మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్ పల్లిలో సుమారు 6వ శతాబ్దంలో నిర్మించినట్లుగా భావిస్తున్న గొల్లత్త గుడి ఇది. దాదాపు 65 అడుగుల ఎత్తుతో కేవలం ఇటుకలతో కట్టిన ఈ అరుదైన ఆలయం ప్రస్తుతం అంపశయ్యపై ఉన్నది.
అరవింద్ పకిడె
పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారుల ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. శతాబ్ధాల చరిత్ర కలిగిన ఆలయాలలో దక్షిణ భారతంలోనే గొల్లత్త గుడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దేశ వ్యాప్తంగా ఇలా ఇటుకలతో కట్టబడిన అతి పురాతన కట్టడాలు రెండు మాత్రమే. వాటిలో ఒకటి గొల్లత్త గుడి కాగా మరొకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూరులోని భీతర్‌గావ్ శివారులో ఉన్న ఆలయం. అది 1600 ఏండ్ల క్రితం 58 అడుగుల ఎత్తులో గుప్త వంశరాజు కుమారగుప్తుని కాలంలో నిర్మితమైంది.
అద్భుత చారిత్రక కట్టడం – అంతులేని నిర్లక్ష్యం – పదుగురి దృష్టికి తేవడం అవశ్యం.
జడ్చర్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో అల్వాన్ పల్లి గ్రామ సమీపంలో గొల్లత్త గుడి ఉంది.
భితర్ గావ్ ఆలయం 58 అడుగుల ఎత్తు ఉండగా మన గొల్లత్త గుడి 65 అడుగుల ఎత్తుతో నిర్మాణం చేయబడి దేశంలోనే ఎత్తైన ఇటుకల ఆలయంగా పేరుగాంచింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కట్టడం పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది.
చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ కట్టడం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. భారీ వర్షాలకు ఇటుకలు ఒక్కోటి రాలిపోతున్నాయి. ప్రవేశ ద్వారం వద్ద కట్టడం బలహీనంగా మారింది.
రాష్ట్ర పురావస్తు శాఖ చుట్టూ కేవలం ప్రహరీ గోడ నిర్మించి తన బాధ్యత పూర్తయినట్లు భావిస్తోంది. ప్రస్తుతం ఆవరణ మొత్తం ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది.
అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్ .
చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను.