ఎప్పుడో 144 సంవత్సరాల క్రితం పుట్టిన ఈ పహిల్వాన్ డూడుల్‌ని నిన్నగూగుల్ ఎందుకు పెట్టిందబ్బా అని మనలో చాలా మంది అనుకుని ఉంటారు. ఇదీ కారణం.
సి. వెంకటేష్
మనకు తెలిసిన లెజెండరీ కుస్తీ వీరుడు దారా సింగ్ మాత్రమే. అతను కూడా సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు కాబట్టి ఆ పరిచయం. కానీ ఈ నిన్న డూడుల్‌లోని “ది గ్రేట్ గామా” మాత్రం బాక్సింగ్ లో మహమ్మదలీ లాగ రెజ్లింగ్ లో ది గ్రేటెస్ట్.
అమృత్‌సర్‌లో పుట్టిన గామా అసలు పేరు గులాం అహ్మద్ బట్. అతని గొప్పతనం చెప్పాలంటే 1947 పార్టిషన్ నాటి ఒక సీను ఉదహరించాలి. అది అచ్చం మన తెలుగు సినిమా సీను లానే ఉంటుంది.
“నువ్వొక్కడివే మమ్మల్ని అడ్డుకుందామనే” అని అనబోయాడు. గామా అతని చెంప చెళ్ళుమనిపించాడు.
లాహోర్‌లో హిందువులను చంపడానికి బయలుదేరిన ఒక మూకను గామా అడ్డుకున్నాడు. వాళ్ళందరితో ఒక్కడే తలపడడానికి రెడీ అయ్యాడు. ఆ మూకలో ఒకడు అతని దగ్గరికి వచ్చి “నువ్వొక్కడివే మమ్మల్ని అడ్డుకుందామనే” అని అనబోయాడు. గామా అతని చెంప చెళ్ళుమనిపించాడు. ఆ దెబ్బకు అతని దవడ పగిలిందని కొంతమంది, మొత్తానికే పోయాడని కొంతమంది అంటారు. ఇంకేముంది మన సిన్మాల్లో లాగే మిగతా జనం పరుగు లంఘించుకున్నారు. అప్పటికి గామా వయసు దాదాపు డెబ్భై. ఇది అతిశయోక్తి ఏమీ కాదని చరిత్ర చెబుతున్నది.
మనం ఇంగ్లీషు సినిమాల్లో చూసే సూపర్ హీరోలకి ఏ మాత్రం తీసిపోడతను. ఈ మహా వీరుడు యాభయ్యేళ్ళ పాటు 5 వేలకు పైగా కుస్తీ పొటీల్లో పాల్గొన్నడు. వాటిలో ఒక్క పోటీలో కూడా ఓడిపోలేదు అంటే మనం నమ్మలేం కానీ అదే నిజం. ఇండియాలోనే కాదు, లండన్ వెళ్ళి అక్కడి మల్లయోధుల దుమ్ము కూడా దులిపి వచ్చాడు.
మన దేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో కుస్తీపట్ల సాంప్రదాయానికి గామానే స్పూర్తి ప్రదాత.
ఇంతకీ అతని ఎత్తు ఐదడుగుల ఏడంగుళాలు మాత్రమే. బరువు మాత్రం వంద కిలోల పైమాటే. రోజుకి పది లీటర్ల పాలు, ఆరు నాటు కోళ్ళు లాగించేవాడు. రోజుకి ఐదు వేల గుంజిళ్ళు (సిటప్స్), మూడు వేల బస్కీలు (పుషప్స్) అతని వ్యాయామం. కదిలే రైలును ఆపుతాననని బ్రిటిష్ ప్రభుత్వానికి ఓ ఛాలెంజ్ విసిరాడు గానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అతను ఎత్తిన 1.2 టన్నుల రాయి ఇప్పటికీ బరోడా మ్యూజియంలో ఉంది. మన దేశంలో, ముఖ్యంగా పంజాబ్‌లో కుస్తీపట్ల సాంప్రదాయానికి గామానే స్పూర్తి ప్రదాత.
తెలుగు జర్నలిజంలో క్రీడా విశ్లేషణకు గౌరవం, హుందా తెచ్చిన సీనియర్ క్రీడా పాత్రికేయులు సి.వెంకటేష్. జాతీయంగా, అంతర్జాతీయంగా టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించిన తొలితరం కామెంటేటర్ వారు.