Editorial

Wednesday, January 22, 2025
ఆరోగ్యంఆమె తల్లీబిడ్డల భరోసా : డా.సామవేదం కామేశ్వరి

ఆమె తల్లీబిడ్డల భరోసా : డా.సామవేదం కామేశ్వరి

Dr Kameshwari

ఒక మహిళా మూర్తి పరిచయం కాదిది. మనకు తెలియని మన అమ్మలక్కల జీవితం గురించి తెలియజెప్పే మానవతావాది జీవన స్పర్శ ఇది. రెండు విధాలా కొనియాడతగిన ఈ వైద్యురాలి కృషి ‘తెలుపు’కి ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు

గర్భసంచి, గర్భ ధారణ – ఈ రెండిటినీ స్త్రీల సమస్యలుగా చూసే సమాజంలో ఆమె ఒక మెలుకువ తెచ్చారు. స్త్రీ ఒక అవయవం కాదని శక్తిమేరా ఎలిగెత్తి చాటారు. పునరుత్పత్తి కేవలం యాంత్రిక విషయం కాదని ఆమె ఏంతో అభిమానంగా నొక్కి చెప్పారు. ఇదంతా ఆమెకు రెండు కళ్ళ వ్యవహారం. బాధ్యతగల ఒక వైద్యురాలి నిశితమైన చూపుకు ఉదాహరణ. తన ఆచరణ ద్వారా గైనకాలజిస్ట్ అంటే ఒక కొత్త అర్థాన్ని చూపిన డా.సామవేదం కామేశ్వరి రెండు దశాభ్దాలకు పైగా చేసిన కృషి ఆమెను ‘అమ్మలకు అమ్మ’గా చేసిందని చెప్పుకోవడం ఒక అందమైన విశేషణం.

డా.కామేశ్వరి మహిళలకు అరోగ్య సూచిక ఐన గర్భ సంచి తొలగింపులకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. సంతాన సాఫల్యం ఒక వ్యాపారం ఐన వేల స్త్రీ ప్రకృతిని అర్థం చేసుకుని, మహిళల కడుపు పంటకోసం ఆమె ఎంతో ఆర్తిగా వైద్యం చేస్తూ సంసార జీవనంలో కలతలు లేకుండా చేస్తున్నారు. వారి కృషి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు పదిహేను వేల మహిళలు పిల్లాపాపాలతో నేడు ఆనందంగా జీవిస్తున్నరూ అంటే అది ఆమె చలువే. అలాగే, ఇప్పటిదాకా దాదాపు ఇరవై లక్షల మంది మహిళలకు జరిగిన అన్యాయం గురించి, వారి జీవించే హక్కుకు భంగం కలిగిన ఉదంతం గురించీ ప్రపంచానికి వెల్లడి అయిందీ అంటే అది ఆమె పోరాట ఫలమే.

వైద్యురాలిగా డా.కామేశ్వరి తల్లడిల్లిన హృదయాన్ని అడ్డుకోత, నిలువుకోత గనుక తీసుకుని చూస్తే రెండు విషయాలు మనల్ని కదిలిస్తాయి. ఒకటి మహిళల కడుపు కోతకు తల్లడిల్లి చేసిన పోరాటం కనిపిస్తుంది. రెండు, కడుపు పండక పోవడానికి మహిళలు పడ్డ వెతల స్థితి ఆమెను ఒక ప్రయోగశీలిని చేసిన వైనం బోధపడుతుంది. ఒక్క మాటలో వైద్యరంగంలో వీరి రెండు దశాభ్దాల నిస్వార్థ కృషి, స్వచ్ఛంద కార్యాచరణ మనకు తెలియని మన అమ్మల దయనీయ చరిత్రను వెల్లడి చేస్తుందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. క్లుప్తంగా వారి కృషిని రెండు విధాలుగా విడగొట్టుకుని చెప్పుకుందాం.

అమానుషంగా తొలగిస్తున్న గర్భ సంచుల గురించి అలుపెరుగకుండా పోరాడిన సాహసి వారు. నిత్యజీవితంలో మనం వాడే ఆహారపు అలవాట్లలో మార్పు తెచ్చి వేలాది మహిళలకు మాతృత్వపు మధురిమను పంచిన నిండు మనిషి వారు. స్త్రీల ఆరోగ్య సంరక్షణలో కీలకమైన ఈ రెండు  అంశాల గురించి డా. సామవేదం వెంకట కామేశ్వరి గారు ‘మొదటి ఇల్లు’  శీర్షిక ద్వారా ‘తెలుపు’ శ్రోతలతో వారం వారం సంభాషిస్తారు. వారు మనసులోని ప్రశ్నల సందేహానికి సమాధానం ఇస్తారు.

కడుపుకోత – దశల వారీగా పోరాటం

ఆరోగ్య సూచికగా చెప్పుకునే గర్భసంచి తొలగించే విషయంలో డా.కామేశ్వరి చేసిన పోరాటం మూడు విధాలా విశిష్టమైన ఫలితాలు తెచ్చింది. ఒకటి, పెద్ద ఎత్తున డబ్బు ఆశకు వైద్యులు చేసే హిస్టరెక్టమీ ఆపరేషన్ల సంఖ్యను గణనీయంగా నిలిపివేయగలిగింది. ఆ తర్వాత, తీసివేసిన గర్చసంచి కారణంగా మహిళలు ఆరోగ్య విషయంలో ఎదుర్కొనే దుష్పరిణామాలపై వారికి అవగాహన కలిగించింది. అవశ్యమైన సలహా సూచనలు అందుకునేలా చేసింది. ముఖ్యంగా నిండు వయసులోని వృద్దాప్యంలోకి అడుగుపెడుతున్న మహిళలకు డా.కామేశ్వరి కృషి వల్ల, తెలంగాణలోని పలు జిల్లాల్లో నెలకిల్పిన శిబరాల వల్ల ఎంతో మేలు కలిగింది. అలాగే, గర్భ సంచి తొలగింపు ఎంతటి దుర్మార్మమైన విషయయో సమాజానికి తెలియజెప్పడంలో, పెద్ద ఎత్తున చైతన్యం చేయడంలో వారి ప్రయత్నం ఫలించింది. డా. కామేశ్వరి లోతైన అధ్యయనం, క్షేత్ర స్థాయి నివేదికలు, వందలాది శిబిరాలు, ప్రచురించిన పుస్తకం- నిశబ్దంగానే ఈ విషయాన్ని ప్రజలకు చేర్చింది. గర్చసంచి ఒక పరికరం కాదు, అది మన తొట్ట తొలి ఇల్లు అన్న అవగాహనను అందించింది.

“తెల్లబట్ట, అధిక రక్తస్రావం, పొత్తి కడుపు నొప్పి, పుండు కావడం- ఈ సమస్యలతో బాధపడే మహిళలు డాక్టర్ల వద్దకు వెళ్ళడంతో వైద్యులు గర్భసంచి తొలగించడం మొదలెట్టారు. ఒకరకంగా వారు మహిళల ఆయువుకే ముప్పు తెచ్చారు. నిజానికి పిండ దశనుంచే పాపాయిగా మారేంత వరకు గర్భసంచికి ఎంతో ప్రాముఖ్యత ఉంది” అని డా.కామేశ్వరి వివరించారు.

“పాపాయి పెరగడానికి సరిపోయే వాతావరణం, ఆహారం, ప్రాణవాయువును అందిస్తూ మానవ మనుగడకే మూలంగా ఉంటుంది గర్భసంచి. అలాంటి మనుగడకే మూలమైన అవయవాన్ని మనిషికి మొదటి ఇల్లు అనాలి. దాన్నీ డబ్బు ఆశకు వైద్యులు కూల్చేయడం నన్ను కలత పెట్టింది. అదీ, చిన్న చిన్న కారణాలతో. దాంతో 18 నుంచి 42 ఏండ్లు గల సుమారు ఇరవై లక్షల మంది స్త్రీలు ప్రిమెచ్యూర్ మెనోపాజ్ దశలోకి నెట్టబడ్డారు” అని వారు విచారం వ్యక్తం చేశారు. “గర్భాశయాలు తొలగించడంతో నూటికి 33 శాతం మహిళల్లో అండాశయాలు కూడా పనిచేయని స్థితి వచ్చింది. దాంతో అటు సంతానానికి దూరం, ఇటు సంసారానికి భారంగా మారారు. ఫలితంగా వారి కళ్ళు, చర్మం, ఎముకలు, గుండె, మనసు అన్నిటికీ ప్రమాదం నెలకొంది” అని కూడా వివరించారు.

“2001లో తొలిసారిగా మెదక్ జిల్లా సదాశివపేట లోని ఒక స్పిన్నింగ్ మిల్లులో పని చేసే ౩౦౦ మహిళా కార్మికులకు పరీక్ష చేయడంతో అందరికీ గర్భసంచి తొలగించిన విషయం నిర్ధారణ చేసుకున్నాను. అప్పటినుంచి మొదలైన పోరాటం 2011లో వై.ఎస్ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అధికారికంగా ఈ ఆపరేషన్లను చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్నాను. ప్రభుత్వం ఉత్తర్వు తేవడంలో తొలి విజయం సాధించాను. అనంతరం సమాజంలో గర్భసంచి తొలగింపుకు గురైన మహిళలకు ఆ దుష్పరిణామాలను వివరించి, వారి జీవన ప్రమాణాల విషయంలో సలహా సూచనలు ఇవ్వడం, నేటికీ సాగుతున్న మరో అంకం. ఇదీ ఒకరకంగా పోరాటమే” అని డా.కామేశ్వరి ‘జిందగీ’తో అన్నారు. “నిజానికి ఒక స్త్రీగా, వైద్యురాలిగా మహిళల అస్తిత్వాన్ని దెబ్బతీసే ఈ పరిణామాలను నిలువరించడం, స్త్రీల జీవించే హక్కుకు భంగం కలిగించే అంశాలపై పనిచేయడం నా ప్రథమ ప్రాధాన్యంగా మారింది. ఇది ఎంతో తృప్తికరమైన జర్నీ” అని కూడా అన్నారావిడ. కాగా, స్త్రీల సంతానంపై పనిచేయడం కూడా గర్చసంచిల తొలగింపు పట్ల లోతైన అధ్యయనం, క్షేత్ర స్థాయి అనుభవాల నుంచి జనించిన కర్యాచారణే” అని తెలిపారావిడ.

Happiness

“తల్లుల కన్నీళ్లు, అందబాష్పాలు రెండూ ఏక కాలంలో చూస్తాను. అలాగే, వారి పొత్తిళ్ళలో పిల్లల చిరునవ్వులు చూస్తాను. వైద్యురాలిగా నా చిరు ప్రమేయం ఇంతటి ఆనందానికి కారణం కావడం నన్ను మరింత ఉత్సాహంగా పనిలోకి ప్రేరేపిస్తుంది.” అని సంతోషంగా వివరించరావిడ.

కడుపు పంట- మాతృత్వం

స్త్రీల సంతానం యాంత్రికమైన వ్యవహారం కాదు. అది భార్యాభర్తల అనుబంధం, కుటుంబ జీవనం, పరిసరాల ప్రభావం, ఆహారపు అలవాట్లతో కూడాన సంవిధానం అని ఇటీవలి కాలంలో మొట్ట మొదట నొక్కి చెబుతున్న వైద్యురాలిగా కూడా డా.కామేశ్వరికి ప్రత్యేకత ఉన్నది. మాతృత్వానికి తోలి అంకం దంపతుల శారీరక కలయిక మాత్రేమే కాదని, తల్లి నవ మాసాల పాటు బిడ్డను మోయడంలోనే లేదని, శారీరక ఆరోగ్యంతో పాటు మహిళల మానసిక ఆరోగ్యం కూడా ప్రథమ ప్రాధాన్యం వహిస్తుందని వారు చెబుతున్నారు.

పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన డా.కామేశ్వరి తనను సంప్రదించే దంపతుల ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని లోతుగా విచారిస్తారు. అటు పిమ్మటే వైద్యం చేయడం ప్రారంభిస్తారు. అందులో ప్రధానంగా స్త్రీ తాలూకు ప్రకృతి ఏమిటి, దానికి కావాల్సిన పౌష్టికాహారం మొదలు, ఆరోగ్యకరమైన పరిసర వాతావరణం ఆవశ్యకతను భేరీజు వేస్తారు. తగిన సలహా సూచనలను దంపతులకు ఇస్తూ, నవమాసాలు బిడ్డను మోసే స్త్రీకి కావాల్సిన ప్రత్యేక ఆహారపు అలవాట్లను విశదం చేస్తారు. అలాగే, కౌటుంబిక సహాయం ఈ సమయంలో మహిళకు ఎంత అవసరమో కూడా సూచిస్తారు. “శరీర నిర్మాణం, శరీర ధర్మం – వీటి వెనకాల ఇతరత్రా ప్రభావం చూపే పరిస్థితులను దంపతులకు దృష్టికి తేవడం సంతాన సాఫల్యానికి మరో ముఖ్యమైన మెట్టు” అని ఆమె వివరించారు.

ఇదంతా ఒక చిత్రమైన విషయం. డా.కామేశ్వరి వైద్యం అందుకొన్న తర్వాత తొలిసారిగా కాన్పు ఐన వారు పదివేలకు పైనే ఉంటారని చెబితే విస్మయం కలుగుతుంది. ఇదంతా అత్యంత చవకగా, అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలతో, అతి తక్కువ మందులతో జరపడం డా.కామేశ్వరి ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
“మాతృత్వం అన్నది ఒక బాధ్యత. ఒక సంపూర్ణ స్థితి. ఈ విషయంలో నా వైద్యం ఫలించి, తల్లుల కళ్ళల్లో ఆనందం చూడటం ఒకెత్తయితే, గొడ్రాలు అన్న మాట కావొచ్చు, ఇంటా బయటా ఎదుర్కొనే పలు నిందలు కావొచ్చు, పిల్లలు కలగనందున మహిళలు చవిచూసే గృహ హింస, పీడన, అణచివేతా కావొచ్చు, ఒక రకంగా నా ప్రయత్నం నుంచి నుంచి వేలాది మహిళలను రక్షించ గలగడం నాకెంతో సంతృప్తికరమైన అనుభవం” అన్నారు డా.కామేశ్వరి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article