భూపాలపల్లి జిల్లా కేంద్రానికి 22 కి.మీ.ల దూరంలో అడవి సోమనపెల్లి గ్రామ సరిహద్దులో ఉన్న అడవుల్లోని ఒక గుట్టలో ఈ రాతి గుహాలయాలున్నాయి.
అరవింద్ పకిడె
దట్టమైన అడవి మధ్యలోనుండి ప్రవహించే మానేరు నదికి ఎదురుగా ఉన్న ఒక పెద్దకొండను తొలిచి గుహాలయాలుగా మలిచారు. ఇక్కడ మొత్తం నాలుగు గుహాలయాలున్నాయి. ప్రాచీన భారతీయ వాస్తు శిల్పానికి చెదరని సాక్ష్యాలుగా ఉన్న ఈ గుహాలయాలు గత కొన్ని శతాబ్దాలుగా నిలిచి ఉన్నాయి.
స్థానికులు ఈ గుహాలయాలను నైనగుళ్లు అని పిలుస్తారు. వీటి నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో విష్ణుకుండినుల కాలంలో నిర్మించబడిన ఉండవల్లి గుహాలయాలను పోలి ఉన్నాయి అక్కడున్నట్టుగానే ఇక్కడి గుహాలయాల్లో కూడా గర్భ గుడి, దాని ముందు భాగంలో మంటపం ఉన్నాయి. ఈ గుహాలయాల్లో శివలింగం, మరియు గణపతి, మహిషాసురమర్దిని విగ్రహాలు శిథిల రూపాల్లో ఉన్నాయి. వీటిని పూర్వం కాలాముఖులుగానీ, పాశుపతులు గానీ ఆరాధించి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.
పశ్చిమాభిముఖ ద్వారాలతో ఉన్న ఈ గుహాలయాలలో బౌద్ధ, జైన ఆనవాళ్ళేవీ దొరకనప్పటికీ, ఇవి 7, 8వ శతాబ్దాల కన్నా ముందు చెక్కబడి ఉండవచ్చని ప్రముఖ చరిత్రకారుడు ఎన్.ఎస్. రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. ఆ వాఖ్యకు ప్రధానాధారాలుగా మొదటి గుహాలయంలోని గోడలపై పెచ్చులు రాలిపోయిన వర్ణ చిత్రాలను ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.
శాసనాలు
మొదటి, రెండవ గుహాలయాల గోడల మీద తెలుగు భాషలో లిఖించబడ్డ రెండు చిన్న లేబుల్ శాసనాలున్నాయి. మొదటి అసంపూర్ణ శాసనంపై ఎక్కటె విమున అనే వ్యక్తి క్రీ.శ. 10వ శతాబ్దంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి, ఆ శివలింగానికి రామేశ్వర దేవుడిగా నామకరణం చేసినట్లు, కెంపెన అనే వ్యక్తి గుహాలయాల నిర్మాణం కోసం రాతిని తొలచినట్లు రాయబడి ఉంది. క్రీ.శ. 110వ సంవత్సరంలో రామేశ్వరుని ఆలయ ధూప, దీప, నైవేద్యాల కోసం పెనుకంటి ముచ్చిరెడ్డి అనే వ్యక్తి భూమిని దానం చేసినట్లు రెండో శాసనంలో ఉంది.
మొదటి అసంపూర్ణ శాసనంపై ఎక్కటె విమున అనే వ్యక్తి క్రీ.శ. 10వ శతాబ్దంలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి, ఆ శివలింగానికి రామేశ్వర దేవుడిగా నామకరణం చేసినట్లు, కెంపెన అనే వ్యక్తి గుహాలయాల నిర్మాణం కోసం రాతిని తొలచినట్లు రాయబడి ఉంది.
‘ఎక్కటి’ అంటే విలుకాడైన సైనికుడు. మొదటి రుద్రదేవుని కాలంలో సిద్దిపేట దగ్గరి కొండపాకలోని రుద్రేశ్వరాలయాన్ని ఎక్కటీలు అంటే విలుకాడులైన సైనికులే నిర్మించారు. అలాగే జనగామ జిల్లాలోని ఆకునూరులో, యాదాద్రి జిల్లాలోని చిన్న కందుకూరులో కూడా ఎక్కటీలే దేవాలయాలు నిర్మించారని అక్కడి ఆలయాల వద్ద లభించిన శాసనాల ద్వారా తెలుస్తోంది.
వర్ణ చిత్రాలు
గర్భగుడి ఎదురుగా ఉన్న మండపం గోడలు ఎలాంటి అలంకారాలు లేకుండా సాధారణంగా ఉన్నప్పటికీ, మనం క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే మండపం పైకప్పు (సీలింగ్) సన్నని సున్నపు పొరతో చదును చేయబడినట్లు తెలుస్తుంది. దానిపై అనేక వర్ణ చిత్రాలున్నాయి.
ఈ వర్ణచిత్రాలు భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి సమీపంలోని పాండవులగుట్ట గుహల్లోని వర్ణ చిత్రాలకంటె ప్రాచీనమైనవి. వీటి రంగుల గాఢత, చిత్రించిన శైలి అజంతా చిత్రాలను పోలి ఉంది.
ఈ వర్ణ చిత్రాలలో నృత్యం చేస్తున్న నర్తకి, యుద్ధ దృశ్యాలు, గుర్రపు రథాలు, విల్లు పట్టుకున్న సైనికులు, రాజ భవనాలు మొదలైనవి ఉన్నాయి. కానీ ఈ చిత్రాల పొరలు కాలక్రమేణా ఊడిపోవడం వల్ల ప్రస్తుతం నలుపు, ఎరుపు, నీలం, పసుపు పచ్చని రంగులలో ఆయా చిత్రాల అస్పష్టమైన గుర్తులు మాత్రమే మిగిలాయి. చిత్రాలున్న రాతి భాగం నాణ్యమైనది కాకపోవడం వల్ల మరియు పలు శతాబ్దాల తరబడి మానేరు నది నుంచి వీచే చల్లని గాలుల ప్రభావం వల్ల ఈ చిత్రాలు క్రమేణా వాటి రూపును, నాణ్యతను కోల్పోతున్నాయి.
ఈ వర్ణచిత్రాలు భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి సమీపంలోని పాండవులగుట్ట గుహల్లోని వర్ణ చిత్రాలకంటె ప్రాచీనమైనవి. వీటి రంగుల గాఢత, చిత్రించిన శైలి అజంతా చిత్రాలను పోలి ఉంది. కార్బన్ డేటింగ్ ప్రక్రియ ద్వారా ఈ చిత్రాల వయస్సును తెలుసుకోవచ్చు. వీటి వయస్సును గూర్చి పరిశోధించవలసివుంది.
చెదిరిపోతున్న శాసనాలు, రాతి చిత్రాలు
2018వ సంవత్సరంలో శివరాత్రి వేడుకల సందర్భంగా గ్రామస్తులు ఈ ఆలయ అభివృద్ధికి పూనుకున్నారు. ఆలయానికి వెళ్ళేందుకు అడవి మధ్య నుండి నడక దారిని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులకు చారిత్రక సంపదపై అవగాహన లేకపోవడంతో ఆధునికీకరణ పేరుతో గుహలకు సున్నం వేశారు. దీనివల్ల గుహల పై భాగంలో ఉన్న రాతి చిత్రాలు, శాసనాలు పాడవ్వడమేకాక వాటి చారిత్రక ప్రాధాన్యం దెబ్బతింది.
అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్. చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను.