‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అన్నట్టు ఈ చారిత్రాత్మక కరపత్రం తెలంగాణా జర్నలిస్టుల ఫోరానికి (TJF) పునాది. దిక్సూచి. ఎజెండా.
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులంతా టిజెఎఫ్ ఒక వేదికగా ఏర్పడటానికి, నాటి సమావేశానికి తమ భావజాలాలు పక్కన పెట్టి ఒకే లక్ష్యం కోసం అందరూ నడుం కట్టడానికి ఈ కరపత్రమే ఎజెండా.
నేటికి సరిగ్గా ఇరవై ఏళ్ళు నిండిన ఈ కరపత్రం నిన్నటికే కాదు, నేటికీ, రేపటికీ, ఎప్పటికీ గొప్ప స్ఫూర్తి నిస్తుంది. ఇది పాత్రికేయ ప్రాణహిత అల్లం నారాయణ గారి విరచితం.
“మనకు తెలంగాణా కావాలె. మన నేల మీద, మన బాస మీన, మన యాస మీన మన పెత్తనం కావాలె!” అంటూ గొప్ప ఆత్మగౌరవ ప్రకటన చేసిన ఈ కరపత్రం సకల తెలంగాణ జనుల అంతిమ ఆకాంక్ష. తొలి ప్రకటన. సాధించుకున్న తెలంగాణలో మళ్ళీ పెత్తనం గనుక ఎదురైతే తిరిగి నిలబడటానికి కలబడటానికి ఈ కరపత్రం పోరాటానికి ఉత్తేజితం చేస్తుంది. అందుకే దీన్ని కేవలం కరపత్రం అనడం కన్నా తెలంగాణ అమ్ముల పొదిలో భద్రంగా ఉన్న ఆయుధం అనే అనుకోవాలి.
మే 31న మాట్లాడుకుందాం
దోస్త్…!
తిరిగి తిరిగొచ్చింది తెలంగాణ. మళ్ళోసారి తేల్చుకుందాం రమ్మంటంది తెలంగాణా. 1969 నుంచి 71 దాకా బలిదానాలు చేసింది. బరిగీసి నిలిచింది. ముప్పయేండ్లుగా నలిగినలిగి రగిలింది మల్లా. వేదికలు, సంఘటనలు, సంస్థలు, వ్యక్తులు, విడివిడిగా, కలివిడిగా చేసిన, చేస్తున్న పని ఇయ్యాల్టికి, ఇన్నొద్దులకు ఒక రేవుకచ్చింది. తెలంగాణా మళ్ళోసారి బాజాట్లకచ్చి బరిగీసి నిలిసింది. మనం జర్నలిస్టులం. తెలంగాణా పుటకపుట్టిన భూమిపుత్రులం.
మనకు తెలంగాణా కావాలె. మన నేల మీద, మన బాస మీన, మన యాస మీన మన పెత్తనం కావాలె! దీన్కి తెలంగాణా ఒక్కటే మాట. మనకు తెలంగాణా కావాలె. మన యాసకు గౌరవం తేవాలె. మన యాసను ఎక్కిరిస్తున్న వాళ్ళమీన కొట్లాడాలె. కూసోని మాట్లాడుకుందాం రండి. తెలంగాణా కోసం ఏంజెయ్యాలె. మన నేలతల్లి కోసం మనమేం జేద్దాం. మాట్లాడుదాం రండి.
స్థలం: ప్రెస్ క్లబ్, బషీర్ బాగ్, హైద్రాబాద్ సమయం: ఉ. 10.00 గంటలకు
తెలంగాణా జర్నలిస్టులు