Editorial

Wednesday, January 22, 2025
వ్యాసాలుఅత్మగీతానికి ఆత్మీయ సమీక్షణం : తాడి ప్రకాష్ పుస్తకంపై ఏదుల గోపి రెడ్డి

అత్మగీతానికి ఆత్మీయ సమీక్షణం : తాడి ప్రకాష్ పుస్తకంపై ఏదుల గోపి రెడ్డి

Portrait by Chitra

సీనియర్ జర్నలిస్టు తాడి ప్రకాష్ రాసిన “ఏలూరు రోడ్ , ఆత్మగీతం” అనే పుస్తకం గురించి రెండు మాటలు.

ఈ పుస్తకం చదివితే జీవితం మీద, స్నేహం మీద, పుస్తకాల మీద, మనుషుల మీద, పేదల మీద, పీడితుల మీద గౌరవం పెరుగుతుంది.

సాహిత్యం చేయాల్సిన పనే అది కదా?

గోపిరెడ్డి ఏదుల

ప్రకాష్ గారిని రెండు మూడు సందర్భాల్లో చూశాను. అంతే. నేను చూసిన ప్రతి సారీ ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవర్నీ మాట్లాడనియ్యడేమో అని కూడా అనుకున్నాను. ఆయనని వినడమే ఆనందం అయినపుడు ఇంకెవరో ఎందుకు మాట్లాడతారని తరువాత అర్ధం అయింది. ఇక పుస్తకంలోకి వెళదాం.

ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్న ఇంటి ఓనర్ని వెక్కిరిస్తూ ‘ఫోన్లో మాట్లాడొచ్చుగా’ అన్నారట పెద్దిబొట్ల సుబ్బరామయ్య. ఓనర్ హర్ట్ అయ్యి సుబ్బరామయ్య గారిని ఇల్లు ఖాళీ చేయించాడట. ఇది చదవగానే నా స్వీయ అనుభవం గుర్తొచ్చింది. ఓరోజు మా ఆవిడ లేని సమయం చూసి కొందరు మిత్రుల్ని మధ్యాహ్నమే ఇంటికి ఆహ్వానించాను. అందులో ఒకడు వంటలో మొనగాడు. వండేశాడు. ఇంకోడు మందులో మహా మొనగాడు. బుడ్డీ తెరిచేశాడు. అది కాస్తా గద్దర్ తో మొదలై గోరటితో ముగింపుకు వచ్చింది. సరిగ్గా అప్పుడే మా ఆవిడనుండి ఫోన్ వచ్చింది. ‘ఇంట్లో ఏం జరుగుతుంది? అని అడిగింది. ‘ఏమీ లేదే’ అన్నాను. ‘పాటలు నాదాకా వచ్చినై’ అని ఫోన్ పెట్టేసింది. నేను మా ఆవిడ లేదనుకున్నానుగానీ, ఓనరు ఉందన్న చిన్న లాజిక్ ను ఎలా మరిచానో? తెల్లారే ఇల్లు ఖాళీ చేయాల్సొచ్చింది. ఇంక నా అనుభవాలు చెప్పను. ఇదే ఫస్ట్ & లాస్ట్.

ఏదైనా రచన నచ్చకపోతే పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘అతను బలే తమాషాగా రాస్తాడండీ’ అనే వాడు. అంటే, ఆ రచయితకి రాయడం రాదనీ, ఒట్టి ఇడియట్ అనీ అర్ధం అట.

ఏదైనా రచన నచ్చకపోతే పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘అతను బలే తమాషాగా రాస్తాడండీ’ అనే వాడు. అంటే, ఆ రచయితకి రాయడం రాదనీ, ఒట్టి ఇడియట్ అనీ అర్ధం అట. ఇప్పుడేమో ఆ పదాన్ని మెచ్చుకోలుగా తీసుకుంటున్నట్టుంది. లేదంటే రాయడం మానుకోవలసొస్తుంది మరి.

ఇది ప్రకాష్ గారి ఆత్మగీతమే అయినా ఆర్టిస్ట్ మోహన్ గారి ఆత్మను కూడా ఆవిష్కరించింది. జాకబ్ కోసం మోహన్ గోదావరిఖని వెళ్ళేవాడు. వాళ్ళ స్నేహం 40 ఏళ్లకు పైగా నడిసింది. ఇద్దరు మగాళ్లు ఎలా ప్రేమించుకుంటారు? వన్ బై టు చాయ్ తాగి, ఒకే సిగరెట్ ఇద్దరూ కాల్చి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు రచయిత. జాకబ్ గజల్ గనక ఎత్తుకున్నాడా చచ్చి సున్నం అయిపోతాం అని తన ఇష్టాన్ని ప్రకటిస్తాడు.
సాయంత్రాల్లో మోహన్ దగ్గరికి వచ్చే మిత్ర బృందాన్ని ‘కొవ్వెక్కిన సృజనాత్మక గుంపు, ప్రతీదీ వేళాకోళమే, ఏ ఒక్క విషయమూ తిన్నగా మాట్లాడరు. రెటమతం, ఏమి సాయంత్రాలవి’ అని అద్భుత క్షణాలని గుర్తుచేసుకుంటాడు.

గోరటి వెంకన్న గొంతు వింటున్నప్పుడు ‘ప్రియురాలి చనుమొనలు ఛాతీని తాకి, ఒక గరుకు గరుకు పులకింత నరాల్లో ప్రవహించినట్టు ఉంటుంది’ అని అంటాడు.

గోరటి వెంకన్న గొంతు వింటున్నప్పుడు ‘ప్రియురాలి చనుమొనలు ఛాతీని తాకి, ఒక గరుకు గరుకు పులకింత నరాల్లో ప్రవహించినట్టు ఉంటుంది’ అని అంటాడు. గోరటి మార్మిక స్వరం మీద ఉన్న మొహానికి పరాకాష్ట. గొప్ప వాటర్ కలర్ ఆర్టిస్ట్ ‘మోషే డయాన్’ బాలూ విమర్శకులని నిలదీశాడు. ‘గోరటిని విమర్శించే వాళ్లకి కూడా ఇది వర్తిస్తుంది’ అని ప్రకాష్ అంటాడు. ‘నిండు కల్లు కుండ లాంటి మనిషి’ అని గోరటికి కితాబు ఇవ్వడం యమా నచ్చింది.

రాంభట్ల కృష్ణమూర్తి చెప్పే మాటల్లో మెరుపులాంటి విరుపుతో, లెంపకాయ కొట్టినట్టు ఓ చేదునిజం కూడా ఉంటుందని చెబుతాడు. అటువంటి ఆయన్ని ‘మోహన్ ఎవరు?’ అని ప్రకాష్ అడిగారట. అందుకు ఆయన ‘మోహన్ ఒక డ్రీమర్’ అని చెప్పారట. అంతటితో ఊకోవచ్చుగా, ఊహూ ఊకుంటే ఆయన ప్రకాష్ ఎందుకు అయితడు, “మరి నేనో” అని అడిగేశాడట. “ఇంచు మించుగా నువ్వూ అంతే. హాఫ్ డ్రీమర్ వి” అని అన్నాడట. అది తిట్టొ, పొగడ్తో – ఏమో ..?” అని అనుమానం వెలిబుచ్చుతాడు.

ఇంతకీ నేనెవర్ని? అని ప్రశ్నించుకొని సమాధానం కూడా చెప్పేశాడు. ” నేను శ్రీశ్రీ తో మాట్లాడినవాణ్ణి, ఆయన పాడె మోసినవాణ్ణి, విస్పోటనం లాంటి ఆ విషాదాన్ని వార్తగా రాసినవాణ్ణి. ఇపుడు శ్రీశ్రీ గురించి, మీరు నాతో మాట్లాడాలనుకుంటే… అది ఆషామాషీ వ్యవహారం కాదు. కనీసం నాకో కాఫీ ఇప్పించాలి. ఒక సిగరెట్ కొనివ్వాలి. పైగా.. దాన్ని మీరే వెలిగించాలి. విషాదాన్ని జోవియల్గా గొప్పగా చెప్పారు. ఇష్టమైన అతిశయంగా అనిపించే ఆత్మవిశ్వాసం కూడా ప్రకాష్ గారిది అని అనిపిస్తుంది.

‘జాన్ లీ ఆండర్సన్’ అనే జర్నలిస్టు చేగువేరా గురించి, చే జీవిత చరిత్ర రాయడానికి 5 ఏళ్ళు చేసిన పరిశోధన గురించి అద్భుతంగా రాశాడు. ఒక పుస్తకం రాయడానికి ఇంత సాహసం చేస్తారా అని అనిపించి రచయితలమీద గౌరవం పెరుగుతుంది.

‘నిజానికి నేను ఈనాడుకీ, ఉదయానికీ పుట్టిన అక్రమ సంతానాన్ని. ఒకవేళ మీరు నన్ను దాసరి రామోజీరావ్ అని పిల్చినా నాకు ఇష్టమే’ అని ప్రకటించుకుంటాడు.

‘నిజానికి నేను ఈనాడుకీ, ఉదయానికీ పుట్టిన అక్రమ సంతానాన్ని. ఒకవేళ మీరు నన్ను దాసరి రామోజీరావ్ అని పిల్చినా నాకు ఇష్టమే’ అని ప్రకటించుకుంటాడు. ‘నండూరి రామ్మోహనరావ్, రాఘవాచారి తో పార్టీలో ఉన్నప్పుడు రాఘవాచారి గారికి నేను సిగరెట్ వెలిగించడం, మరో రౌండ్ లో ఆయన నా సిగరెట్ వెలిగించడం, what a memorable time, అవి రెండు విద్యా కుసుమాలు, రెండు ఉన్నత సంస్కార శిఖరాలు, ఇద్దరు intellectual giants, ఇద్దరు brilliant editors, వాళ్ళిద్దరూ ప్రేమగా పెంచుకుంటున్న కుక్కపిల్లలా నేను. నాకింకా ఏదన్నా ప్రభుత్వ బిరుదు రావాలంటారా? పులిట్జర్ ప్రైజేమన్నా కావాలంటారా? అని పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తాడు.

ఏలూరు రోడ్డు మీద ఓ అపరిచితుడు “నేను టెన్త్ ఫస్ట్ క్లాసులో పాసయ్యానని మీరే చెప్పారు సార్’ అని అన్నప్పుడు “నేనెప్పుడూ అంతే” అన్నట్టు భుజాలు ఎగరేసి నవ్వేసేవాన్ని అని వృత్తి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తాడు.

ఏటుకూరి బలరామమూర్తి గారు పుస్తకం చదువుతున్నప్పుడు వారి భార్య టీ ఇస్తే, పరధ్యానం లో పావలా టేబుల్ మీద పెట్టాడట హోటల్ అనుకొని. అప్పుడు ఆమె నాలుగు నిఖార్సైన బ్రాహ్మణ తిట్లు తిట్టిందట. ఇలాంటి మరమరాలు చాలా ఉన్నాయి.

విశాలాంధ్రలో ప్రకాష్ గారి కవిత అచ్చయినప్పుడు వాళ్ళమ్మ “వాడా (మోహన్) బొమ్మలేసి చెడిపోయాడు, నువ్విలాంటి పిచ్చిరాతలు రాసి పాడైపోకురా” అని చెప్పిందట. “బొమ్మలు గీసుకునే నాయాళ్ళు, కవిత్వాలు రాసుకునే సోదిగాళ్లు ఎందుకూ కొరగారని సభ్య సమాజం ఆనాడే కనిపెట్టిందని యిందు మూలముగా తెలియజేయడమైనది” అని ప్రకాష్ గారు చెబుతున్నారు. నిజాన్ని గ్రహించండి.

మర్యాద, గౌరవం ప్రేమించుకుంటే పుట్టిన బిడ్డలా ఉంటాడు MS నాయుడు అని చెప్పి వారి కవిత్వం గురించి చెప్పిన విషయాలు చదివి తీరాల్సినవి.

“నల్లగా, బండగా, పొట్టతో, అన్ ఇంప్రెసివ్గా ఉండే పైడి తెరేష్ బాబు పాడిన పాటలు విన్నాక ఆయన మెహదీ హాసన్ లా, ఒక గులాం అలీ లా కనిపించాడు. ఒక ఆత్మ సౌందర్యాన్ని నేను దర్శించుకోగలిగాను” అని తెరేష్ తో ఉన్న అనుబంధాన్ని వివరిస్తాడు.

మర్యాద, గౌరవం ప్రేమించుకుంటే పుట్టిన బిడ్డలా ఉంటాడు MS నాయుడు అని చెప్పి వారి కవిత్వం గురించి చెప్పిన విషయాలు చదివి తీరాల్సినవి. అనిల్ బత్తుల పుస్తకానికి ఆర్టిస్ట్ మోహన్ రాసిన చివరి ముందు మాట గురించి, వాళ్ళ అక్క సుశీల ప్రకాష్ ని ‘నాస్తిక వెధవా’ అని తిట్టిన విషయం గురించి, వాళ్ళ అమ్మకి గొలుసు చేయించలేని నిస్సహాయత గురించి, దళితుల మీద దాడులపై రక్తంతో రాసిన వేదన గురించి చెబుతుంది ఈ పుస్తకం.

ఈ పుస్తకం చదివితే జీవితం మీద, స్నేహం మీద, పుస్తకాల మీద, మనుషుల మీద, పేదల మీద, పీడితుల మీద గౌరవం పెరుగుతుంది. సాహిత్యం చేయాల్సిన పనే అది కదా?

ఈ పుస్తకాన్ని ప్రచురించి ‘అన్వీక్షికి’ ప్రత్యేకతని మరోసారి చాటుకుంది. 300 పేజీలు గల ఈ పుస్తకం మొదలు పెడితే ఆపలేరు.

గోపిరెడ్డి ఏదుల తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు.
వారు సమీక్షించిన ఈ పుస్తకం వెల 250. ఈ లింక్ క్లిక్ చేసి amazon ద్వారా తెప్పించుకోవచ్చు.

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article