గోవిందరాజు చక్రధర్
సమూహం మధ్య చిక్కి
ఉక్కిరి బిక్కిరి అవుతున్నా
రోదల నుంచి, సొదల నుంచి
వేసారిన బతుకుల
నిట్టూర్పుల నుంచి
కాస్తంత బ్రేక్ తీసుకోవాలనుంది
కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి
కృతిమ నవ్వుల నుంచి
దూరంగా పారిపోవాలనుంది
ఒంటరి ఒడిలో సేద తీరాలనుంది
ఒంటరిగానే వచ్చానీలోకంలోకి
ఒంటరిగానే వెళ్తానీలోకంనుంచి
ఒంటరి రాస్తాలో బంధాలనీ బాంధవ్యాలనీ
బోల్డన్ని సంకెళ్ళు
ఊపిరి సలపనివ్వడంలేదు.
బంధనాలన్నీ తెంచుకుని
ఒంటరి తీరానికి పారిపోవాలనుంది
రెక్కలు చాచుకుని
శక్తిని చాటుకుని
ఎవరూలేని ఒంటరి ద్వీపంలో
వాలిపోవాలనుంది
అక్కడ ఆకాశంతోనూ
నక్షత్రాలతోనూ
బోల్డన్ని కబుర్లు
కలబోసుకోవాలనుంది
నా గుండె శబ్దాన్ని మాత్రమే
వినాలని ఉంది
కనురెప్పల సవ్వడినీ
ఆలకించాలని ఉంది
నిశ్శబ్ధం నీడలా
పరచుకునే
ఆ ఒంటరి లోకంలో
తిరగాలనుంది
జీవన మధురిమ తెలుపు ఇటీవల తెలుపు ప్రచురించిన గోవిందరాజు చక్రధర్ గారి కవిత ఇంకేం కావాలి?