Editorial

Sunday, September 22, 2024
కథనాలుఅరవింద్ సమేత : నాటి దేవతల కొండ

అరవింద్ సమేత : నాటి దేవతల కొండ

Devarakonda

13 వ శతాబ్దం నాటి దేవతల కొండనే నేటి ఈ దేవరకొండ కోట

Aravind Pakideఅరవింద్ పకిడె

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటలన్నింటిలో దేవర కొండ కోట తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకుంది. 13 వ శతాబ్దంలో నిర్మాణం చేయబడ్డ దేవరకొండకి ‘సురగిరి’ అంటే దేవతల కొండగా మరో పేరున్నది. కోట చుట్టూ 8 చోట్ల ఆంజనేయ స్వామి రూపాన్ని శిలల్లో చెక్కి అష్టదిగ్బంధనం చేశారని, చుట్టూ దేవరలు ఉన్న కొండ కాబట్టి ఈ ప్రాంతాన్ని దేవరకొండ అని కూడా పిలుస్తారు.

15 వ శతాబ్దం నాటి దేవరకొండ కైఫీయత్ ద్వారా దేవరకొండ కోట విశేషాలు తెలుస్తున్నాయి.

15 వ శతాబ్దం నాటి దేవరకొండ కైఫీయత్ ద్వారా దేవరకొండ కోట విశేషాలు తెలుస్తున్నాయి. సుమారు 700 సంవత్సరాల క్రితం అంటే 13 వ శతాబ్దంలో నిర్మించబడ్డ ఈ కోట కాకతీయులకు సామంతులుగా ఉండి అనంతర కాలంలో స్వతంత్రులు అయిన పద్మనాయకుల రాజధానిగా విలసిల్లింది. అనపోత నాయకుడు, రెండవ మాదానాయుడు కాలంలో కోట నిర్మాణం పూర్తయింది. మాదానాయుడి వారసులు దేవరకొండని , అనపోత నాయకుడి వారసులు రాచకొండని రాజధానిగా చేసుకొని 1236 సంవత్సరం నుండి 1486 సంవత్సరం వరకు తమ పరిపాలన సాగించారు. తరువాత కాలంలో ఈ కోటని బహమనీ సుల్తానులు , కుతుబ్షాహిలు వశం చేసుకున్నారు.

నిర్మాణ కౌశలం

Devarakondaఈ కోట విస్తీర్ణం దాదాపుగా పది కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 500 అడుగుల ఎత్తులో ఏడు కొండల మధ్య రాళ్లతో నిర్మితమైన ఈ కోట చుట్టూ రక్షణగా మట్టి, రాళ్లతో కట్టిన కోట గోడలు ఉన్నాయి. మొత్తం 7 గుట్టలని చుట్టి ఉన్న ఆ శిలా ప్రాకారంలో సుమారు 360 బురుజులు, రాతితో కట్టిన 9 ప్రధాన ద్వారాలు, 32 ప్రాకార ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, కొనేరులు,చిన్న కొలనులు, సైనికుల నివాసాలు, భవనాలు, 13 ధాన్యాగారాలు, రాజమందిరం, అంతఃపురం, సభా వేదికలు మరెన్నో దేవాలయాలు ఉన్నాయి.

Devarakonda

ప్రాకారాల మెట్లు, రహస్య ద్వారాలు, ప్రధాన ద్వారాల మధ్య రెండు అంతస్థులలో కట్టిన సైనిక స్థావరాలు , ఆయుధగారాలు, నాటి శత్రు దుర్బేధ్యమైన నిర్మాణాలకు చిహ్నాలుగా ఉన్నాయి. నాటి కాలంలో జరిగిన యుద్దాలకు నిదర్శనంగా ఫిరంగులు కనపడతాయి. రాజ దర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణ కుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు గుర్రాలు చెక్కి ఉన్నాయి. కోట సమీపంలో ఉన్న నరసింహ ఆలయం, ఓంకారేశ్వర ఆలయం, రామాలయం లాంటి దేవాలయాలు, శిధిల విగ్రహాలు కాకతీయుల శిల్ప వైభవాన్ని చాటుతాయి . నేడు అవి చాలా వరకు శిథిలం అయ్యాయి. అయినప్పటికీ అవి ఆనాటి రాజుల దర్పానికి, రాజరికానికి ప్రతీకగా నిలిచాయి.

రాజ దర్బార్ ఉన్న కోట ద్వారాలకు రెండు వైపులా పూర్ణ కుంభాలు, సింహాలు, తాబేళ్లు, చేపలు గుర్రాలు చెక్కి ఉన్నాయి.

Devarakonda

జల సమృద్ధి పుష్కలంగా ఉన్న కోట పరిధిలో వందల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. కోటలో ఉన్న ఎల్లమ్మ , కోట మైసమ్మ దేవతలకు ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి, మహా శివరాత్రి నాడు ఉత్సవాలు జరుగుతాయి.

బలానికి ప్రతీకగా సింహ రూపాలను, ధర్మ రక్షణకు ప్రతీకగా ధర్మచక్రాన్ని దుర్గం ద్వారాలపై చెక్కారు . అయితే ఈ కోట సింహద్వారంపై చెక్కించబడిన పూర్ణ కలశం చిహ్నాన్ని గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నంగా తీసుకున్నారు.

devarakonda

ఎక్కడ ఉంది? ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ కి 110 km, నాగార్జున సాగర్ కి 45 Km ల దూరంలో నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌కు వెళ్లే దారిలో మల్లేపల్లి సెంటర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో అక్కంపల్లి ప్రాజెక్టుకు చేరువలో దేవరకొండలో ఈ దుర్గం ఉంది.

హైదరాబాద్లోని MGBS బస్ స్టేషన్ నుండి దేవరకొండ కి బస్సు సౌకర్యం ఉంది. ఉదయం 5.30 నుండి రాత్రి 9.30 వరకు ప్రతి గంటకు ఒక బస్ అందుబాటులో ఉంటుంది. సొంత వాహనాల ద్వారా కూడా వెళ్ళవచ్చు. మంచినీరు, ఆహారం తీసుకెళ్లడం మరవద్దు .

అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్. చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను. తన ఫేస్ బుక్ అకౌంట్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article