ఒక చిన్న పుస్తకంగా రాయగలగడం, దాన్ని అంగీకరింపజేయడం చాలా గొప్ప విషయం. అందుకు రమేష్ బాబుకు అభినందనలు.

 

సమీక్షకులు అడివి శ్రీనివాస్ గారు ఎలక్ట్రానికి (టీవి) మీడియాలో చిరపరిచితులైన క్రియేటివ్ డైరెక్టర్. ప్రస్తుతం ఎన్ టీవీ లో పనిచేస్తున్నారు. 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article